23, మార్చి 2018, శుక్రవారం

స్వభావం

స్వభావం.
  ప్రతి మనిషిలోను స్పష్టంగా అందరిలో కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇవి సహజమైన నిత్య సత్యమైన పరమాత్మ లక్షణాలు. అవి  ఎప్పుడూ తాను ఉంటాననే నమ్మకం. అంతా తెలుసనే లక్షణం. ప్రకటితం కాకున్నా తనలో తనపట్ల సంతృప్తి.ఇవి సతిచ్చిదానంద లక్షణాలు.ఎప్పుడూ ఉండడం సత్ లక్షణం.తెలుసు అనేది చిత్, ఆనందం సంతృప్తి.ఇవి లేని మనిషి ఉండరు.కానీ వీటిని శరీర పర్యంతంగా భావించడమే
అవిద్య.అలానే పరబ్రహ్మ తత్వంలో, అహం ప్రజ్ఞ తెలిస్తే సృష్టి.ఇదే అద్వైతంలో ద్వైతం.స్పందించిన అహం తిరిగి స్వస్థితిని పొందాలనే సహజమైన కోరిక మోక్షం.ఇది శరీర పర్యంతమైనపుడు,బాహ్యంలో జంట కోసం వెతుకుతుంది. కానీ అంతరార్ధంగా గమనిస్తే,ఇది నిజానికి తనలోనే ఉన్న తనను చేరడమే.బాహ్యంలో స్త్రీ,పురుష బేధం తెలిసే 8సం. వయసు నుండి పరమాత్మ జ్ఞానాన్ని అందించ గలిగితే ,తమలో
కలిగే భావాలకు మూలం తెలియడం వలన పిల్లలు, తమను తాము అనవసర భావజాలం నుండి కాపాడుకో గలుగుతారు.శ్రీరాముని యోగ వశిష్ఠ అనుభవం ,ఈవిషయాన్ని తెలియ జేస్తున్నది.అనవసర సమయంలో,అక్కరలేని విషయాలనుండి పిల్లలను కాపాడుకోవచ్చు.విజ్ఞానం అవసరం లేని పశు జనాలకు మాత్రమే తినడం తెలిశాక, తరువాత ప్రత్యుత్పత్తి మాత్రమే గమ్యం.కానీ మానవ జన్మ పరమార్ధం
గ్రహించాలి.                                                       

