5, ఆగస్టు 2014, మంగళవారం

నమః శివాయ

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః

        నమః శివాయ       
   
 శ్రీ  గురుభ్యో నమః 

                                శ్రీ ఆది శంకరుల పాద పద్మాలకు సవినయంగా నమస్కరిస్తూ ,
         శ్రీ శృంగేరి పీఠ విరాజిత వర్తమాన పరమ గురుమూర్తులైన ,పూజ్య గురుదేవుల పాద పద్మాలకు శరణాగతిని స్వీకరించమని ప్రార్ధిస్తూ,కలి ప్రభావం వలన కొన్ని తరాలుగా లుప్తమైన ఎన్నో సదాచార ,సంప్రదాయాలను కాపాడు  కోవాలనే తపనతో అమ్మను కృప చేయమని అర్ధించడం తప్ప ఏమీ తెలియని ,ఒకే ధ్యాసతో సాగిన జీవితం , గురుమూర్తులకు సమర్పిస్తూ, అమ్మ  అనుమతిస్తేనే 'గురువు' అనే శబ్దం మనసును చేరుతుందని భావిస్తూ,శారీరకంగా వేరే ప్రదేశంలో ఉన్నా,అంతః కరణతో  గురుదేవుని పాద పద్మములకు,స వినయంగా ,పతి ,పత్ను లిద్దరమూ ,పదే ,పదే నమస్కరిస్తున్నాము .
            నాకు తోచిన నాలుగు మంచి మాటలు ,సంఘానికి కీడు చెయ్యనివి ,సంస్కృతీ ,సంప్రదాయాలకు దూరమై , నాలానే మళ్లీ పొందాలనే తాపత్రయం కలవారితో మనో భావాలను పంచుకోవాలనే తాపత్రయమే తప్ప ,వేరే ఏ ఉద్దేశ్యం లేదు . అమ్మవారి కృపతో ,మన ధర్మం పైన అపరిమితమైన ఇష్టాన్ని ,ఈ నాలుగు మాటలు కలగిస్తాయనే ధృఢ అభిప్రాయం .  గురు దేవుల అనుగ్రహాన్ని ,యాచిస్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాను . ఈ సాహసాన్ని గురుదేవులు మన్నించాలని,ప్రార్ధిస్తున్నాను .
                           అమ్మ పాదాలయందు గురు దేవులను స్మరిస్తూ దీన్ని సమర్పిస్తున్నాను .         
                                     'ఓం' కార ,నాద స్వరూపుడు శివుడు .
 నిరాకారం శబ్దమే.ఒకశబ్దం నుండి ఒక రూపంస్పష్ట మౌతుంది. సాకారం రూపం .రూపం స్పృహలోకరాకముందు 
 నిరాకారమే ,శబ్దానికున్నస్వరూపం . ఎవరి  నుండి   వికి సోకినా  శబ్దం ప్రణవమే , అని మనస్ఫూర్తిగానమ్మిన  వారికి ప్రతిశబ్దము స్వరూప స్వభావాలతో  సాక్షాత్కరిస్తుంది పరమాత్ముని నుండి సకలము , పరమాత్మునికే  సకలము . అని నమ్మినవారి నుండి కదిలి సృష్టిలో వ్యాపించిన ,వాగ్వైభవం అందరి  హితానికై ప్రసాదించిన  మహనీయులకు మనః  సుమాంజలి . ముఖతః అన్నీ వినలేకపోయినా ,పరంపరగా పెద్దల నుండి ,గురువుల నుండి ,గ్రంధాలనుండి విన్నవి   పరమాత్ముని వాణిగా గ్రహించి ,పరమాత్మయే పరమ గమ్యంగా భావించి, జీవించే వారి పాద ధూళిని స్మరించి , విస్మరించలేనివి, ఆస్వాదించే ఆనంద రసాస్వాదన చిత్తులైన తేనేటిగల గుంపులోని ఒక కీటకంగా నన్ను సంభావించి ,సరి పడని భావాలను మైనంగా భావించి విడిచి పెట్ట వలసినదిగా నాద రూపుడైన పరమాత్మను ఈ విశ్వంగా భావిస్తూ అర్ధిస్తున్నాను . వంట అమ్మ కర్తవ్యం . కానీ ప్రతి అమ్మ వంట రుచికి తేడా ఉంటుంది . ప్రతి చేతి వంటకి మారే రుచిలా, ప్రతి వారి అనుభవంలో  పరమాత్మ వైభవాన్నిసరి కొత్త కోణంలో  స్మరించడంలో ఆనందాన్ని ఆస్వాదించే మధుపంలా సమాజపు శైలిని,పరమాత్మ వైభవాన్ని ద్రుష్టి నుండి జారిపోనికుండా ,రెండు వైపులా పదునైన కత్తిని వాడుతున్నట్లు వీలైనంత అనుసంధానం చేసే ప్రయత్నానికి పరమాత్మ సహకరిస్తాడని ఆశిస్తున్నాను . వంట ఎంతో బావుందని మూగవాడు చెప్పినట్లు పరమాత్మను ఇలా స్మరిస్తున్నాను .

         కాలంలో ఎన్నో మార్పులు సహజం .చలనమే లేని శివ స్వరూప కాలానికి ,మార్పు రూపమైన ఆచార సంప్రదాయాలు అమ్మరూపమే .పిల్లల కవసరమైన మార్పులు ,చేర్పులు ,ఓర్పుతో అందించే అమ్మకు తొలి నమస్కారం కానీ తండ్రి మాటను ఏ మాత్రం ధిక్కరించినా ,తండ్రికి తెలియకుండా ఏ వ్యవహారం చేసినా ,అమ్మకు వచ్చే ఆగ్రహం అపరిమితం .ఇది ఆమె పత్నిగా తానై పొందిన ,స్వతంత్ర ప్రతిపత్తి . దీన్ని మాత్రమే అమ్మ స్త్రీ స్వాతంత్ర్యం అనే దిశగా ఆమోదిస్తుంది . భర్త గౌరవం ముందు ,తన గౌరవం ఎంత చిన్నదో ,దక్ష పుత్రికగా నిరూపించిన అమ్మకు నమస్కారం .

        వేదమే శివానాదం . మూల రూపమైన 'ప్రజ్ఞానం బ్రహ్మ'తత్వమసి'అయమాత్మ బ్రహ్మ'అహం బ్రహ్మాస్మి' అనే దిశలో పరమార్ధాన్ని, గ్రహించడానికి చేసే కృషిని మాత్రమే అమ్మ , తాను ఇచ్చిన మానవ దేహానికి సార్ధక్యం అని , ఆదిశగా వేసే అడుగులకు ఎంతో ప్రీతితో సహకరిస్తుంది . ఈ సాధనకు వేసే అడుగులకు వినాయకుడు ఏ విఘ్నాలు రానివ్వడు . వచ్చినట్లు బయటినుండి చూసేవారికి అనిపించినా,అంతరంలో సాధకునికి ,పాప పరిహారంగా తెలుస్తుందే తప్ప,విఘ్నమని నిరుత్సాహం ఆవరించదు . దేవసేనా ధ్యక్షుడు వీరిని ,వెనుక అడుగు వెయ్యనివ్వడు .            ధర్మార్ధకామమోక్షాలు ,శివ కుటుంబం . ధర్మం తల్లి ,మోక్షం తండ్రి . వారి రక్షణలోని అర్ధ ,కామాలు , వినాయకుడు ,కుమారస్వామి . అర్ధం తరువాతనే కామాన్ని చెప్పాలి . ముందు కోరిక ,ఎంత పరిగెట్టినా ,అర్ధవంతమైన , అర్ధంతోనే అది సాధ్య మౌతుంది .ఇది గణాధ్యక్షుని విషయంలో మనం గ్రహించ వచ్చు . అర్ధం అనే పరమార్ధం అమ్మ సృష్టి. నిత్య ముక్త స్వరూప శివత్వంలో,మౌనమే ,సంపద .దానికి అమ్మ మాత్రమే రూపమివ్వ గలదు . వాగ్వైభవం అమ్మ ఇచ్చే సంపద . భౌతిక సంపదల మూల రూపం వాగ్రూపం .దాని విస్కృత పరిణామం విఘ్నాధిపతి . అందుకే గణపతి 'ఓం'కార రూపుడు . ఎప్పుడూ తల్లి ,తండ్రి చుట్టూ ప్రదిక్షణం చేసి సత్ఫలం పొందుతూ ,మార్గదర్శనం చేస్తున్నాడు .సృష్టిలోని ప్రతికణం పరమాత్మయే .అనే ధారణ వల్ల ,సంయమనం ఏర్పడుతుంది .సుఖ ,దుఖాలు ,మనసుపై , పెద్దగా తమ ప్రభావాన్ని చూపలేవు . ఇదే ప్రదక్షణ ఫలం .
      ఈ స్థితిలో ,కోరిక కదిలినా పెద్ద ప్రమాదకారి కాదు . ధర్మాన్ని అనుసరించి ,సంయమనంతో నడిచే నడతకు , రూపం ,కుమార స్వామి .ఆచరణకు అధ్యక్షుడు ,దేవ సేనాధిపతి .తన పనిపై సందేహం లేని స్వామిత్వమే ,కుమారస్వామి. ఇది ధర్మానికి మోక్షానికి వారధి .మోక్షం కూడా అనుభవానికి ముందు ,కామనయే. ఈతడు అమ్మ నుండి కాక ,అమ్మద్వారా , ప్రేరేపింప  బడి భౌతిక ,ప్రయోజనం లక్ష్యంగా కాక[కామదహనం]పర తత్వమే ప్రయోజనంగా,సాగే ప్రయాణానికి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యుడు.అందువల్ల కాలసర్ప రూపంగా ,సాధనగా సాగుతుంది ,కోరిక . అగ్ని,నుండి వ్యక్తమై ,అవ్యక్త పరమాత్మను చేర్చడమే ,ఇతని గమ్యం . సాధారణంగా కూడా కోరికకు దహించే తత్వం సహజం . మోక్షకామి  అయి ,కదిలితే ,కదలని తానే స్వరూపంగా ,సాధ్యం భాసమాన మౌతుంది .
