27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సనాతనం

సనాతనం. 
       శ్రీ గురుభ్యో నమః. 
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. కలియుగంలో తరింపచేసే మంత్రం.
ఇందులో మనకు కనిపించేవి మూడు నామాలు .మూడు ముక్తిమార్గాలు. తాపత్రయాల నుండి తప్పుకోడానికి ఈ మంత్రం. సంసారమనే కాసారంలోని సుఖపడాలనే తపనే గజేంద్రుడు ఈదులాడిన సరస్సు. కాలమనే మొసలి సమీపిస్తే ,తన ఆత్మబంధువులైనా ఏమీ చెయ్యలేరు. చాలామంది ఇక్కడ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేని దురవస్థ. అంతేకానీ ఇందులో బంధుజనుల అలసత ఏమిఉండదు. పూర్వపుణ్య విశేషం ,అలానే 
తనశక్తి ఏమీ పనిచెయ్యడం లేదని తెలిసిన క్షణం పరమాత్మను అంతర్యామిగా గుర్తించడం వలన అతనిని శ్రీహరి 
రక్షించాడు. దీనికి సంసారంలోఉన్నా పరమాత్మపట్ల అవగాహన కలిగి ఉండడం వలన ,వీలైనంత శాస్త్ర అవగాహన , భక్తి ,అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము ,గజేంద్రునికి సహకరించాయి. అవి ఈజన్మకు సంబంధించినవి కాకపోయినా జంతుశరీరంలో రక్షించాయి. కానీ మానవుడైకూడా ప్రయత్నశీలుడు కాకుంటే పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . ఎన్నో జన్మల తపః ఫలంగా లభించిన మానవదేహం తన గమ్యాన్ని చేర్చే నావ . మిగిలిన ఉపాధులకు 
ఈఅవకాశం లేదు. మానవజన్మలో గమ్యం చేరాలంటే అడ్డుగా ఉన్నవి ,అహం,మమ. నిజానికి ఈరెండూ కలిగి ఉన్నది  పరమాత్మ.కానీ శరీరంలో పరమాత్మ తేజస్సు  శరీరికి అర్ధం కానివ్వదు . శరీర పర్యంతంగా తెలుస్తున్న 
చైతన్యాన్ని అహంగా భావిస్తాడు. కుమ్మరి కుండ తయారైన మాత్రాన ,అందులో ఆకాశం నింపబడలేదు. అలానే 
బయటి ఆకాశంకన్నా వేరుకాదు. కుండ తన ఆకాశం అంటే ఎలాటిదో ,శరీర పర్యంత అహం తాను అనుకోవడం 
అలాంటిదే. అలానే పంచేద్రియాలు గ్రహించే సకలము తనది అయిన ప్రపంచం అవుతుంది. ఇవన్నీ పరమాత్మ 
సృజనలో పంచభూత వికారాలే . కనుక తను అనేది ,తనది అనేది మిధ్య. అంటే [పుట్టుకతో] మధ్యలో వచ్చాయి. 
మధ్యలోనే పోతాయి. ఆకాశంలా తానెప్పుడూ ఉండేదే. కుండ రాకపోకలతో ఆకాశం దుఃఖిస్తే ఎలా?
        కానీ ఇదే అజ్ఞానం ఎన్నో జన్మలుగా ధృఢపడి కుండే నిజమై కూచున్నది. జంతు జన్మలలో జ్ఞానార్జన అవకాశం లేదు కనుక ,ఈ జన్మకు ఎంతో ప్రాధాన్యత నిచ్చింది శాస్త్రం. మానవ మస్తిష్కమే ముక్తి సాధనం . సాధన వరకే దీని 
ఉపయోగం. సాధ్యం అంతటా నిండియున్న ఆకాశమే తాను అని గ్రహించడమే సారాంశం. అందుకే ఆకాశమే విష్ణువు అంటుంది శాస్త్రం . ఆకాశం అంటే జడంకాదు . మనలో చైతన్యం మనకు తెలుస్తున్నది కదా ?అదే అంతటా నిండి ఉన్నది. జీవితంలో భుక్తికి అవసరమైనంతగా మాత్రమే ,కుటుంబ అవసరాలవరకు ధర్మబద్ధంగా సంపాదించి , ధార్మిక జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత సమయాన్ని ,తత్వ ,భక్తి శాస్త్ర అధ్యయనంలోనూ,సజ్జన సహవాసం తోను, పరమాత్మ కృపకు పాత్రులైతే హృదయంలో గురుసాన్నిధ్యం కలుగుతుంది . శివాయ గురవే నమః. బాహ్యంలో గురువు ,మీ శాస్త్ర విహిత కర్మాచరణతో మీముందుకు వస్తారు. మన పెద్దల బాటను విడువక ఆరాధన,కొనసాగిస్తేనే 
తగిన గురువు మార్గదర్శనం చేస్తారు . పెద్దల బాటకు బద్ధకం ,కుతర్కం తోడైతే ,సాధనను మోసపుచ్చే గురువే 
లభ్యం అవుతారు. దీనికి పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . కనుక తన ఆచార వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. 
          జ్ఞానం తనను ఉద్దరించుకోడానికే ,జంఝాటానికి కాదు . ఈసాధనకు గమ్యాన్ని ప్రసాదించే మహామంత్రమే 
హరే రామ ,హరే కృష్ణ . అహం మన సాధనకు అడ్డుపడుతున్నపుడు రామనామము,ప్రపంచం నాదిగా తిప్పలు 
పెడుతున్నప్పుడు కృష్ణ మంత్రము,అన్నివేళలా హరి మంత్రము ,ముముక్షువుకు సహాయపడతాయి. ఏకాగ్రతతో, బుద్ధి సహాయంతో అహం రూపమైన రావణ సంహారాన్ని, చిన్ననాటినుండి ఆశ్రయించిన యోగ వశిష్ఠ గీత యొక్క అనుభవ సారంతో జీవన విధానాన్ని,కలిగిన శ్రీరాముని కధనుండి ప్రేరణ పొంది,శ్రీరామనామంతో అహంను జయించాలి.అన్ని తావులయందు తన వైభవాన్ని చాటి ప్రతి వారితోను ప్రతి సంఘటనతోను,మమేకం అయినట్లుఉన్నా, క్రీడగా తన పాత్రను ప్రపంచంలో ప్రకటించిిిన కృష్ణానామాన్ని ,ఇదం అని తెలియబడుతున్న      ప్రపంచాన్ని,బాహ్యం లోను,అంతరంగంలోను ,విశ్వం అంతా పరమాత్మ భావాన్ని పొందడానికి కృష్ణానమాన్ని గ్రహించి చరించాలి.
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే . 