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సనాతనం

సనాతనం. 
       శ్రీ గురుభ్యో నమః. 
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. కలియుగంలో తరింపచేసే మంత్రం.
ఇందులో మనకు కనిపించేవి మూడు నామాలు .మూడు ముక్తిమార్గాలు. తాపత్రయాల నుండి తప్పుకోడానికి ఈ మంత్రం. సంసారమనే కాసారంలోని సుఖపడాలనే తపనే గజేంద్రుడు ఈదులాడిన సరస్సు. కాలమనే మొసలి సమీపిస్తే ,తన ఆత్మబంధువులైనా ఏమీ చెయ్యలేరు. చాలామంది ఇక్కడ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేని దురవస్థ. అంతేకానీ ఇందులో బంధుజనుల అలసత ఏమిఉండదు. పూర్వపుణ్య విశేషం ,అలానే 
తనశక్తి ఏమీ పనిచెయ్యడం లేదని తెలిసిన క్షణం పరమాత్మను అంతర్యామిగా గుర్తించడం వలన అతనిని శ్రీహరి 
రక్షించాడు. దీనికి సంసారంలోఉన్నా పరమాత్మపట్ల అవగాహన కలిగి ఉండడం వలన ,వీలైనంత శాస్త్ర అవగాహన , భక్తి ,అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము ,గజేంద్రునికి సహకరించాయి. అవి ఈజన్మకు సంబంధించినవి కాకపోయినా జంతుశరీరంలో రక్షించాయి. కానీ మానవుడైకూడా ప్రయత్నశీలుడు కాకుంటే పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . ఎన్నో జన్మల తపః ఫలంగా లభించిన మానవదేహం తన గమ్యాన్ని చేర్చే నావ . మిగిలిన ఉపాధులకు 
ఈఅవకాశం లేదు. మానవజన్మలో గమ్యం చేరాలంటే అడ్డుగా ఉన్నవి ,అహం,మమ. నిజానికి ఈరెండూ కలిగి ఉన్నది  పరమాత్మ.కానీ శరీరంలో పరమాత్మ తేజస్సు  శరీరికి అర్ధం కానివ్వదు . శరీర పర్యంతంగా తెలుస్తున్న 
చైతన్యాన్ని అహంగా భావిస్తాడు. కుమ్మరి కుండ తయారైన మాత్రాన ,అందులో ఆకాశం నింపబడలేదు. అలానే 
బయటి ఆకాశంకన్నా వేరుకాదు. కుండ తన ఆకాశం అంటే ఎలాటిదో ,శరీర పర్యంత అహం తాను అనుకోవడం 
అలాంటిదే. అలానే పంచేద్రియాలు గ్రహించే సకలము తనది అయిన ప్రపంచం అవుతుంది. ఇవన్నీ పరమాత్మ 
సృజనలో పంచభూత వికారాలే . కనుక తను అనేది ,తనది అనేది మిధ్య. అంటే [పుట్టుకతో] మధ్యలో వచ్చాయి. 
మధ్యలోనే పోతాయి. ఆకాశంలా తానెప్పుడూ ఉండేదే. కుండ రాకపోకలతో ఆకాశం దుఃఖిస్తే ఎలా?
        కానీ ఇదే అజ్ఞానం ఎన్నో జన్మలుగా ధృఢపడి కుండే నిజమై కూచున్నది. జంతు జన్మలలో జ్ఞానార్జన అవకాశం లేదు కనుక ,ఈ జన్మకు ఎంతో ప్రాధాన్యత నిచ్చింది శాస్త్రం. మానవ మస్తిష్కమే ముక్తి సాధనం . సాధన వరకే దీని 
ఉపయోగం. సాధ్యం అంతటా నిండియున్న ఆకాశమే తాను అని గ్రహించడమే సారాంశం. అందుకే ఆకాశమే విష్ణువు అంటుంది శాస్త్రం . ఆకాశం అంటే జడంకాదు . మనలో చైతన్యం మనకు తెలుస్తున్నది కదా ?అదే అంతటా నిండి ఉన్నది. జీవితంలో భుక్తికి అవసరమైనంతగా మాత్రమే ,కుటుంబ అవసరాలవరకు ధర్మబద్ధంగా సంపాదించి , ధార్మిక జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత సమయాన్ని ,తత్వ ,భక్తి శాస్త్ర అధ్యయనంలోనూ,సజ్జన సహవాసం తోను, పరమాత్మ కృపకు పాత్రులైతే హృదయంలో గురుసాన్నిధ్యం కలుగుతుంది . శివాయ గురవే నమః. బాహ్యంలో గురువు ,మీ శాస్త్ర విహిత కర్మాచరణతో మీముందుకు వస్తారు. మన పెద్దల బాటను విడువక ఆరాధన,కొనసాగిస్తేనే 
తగిన గురువు మార్గదర్శనం చేస్తారు . పెద్దల బాటకు బద్ధకం ,కుతర్కం తోడైతే ,సాధనను మోసపుచ్చే గురువే 
లభ్యం అవుతారు. దీనికి పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . కనుక తన ఆచార వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. 
          జ్ఞానం తనను ఉద్దరించుకోడానికే ,జంఝాటానికి కాదు . ఈసాధనకు గమ్యాన్ని ప్రసాదించే మహామంత్రమే 
హరే రామ ,హరే కృష్ణ . అహం మన సాధనకు అడ్డుపడుతున్నపుడు రామనామము,ప్రపంచం నాదిగా తిప్పలు 
పెడుతున్నప్పుడు కృష్ణ మంత్రము,అన్నివేళలా హరి మంత్రము ,ముముక్షువుకు సహాయపడతాయి. ఏకాగ్రతతో, బుద్ధి సహాయంతో అహం రూపమైన రావణ సంహారాన్ని, చిన్ననాటినుండి ఆశ్రయించిన యోగ వశిష్ఠ గీత యొక్క అనుభవ సారంతో జీవన విధానాన్ని,కలిగిన శ్రీరాముని కధనుండి ప్రేరణ పొంది,శ్రీరామనామంతో అహంను జయించాలి.అన్ని తావులయందు తన వైభవాన్ని చాటి ప్రతి వారితోను ప్రతి సంఘటనతోను,మమేకం అయినట్లుఉన్నా, క్రీడగా తన పాత్రను ప్రపంచంలో ప్రకటించిిిన కృష్ణానామాన్ని ,ఇదం అని తెలియబడుతున్న      ప్రపంచాన్ని,బాహ్యం లోను,అంతరంగంలోను ,విశ్వం అంతా పరమాత్మ భావాన్ని పొందడానికి కృష్ణానమాన్ని గ్రహించి చరించాలి.
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే . 