           ధర్మ,అర్ధ ,కామ,మోక్ష అనే పురుషార్ధాలు నాలుగు దీన్నే నిరూపిస్తాయి .'ధర్మ',గురు ముఖతః వినే ,'ప్రజ్ఞానం బ్రహ్మ''తత్వమసి'అనేవి బాల్యం నుండి వింటున్న బాల్యం, కిసోరావస్థలో అన్వయ మనే అధ్యవసాయంలో పడుతుంది. బాల్యంలో క్రీడ లంత సహజంగానే,పై విషయాల ఆలోచనకూడా అంతే సహజంగా,అధ్యయన సమయంలోనూ అనుస్యూతంగా సాగుతుంది .అర్ధ అనే పురుషార్ధం వద్దకు వస్తే ,ఇంట్లో పెద్దలు ధన సంపాదన ,వినియోగ , సంగ్రహ అనేవాటిని ,ఏ విధంగా విభాగం ఎలా అనేది ,పిల్లల ఊహ తెలిసి నప్పటినుండి గమనిస్తూనే ఉంటారు .ధనమే కాదు తల్లి ,తండ్రులు ,ఏ విషయాలకు ఎంత ప్రాధాన్యత నిస్తారు అనే విషయం ,పిల్లలకు నిర్ద్వందంగా తెలుసు . పెద్దల ద్రుష్టి కేంద్రమే ,పిల్లల సంపద . దీనివలన పెద్దల ద్రుష్టి అత్యవసర విషయంగా ,దేన్నిపరిగణిస్తున్నదో ,తెలుసుకునే నేర్పు వారికి సహజంగానే ఉంటుంది . వారి ద్రుష్టి పడకుండా నిర్వహించ వచ్చు అనుకుంటే ,వారినుండి పెద్దలకు కూడా ,పిల్లల దాపరికమే ఎదురవుతుంది . దీనివలన పిల్లలకన్నా ,పెద్దలే భవిష్యత్తులో బాధకు గురి అవుతారు .అన్నిటినీ దాచి పెద్దల్ని 'మసి పూసి మారేడుకాయ 'చందంగా ,వర్ణాంతర వివాహాలవరకు గాని ,అధవా మా స్వంత విషయాలు అంటూ ,తన భార్య పిల్లలు ,ఒక ప్రత్యేక విభాగం అన్న రోజున ,పిల్లలను పెంచిన ,15సం /జీవితంలో ఎంత అనర్ధం జరిగిందో ఆలోచించినా వ్యర్ధమే . అర్ధ వ్యవస్థకు మనపెద్దలు ,ధర్మానికన్నా తక్కువస్థానం ఎందు కిచ్చారో ,పిల్లలు పెరిగే వరకూ తెలియదు .అపుడు తెలుసుకుని చెబుదామన్నా ,వినేవారు ఉండరు . ప్రత్యక్షంగా పెద్దల ద్వారా వినకున్నా ,తమ స్వంత అనుభవంలో మనసు ఎలా ప్రవర్తించి తల్లి దండ్రులను ఎక్కడ ఉంచిందో గమనించి ,ధర్మ ప్రాతిపదికకు ,అర్ధసంగ్రహం కన్నా మిన్నగా జీవించి ,విలువలకు ప్రాధాన్యతను పెంచి ,జీవించి మాత్రమే ,పిల్లలకు మార్గ దర్శనం చేయాలి .ఇలా జీవించడానికి సంపన్న జీవితం కన్నా ,సంపన్న సంప్రదాయం ముఖ్యం . రోజు వారి సంపాదన ,అయినా జీవించే విధానం మాత్రం స్వీయ పరిణతి మాత్రమే . నిజానికి పెద్దలు సంపదగా పరిగణించింది సాంప్రదాయ బద్ధమైన జీవితాన్నే కానీ ,మట్టిలో పుట్టి ,మట్టి రూప మైన బాహ్య సంపద కాదు . శ్రీ శంకరులు ,కనకధారా స్తోత్రంలో ,మనముందుంచింది ,అర్ధ సంపాదన బాల్యక్రీడ అని తెలియ జెయ్యడమే . తరువాత ఏ సంపాదన ముఖ్యమో ,జీవించినంత కాలం చెప్తూనే ఉన్నారు .
                కామ పురుషార్ధానికి ,కామన అనే అర్ధం అందరికీ తెలిసిందే . అర్ధానికి ధర్మాన్ని జోడించినట్లే ,కామనకు కలపాలి .ధర్మంతో అనుసంధానం చెయ్యకుంటే వీటికి , సార్ధకత లేదు . ఎందువల్ల అంటే ,మోక్షమే శివ స్వరూపం .గమ్య రూపమైన మోక్షానికి ,సాధన ధర్మమే . పత్నిధర్మమే మహా గౌరి .ఆమె తనతో కలిసి శివాజ్ఞను ,అంటే ధర్మాన్ని పాటించ మంటుంది .కానీ శరీర పరిధిని ,తమ పరిధిగా అర్ధ ,కామాలు ప్రవర్తిస్తాయి . కానీ శరీరం , ఈ సృష్టిలో, ఎంత చిన్నదో , వాటి పరిధి అంత చిన్నది .దీని వలన మాత్రమే,చిన్నదైన తన జీవ కుటుంబానికి పరిమితమై ,జనన,మరణ చక్రంలో పరిభ్రమిస్తాడు .అర్ధ కామాలకే పరిమితమైన జీవి . మోక్ష గామి ఐ ,ధర్మ మనే బండిలో మాత్రమే ప్రయాణించేది ,వసుధైక కుటుంబం .
             పైన చూసినట్లు మోక్షమనేది ,ఒక పురుషార్ధం కాదు . ముందున్న మూడు కలిగిన ముముక్షువు పొందే , సాధ్య స్వరూపం .సాధన ,ధర్మ బద్ధమైన ,అర్ధ ,కామాలు . ధర్మ పరమైన నిబద్ధతతో జీవించి ,సృష్టిని ఆచంద్ర తారార్కం ,ధర్మ స్వరూపులైన ,సీతారాముల ,అయోధ్యగా, నిరూపించే జీవితం ,ధన్యం . ప్రజ్ఞానం బ్రహ్మ ,తత్వమసి ,గురు వాక్యాలు . వీటిని బాల్య,కౌమరాలలో పెద్దల ద్వారా బాగా గ్రహించి ,చింతన,కొన సాగించి [థియరీ],యౌవ్వన ప్రారంభం నుండి అర్ధ , కామాలతో బాటు ,మిగిలిన రెండు మహా వాక్యాలు ,స్వానుభవ [ ప్రాక్టికల్]రూపమైన , జీవితం సాగాలి . దీనికి దేశ కాలాలు అడ్డు రావు.అయమాత్మ బ్రహ్మ,అనేది సాధన .అహం బ్రహ్మస్మి అనేది స్థితి .దేశ ,కాలాల్నితమ అపజయానికి    కారణంగా చూపడమంటే ,చాతకాక ,మద్దెల ఓటిదన్నట్లు . బాహ్య కారణాలు అంత రంగాన్నిఏ మాత్రం కదిలించకుండా చేసే సాధన ,స్థిత ప్రజ్ఞత నిస్తుంది . ధర్మమనే కాడికి పూన్చినపుడే ,అర్ధ ,కామాలు ,జీవన రధాన్ని,అహం బ్రహ్మాస్మి అనే , గమ్యాన్ని చేరుస్తాయి .ధర్మ మనే కాడి నుండి తప్పిస్తే ,కనిపించిన అడ్డమైన గడ్డీ తిని,గాడి తప్పిన జీవితాన్ని వ్యర్ధంగా , గడిపేస్తాయి . 
           అమ్మ నమస్కరించే అయ్యకు నమస్కారం . అమ్మ చూపించే తండ్రికి నమస్కారం . శివాయ గురవే నమః . సృష్టిలో అందరి పోషణ భారాన్ని వహిస్తున్న,తల్లి దంద్రులైన శివ ,శివానీ లకు,హృదయ పూర్వక నమస్సుమాంజలి . ఓంకారాన్ని పరిపూర్ణ పరబ్రహ్మంగా మనకు పెద్దలు సూచిస్తారు. అ ఉ మ అనే మాత్రలకు,అర్ధమాత్ర సంపూర్ణ స్వరూపాన్నిస్తుంది.ఆమూడు అక్షరాలలోనే,త్రిమూర్తి రూపమైనా,ముగ్గురమ్మలరూపమైనా,మూడు లోకాలైనా,త్రిగుణాలైనా, అన్నీ యిమిడి ఉన్నాయి.అర్ధమాత్ర సాక్షాత్తుగా ఆది గురు స్వరూపమే.ఒక ఓంకారానికి,మరొక ఓంకారానికి మధ్యనున్న సాక్షాత్ స్వరూపమే నిరాకార పరబ్రహ్మం.ఇదే అర్ధ మాత్ర.ఈ పరిధి లోనిదే సకలమూ.శివుని ,నంది శ్రుంగాల ,మధ్యనుండి చూసే ,ఆలయ ఆచారం లోని పరమార్ధము ఇదే .నిరాకార స్వస్వరూపం శివుడైతే ,అది మన ఎరుకగా ఉన్నది అమ్మ చిత్ స్వరూపమే. వీరి చిద్విలాసమే కదా,జగత్తు. అదే ఆనంద రూపమైన జగత్స్థితి.వీరిద్దరి సంయోగ స్వరూపమే ,ప్రతిజీవి. అంతేకాదు మనకు పరిచయమయ్యే ప్రతి క్షణం. ప్రతికణం. 
       మనలో మనమే ఉంటే,ఈ విషయాలను గుర్తించ వచ్చు.ఎరుక ,మెలకువ ,ఉంటే సాధ్యమే. మనమొక పువ్వును చూశా మనుకుందాము. చూస్తున్న నేను , చూడబడే పువ్వు ,చూసే చర్య ,త్రిపుటి .ఈ విధానాన్ని సాక్షిగా గమనిస్తే,గమనించే నేను అర్ధమాత్ర. ఇదే శ్రీరమణ మార్గం.
    గమనించే సాక్షికి,త్రిపుటితో ఏ సంబంధం ఉండదు. పువ్వులు ఎన్ని ఉన్నా చూసే చూపు ఒక్కటే. అలానే శరీరానికి సాక్షి పరమాత్మ మాత్రమే .పువ్వును చూస్తున్నప్పుడు కలిగే చర్య గమనిస్తే. చూసే సాక్షి శివుడైతే,చూడబడే పువ్వు అమ్మవారే. ప్రతి క్షణం కళ్యాణమే. కలిగేది ఆనందమే. కానీ త్రిపుటిలో మునిగితే సంసారం. అంటే చూసినది కావాలనుకోవడమే సంసారం. సాక్షిగా కదిలే వాటిని గమనిస్తూ పోవడం,పరమాత్మాను సంధానం.
            త్రిపుటి బాహ్యం లోనే లేదు.అంతర ప్రపంచానికి  కూడా అన్వయిస్తే, యిదే ఆనందం అందుతుంది. సాధన
సమయాన్ని కోరదు. అవగాహన మాత్రమే ఆలంబనం అవుతుంది.అందువల్లనే కర్మ,భక్తి అన్నీ లయమై,లక్ష్యంఅందాలంటే జ్ఞానమే ప్రధానమనే ఉపనిషద్ వాక్యం,వర్తమాన క్షణానికి అన్వయిస్తే  మాత్రమే సాధన సంపూర్ణ మౌతుంది.కర్మ,ఇది బాహ్య,అంతర ప్రపంచాన్నిశుద్ధి చేసి వర్తమాన క్షణాన్ని మన ముందుకు తెస్తుంది.దీనికి కర్త, కర్మ,కర్మఫలం.ఇలా త్రిపుటి పైనే ఆధార పడుతుంది. కర్మఫలం కోరని కర్మ,బాహ్య,అభ్యంతర సుచినిస్తుంది.బాహ్య అంతర కర్మ, కర్తయొక్క సపోర్ట్ తో మాత్రమే తన సాధన సాగిస్తుంది. మన మీద మనకున్న కంట్రోల్ కర్మకు సహాయ కారి అవుతుంది. అలలు లేని నీటిలా స్పష్టమైన అవగాహనకు సహకరిస్తుంది. పరమాత్మ దర్శనానికి ప్రధమమైన ప్రాతిపదిక క్లారిటీ,ఇది కూడా మనకు సాక్షిగా ఉండే సాధనలో లభిస్తుంది. ఈ సాధనలో మనకు తెలియకుండానే , పరమాత్మ సామీప్యం వలన,పాప పుణ్యాలు క్షీణిస్తాయి.పిల్లలలకు,తల్లి తండ్రి,ఎదురుగా ఉన్నప్పుడు వారికి కలిగే రక్షణ వంటిదే ఇది కూడా. అందువలన తత్క్షణ ఆనందానికి అర్హుల మౌతాము.