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

శ్రీ వల్లభేశాయ నమః.శివాయ గురవే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ విష్ణు రూపాయ నమశివాయ.శ్రీ గురుగుహాయ షణ్ముఖాయ నమః.
గురువు పరసువేది లాంటి వారు.జీవి తన పాప కర్మలను పరమాత్మ సేవతో తొలగించుకున్నపుడు ,కర్తృత్వ భావం
తొలగి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే తపన ఏర్పడుతుంది. పాప ప్రభావం తగ్గితే, ఇనుముకు తుప్పు
లేకుండా చేసినపుడు అయస్కాతం చేత ఆకర్షించ బడినట్లు ,గురువు పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. అంతవరకూ గురువు
పక్కనే ఉన్నాఆయన కృపకు పాత్రుడు కాలేడు . ఎపుడు చిత్తశుద్ధి కలుగుతుందో , అపుడు తప్పక గురువు , పరమాత్మ యొక్క రూపమైన ,జీవ బ్రహ్మైక్యాన్ని తెలియజేసినపుడు ,జీవి అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని కలిగి , క్రమంగా ఆత్మనిష్ఠను పొందుతాడు. పరశువేది ఇనుమును బంగారం చేసినట్లే ,గురువు స్వానుభవమైన అహం బ్రహస్మి అనే అనుభవాన్ని ,శిష్యునికి తత్వమసి మహావాక్యంగా అందిస్తారు. దీనితో జీవత్వ బ్రాంతి నశించి శిష్యుడు
ఈశావాస్యం ఇదం సర్వమ్ అని తనలోనే మునిగిపోతాడు. 