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

శ్రీ వల్లభేశాయ నమః.శివాయ గురవే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ విష్ణు రూపాయ నమశివాయ.శ్రీ గురుగుహాయ షణ్ముఖాయ నమః.
గురువు పరసువేది లాంటి వారు.జీవి తన పాప కర్మలను పరమాత్మ సేవతో తొలగించుకున్నపుడు ,కర్తృత్వ భావం
తొలగి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే తపన ఏర్పడుతుంది. పాప ప్రభావం తగ్గితే, ఇనుముకు తుప్పు
లేకుండా చేసినపుడు అయస్కాతం చేత ఆకర్షించ బడినట్లు ,గురువు పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. అంతవరకూ గురువు
పక్కనే ఉన్నాఆయన కృపకు పాత్రుడు కాలేడు . ఎపుడు చిత్తశుద్ధి కలుగుతుందో , అపుడు తప్పక గురువు , పరమాత్మ యొక్క రూపమైన ,జీవ బ్రహ్మైక్యాన్ని తెలియజేసినపుడు ,జీవి అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని కలిగి , క్రమంగా ఆత్మనిష్ఠను పొందుతాడు. పరశువేది ఇనుమును బంగారం చేసినట్లే ,గురువు స్వానుభవమైన అహం బ్రహస్మి అనే అనుభవాన్ని ,శిష్యునికి తత్వమసి మహావాక్యంగా అందిస్తారు. దీనితో జీవత్వ బ్రాంతి నశించి శిష్యుడు
ఈశావాస్యం ఇదం సర్వమ్ అని తనలోనే మునిగిపోతాడు. 