         కర్మలో త్రిపుటి ఉంది.ఒకటి మైనస్ అయితే మిగిలేది భక్తి.భక్తుడు,భగవంతుడు.భక్తిలోకూడాశరీరసహకారంతో
జరిగేది,పూజ.ఇది కూడా,ఎన్నో జన్మలలో చేసిన శారీరిక పాపాలను తుదముట్టిస్తుంది. పాప కర్మకు మనసు కూడా
బాధ్యత వహించింది కనుక,పూజలో కూడా మనసు సహకరిస్తేనే పూజాఫలం అందుతుంది.వీటిని శాసించడం బుద్ధి కర్తవ్యం. కర్మకు శాసించిన బుద్ధి ఇక్కడ శాసనం చెయ్యకపోతే,వక్రమైనదనే అర్ధం.
         అంతర పూజలో భక్తుడు ,భగవంతుడు.  జప,ధ్యానాలు. వీని వలన శరీర సహకారం లేకుండా,మనసును
ప్రేరేపించి బుద్ధి చేసిన పాపాలకు,ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కర్మను,భక్తిని సహకారంగా తీసుకుని సాగినా,పతాక
స్థాయిలో యివి ఏ మాత్రం సహకరించవు.జ్ఞాన స్వరూపమైన ఏకత్వం,మన స్వరూప మౌతుంది. దీనిలో త్రిపుటి
లేదు.అందువలన జ్ఞానాన్నిసాధనంగా కూడా నిరూపించడం కుదరని విషయం.ఏకమైన ఎరుకలోసాధన,సాధకుడు
సాధ్యము,వీని బేధం లేదు.మంచు కరిగి నీరైన చందంగా.  శివానంద రూప శివోహం,శివోహం.
         ప్రకృతిని పరికిస్తే కనిపిస్తున్న ప్రతిదీ, శివుడు ,శక్తి కలిసి ఉన్న స్వరూపం ,ప్రతి జీవిగా ,ప్రతి శరీరంలో అర్ధ నారీ
శ్వరమే .బాహ్యంగా చూస్తే నాటకరంగంలో,వేదిక పైన నటించే కధ కోసం మాత్రమే స్త్రీ,పురుష,బేధం.అంతరంగంలో
కదిలితే,మనకు,మన స్వరూపంగా అనుభవంలో శరీర పర్యంతంగా,భాసించే ఏ చైతన్యం  పరిచయంలోఉందో అది ,
శరీరం గాను,తెలుసుకుంటున్న చైతన్యం గాను,అర్ధ నారీశ్వరమే .అంతరంగంలో పరమాత్మ రూపంగా అనుభవం ఏకమే ఐనా ,సృష్టి పరిధిలో పరమాత్మ ఉన్నతుడు . ఇది పరమాత్మ చెప్పే విషయం కాదు . జీవుడు ప్రతిపాదించ వలసిన విషయం
           ఇదే స్త్రీ ,తనకు తానుగా గీసుకునే ,చిన్నగీత . భర్తకు పెద్ద గీత ,దానంతట అదే ఏర్పడుతుంది . ఇది ఆధ్యాత్మిక పరమైనఅన్వయం . భక్తితో పరమాత్ముని మూర్తి ఎదుట నిలబడి నపుడు ,కళ్ళు మూసుకోవడం ,సాధారణంగా జరిగే ప్రతిక్రియ . ఇలా ఎందుకు ?సాకారంగా శరీరం వెలుపల కనిపిస్తున్నమూర్తి ,అంతరంలో నిరాకర రూప ,అనుభవరూప , సచ్చిదానందరూప స్వానుభవ రూప ,శివోహం ,శివోహం . శరీరస్ప్రుహతో ,మాత్రమే బాహ్యభ్యంతరాలు. శరీరం పురాకృత కర్మ రూపం . కర్తృత్వ భావం విడిచిన తత్క్షణం ఉన్నది ,నిరాకార రూప శివోహం ,శివోహం .
         ఓంనమో నీలకంఠయ మహా మృత్యుంజయాయ నమో నమః . వర్తమానంలో సాధన మోక్షా న్నిస్తుంది . ఇది శాస్త్ర  సమ్మతం.అంటే మనసులోకి భూత ,భవిష్యత్ వీటి ఆలోచన వీడి తత్ క్షణంలో ఉన్ననిరాకార సత్చిద్రూప స్థితి . అనుభవం ఆనందం . ఇది మోక్షం .కానీ ప్రతిబంధకమే భూత కాలం .భవిష్యత్తు గురించి ఆలోచనను నిరోధించ వచ్చు. భూతకాలానికి సంబంధించిన ఆలోచనలు తప్పకప్రతిబంధకాలే.కనీసం ఈజన్మకు సంబంధించిన ఆలోచనలే నిగ్రహించ లేనపుడు గత జన్మల పాపరాసి తప్పక ఏదో ఒకరూపంలోఅడ్డు తగులుతూనే ఉంటుంది.ఇదే మనకుక్షీర సాగర మధన గాధలో తెలుస్తున్నది. 
      విష్ణువే  ఆధారంగా [వర్తమానం]మధన సాగి నప్పటికీ ,దేవతలు,రాక్షసులు వీరికి కల రాకృతం[భూతకాల]మహా కాలకూటవిషం [కాలంలో కూడబెట్టుకున్నది]నిరోధించ శక్యం కానిది ,దీన్ని వర్తమానం దాటలేక  పోయినప్పుడు, పరమేశ్వరుని శరణు వేడితే భూత కాలాధిపతి  ఐన పరమ శివుడే ,విషాన్ని గ్రహించి ,నీలకంఠ నామంతో అనుగ్రహించాడు . ఆసమయంలో క్రింద పడిన విష బిందువులు ,విష సర్పాలుగా మారినపుడు వాటిని తానే ధరించి మానవాళిని  భయ ముక్తులను చేశాడు . మానవుని పురాకృత పాపకర్మ ఎంత ఉన్నా, ఈ జన్మకు వర్తించేది ఒక బిందువే . ఈజన్మకు అందిన పాప ఫలం వ్యాధి,వైరం,దారిద్ర్యం ,అహంకారం,ఇలాఎన్నో రూపాలలో స్తరించి,మనసుకు వర్తమానంలోని  [విష్ణువును] ఆనందాన్ని అందకుండా చేస్తుంది . భయముక్తుడు కాని వాడు మోక్షానికి అనర్హుడు . భయమే మృత్యువు . అందుకు శివుణ్ణి మార్కండేయునివలె మృత్యుంజయా పాహి అనవలసిందే .అదే మనకు క్షీర సాగర మధన సమయంలో దేవత రూపాన్ని ధరించి[మోహ రూపమైన]మాయా రూపాన్ని పొంది,మోసంతోమన అమృతరూపమైన కాలాన్నిహరించి అందవలసిన మోక్షరూపమైన  వర్తమాన కాలాన్ని,రాహు కేతు రూపంగా, సూర్యుని,చంద్రుని, గ్రసించి నట్లు,గ్రహణంలా  కనిపిస్తుంది . కానీ ఇది కూడా పైకి కనిపించే కారణమే ,నీడలాగా . నిజం అంతరాత్మ రూపమైన పరమాత్మ చైతన్యాన్ని, ఇది ఎంతోసేపు మరుగు పరచలేదు. రాహు కేతువులను గుర్తించిన ,విశ్వానికి నేత్రాలైన సూర్యుని ,చంద్రులపై పగబట్టి గ్రహణాన్ని లీలా మాత్రంగా చూపి అంతరంగ ద్రుష్టి ఐన మూడో కన్నును మాత్రం అడ్డుకోలేక విరమించేవే ఇవి .అందువల్ల శ్రీ కాళహస్తీస్వరుని , మూడోకంటి వాణ్ణి భజించి భయ ముక్తులు కావలసిందే . అందరికీ అందే వాడే నాగాభరణుడు . అందుకే భోళా శంకరుడు . ఎప్పుడూ నడుస్తున్నది భూతకాల రూప ప్రారబ్ధమే . శివుడే అందుతున్న వాడు . ఈయన దక్షిణామూర్తి . ఈయన శక్తి జ్ఞాన ప్రసునాంబిక . అందుకే గ్రహణ సమయంలో కూడా శ్రీ కాళహస్తీ శ్వరాలయం తెరిచే ఉంటుంది . మానవాళిని భయముక్తులను చేసే భవ్యాలయం .
       ఇందులోని శ్రీ వాచకం సాలె పురుగును సూచిస్తుంది . ఇది మానవుని కర్తృత్వ భావంతో పెంచుకునే సాలెగూడు . పదార్ధం గూడు కట్టడానికి ఎక్కడి నుంచో రాదు . తానే తననుండి అహం శరీరానిదే వేరే కర్త, లేడనే పరమాత్మ నిరాకరణ రూపమైన ప్రవృత్తి మాత్రమే దీనికి ఆధారం.ఈ విధమైన అహాన్నిమాత్రమే అమ్మ అయిన జగన్మాత జనన,మరణ రూపమైన ఉయ్యాలలో పసి బిడ్డగా లాలిస్తుంది.అందుకే వినాయకుడు తల్లి తండ్రులకు నస్కరించి సఫలీ కృతుడు అయ్యాడు . మానవులు శరీరంలో ఉన్నది ,నిజానికి తల్లితండ్రుల రూపంలో ఉన్న శివా శివులే .దీన్ని గుర్తించి అహం నిర్మూలనం చెయ్యడం సులువు .అంతా ఈశ్వరుడే,అహం  లేదు ,అంతా శివోహం అంటున్న శివుడే, అని నమ్మి సాధన చేసే భక్తులకు జ్ఞాన ప్రసూనంబికగాఅనుగ్రహించి జనన,మరణ చక్ర బేధనం చేస్తుంది .శరీరం ఉన్నంత కాలం,తనలో వ్యక్త మవుతున్నది , శివాశివులని  ఎరిగి,అహం ప్రత్యయం,శరీర పర్యంతమనే సర్ప భావాన్ని వీడి,పరమాత్మనే రజ్జువుగా తెలిసి భయ రహితులై మోక్ష స్వరూపమైన,మార్కండేయులై, శరీర మరణాన్ని తమ మరణంగా అన్వయించక ,శివోహం అనాలి . శరీరానికి అన్వయిస్తే కలిగేది ,రావణాసుర తత్వమే .ఇలా ఈ సాలెగూటి నుంచి శివుణ్ణి ఆశ్ర యించిన 'శ్రీ 'కధ .
      కాళము అంటే సర్పము . సర్పము వర్తమాన కాలానికి గుర్తు . అంటే మన కాలాన్ని శివునికి అలంకరిస్తే , అలంకరణ ప్రియుడైన విష్ణువై ,తత్క్షణం వర్తమాన రూపమైన విష్ణువై, మోక్ష రూపునిగా,సర్వే సర్వత్ర ప్రకాశిస్తాడు.అమ్మ సూర్యుని నుండి వచ్చే కాంతి స్వరూపం .ఇవి నిజానికి రెండు కాదు . ఒక వ్యక్తికి రూపాన్ని గాని ,నామాన్ని గాని వేరుగా ఉహించడం కూడా కుదరనిపని.ఒకే వస్తువును దాని స్వభావాన్ని కూడా వేరు చెయ్యలేము.విద్యావంతుని నుండి విద్య ఎప్పుడూవేరుగా  ఉండదు.ఇదే అర్ధనారీశ్వరo . శ్రీచక్రం . 4శివ కోణాలు . 5శక్తి కోణాలు . బిందువు అద్వైతం .
