2, డిసెంబర్ 2016, శుక్రవారం

అహం-ఇదం

అహం-ఇదం .
ఈరెండే ప్రతి బంధకాలు జీవుడు ,ఈశ్వరుడు అయ్యేందుకు . ఇదే ఇరుముడి , అయ్యప్పకైనా . తలనీలాలు ,ముడుపు వెంకటేశ్వరునికైనా . శరీర పర్యంత స్వాభిమానం అహం . దాని పరిధి అంతా ఇదం . బాహ్యంలో కనిపిస్తున్న ,వ్యావహారిక నామరూపాలన్నీ శరీరం వెలుపలివి . బాహ్యాన్ని విడిచి ,తనలో వాటి స్థానం ఆలోచిస్తే ,అవి ఒట్టి ఊహ మాత్రమే . ఏవి లోపలికి ప్రవేశించ లేవు . కానీ అవే మన భగవదత్తమైన సమయాన్ని ,సాధనకు పనికిరాకుండా చేసి మానవ జన్మను వృధా చేస్తున్నాయి . ఒకక్షణమైనా ఏమిటి అనే ప్రశ్న రాకుండా మూసుకుపోయిన అజ్ఞానమే ,ఆవరణ . ఆవరణ వరకు వెళ్లకుండా అడ్డుపడేది ,విక్షేపం . విక్షేపం విడిచి పెట్టాలంటే 'ఇదం' అనే నామరూపాలు ,తనలో ఉన్న తన దగ్గరికే వెళ్లనీయని ,ముళ్లకంచె . దీన్ని దాటాలి . కానీ ఎక్కడా గాయం కాకూడదు మనసుకు . చిన్న కుండీలోని గులాబీ తుంచినంత సులువు కాదు ,బలిష్టంగా మారిన గులాబీ చెట్టు మధ్యలో ఉన్న గులాబీ కోయడం లాంటిదే ఇది . ముందు చుట్టూ కొమ్మల్ని ,తలో వైపుకు లాగి కట్టాలి . కానీ అవి కట్టుబడక విడిపోతూనే ఉంటాయి . అత్యంత సావధానం
అవసరం . అలానే అసలు బయటి ప్రపంచంలోని వస్తువులు ,వ్యక్తులు ,అంతరంగంలోకి ఎలా ప్రవేశించగలరు అని మధన చేయాలి , కానీ కొద్ది నిమిషాలుకూడా మనసు నిలబడదు . దీన్ని దాటలేని నిరాశను జయించలేని స్థితిలో భగవంతుడే దిక్కు అనుకోని వారుండరు . వారే ముందు ఆర్తులు ,తరువాతి జిజ్ఞాసువులు . వీరికి ప్రపంచ విషయాల పట్ల లేని ఆర్తి పరమాత్ముని చేరే విషయంలో ఉంటుంది . వీరిది స్వచ్ఛమైన భక్తి . ఇది రానంతవరకు భక్తుడు అని చెప్పడం అసమంజసం .ఇలా భక్తులైన వారి స్థితిలో,గృహస్థాశ్రమ నియమాలను ఉల్లంఘించలేని బేలతనం , కానీ పరమాత్మను చేరాలనే తాపత్రయం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . ఇక్కడ సహకరించేదే ముడుపు .
అంటే తనది అనుకుంటున్న దానినుంచి ఎలా మనసుకు బయటకు రావాలో సహకరించమనే అభ్యర్ధన ,ముడుపులో ఉంది . ఇది అన్ని కొమ్మలు బాగా అన్ని పక్కలకు కట్టేయడం . ఇది విక్షేపానికి పడే తాపత్రయం . గులాబీని కొయ్యడం ,ఆవరణను తొలగించడమే . గులాబీ క్రింది ముళ్ళు ఉండనే ఉన్నాయి .పువ్వు కనిపిస్తుంటే గుర్తు పట్టడం సులువే. కానీ అహం అనే ఆవరణ , తెల్లవారక ముందు కోసే గులాబీ .దీనికి వెలుగు చూపే దీపం గురు స్వరూపం . ఇది భగవంతుని కరుణ వల్లనే లభ్యం. దీనికి సహకరించే అంగం మానసిక సన్యాసం . ఇదే తలనీలాల ప్రయోజనం . మనం బాహ్యంగా చెయ్యలేని సన్యాసాన్ని సూచిస్తుందిది. ఈస్థితిలో మాత్రమే గురువు సహకరించ గలరు . వస్తువును చూపడానికి . కానీ ప్రయత్నం ఎవరికి వారిదే . దీపం పువ్వును మాత్రమే చూపగలదు . దీక్షగా దగ్గరికి వెళ్లి చూడాలి . దూరంగా ఉండగా సాధ్యపడదు . ఇప్పుడు గులాబీ స్థానంలో అమ్మను చూద్దాం . ఎందుకంటే పువ్వు లాంటి జడం కాదు పరమాత్మ . ఎంత పనిలో ఉన్నా ఏడుస్తూ ,నిస్సహాయంగా చూస్తున్న పిల్లవాడిని లాలించే తల్లి పరమాత్మ .ఇప్పుడు ఉదాహరణ మార్చడానికి కారణం చూద్దాం.
కర్మ పరిధిలోని జన్మ కారణం ,కర్తృత్వం . ఈ అభిమానం వలన ఏర్పడిన నేను ,నాది అనే భావాల నుండి తనను తాను ఉద్ధరించుకోవలసిన బాధ్యత కూడా తనదే.దీనికి ప్రధమంగా శాస్త్ర సహాయంతో పెద్దల సహాయంతో ,తన విధి ,నిషేధాలను తెలిసి దేనికీ వ్యగ్రత పొందక ,అతిని పొందక ,భగవత్ప్రీతిగా కర్మ ఆచరిస్తూ,అర్ధార్ధి ,ఆర్తుడు , జిజ్ఞాసువుగా ప్రయత్నం చేయాలి. ఏమిచేయలేని నిస్సత్తువ,గమ్యం చేరే మొదటితీరం . ఇక్కడ గురువు ,దైవము సహకరిస్తారు . శివోహం .