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

                                                                        సనాతనం.
                                                                       [కన్యాదానం.]
   భారతీయ సంప్రదాయంలో కన్యాదానానికి పెద్దపీట వేయబడింది. ఇదే నాలుగు ఆశ్రమాలకు పట్టుకొమ్మ అయిన
గృహస్థాశ్రమానికి ప్రారంభం. దీన్ని స్త్రీ ,పురుష పరంగా కాక ,అద్వితీయమైన అర్ధనారీశ్వర తత్వంలో అర్ధంచేసుకునే
శాస్త్ర మననంలో భాగంగా స్వీకరించాను. జీవి పుట్టిన పిదప ఆహారంతో క్రమంగా మనసు తయారవుతుంది. ఇదే కన్య. నిజానికి మనసు దేన్ని మనం కోరుకుంటే దానిలో లగ్నం అవుతుంది. ఇది అందరి అనుభవంలోని విషయం.
ఇందువల్లనే శాస్త్రం ,ధ్రువుణ్ణి ,ప్రహ్లాదుని,శ్రీరాముని సంకేతంగా చూపి బాల్యంలోనే పిల్లలకు అపరోక్షానుభూతిని
పరిచయం చేయమంటుంది. ఏ కోరిక అయినా ధ్రువుణ్ణి,ఏ ప్రశ్న అయినా ప్రహ్లాదుని,ఏ వైరాగ్యమైన శ్రీరాముని వలె,గురువును ఆశ్రయించి వారికి అనువైన విధానంలో పిల్లలకు తత్వాన్ని పరిచయం చేయడం కనీస ధర్మం.
పై వారిలో ఎవరూ సన్యాసులు కాదు,గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించారు. జ్ఞానం అంటే సన్యాసం అనేది అపోహ. తన నిజానిజాలు తను తెలుసుకోవడం భగవత్ జ్ఞానం.
     మనసు కలిగిన జీవి , దానికి తండ్రితో సమానం. అష్టవర్షాత్ భవేత్ కన్య. ఆ వయసు నుండి మనసు తండ్రి ఏది చూపిస్తే అందులో లయమవడం ప్రారంభిస్తుంది.ఇలా అన్నంతో అంటే భూమినుండి అయోనిజగా జన్మించినది,కన్య.
అందు వల్లనే జనకుని ,విష్ణుచిత్తుని ఇలా ఎంతోమందిని, అమ్మాయి తండ్రిగా పరిచయం చేసింది శాస్త్రం. ఒక సంక్లిష్ట
విషయాన్ని అందరికీ అర్ధమయ్యేలా వ్యక్తులతో నిర్మితి చేసేది నాటకం.యదార్ధమైన పరతత్వాన్ని భూమిపై , ప్రకటించి  చూపినవి ఇతిహాసాలు. కన్యకు పరమాత్మను పరిచయం చేసి అతనితో ఎప్పుడూ,నిరంతరాయంగా లగ్నమై పోయేలా చెయ్యడం తండ్రి కర్తవ్యం. అలా చేసేదే కన్యాదానం. అపుడు సీతకు అరణ్యం కూడా ఆహ్లాదం గానే ఉంది. అరణ్యం అంటే జీవితం. ఒడిదుడుకులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.ఇది బాహ్యచరణ.
    అంతరంలో తన స్వస్థితిలో కదలక,నిమిత్త మాత్రంగా కర్మాచరణ పాతివ్రత్యం.కానీ మనసు ఇంద్రియ విషయాలతో
ప్రాపంచిక విషయాలతో నిండి ఉండడం,భార్యా లోలత్వం.అంటే మనసు తాను పరిభ్రమించడానికి ,పరమాత్మయొక్క
దివ్య విభూతి అయిన కాలాన్ని నష్ట పరుస్తున్నది. దీనివలన జీవి కర్మల ఫలితంగా జన్మ పరంపరలు పొందుతాడు.
బాహ్యంలో చరించడం అంటే జీవికి కర్త్రుత్వాన్ని ఇవ్వడం,బాహ్యంలో మాత్రమే శరీరంతో కలిసిన అహం ప్రజ్ఞ ప్రవర్తిస్తుంది.అందువలన ముక్తి అసాధ్యం.అందువల్లనే బాహ్యంలో కన్యాదానం వలన ఏడు తరాలు తరిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తాయి.మనసు లయిస్తేనే కానీ పైన అనుకున్నట్లు ముక్తి అసాధ్యం.దశరథుడైన వానికి రాముడు
లభించాడు యజ్ఞంతో. సీత జనకునికి మనో రూపంగా లభించింది. వీరిద్దరి కళ్యాణం ముక్తి. అంటే పురాకృత కర్మ
అనే యజ్ఞ కుండంనుండి ఆవిర్భవించినది శరీరం,అన్నగతంగా ఏర్పడింది మనసు. ఈరెండూ కలిస్తేనే జీవన్ముక్తి.