       లం ,హం ,యం ,రం ,వం ,ఇవి పంచ భూతాత్మక బీజాక్షరాలు . దీనిలోని వాయు బీజాక్షరమ్ యం,వాయువుకు సూర్యుని పంచాయతనంలో తెలియజేస్తారు .'లం'వినాయకుని ,పృధ్వీ రూపంగా ,'హం'విష్ణువును ఆకాశ రూపంగా , 'రం'అమ్మవారిని అగ్ని రూపంగా ,'వం'శివుడు జల స్వరూపం . శివునకు అభిషేకం .దీపం అమ్మవారు .పుష్పం విష్ణువు. ధూపం సూర్యునికి .నివేదన వినాయకుడు . నివేదనలో పదార్ధం ,పంచ భూతాత్మకం.
           సూర్యుడు సకల దేవతా స్వరూపుడు .హనుమంతుని, వేద వేత్తను చేసిన గురువు శ్రీ సూర్య నారాయణ మూర్తి .నమస్కరిస్తే కరుణించే కారుణ్య మూర్తి .అలాగే శ్రీ కాళ హస్తీ శ్వరుడు ,వాయు లింగ రూపుడు .ఆదిగురువు దక్షిణా మూర్తి . అందువలన సూర్యునిలో ' శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సహిత శ్రీ కాళ హస్తీ శ్వరుని ' భావించి నమస్కరిస్తే ,రాహు ,కేతు బాధల నుండి విముక్తులు కావచ్చు .  
       హస్తి ,ఏనుగు పూజించిన సర్వేశ్వరుడు.మానవ కపాలం ఏనుగు కుంభ స్థలమైతే,మూలాధారం వరకూ ఉన్న సుషుమ్నా మార్గమే తొండం . ఏనుగు తొండంతోనే అన్నీ అందుకుంటుంది .స్పర్శ అనే జ్ఞానేంద్రియానికి గుర్తుగా కూడా ఏనుగు చెప్పబడుతుంది.ఎప్పుడూ క్రిందికి వేళ్ళాడుతూ ప్రేయో మార్గాన్ని ఆశ్రయించి,ఎంతో సూక్ష్మ బుద్ధి కలిగి శ్రవణంలో  ఎంతోనిపుణత కలిగివున్నా,సృష్టితో అనుబంధాన్ని వదులుకోలేని బలహీనత,మదించి ఉండడం వలన,శ్రవణం లోని జ్ఞానాన్ని, అనుభవానికి అందక,సంసారం అనే కాసారంలో తిరుగాడుతూ ఉంది . కాలం [మొసలి]వర్తమానంలో శరీరాన్ని,గ్రసించే సమయంలో  స్థితి కారకుడైన విష్ణువును 'నివేతప్ప ఇతః పరం బెరుంగ' అని గుర్తించి ,మనసును ఏకాగ్రం చేసి ,చేసిన ప్రార్ధనను,శ్రీ హరి మన్నించి ,సిరికి చెప్పకున్నా,[హృదయ స్థిత లక్ష్మి ,వాగ్రూపంగా]గరుడుని మాత్రం అధిరోహించాడు.అంటే శ్రవణానక్షత్రాధిపతి ,శ్రీ మహా విష్ణువు.గరుడ రూపంలో  సూచించ బడిన వేదవిద్య ,స్ఫురణకు తెచ్చి,కరిని కాచి రక్షించాడు. నీటిలోని మొసలి ఏనుగును వెదుకుతూ రాలేదు .అలానే కాలగతిలో ఏనుగనే శరీరమే,మృత్యువనే మొసలి వద్దకు చేరింది .అప్పుడు తాను కాలాన్ని ఎంతగా అపహాస్యం చేసిందో , అర్ధం అయింది . వర్తమానంలో అంటే విష్ణు కృపతో,శ్రవణం ద్వారా తాను పొందిన జ్ఞానంతో ,అంతర్ముఖమై ,మూలానికి చేరి , అంతర్గత చైతన్య రూపమైన శక్తి ,వాడక పోవడం వలన ,చుట్ట చుట్టుకుని నిద్రిస్తున్నట్ట్లున్న అనంతమైన కాలం [సర్పం] బుసలు కొడుతూ, ఏనుగు తొండంలో [సుషుమ్నలో]ప్రవేశించి,సహస్రారం చేరి పరమాత్మలో లీనమైంది . ఇది వాయు నిరోధంతోనే సాధ్యం. వాయువు యొక్క కుమ్భకస్థితిని ఏనుగు అని సంభావించినపుడు సమయమనే కాళము కుంభకంలో జాగృతిచెంది శివుని చేరి సాలెగూటి వంటి సంసారం నుండి విముక్తి  పొందడమే సమాధి .
        శబ్ద రూపమైన మంత్రం కానీ స్తోత్రం కానీ ,వెన్ను నిటారుగా ఉంచి ,శబ్దాన్ని ఎక్కడ పుడుతున్నదో అక్కడే నొక్కి , ధ్యాసతో చదవడం వలన,మనసు కదలక శబ్ద మూలంలో రమిస్తూ ,బాహ్య ప్రపంచం కోసం వెంపర్లాడదు.స్వానుభవం సాకార మౌతుంది .జీవ బ్రహ్మైక్యమే శ్రీ కాళ హస్తి .     
            సాధన సంపూర్ణం అవాలంటే కీలకమైన అంశం, పైన చూసిన దృశ్యంలో తెలుస్తుంది . క్రమంగా మనః చక్రాన్ని,దృఢo చేసిన కొద్దీ ,సుదర్శనమై ,కాలాన్ని[భూత,భవిష్యత్]నిలిపి ,వర్తమానం ,అనే కాలాతీత స్వరూప ,క్షణంలో , నామ రూపాతీత స్థితిలో నిలిపితే ,అదే మోక్ష రూపుడైన విష్ణువే . కదలకుండా ఉన్న క్షణంలో ఉన్న మనస్సే ,సుదర్శన చక్రం . త్రిగుణాతీతమైన ఆనంద స్వరూపమే ,తత్ క్షణంలో అందుతుంది .
                దీన్నే విష్ణు రూపానికి అన్వ యిస్తే ,సూర్యుడు నారాయణ రూపు డైతే ,కిరణాలు లక్ష్మి స్వరూపం . పద్మం నీటిలో  ఉంది . సూర్య రస్మితో వికసిస్తుంది .సంసారమనే బురదలో [శరీరంలో]మనసు పద్మం వంటిది.అందువల్లనే జీవినే పద్మావతిగా చూస్తే ,పరమాత్మ  జ్ఞానం జీవి మనసును వికసింప జేస్తే [షట్చక్ర బేధన రూపమైన ]సహస్రారంలోని వెంకట రమణునిలో లీన మౌతుంది .క్రింద పద్మావతి  ఏడుకొండల పైన [షట్చక్రాలు పైన]వేంకట రమణుడు .కిరణాల రూపంతో లక్ష్మి ఒక పత్ని.ఆమె మరో రూపమే పద్మావతి . సృష్టి అనే క్రీడలో విష్ణువు యొక్క శక్తి శ్రీ మహాలక్ష్మి . ఆమె అలంకరించుకుని ,దర్పణంలో తనను తాను చూసి మురిసిన ,ప్రతిబింబ రూపమే పద్మావతి . ప్రతిబింబానికి ఉన్న మరో లక్షణం .కుడి ,ఎడమగా కనిపించడం . బింబంనిరాకారం . సాకారం ప్రతి బింబం . ప్రతిబింబ రూపమైన శరీర పరిధిని తానుగా భ్రమించే జీవాత్మ ,అద్వైత పరమాత్మ శివోహం అంటే ,నేను అంటూపూర్తిగా వ్యతిరేక దిశలో శరీరమే అని అన్వయించి,తనను విలక్షణంగా బింబం కంటే వేరంటూ,నిర్ణ యించి మోక్షం కావాలంటూ మొర పెడుతుంది . ప్రతిబింబం తాను అనగానే ,కాలం అనేది ప్రారంభం అవుతుంది . బింబానికి కాలం అలంకారం మాత్రమే శివునిలా. పాన్పుగా ఉంటుంది విష్ణువుకు .అద్దం ముందుకు రావడం జన్మ ,తప్పుకోవడం మరణం. లక్ష్మిమాత్రమే  పద్మావతికి  శ్రీనివాసునితో కళ్యాణం చెయ్యగలదు .జ్ఞానం మాత్రమే  ఆత్మను పరమాత్మతో కలప గలదు . ఇద్దరు భార్యలు  అని సూచించిన అంతరార్ధం ఇదే .
          వర్తమాన క్షణంలో[విష్ణువు ],దేహం [భూదేవి],కాలం [శ్రీదేవి] ప్రాణ స్వరూపం ,ఒకే బిందువు వద్ద ,ఐక్యమై
స్వస్వరూప ,మోక్ష రూపంగా,దర్శనమిస్తున్నారు .ఆకాశమే నామరూపాలకు ,అవకాశమిస్తుంది .ఆకాశం విష్ణువు,శబ్దం లక్ష్మిరూపం ,రూపం భూదేవి . బుద్ధి ,నామరూపాల వరకే పరిమితమై ,పరమాత్మను ,గ్రహించలేదు .బల్బు విద్యుత్తుతో , ప్రకాశిస్తుంది కానీ ,విద్యుత్తును ,దృశ్యంగా ఎప్పటికీ తెలుసుకోలేదు .అలానే ప్రకృతి సాకారం . విష్ణువు నిరాకారం . వీరి కళ్యాణ రూపమే సృష్టి . పద్మావతి భూమి మీద అవతరించే లీల దిశగా అర్ధం చేసుకుంటే ,లక్ష్మీదేవి ,భ్రుగు పుత్రిక కూడా . భ్రుగు మహర్షి ,వైకుంఠఆనికి వచ్చి,నారాయుణుని పరీక్షించి,హృదయం పై కాలితో తన్ని నపుడు లక్ష్మి అలిగి,కొల్హాపురి చేరిందనేది,ఐతిహ్యం .శ్రీ మహాలక్ష్మిని విష్ణు పాదాలు కడిగి కన్యను అతని పాదాల చెంత ,సమర్పించి నపుడు ,ఆమెకు పాదాల వద్ద మాత్రమే స్మరణ ఉండాలి . స్వామి ఆమెను హృదయంలో దాల్చవచ్చు. కానీ లక్ష్మికి తాను పాద సేవకురాలననే స్పృహకు అంతరాయం కలగ రాదు . తాను హృదయంలో ఉన్నాననే భావాన్ని పొందడం వలన ఆమెకు , ఏ మేలు కలగక పోగా, అహం వల్ల తన స్థానాన్ని కోల్పోయింది.అలానే ఆధార రూపమైన,శరీర పర్యంతం కాని ,సోహం వలన,అహం నిరాకరణ రూపమైన ముక్తి పొందుతాడు. అలానే భక్తిలోఅహం లేని శరణాగతి కాక,నా అంతటి భక్తుడుగాని, జ్ఞాని గాని లేడు అనుకున్నప్పుడు అన్నీ అనర్ధాలే .స్వామిని విడిచి ,మళ్లీ తపించ వలసిందే . ఇదే కాల చక్రం తో విష్ణువు చేసే వధ . భౌతికంగా చూసినపుడు,అమ్మాయిని,అణుకువగా,అత్త మామల సేవ చేసి ,భర్త హృదయాన్ని ,గెలవమనే పెద్దల మాటలో అర్ధం అదే. అత్త ,మామలే భర్త శరీరానికి ఆధారం . కనుక సృష్టిలోని తన జీవిత నాటకం ,సరిగ్గా సాగడానికి , పెద్దలమాట చెవిన పెట్టడం మంచిది .భర్త హృదయాన్ని గెలిచినా,అణకువ తప్పదు .సతీ దేవి కధలోకాని ,పై కధలో కానీ తండ్రి చేసిన తప్పుకు ,తనయలు బాధకు గురి అయారు .        
