20, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ గోదా కళ్యాణం

శ్రీ గోదా కళ్యాణం .

         'శ్రీ రంగనాధాయ నమః '. . పరమాత్మ కరుణతో కలిగిన మానవ దేహానికి ,చూపుతో బాటు ,
మనో నేత్రం కూడా ప్రసాదించాడు . అనాది అయిన ,పురాకృత కర్మ బంధం వలన ,జగత్తుగా
సత్యమైన మాయ వలన ,మిధ్యా ఆరోపం సహజం . దీనికి దృష్టి దోషం సహజం గానే జీవికి , ఏర్పడుతున్నది . భవరోగ నివారణకి ,వైద్య శిఖామణి పరమాత్మ తానే ,గురువుగా అవతరించి ,
జ్ఞానమనే కంటి అద్దాలు ప్రసాదించి ,ముక్తి మార్గాన్ని ,సరిగ్గా ద్యోతకమయ్యేలా చేస్తాడు .
         వారి ,వారి పూర్వ సాధనా సామర్ధ్యానికి తగిన గురువు వారికి తప్పక లభిస్తారు . అలాకాదు
మాకు సరి అయిన గురువు దొరకలేదు ,భ్రమలో ఉండి పోయాము ,అనుకోవడం శుద్ధ తప్పు .
ఎవరైనా వారి పురాకృత కర్మను మించి ఏదీ పొందలేరు . కనుక సంచిత ప్రారబ్ధాన్ని సరి చేయడానికి ఆ రూపంలో వారు తారస పడతారు . అర్ధమైన తరువాత అయినా ,భక్తి అంటే ,కేవల
పూజ ,జపము ,ధ్యానము కాదని ,జీవించే ప్రతిక్షణం కనిపించే ,వినిపించే ప్రతి విషయం , పరమాత్మ లీలగా ,అందులోని తనపాత్ర ఎంత సమర్ధ వంతంగా పోషిస్తున్నాడో తెలిసి ,జీవిస్తే
తప్పక గురుకృపకు ,పాత్రులు కాగలరు . ఇది మరీ గ్రాంధికంలా ఉందంటున్నారు పిల్లలు .
పూర్వం మంచి నీళ్ళు దోసిలిలో పోసేవారు అవి మరి ధారగానే పడతాయి . తీసుకునే వారు
ఆగి ,ఆగి తీసుకోక తప్పదు .
        ఇక నాచేత వ్రాయించ బడుతున్న ఏ విషయమైనా ,శ్రీ రమణ మార్గాన్ని తప్ప వేరే కోణాన్ని
చూపించలేకపోవడం ,సహజం . శ్రీ శంకరుల ఆచారము ,శ్రీ రమణుల అనుగ్రహము ,ఇవే రెండు
కళ్ళద్దాలు . కానీ చూపు శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ .
      శ్రీ గోదా దేవి మానవుడు తానుగా భ్రమిస్తున్న అహం . చేరిన శ్రీ రంగనాధుడు జగత్తును ఆటగా ,
క్రీడిస్తున్న పరమాత్మ . సోహం అంటూ భ్రమర కీట న్యాయంగా ,లేని తనను ఉన్న సత్యంలో
ఐక్యం చేయడం కళ్యాణం .
        పుట్టిన పురిటి పిల్లకు ఎవ్వరూ చెయ్యరు పెళ్లి . వారిని పెంచే విధానం విష్ణు చిత్తుడు ,నేర్ప
వలసిందే . తల్లిదండ్రులు వారిజీవితాన్ని ,పరమాత్మనే గమ్యంగా గడిపినప్పుడు ,పిల్లలు ఎలా
ఉంటారో అని ఆలోచించే పనే ఉండదు . ఎందువల్లనంటే ,వారి చిత్తం ,శివునిది కనుక . తమను
తాము , జిజ్ఞాసువులుగా మార్చుకుని ,పిల్లలకు మార్గదర్శనం చేస్తారనే ,పరమాత్మ సంతానాన్ని ఇచ్చింది . కానీ కలి గురించి ఎన్ని కారణాలైనా చెపుతారు . కానీ ఒక క్షణం వర్తమానంలో ఉంటే
కలి లేనే లేదు . లేనిదాన్ని ఉందని నిరూపించడానికి పడే తాపత్రయం ,పరమాత్మ కొరకు
వినియోగిస్తే వేరే తపస్సు అవసరం లేదు . నిజానికి విష్ణు చిత్తునకు భార్య లేదు . కానీ మనం
అనుసంధానం చేస్తే ,మారు మాట్లాడకుండా సాధనకు సహకరించే మనస్సనే భార్యతో కలిసి ,
తన వ్యక్తిత్వాన్ని పరమాత్మకు సమర్పించాడు విష్ణు చిత్తుడు . తల్లి దండ్రులు నేర్పినంత ,నేర్చి
తనను తాను విష్ణు చిత్తునిగా గ్రహించి ,మనసును వంచి ,అహంను ,శివోహంలో లయం చేసి ,
సాక్షిగా ,శ్రీ గోదా రంగనాధుల కల్యాణాన్ని వీక్షించాలి . శరీరం ఉప్పు బొమ్మలా ప్రారబ్దానంతరం
పరమాత్మ అనే సముద్రంలో కలిసి సముద్రంగానే ఉంటుంది .
                                        శ్రీ గోదా రంగ నాధార్పణ మస్తు .