20, సెప్టెంబర్ 2017, బుధవారం

సనాతనం

సనాతనం. 
    
      శ్రీ గురుభ్యో నమః . 
మన వాగ్మయంలో ఇతిహాసాలు ,పురాణాలూ చదివినకొద్దీ కొత్తగా అర్ధం అవుతూ ,తమలో దాగిఉన్న రహస్యాన్ని ,పరమాత్మ కృపతో బుద్ధికి ప్రచోదనాన్ని అందిస్తాయి . ఇలా నాపరిధిలో వీటి అంతరార్ధం అందించే ప్రయత్నం చేస్తాను . 
    ముందుగా హరిద్రాగణపతి పూజను కొద్దిగా పరిశీలిద్దాము . ఈయనను అమ్మవారు తనవంటి నలుగుతో తయారు చేసింది . తండ్రి ద్వారా రెండవసారి తలను పొందాడు . ఎంతోమంది విజ్ఞులు దీనికి వ్యాఖ్యానాలు చేసారు . పృధ్వితత్వంతో తయారైన శివశక్తి ఏకరూప పరమాత్మ రూపంగా నేను భావిస్తున్నాను . అలానే మానవుని దేహం పృథ్వితత్వంతో ,తల్లి, దండ్రుల ఏక రూపమై జనిస్తున్నది . ముందుగా చేసే హరిద్రా గణపతిపూజలోని తత్వంలో శరీరాన్ని కూడా పరమాత్మరూపంగా గ్రహించి ,దానికి తగినంత అన్నపానాదులతో పోషించి ,దానిని పరమాత్మ పూజకు జడత్వంలేకుండా సహకరించేలా చూసుకుని ,అంతకన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత నియ్యక ,దేహాత్మభావాన్ని పక్కకుపెట్టి ,పరమాత్మను సేవించాలి . లఘువుగా ప్రతిపూజకు ముందు ఇది తప్పదు . 
    వినాయక వ్రత కల్పంలో ఓంకార రూపుడైన అనంత తత్వం గణపతిగా ఆవిర్భవించి గణాధిపత్యం వహించడం గురించి 
ఒకసారి చూద్దాము . ఒకే శరీరంలోని శరీరరూపం ,వినాయకుడు ,జీవరూపం సుబ్రహ్మణ్యుడు . ప్రతివారికి బాల్యంలో ముందుగా పరిచయమయేది శరీరం . బాల్యమునుండి తల్లితండ్రులు భగవద్భక్తిని వారికి అలవాటు చెయ్యాలి . అందరిలో శివ శక్తులే నిండియున్న విషయాన్నీ తెలియజేయాలి. ఈవిషయాన్ని బాగా అర్ధం అయ్యేలా చెయ్యాలి . అపుడు వ్యక్తి ఎవరిని చూసినా పరమాత్మ అనేభావాన్ని అనుసంధానం చేయగలుగుతాడు . ఇదే మనకు గణాధిపత్యం కొరకు పోటీ పడిన వినాయకుడు సుబ్రహ్మణ్యుడు విషయంలో కూడా కనిపిస్తున్నది . ముందుగా గణపతిలా శివ శక్తులే సకలము అని భావించడం వలన ,సుబ్రహ్మణ్యుడు భూప్రదిక్షిణ సమయంలో ,వినాయకుడే కనిపించాడు . అంటే అంతటా తల్లి తండ్రుల 
ఏకరూపమైన వినాయకునిగా సుబ్రహ్మణ్యునికి అవగతమైనది . శరీరం తాను కానప్పుడు ఫలం శరీరానికే అందడం ,అనేది ఆలోచించ వలసిన విషయం . కొద్దిగా గమనిస్తే పురాకృత కర్మ ఫలాలను శరీరం ద్వారా మాత్రమే పొందగలం . అందువల్ల సుఖానుభూతి కూడా అదే సమయంలో మనసు అక్కడ లేని కారణంగా సాధారణంగా ఇది శరీరానికే అన్వయ మోతుంది. అపుడు అలిగాడు సుబ్రహ్మణ్యుడు. శివుడు, సర్వ జీవులలోను పరమాత్మని చూడడమే ,నిజమైన ఫలమని ,అంతటా నిన్నే చూచిన నీవేకదా నిజమైన ఫలం అన్నాడు .