       పంచ భూతాలు ,నిరాకారమైన పరతత్వాన్ని సూచిస్తే ,పంచీకరణతో,సృష్టి సాకర మైంది .భక్తి సాకారం ,జ్ఞానం నిరాకారం నీరు ,మంచు వీటి మధ్యన ఉన్న బేధం మాత్రమే ,వీటి మధ్యన ఉన్నది కూడా . పంచ భూతాలతో పోలిస్తే , నిజానికి పంచీకరణ జరిగింది ,సృష్టిలో చాలా స్వల్పం . అలానే ద్వైతంతో పోలిస్తే ,అనంతమైనది అద్వైతం . లాలించే అమ్మగా ద్వైతాన్ని భావిస్తే , అనంతుడే తండ్రి .అహం వీడి ఆలోచిస్తే ,శరీరం రూపంలో అమ్మగా,లోపల ,బయట అంతటా నిండిన పంచ భూతాలను తండ్రిగా సంభావిస్తే ,కలిగే ఆనందానికి అంతు ఉండదు .పరిమిత అహం ,'నేనుగా' శరీర భ్రాంతిగా , ధర్మ పరిధిని కాపాడనంత వరకు , ప్రకృతి స్వరూపిణిగా ,మాయగా భ్రమింప చేస్తూ ,అమ్మగా ఆడిస్తూనే ఉంటుంది . అంతా పరమాత్మేనని గ్రహిస్తే ,అమ్మ, సర్వే సర్వత్ర ప్రకాశించే  పరమాత్మగా,శివునితో ఏకమై ,ప్రకాశిస్తుంది .ఇది జీవ బ్రహ్మైక్యం .ఈ సత్యాన్ని ప్రతిపాదిస్తూ ,స్త్రీ  శరీరాన్ని ప్రకృతిగా భావించి ,భర్త జీవించి ఉండగా ,స్త్రీ శరీరం ,లయం కావడాన్ని ముక్తి ,అనే దిశగా ,సంప్రదాయ వాదం భావించి ఉండవచ్చు.కాశిలో విశ్వేశ్వరుడు అనంతుడు ,మనను స్పృశించి , సేదతీర్చే తల్లి గంగ .కాశి నగరమే ,విశాలమైన కన్నులతో చూచి, అందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ .శివుని అర్ధ శరీరం అన్నపూర్ణ [గౌరి] .మూడో కన్ను విశాలాక్షి.శివుని కరుణ,జటాఝూటం నుండి జాలువారే గంగ . వెరసి కాశి అర్ధనారీశ్వరం
            త్రి భాషా సూత్రం వలన అన్నీ గ్రహిస్తున్నా ,అన్ని ఉపన్యాసాలు విని ,అంతరంగంలో సత్సంగ భావాన్ని విడువలేక తెలుగులో ఇలా కొద్దిగా మనన , రూపంగా క్రింది విషయాలు వ్రాస్తున్నాను .స్వామి అనుభావానంద స్వామికి దన్యవాదాలర్పిస్తూ ,స్వానందమనే ద్రుష్టి తప్ప ,మిగిలిన ఎలాంటి స్వలాభాపేక్ష లేదని ,సత్సంగ రూపంగా గ్రహించడానికై , అర్ధిస్తున్నాను .         
    మౌనం శివ స్వరూపం,శబ్దం అమ్మవారి స్వరూపం.స్వామి  అనుభవానంద,సనత్సుజాతీయం,అనేదాన్నివివరిస్తూ[హింది] జీవుడు తననుతాను ,స్త్రీ ,పురుష ,తండ్రి ,తల్లి ,పుత్రుడు ,పుత్రిక ,సోదరుడు ,సోదరి ,భర్త ,భార్య , అత్త ,మామ ,బావ ,వదిన ఇలా ఏదో ఒక పాత్రను ,ఆపాదించుకుని ,[ఫ్రేమ్]వ్యవహరించడానికి ,శబ్దం మాత్రమే సహకరిస్తుంది.ఇది సంసారం .వీటినుండిమనసు మరలిన క్షణం ,వున్నది ,మౌనం.అమ్మ త్రిపుర సుందరి .శివుడు త్రిపురాంతకుడు .తనను తాను, ఒక పాత్ర అని నమ్మితే ,ధర్మం అనే చట్రంలో బంధించ బడతారు . సర్కిల్ ప్రారంభం అవుతుంది . ప్రవర్తన మాత్రమే ధర్మానికి కట్టుబడాలి . కానీ మనసు ధ్యాన మగ్నమై మౌనంలో ,పరమాత్మలో అబేధతను,సాధించడమే ,జీవిత లక్ష్యంగా మారాలి . ఇదే ఉపరతి . మాటలు సంసారం .మౌనం ,ముక్తి . వాక్కు ,మనస్సు ,రెండింటి నుండి శబ్దం మరలడమే సాధన .సాధనలో ,మౌనము ,శబ్దము ,ఒకచోట ఉండవు.సాధ్యంలో, మౌనం, శబ్దంగా  పరివర్తన చెందడం స్పష్టంగా తెలుస్తుంది . ఉన్నవి రెండుగా కనిపిస్తున్నా నిజానికి ఒకటే . అనుభవాలు  శబ్ద రూపంలో ,నిక్షిప్తమై ,తిరిగి జ్ఞాపకం వస్తే రూపాలుగా కూడా తెలుస్తా యి . తనలో తానైన సంతృప్తి నుండి వెలువడిన ,కళా స్వరూపమే సృష్టి . ఆనందమే దీనికి రంగము ,రంగు ,కుంచె . అర్ధనారీశ్వరమే ,జీవన్ముక్తి .
             మనస్సు ఒక క్షణం కూడా వర్తమానంలో నిలవదు . బాహ్యంలో ఎప్పుడూ భూత కాలం గురించి ,మనసులో ఎప్పుడూ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది .మౌనమే వర్తమానం .అత్యంత సావధానం అవసరం .ఒకటి తనలో తను మాట్లాడుకోకుండా ఉండడం,ఎవరితోనైనా మాట్లాడేటపుడు,ఇప్పుడు మాట్లాడడం అవసరమా?అని ఒక క్షణం మనసును ఆపితే ,మౌనంలో ఎంతో ప్రశాంతత పొందుతుంది .జ్ఞానం అనుభవంగా అందుతుంది .స్వరూప విస్మృతి ,లేదా నేనది ,నేనిది అనే అధ్యారోపం,ఇవే మరణ సద్రుశాలు .ఇదే సంసారం .
          సంగ్రహము ,సంబంధము ,ఇవి రెండే ,మనిషి మోసే బరువులు . ఇవి పరిమితిని మించక ఉంటే ,సాధన ,నిరాటంకంగా సాగుతుంది .గౌరవం ,ద్వేషం ఈ రెండూ ,సంస్కారాలను బలపరుస్తూ ఉంటాయి . వీటిని అధిగమించక తప్పదు .భగవద్గీతలో చెప్పినట్లు ,సుఖ దుఃఖాలు ,లాభా లాభాలు ,జయాపజయాలు ,వీటి సంస్కారాలు ,నిర్మాణం కానప్పుడు కదా ,సాధన ప్రారంభం .అందువల్లనే కర్మ చెయ్యడం వరకే ,స్వాతంత్ర్యం ఉంది .కానీ ఫలాలు పొందే టపుడు ,ప్రకృతి నియమాన్ననుసరించి దాని ఫలాన్ని తప్పక పొంద వలసిందే . అందుకే నవ్వుతూ తప్పులు చేస్తే ,ఏడుస్తూ అనుభవించాలానే నానుడి ఉంది .     
            మననీడకు ,ఎప్పుడైనా సత్యత్వం అనేదాన్ని ఆపాదిస్తామా ?అది బురదపై పడినా ,గొప్ప వస్తువుపై పడినా మన కేమీ సంబంధం ఉండదు .నీడపై ,బురద పడిందని స్నాన మెవరు చెయ్యరు .గొప్ప వస్తువుపై పడిందని గొప్పలు చెప్పరు . దీనిలో సత్య ప్రతిష్ట లేదు . అంతే దూరంగా తత్వాన్ని ,శరీరాన్వయాన్నిగుర్తించాలి . పుణ్యం చేసినా అందులోని ,కర్త్రుత్వాభి మానం పాపమే . అందువల్లనే పుణ్య కర్మలు కూడా ,కర్త్రుత్వాన్ని విడిచి ,ఆత్మశుద్ధి లక్ష్యంగా సాగితే ,జ్ఞానానికి ,సత్వ ప్రకాశం తోడై సాధన,పరిపక్వతకు దారి తీస్తుంది .ఇది సద్యో ఫలితాన్నిస్తుంది .కర్త్రు త్వాభిమాన కర్మ,భవిష్యత్జన్మలలో కొంత సుఖాన్నిచ్చి మళ్లీ ,జన్మ పరంపర నిస్తుంది . నిరహంకారకర్మ ,జీవన్ముక్త  స్థితికి ,దారి సుగమం చేస్తుంది . దుఃఖం వచ్చినా ,దుఃఖితుడు కాని డిటాచ్మెంట్ ,తప్పక ఇస్తుంది .
               బ్రహ్మ దేముడు విష్ణువు నాభి కమలం నుండి వచ్చినపుడు ,మొదటగా విన్న శబ్దం తప . వెంటనే బ్రహ్మ ,తాను వచ్చిన  నాళం లోనికి ప్రవేశించి ,తనలో తాను లీనమై ,మళ్లీ తిరిగి బాహ్యంలో సృష్టిని ప్రారంభించాడు . తమలోతాము లీన మయ్యేదే తపస్సు . అప్పటి సద్యో ఫలం జ్ఞానం . ఇదే రమణ మార్గం . మనమార్గం 'నేను' తోనే ప్రారంభం . దాంట్లో ప్రవేశిస్తే దొరికేదే తత్వమసి అంతరార్ధం .
            ఇల్లు అంటుకున్నవాడు ,వేరే వాళ్ళ యోగ క్షేమాలు విచారించ లేడు . అలానే ప్రపంచపు విషయాలు ,జిజ్ఞాస కలిగిన సాధకుని మనసులో ,ప్రవేశించ లేవు .ఉదా:సినిమాలో ఉన్న రెండు ,గంటలు దానితో తాదాత్మ్యం చెంది ,నవ్వి ,ఏడ్చి , ఇంటికి రాగానే సుఖంగా నిద్ర పోయినట్లు ,నాటకంలోని పాత్రధారిలా ,సకలమూ నియమబద్ధంగా చేస్తూనే ,తనలో తాను మునిగి ఉండే ప్రజ్ఞ , పై సాధకుని స్వంతం . అతడు ఏ కర్తవ్యాన్ని విడిచి పెట్టడు .