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

                                                                        సనాతనం.
                                                                       [కన్యాదానం.]
   భారతీయ సంప్రదాయంలో కన్యాదానానికి పెద్దపీట వేయబడింది. ఇదే నాలుగు ఆశ్రమాలకు పట్టుకొమ్మ అయిన
గృహస్థాశ్రమానికి ప్రారంభం. దీన్ని స్త్రీ ,పురుష పరంగా కాక ,అద్వితీయమైన అర్ధనారీశ్వర తత్వంలో అర్ధంచేసుకునే
శాస్త్ర మననంలో భాగంగా స్వీకరించాను. జీవి పుట్టిన పిదప ఆహారంతో క్రమంగా మనసు తయారవుతుంది. ఇదే కన్య. నిజానికి మనసు దేన్ని మనం కోరుకుంటే దానిలో లగ్నం అవుతుంది. ఇది అందరి అనుభవంలోని విషయం.
ఇందువల్లనే శాస్త్రం ,ధ్రువుణ్ణి ,ప్రహ్లాదుని,శ్రీరాముని సంకేతంగా చూపి బాల్యంలోనే పిల్లలకు అపరోక్షానుభూతిని
పరిచయం చేయమంటుంది. ఏ కోరిక అయినా ధ్రువుణ్ణి,ఏ ప్రశ్న అయినా ప్రహ్లాదుని,ఏ వైరాగ్యమైన శ్రీరాముని వలె,గురువును ఆశ్రయించి వారికి అనువైన విధానంలో పిల్లలకు తత్వాన్ని పరిచయం చేయడం కనీస ధర్మం.
పై వారిలో ఎవరూ సన్యాసులు కాదు,గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించారు. జ్ఞానం అంటే సన్యాసం అనేది అపోహ. తన నిజానిజాలు తను తెలుసుకోవడం భగవత్ జ్ఞానం.
     మనసు కలిగిన జీవి , దానికి తండ్రితో సమానం. అష్టవర్షాత్ భవేత్ కన్య. ఆ వయసు నుండి మనసు తండ్రి ఏది చూపిస్తే అందులో లయమవడం ప్రారంభిస్తుంది.ఇలా అన్నంతో అంటే భూమినుండి అయోనిజగా జన్మించినది,కన్య.
అందు వల్లనే జనకుని ,విష్ణుచిత్తుని ఇలా ఎంతోమందిని, అమ్మాయి తండ్రిగా పరిచయం చేసింది శాస్త్రం. ఒక సంక్లిష్ట
విషయాన్ని అందరికీ అర్ధమయ్యేలా వ్యక్తులతో నిర్మితి చేసేది నాటకం.యదార్ధమైన పరతత్వాన్ని భూమిపై , ప్రకటించి  చూపినవి ఇతిహాసాలు. కన్యకు పరమాత్మను పరిచయం చేసి అతనితో ఎప్పుడూ,నిరంతరాయంగా లగ్నమై పోయేలా చెయ్యడం తండ్రి కర్తవ్యం. అలా చేసేదే కన్యాదానం. అపుడు సీతకు అరణ్యం కూడా ఆహ్లాదం గానే ఉంది. అరణ్యం అంటే జీవితం. ఒడిదుడుకులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.ఇది బాహ్యచరణ.
    అంతరంలో తన స్వస్థితిలో కదలక,నిమిత్త మాత్రంగా కర్మాచరణ పాతివ్రత్యం.కానీ మనసు ఇంద్రియ విషయాలతో
ప్రాపంచిక విషయాలతో నిండి ఉండడం,భార్యా లోలత్వం.అంటే మనసు తాను పరిభ్రమించడానికి ,పరమాత్మయొక్క
దివ్య విభూతి అయిన కాలాన్ని నష్ట పరుస్తున్నది. దీనివలన జీవి కర్మల ఫలితంగా జన్మ పరంపరలు పొందుతాడు.
బాహ్యంలో చరించడం అంటే జీవికి కర్త్రుత్వాన్ని ఇవ్వడం,బాహ్యంలో మాత్రమే శరీరంతో కలిసిన అహం ప్రజ్ఞ ప్రవర్తిస్తుంది.అందువలన ముక్తి అసాధ్యం.అందువల్లనే బాహ్యంలో కన్యాదానం వలన ఏడు తరాలు తరిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తాయి.మనసు లయిస్తేనే కానీ పైన అనుకున్నట్లు ముక్తి అసాధ్యం.దశరథుడైన వానికి రాముడు
లభించాడు యజ్ఞంతో. సీత జనకునికి మనో రూపంగా లభించింది. వీరిద్దరి కళ్యాణం ముక్తి. అంటే పురాకృత కర్మ
అనే యజ్ఞ కుండంనుండి ఆవిర్భవించినది శరీరం,అన్నగతంగా ఏర్పడింది మనసు. ఈరెండూ కలిస్తేనే జీవన్ముక్తి.