               కానీ తపస్సు వలన ,ఎదుటి వ్యక్తిని కించ పరిచే ,లక్షణం వచ్చేఅవకాశం ఉంది . అందువలన సాధకులు , బాహ్యంలో ప్రపంచ రూపంగా ఉన్నది ,తన స్వరూపమే అయిన పరమాత్మగా గుర్తించి ,ఇక్కడ కలిగే అనుభవాలను , స్వామి కల్పించిన పరీక్షగా భావించి , ఓర్పుగా ,తమసాధనకు ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాలి . సాధారణంగా ,భక్తులు గాని ,జ్ఞానులు గాని ఎవరినీ శపించడం అనేది ,పురాణాలలో తక్కువగా కనిపిస్తుంది . తాపసులు క్రోధాన్ని ప్రదర్శించడం గమనిస్తాము .
               తపస్సులోని ముఖ్య సూత్రం ,ప్రపంచలోని ఏ వస్తువులు గాని ,వ్యక్తులుగాని లేకుంటే ,బతకలేము అనేదాన్ని విడిచి పెట్టాలి . పరావలంబనం పెద్ద ముప్పు . వేదవ్యాసులు 'సర్వం పరవశం దుఃఖం ,సర్వం ఆత్మ వశం సుఖం 'అన్నారు . ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి . భక్తిలో ,భగవంతుని పట్లగల విశ్వాసం ,క్రమంగా ఆత్మవిశ్వాసంగా పరిణతి చెందుతుంది . అలా కానప్పుడు తపస్సు చేయలేదనేదే యదార్ధం .ఈ రెండు కలిగితే తపస్సులో విఘ్నాలు ,తొలగినట్లే .
               అంతఃకరణ విక్షేపం లేకుండా ,కామ ,క్రోధాదుల అభావం కలిగేలా జీవించాలి . వచ్చాయి కనుక ,వీటికి అభావం సాధ్యం . ఎప్పుడూ ఉండే శాంతికి అభావమే లేదు . ప్రతి మంత్రానికి చివర 'శాంతి ,శాంతి ,శాంతిః 'అని చెప్పడంలో ,ప్రధమం శరీర శాంతి ,వీలైనంత వరకు శరీరం కదలకుండా ఆసనం .ప్రాణం నెమ్మదిగా కుదుట పరిస్తే ,తరువాత మనస్సు ,శాంతిస్తుంది . మూడు శాంతించాక,కావలసింది సావధానం .లేకపోతే నిద్ర సహజ మౌతుంది . ఇంద్రియ నిగ్రహం వల్ల కలిగే  ఆనందం ,ఇంద్రియ భోగాల వల్ల కలగదనేది ,అనుభవానికి అందుతుంది . కత్తిమీద సాము అన్నట్లు ,జగత్తులో సావధానం ,కలిగి ఉండాలి .
         కొందరిలో ఎదుటివారికి బాధ,కలుగుతుందేమోనన్న,ఆలోచనే ఉండదు . వారికి ఏ చెడ్డ లక్షణాలు లేకున్నా , అలా మాట్లాడడం తప్పు అనేదే తెలియదు . హృదయంలో కటుత్వం లేకున్నా ,మాట చాలా కటువుగా ఉంటుంది . దీన్నే శాస్త్రం ప్రమాదం అంటుంది.మనస్సుతో నెమ్మదిగా ప్రయత్నం అనేదాన్ని విడవాలి.లేకుంటే అహంశక్తి బలహీన మవదు .గాలిపీలిస్తే శ్రమగా ఎవరూ భావించరు .కానీ ప్రాణాయామం ,శ్రమగా అందరికీ తెలుసు . దీనిలో అహం వ్యక్త మవడమే శ్రమకు కారణం . భగవద్గీత వినడం వలన దుఃఖాన్ని అధిగమిస్తేనే ,అది తెలుసుకున్న ఫలం .మనస్సు ,బుద్ధిలో లీనమవ్వాలి .మనస్సు కళ్ళజోడు లాగా ,తనకోసం దేన్నీ గమనించదు .విషయాలను తెలియజేస్తుందంతే . బుద్ధి వివేచన చేస్తుంది ,చింతన పెరిగినకొద్దీ . మనస్సును నిగ్రహించడం కష్టం అన్న అర్జునునితో [మనసు], అభ్యాసం చెయ్యమనే ,శ్రీ కృష్ణుని సూక్తిలో ,అంతరార్ధం , మనసు మళ్లీ ,మళ్లీ ,ప్రశ్నల,వలతో కూడా,విసిగించ వచ్చు.ఎక్కువగాదీనికి అవకాశం ఇవ్వకూడదు .మనసు జ్ఞాత మాత్రమే.దీని పరిధి సంసారం .బుధ్ధి ,దీన్నిఅధిగమించి[జ్ఞేయం]పరమాత్మనుపరిచయం చెయ్యగలదు.దేహాత్మ భావం నుండి విముక్తి .దేహం నుండి విముక్తి అంటే ,నీడలా ఉండవలసిన,దేహమే నేననే భ్రాంతి,సత్యం అని బుద్ధిని ఎలా పరిభ్రమింప చేస్తోంది ?  అని నిత్య, నిరంతర చింతన సాగాలి . తన బ్రహ్మచర్యం తోడు కావాలి ,ఆంజనేయునిలా పరిశ్రమించాలి .బ్రహ్మమే పరమ గమ్యం ,అని పరిశ్రమించడమే ,బ్రహ్మచర్యం .ఇప్పటి వరకు ప్రపంచంలో చరించిన బుద్ధి ,ఇకపై బ్రహ్మాత్మగా చరించే అభ్యాసం చెయ్యాలి . కోరిక లేని పరిస్థతి . దేహాత్మ భావంనుండి  విడిపడాలంటే ,తల్లి తండ్రులు ఇచ్చిన శరీరాన్ని,వాడుకున్నా,అహాన్ని,గురువు పాదాల వద్ద సమర్పించి ,జన్మతో కలిగిన శూద్రత్వాన్ని వదలి ,ద్వితీయ జన్మ , బ్రహ్మాన్నిగమ్యంగా సాగి , బింబంగా తనలో తాను మునగాలి .సాధకుడు గురువు ఉపకారాన్ని మరవకుండా ఉండడమే ,ఆయనకు ఇవ్వగల దక్షిణ . శరీర స్పృహ ఉన్నంతవరకు ,దీనికి విస్మృతి ఉండరాదు . అప్పుడు దేహాత్మ భావాన్ని గెలవగలరు .
          గురువును దేనితో పోల్చగలం ?పరుసువేది అయినా లోహాన్ని బంగారంగా మారుస్తుంది . కానీ ఆ బంగారం ,మళ్లీ బంగారాన్ని తయారు చెయ్యలేదు . బంగారంగా మారిన శిష్యుడు మాత్రం ,మళ్లీ శిష్యులను బంగారంగా మార్చే శక్తి నిచ్చిన గురుదేవునకు , ఏమీ యివ్వలేడు . నిజానికి అహం సమర్పించానని శిష్యుడు అనుకున్నాడే తప్ప ,గురువు దృష్టిలో అహం మిధ్య ,జగత్తులోని ఏ వస్తువిచ్చినా ,అది మాయ . అందువలన ఏమీ ఇవ్వక్కరలేదనే ,లోభత్వాన్ని పొందక ,ఏ మిచ్చినా గురువు ఋణం తీరదని గుర్తించి ,వారు చూపిన పధంలో పయనించి గమ్యం చేరాలి .
             శిష్యుడు గురువు చెప్పినట్లు తనను తాను మలచు కుంటాడు . అందుకే భక్తితో పరమాత్మను సేవించినా ,భక్తునికి భగవంతుడు గురువు రూపంలో మాత్రమే ,జ్ఞానమనే బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు .భక్తులతో కలసి ఉన్నప్పుడు విక్షేపం సహజం .గురువు సాన్నిధ్యంలో ,ఆవరణ ,విక్షేపం ,ఆశ్రమం బయట కాపలా ఉంటాయి .కృతజ్ఞత లేనివారిని పట్టుకుంటాయి . శిష్యునకు తనకు తెలిసింది ,గురువుకు  ఏమిస్తే బావుంటుందనేదే తప్ప,గురువు యొక్క సూచన ఏమిటి ,అనే ఆలోచన ఉండదు. వారు చెప్పింది వినాలే తప్ప ,ఏదీ ఒప్పించే ప్రయత్నం చేయకూడదు . అలానే బంధించాలనే తపన ఉన్నవాడు గురువు కాదు . బంధనాలను తెంచ గలవాడు గురువు .శిష్యుని ప్రయత్నంతో కలిగేవాటికి పరిమితులుంటాయి . గురువు ప్రసాదించేది,పరిపూర్ణ స్వరూపం . పరిమితమైన తన ప్రయత్నంతో ,గురువును సమీపిస్తే అపరిమిత స్వ స్వరూపం స్వంతమౌతుంది . ఇది గురువు అనుగ్రహమేకానీ ,తన ప్రయత్నఫలం కాదు .నా ప్రయత్నం అనే భ్రాంతి ,పయత్న లోపాన్ని ,అందుకు భగవంతుడు వేసిన శిక్ష మాయగా ,సాధన నా ప్రయత్నమే అనే ,అహంకారాన్ని ఇస్తుంది .        
            బ్రహ్మచర్యం ,అనే ఈ విభాగంలో నాలుగు పాదాలున్నాయంటుంది ,సనత్సుజాతీయం . సమయం అనేది మొదటిది . క్రమంగా పక్వమవాలి . ఒక్కొక్క ఆలోచనా ,ధర్మ నిరతిని ,న్యాయ బద్ధతని ఆపాదించు కున్న కొలది ,సాధన ,పరిపక్వమౌ- తుందని గుర్తు . సాధనలో ఉత్సాహయోగం వలన , ఉపలబ్ధి కలుగుతుంది . జ్ఞానంవలన ,ఆత్మతృప్తి స్వంత మౌతుంది . శాస్త్ర విచారం ,తృప్తిని ధృఢ పరుస్తుంది .ఇవి గురు కృపతోనే సాధ్యం .
            ఏమీ తెలియని బాలకుని వంటి ,ఆనందం . భారమూ లేదు ,భయమూ లేదు . restore factory settings. పిల్లలు అబద్ధం చెపితే ,పెద్దలు 'వీడు పెద్దవాడవుతున్నాడు'అంటే ,సహజం కాని వాటిని అభ్యసిస్తున్నాడని .బాలునికి తన వారని పరాయి ,అనే భావనే లేదు .సంగ్రహము తెలియదు . పాత్రను సక్రమంగా పోషిస్తున్నా ,మనసుకు బాల్యమే ,ఆనందం . నచికేతుని వంటి జ్ఞానంతో ,మరణాన్ని జయిస్తాడు . తన స్వరూపాన్ని గమనించడం తప్ప వేరే మార్గం లేదు . ఆరాధన అంటే ప్రతి ,క్రియ పరమాత్మకే సమర్పణం . దీనివలన కర్తృత్వం లేని కర్మతో ,అంతఃకరణం శుద్ధ మౌతుంది . తత్వ జిజ్ఞాస కలగడమే దీనికి కల ప్రయోజనం . దయ పేరుతో ,ఎవరినీ అవమానించ కూడదు . హీనత్వం ఎవరి పట్ల కూడదు . సేవా భావం అవసరం . అప్పుడు అహం బలపడదు .
                    అంతఃకరణలో వైరాగ్యంతో కూడిన ఆత్మ చింతన ,బాహ్యంలో సకలమూ పరమాత్మ చైతన్యంగా గుర్తెరిగి ,తన భూమికను ,రసవంతంగా పోషించేది ,స్థిత ప్రజ్ఞత్వం . పై రెంటిలో నీరసం లేదు . సకలమూ పంచ భుతాత్మకం అనే దృష్టి వలన కలిగేదే వైరాగ్యం.మంచి ఆకలి కలిగి ,మంచి భోజనం చేసిన వ్యక్తికి ,మళ్లీ ఎన్ని రకాలైన ఆహార పదార్ధాలైనా ,ఎలాటి ప్రలోభాన్నికలిగించ లేనట్లే  , సకల సృష్టి ,పంచ భూతాలనే స్పృహ వలన , అతనికి ,ఏ మాత్రం ప్రపంచ వాసనలు,ఆనందాన్ని ఇవ్వలేవు . ఇదే వైరాగ్యం . మనసు బాహ్యంలో కదిలి నప్పుడు , పరమాత్మ, సృష్టిగా వ్యక్తమైతే దాన్ని ,విశ్వరూప దర్శనంగా , భావించే ద్రుష్టి కలిగి తానుకూడా అందులోని భాగ మైనందుకు కలిగే ఆనందాన్ని,నిశ్చయంగా కలిగి ,బాహ్యాంతరాలలో, భావించేవారికి సకలమూ సంతృప్తినే ఇస్తుంది . రసో వై సః .
            నాదమూలం ,మౌన స్వరూప ,ఉనికి . సత్స్వరూపం . నాదబిందు కళాతీతం . సృష్టి కళారూపం . రూపానికి పూర్వంశబ్దం .శబ్దానికి పూర్వం ,సత్స్వరూప మౌనం .క్రమంగా రూపం పట్ల ,మోహాన్ని వీడి ,రూపాలను,చిత్రకారుని,చిత్రంలా భావిస్తూ కారణమైన శబ్దంలో,లయం చేస్తూ,శబ్దాన్ని కారణమైన మౌనంలో ,పరమాత్మలో మనస్సు శాంతిని పొందేలా కృషి చెయ్యాలి . ఇదే నివృత్తి మార్గం . ఇదే బ్రహ్మ మానస పుత్రుల స్థితి . వీరు సృష్టికి విముఖులు . విముఖత్వం మాత్రమే మోక్ష మార్గం . మనోలయమే మార్గం .మనస్సు వైరాగ్యానికి ,ఎప్పటికీ ఒప్పుకోదు .ఆనందం బయట మాత్రమే ఉందనేది మనస్సుకున్న అభిప్రాయం. జ్ఞానం మాత్రమే ,ఆనందం బాహ్యంలో లేదని,తన అంతరంగాన్ని,చిదంబరంగా హృదయాన్ని గ్రహించి ,నామరూప నాట్యాన్నిగమనించాలి . లయకారుడైన శివుడు జన్మ ,మరణ రూపమైన అజ్ఞానాన్ని ,లయం చేస్తాడు .ఇదే ఆనందవనం ,మహా స్మశానంకాశి . దీన్ని గమనించే కాలం ,కాల భైరవం . మృత్యుం జయం .
            విష్ణువు ,అమ్మవారు ఒకటే స్వరూపం .విశ్వం రూపమైన ఆవరణ రూపం .ఈ ఆవరణ భంగమే ,శివుని దిగంబరము . సృష్టిని ,క్రమంగా ,సాధనతో ,విశ్వాన్ని ,విశ్వనాధుడైన శివునిలో లీనం చేసి తత్ స్వరూపమైన ,సద్రూపమై శివోహం అనాలి .నిద్రలో, కళ ,కళాకారుడు వేరుకాదు . అలానే ప్రపంచ నిరాకరణ రూపమైన ,జ్ఞానం ,విశ్వాన్ని విశ్వనాధునిలో లీనం చేస్తుంది .సృష్టిలో చరిస్తున్నప్పుడు ,సకలము,దైవ రూపంగా,ప్రతి క్షణం,అనుభవానికి అందితే,అదే వర్తమాన రూపమైన మోక్షం.ప్రకృతిని ఈ శ్వరుడు వశం చేసుకుని ,నడిపిస్తున్నాడు . ప్రకృతిని వశం చేసుకున్నవాడు ,దేముడు . ప్రకృతికి వశమై పోయినవాడు జీవుడు . వీటినే మన సంప్రదాయంలో ,తత్వాన్ని, నాటకీయమైన  సృష్టిలో ,భర్తను ,భార్య అనన్య శరణంగా ,అనుగమించాలని స్పృశించింది . తాదాత్మ్యం చెందడం బంధం .తాదాత్మ్యం తెగడానికి ,సకలము పరమాత్మదే  అనడమే ,పరిష్కారము .కర్మతో తాను కర్తను కానని తెలిసి ,శరీర ధారణ వలన ,ఏ ఏ శాస్త్ర విహిత కర్మలున్నాయో ,వాటిని ఫలాపేక్ష విడిచి ఆచరించడం వలన కలిగే స్థితి ,దీన్ని సాలోక్యం అంటుంది ,శాస్త్రం . తన్మాత్రలు వశమైతే ,[శబ్ద స్పర్శ రూప రస గంధములు ]వీటితో తాదాత్మ్యం విడిచి పెడితే ,కలిగేది సామీప్యం . బుద్ధితో ,అహంకారంతో ,తాదాత్మ్యం విడిస్తే కలిగేదే సాయుజ్యం .
        పూజలో సకల పదార్ధాలు , పరమాత్మవే అని భావించడం కొంత సహజమే . కానీ తన శరీరం ,అది తననే అహం ,దానివి తను కలిగి ఉన్నాననే భావం నాది . ఈ మూడు నిజానికి తనవా ?వీటితో కలిపిన పూజ ,నమస్కారమే . అంతః బహిశ్చ తత్ సర్వం వ్యాప్త నారాయణ స్థితః .
        సర్వం బ్రహ్మ మయం జగత్ . ఇది హృదయం లోనికి అవరోహణం . ఇది ప్రస్థానం ,జీవికి . కానీ శరీర లయమనే ,మహా ప్రస్థానం,జరిగే లోపు,శరీర చలన సమయంలో,విధి ,నిషేధాలు తప్పవు .అంతరంగంలో సర్వం బ్రహ్మ మయం,ఇదే బ్రాహ్మణత్వం వేద ప్రతి పాదిత మైన తన కర్మాచరణ ,విడువక ,దీక్షతో త్రికరణ శుద్ధిగా ,ఆచరించడమే ,క్షత్రియ ధర్మ పాలన .సృష్టిలో ఎవరెవరికి ,ఎంత ప్రాధాన్యత నివ్వాలో ,తెలిసి ,సమతూకంతో,మమతకు లోనుకాక ,తన పాత్రను అర్ధవంతంగా,పోషించే నేర్పు వైశ్య . ఈ మూడిటికి తగినట్లు శరీరాన్ని,తమస్సుకు తావివ్వక సృష్టిలో చరించడమే శూద్ర ,అనే ,ఒకే వ్యక్తిలోని వర్ణ వ్యవస్థ .
           హృదయ గతమైన పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించి ,దానికి సాకార రూప పుజావిధిని నిర్వర్తించి ,వేద విధిని అనుసరించి ,యజ్ఞ యాగాది క్రతు నిర్వాహణే ధ్యేయంగా ,జీవించే బ్రాహ్మణ వ్యవస్థలో ఏ విధమైన ప్రలోభానికి తావివ్వక ,తమ ఆచార ,వ్యవహార క్రియలకు వారసత్వాన్ని అందించాలనే ,తలపు ,బ్రాహ్మణునిలోని ,బ్రాహ్మణత్వం.దానికి తగినంత ,మనసుతో పోరాటం ,క్షత్రియం.మనసు జగత్తులోని సకల భోగాలను చూపి,సంధ్యా వందన,పూజాది ,సకల విధి నిర్వహణకు ,ఆటంకాలను కలిగిస్తూ ,ధర్మ విచ్యుతికి ,నిరంతరం ప్రయత్నిస్తూ ,పైపైన విధులు నిర్వహిస్తున్నా,త్రికరణ శుద్ధికి ఏ మాత్రం సహకరించదు .దీన్ని గెలవాలంటే , శ్రీరాముని వంటి క్షత్రియ ధృతి అవసరం . ఇది ఉంటేనే బ్రాహ్మణుని ,బ్రాహ్మణత్వం కాపాడ బడుతుంది .బ్రాహ్మణుడు ,భర్త అయితే ,బ్రాహ్మణత్వం భార్య ,దాన్ని కాపాడు కోవడంలోనే అతని ,సార్వభౌమత్వం దాగి ఉంది .
             దీనికి తల్లి తండ్రులు ,గురువు ,సజ్జనులు ,సాంగత్యం ,వీటి విలువ తెలిసి ఉండాలి . పరమాత్మ అపార కృప కలిగితేనే ఇది సాధ్యం .ఈ గణనే ఎవరికి ఎంత విలువ ,దీని వలన మాత్రమే అతని విజ్ఞత ,బేరీజు వెయ్యబడుతుంది.ఇదే అతని వైశ్య ధర్మం. ఇదే నిజమైన ధనం,బ్రాహ్మణునికి.అలాకాక తనలోని క్షాత్రానికిఅలానే వైశ్యానికి తగినంత ప్రాధాన్యత నివ్వకపోతే కలిగే అనర్ధం , తమోగుణ రూపమైన ప్రతిబంధకం . దీన్ని గెలిచేందుకు తప్పక కృషి అవసరం . జపాన్ని ,ధ్యానాన్ని పెంచి మనసును ,తన ఆధీనంలోకి తెచ్చుకోవడమే ,కృషి రూప శూద్రత్వం.వీటిలో ఏది తక్కువ ?ఏది ఎక్కువ ?నిజానికి విష్ణుపాదాలు విశ్వరూపంలోని శూద్రులు . అంటే కృషిని ఆశ్రయిస్తే తప్ప ,తన అస్తిత్వాన్ని నిలుపుకోవడమే ప్రశ్నార్ధకం .
           ఇదే విషయాన్ని క్షత్రియ పరంగా చూద్దాం .క్షాత్రాన్ని గ్రహించిన రామావతార గాధ ,రక్షించడం అనేదాన్ని,త్రికరణ శుద్ధిగా పాటించిన పరమాత్మను ,మనకు రాజుగా ప్రకటిస్తున్నది . రక్షణను పితృవాక్య పరిపాలన ,ధ్యేయంగా ప్రారంభించాడు రాముడు.గుర్వాజ్ఞకు రక్షణ నిచ్చి,యాగ పరిరక్షణ,సీతా పాణిగ్రహణంచేసి,అంశావతారమైన పరశురాముని నిగ్రహించి,అతణ్ణి అప్పటి వరకు పాటించిన క్షాత్ర ధర్మాన్నివిడిచి,తన తపో భూమికతో,సనత్కుమారుని దిశా నిర్దేశంతోదత్త గురుని కృపతో,తన  'అహం బ్రహ్మస్మి'అనే స్వస్థితికి దారి సుగమం చేసి,ధర్మ పరిరక్షణకు ,క్షాత్రం తప్పదని తన అవతార కాలమంతా,మోనంగా నిరూపిస్తూనే ఉన్నాడు శ్రీ రాముడు.ఆచరణ రూపమైనది ధర్మం.కదులుతూ ప్రదక్షిణ చేస్తుంది,సత్యానికి.సద్రూపం పరమాత్మ.అహం బ్రహ్మాస్మి వరకు తోడుండి ,పరమాత్మలో లయింప జేసేది ధర్మం .
         శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ,తమ శివపదంలో 'అడుగు కలిపెను గౌరి ,హరుని అడుగులలో 'అంటారు . నిరాకార రూపమైన ధర్మం ,[గౌరి]నిరాకారమైన శివునిగా చేసి 'అహం బ్రహ్మస్మి'అనిపిస్తుంది .శరీరం శివుడైతే ,అంతః చైతన్యం శివాని. శివా శివుల నర్తనమే,సృష్టి .ఆనందమే కుమారుడు సుబ్రహ్మణ్యుడు.ఇలా సృష్టిని ,అనుసంధానం చేసి,శరీరమే తాననే అహంను శివుని కుడికాలి క్రింద మోపడానికి ,సమర్పించ వలసిందే . అదే చిదంబరం .శివునిది కుడి పాదం ,అమ్మవారిది ఎడమపాదం . అదే సూచనగా ,మగవారు గోచీ పోసిన పంచ కానీ ,స్త్రీలు గోచీ పోసిన చీర కానీ ,ధరించి నపుడు ఎడమకాలు పూర్తిగా మూసి , కుడికాలు కొసలు ఉండేలా వస్త్ర ధారణ చేస్తారు . నటరాజ మూర్తి ఎడమ కాలు పైకెత్తి ,సృష్టిని ప్రతిపాదిస్తే ,కుడికాలు స్థిరమైన శివ తత్వాన్ని ,చాటుతుంది . కదులుతున్న సృష్టిలో శరీరం నర్తిస్తున్నా,మిధ్యా నేను అయిన అహంను స్థిరమైన శివోహం అనే పరతత్వంగా ,ప్రకాశించే చిన్మయ మూర్తికి సమర్పించి , తానే శివోహం అనాలి .
              బ్రహ్మమే తాననే స్థితిలో సాధన సాగించి ,పూజాదికాలతోనిరంతర ,సమాజ శ్రేయస్సుకు ,పరమాత్మను సేవించడమే తప్ప వేరే ప్రక్రియ లేదు అని నమ్మి,చరించే వ్యవస్థకు ,బ్రాహ్మణ అని నామకరణం చేసినట్లే ,కొంత మానవ ప్రయత్నం అవసరం, అని నమ్మి అవ్యవస్థితిని సవరించే దిశగా ,గురు నిర్దేశిత పధంలో సమాజ నిర్మాణానికి ఉద్యమించిన వారికి క్షత్రియులని పేరు . దీనికి అవసరమైన శారీరిక అవసరాలకు తగిన వస్తువులను సేకరించి సమాజానికి అందించే వ్యవస్థ  ,వైశ్య నామం కలిగి ఉంది . అలానే శారీరిక కష్టాన్ని వహించి ,సమాజానికి అన్నాన్ని అందించే ,వ్యవస్థకున్న నామమే ,శూద్రులు .
             ఓం కారంలోని మూడున్నర అక్షరాలైనా ,మూడు శరీరాలు ,అంతరాత్మ అయినా ఒకే వ్యక్తికి నిర్వచనం . అదే కుల వ్యవస్థలోను ప్రతిబింబిస్తుంది . ఇది బీజ స్థితి నుండి ఒకచెట్టు సంపూర్ణంగా ఆవిర్భవించిన స్థితి . దీనికి బీజం పరమాత్మ అనడం అందరికీ సమ్మతమే . మొదటి అంకురం అత్యంత పదిలంగా కాపాడితే ,అది వ్యవస్థను పోషిస్తుంది . ఏ ప్రాజెక్ట్ అయినా ముందు జ్ఞాన రూపంలో ఉంటుంది . అపుడు దానిపట్ల జాగ్రత్త అవసరం . ఇష్టం వచ్చినట్లు అందరూ మేమెందుకు గియ్యకూడదు అని , అల్లరి పిల్లల్లా, తలో గీత గీసేస్తే ,సాకారమెలా అవుతుంది ?అందువల్ల సర్వవిషయాలు కలిగిన వేద విజ్ఞానాన్ని,అన్య విషయాల పట్ల అయిష్టత కలిగిన బ్రాహ్మణ వ్యవస్థకు ,ఎన్నో ఆంక్షలతో అందించారు . రూప కర్తలైన వీరికి ,ఏ విధమైన ,ఆర్ధిక పరమైన వరాలు కల్పించలేదు ,వారి దిన భ్రుతి కూడా ,యాయవారమే ,మేధస్సుకు పదును చాలా అవసరం . అందువలన వీరికి ,పాలన కానీ ,వ్యాపారం కానీ ,శారీరిక శ్రమగానీ విధించ బడలేదు . అలానే వీరిని సౌకర్యాలకు ,విలాసాలకు కూడా దూరంగా ఉంచి వీరిని శాస్త్రం ,కఠినంగానే ,వారిని వారే నియంత్రించుకుని ,కట్టుబాట్లతో జీవించమంది .
             చెట్టుకు వేళ్ళు నీటిని గ్రహించి అన్ని శాఖలకు అందిస్తాయి . అలానే ఎవరూ చూసి మెచ్చుకోవాలనిగాని ,తామెంతో గొప్పవారమనే భావాన్ని ,పొందే అవకాశం కూడా వారి కివ్వక ,మగ వారికి పిలకను ,స్త్రీలకు ,మడి అనే కట్టుబాటును ఉంచి వేరే అగ్రహారాలలో ఉంచారు.అలా ఉన్నా రేణుకా దేవి గాని ,అహల్య గాని పడిన ఇబ్బందులు,అందరికీ తెలిసినవే. సమాజానికి దారిని ,పరమాత్మ అనే కరదీపికతో చూపవలసిన బాధ్యత వారిపై ఉంది . దాని ప్రయోజనానికి భంగం కలగ కుండా ఉండాలనే వారికి వేరే అగ్రహారాన్ని చూపారు . కానీ కలి వారిపై మోపినన్ని అభాండాలు ,వేరెవరిమీద మోపలేదు . కలి లక్షణమే ,ఆచార సంప్రదాయాలు నేల రాయడమే.కానీ హృదయ దౌర్బల్యం పొందక,పై పై మెరుగులకుమోసపోక తమ కట్టుబాట్లుకాపాడుకునే సహజత్వాన్ని వీరు పొందిన రోజు మళ్లీ ,వారి బాధ్యతైన సమాజానికి దిశా నిర్దేశం చెయ్యగలుగుతారు .
          వేళ్ళను చెట్టు అని ఎవరూ అనరు . దీని బలమైన మాను క్షత్రియ వ్యవస్థ . ప్రస్తుత సమాజంలో కీలకమైన స్థానాల్లో ఉన్న మహామహులందరూ ,ఈ వ్యవస్థకు చెందిన వారే . కానీ ఆత్మ విమర్శతో,సమాజానికి సహకరిస్తే పూర్తి సమాజం వారికి పట్టం కట్టి ,బ్రహ్మ రధం పడుతుంది . పరమాత్మయే రాజై గౌరవించిన ఈ వ్యవస్థను ఆయనే కాపాడాలి. వామనావతారమైన ,విష్ణువు రాజై పాలించ లేదు.అంతటా పరమాత్మను తెలిసి,అహంకరించ వద్దని మాత్రమే సూచించాడు.క్షత్రియ వంశ సంజాతుడై రాముడు రామరాజ్యాన్ని ,ఎన్ని అవరోధాలైనా ఎదిరించి ధర్మానికి , ఏ మాత్రం భంగం కలగనీక ,తానై క్షత్రియ ధర్మాన్ని లోకానికి ప్రకటించి వీరిని ధర్మ పరిరక్షణకు ,శాసించాడు .సూర్యుడు గ్రహాలలో క్షత్రియుడు. ఆయన కన్నా రాజ వ్యవస్థకు మార్గం చూప గలవారెవ్వరు ?సమాజరక్షణే వీరికి బ్రహ్మ విద్య .           
     ఆకులు లేని చెట్టు జీవాన్ని కోల్పోతుంది . సూర్యుని నుండి గ్రహించిన రస్మితో చెట్టును పోషిస్తుంది . సంగ్రహించి పంచి పెట్టే వ్యవస్థ ,వైశ్య .కానీ అవసరానికి తగినంత ,సేకరణ ,తగిన వితరణ , దీన్ని మరచి రెంటిలో ఏ తూకం మార్చినా ,అది ,సమాజానికి అనారోగ్య కారణం . అవసరానికి మించి చేరిస్తే సమాజానికే క్యాన్సర్ . తగినంత అందించకపొతే ,చెట్టు ఎండు
తుంది .సమన్యాయం వీరికి బ్రహ్మవిద్య .
        చెట్టుకు పూసిన పువ్వులే శూద్ర వ్యవస్థ,వేళ్ళు నీటినిచ్చినా,మాను రాలకుండా గట్టిగా పట్టుకున్నా,ఆకులు సహకరించినా చెట్టుకు అందాన్ని,అంకురాన్నిచ్చి,వ్యవస్థ ఎదురుచూసేలా,తనను తాను సమర్పించుకునే త్యాగ లక్షణం,వీరి స్వంతం.పువ్వులు చెట్టు నుండి వేరు చేసినా,లేక చెట్టుకే ఉంచినా,తనంత తానే ముడుచుకుని,తన కర్తవ్యం వరకే,బాహ్యంలో చరించాలనే సూచనతో మానవులకు మార్గ దర్శనం చేస్తున్నాయి.అందుకే అందరూ తల వంచి మొక్కే,తన పాదాలను వారికి గుర్తుగా,పరమాత్మఅను గ్రహించాడు.వీరికి సేవా గుణమే బ్రహ్మవిద్య.విష్ణు పూజకు పువ్వులే శ్రేష్ఠం.అవి పాదాలను చేరి అందరి కష్టాలు గట్టెక్కిస్తాయి . అంటే త్యాగమయ సేవ , పరమాత్మునికి సమర్పించే పుష్పం .
           విశ్వానికి  బాహ్య శరీరం ,శూద్ర వ్యవస్థ . మనోమయ వ్యవస్థ ,వైశ్య . బుద్ధి రూపం క్షత్రియం . జీవ రూపం బ్రాహ్మణ . వీరందరి గమ్యం ముక్తి . అన్ని వ్యవస్థలు ,అహం అనేదాన్ని పక్కకి పెట్టి తమ కర్తవ్యాన్ని ,బ్రహ్మ విద్యగా ఉపాసిస్తే కలిగేది మోక్ష రూప గమ్యం .అలానే కారం బాహ్య ఆవరణం ,దాని లోపల కారం ,దాని అంతరం కారం , తరువాతది అర్ధమాత్ర . కానీ మొత్తం కలిపితేనే 'ఓం'. ఓం కార ప్రణవానంతరం ,స్వరూపమే ,పరమార్ధం ,పరమాత్మ , నిరాకార రూపం .
        కర్తవ్యాన్ని,బ్రహ్మ విద్యగా అంటే ,తన కర్తవ్యమైన దేన్నైనా,విశ్వ నాటకంలోని పాత్రగా మాత్రమే గమనిస్తూ పోషిస్తే ,అదే పరమాత్మను చేర్చే బ్రహ్మవిద్య .శరీర పర్యంతం ,శరీరానికి ,బాహ్య ,అభ్యంతరాలు వ్యావహారిక సత్యాలు . ఇవి రెండూ రైలు పట్టాల వంటివి ,జీవి రధాన్ని ,గమ్యం చేర్చడానికి . బాహ్యానికి అన్వయించుకునే , రైలు పట్టా ,'సంస్కృతీ-సాంప్రదాయం' . అభ్యంతర శుచికి ,జీవిని  పరమ గమ్యానికి  చేర్చే రెండో రైలు పట్టా ,'అంతర్మధనం' .నిరాకర ,సాకార రూపమైన తత్వాను సంధానమే దీనికి లక్ష్యం .