17, ఫిబ్రవరి 2018, శనివారం

సనాతనం

                                                                    సనాతనం .
  ప్రాణి పుట్టిననాటి నుంచి నేర్చుకోవాలనే తాపత్రయాన్ని కలిగి ఉంటుది. నేర్చుకునే సందర్భంలోకానీ ,నిష్ణాతులైన తరువాతకానీ ఎదో ఒక గమ్యాన్ని తనంతట తానే కలిగి అది పూర్తి అయిన తరువాత కృతక్రుత్యతను ఆస్వాదిస్తోంది.
నిజానికి ఈదశలో తనలోతాను మునిగి స్వస్థితిని పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఇది ప్రతివారి అనుభవం లోనిది. పుట్టుక తన స్వస్థితినుండి బయటకు రావడమే. మళ్ళీ తిరిగి చేరాలనే తపనే ఇందులోని తాత్పర్యం. నిజానికి నిద్రలోకూడా జరుగుతున్నది ఇదే. అందువల్లనే లేచాక ఎంతో హాయిగా ఉంటుంది. తన స్వస్థితి
చేరుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.
శరీరంతో తాదాత్మ్యం చెంది ఎదో చేస్తున్నాననే భావనా బలం వలన ,కర్మల ఫలితంగా జన్మలను పొందుతున్నాము.
ఎప్పుడు మెలకువ వస్తే అపుడే ప్రపంచం అనుభవానికి అందుతుంది. అలానే ఈప్రపంచంలో ఇపుడు కర్మలను
చేస్తున్నా,ఆధ్యాత్మిక మార్గం ,నిద్రకు ,ముందు తరువాత కూడా నీవే ఉన్నట్లు ,జన్మకు ముందు తరువాతకూడా
ఉనికి సమానమని తెలియజేస్తుంది. ముందు ,వెనుక ఉన్న ఉనికి ఇప్పుడూ ఉన్నది నిజం . దీన్ని నిద్రలో కాక
మెలకువలో పొందడం ఆధ్యాత్మిక సాధన. కానీ తెలియకుండా కూడా ,గమ్యాన్ని చేరిన ప్రతిసారి పొందే అనుభవం కూడా ఇదే. తెలియకుండా జరుగుతున్న ఈప్రయత్నంలో శరీరభావన వలన పునరావృత్తి కలుగుతున్నది.
అదే పరమాత్మ జ్ఞానంతో చేస్తే మోక్షం అవుతుంది.  

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సనాతనం

                                        సనాతనం.
అన్ని శాస్త్రాల సారం ,నామరూపాలు భ్రాంతి అని ,స్వరూపమైన అహం ,జీవాత్మకాదని ,శరీరాన్ని తానుగా భావించడాన్ని,మనసుకి ఆలంబనగా ఇవ్వకూడదనేదే సారాంశం. మనసుకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పే విధానాలను ఎందరో సాధనాపరులు తెలియజేస్తూనే ఉన్నారు . అలాంటివి మనన రూపంగా స్మరిస్తున్నాను. వ్యక్తి ఒక్కడే అయినా అతడు తండ్రికి కుమారుడు,సోదరికి అన్న అలానే భర్త ,తన పిల్లలకు తండ్రి కూడా . కానీ ఇవన్నీ అనుబంధాలు తప్ప వేరు కాదు . వీటిని వార్డరోబ్లో హాంగార్లకు తగిలించే దుస్తులుగా ఊహిస్తే ,జ్ఞానం,వైరాగ్యం సిద్ధించేందుకు అవకాశం కలుగుతుంది. నిజానికి వీటిని తిరస్కరిస్తే ,ఎప్పటికీ మనసు లొంగదు . కానీ వ్యవహారం అవసరమైనపుడు తన పాత్రకు న్యాయం చేస్తూ ,అది అవగానే తన మూలమైన స్వరూప అహంలో విశ్రాంతి పొందాలి. ఇది నిజానికి రోజూ నిద్రలో జరుగుతున్నదే . సంబంధాలు అపుడు లేవు . దానివల్ల నిజజీవితంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దీనిని జాగ్రత్తులో సాధనగా మార్చినపుడు మనసు స్వరూపంలో నిలకడ పొందగలదు .

15, ఫిబ్రవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం. 
     స్త్రీ,పురుష సంబంధం లేని ,భార్యా లోలత్వం,పాతివ్రత్యం. జీవుడు సనాతనుడు. శరీరం లేనపుడు కూడా ,సూక్ష్మ 
శరీరంతో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దీన్ని మనశాస్త్రం అంగీకరిస్తున్నది. పాప,పుణ్యాలు సమమైనపుడు ,
మానవదేహం కలుగుతుంది. సూక్ష్మదేహం శరీరమనే ఉపాధితో కలిసింది. అంటే సూక్ష్మశరీరం పురుషుడు,శరీరం స్త్రీ, 
అనిభావిస్తే,భార్యని పువ్వులా చూస్తూ అన్నీ అమరుస్తూ,దానికోసమే జీవితాన్ని సమర్పించడం,భార్యా లోలత్వం. 
  తన శరీరము ,ప్రాణము ,మనసు కూడా ,జన్మ పరంపరలు దాటించడానికే అనే ఎరుకతో జీవి ప్రయత్నించడం అనేది ,పరమేశ్వరుని పతిగా గ్రహించి ,ధర్మ విరుద్ధం కాని కర్మాచరణతో జీవన్ముక్త స్థితికి ప్రయత్నించడం పాతివ్రత్యం.