25, అక్టోబర్ 2016, మంగళవారం

ధర్మం

ధర్మం .
ధర్మం అంటే లక్షణం . గాలికి కదలడం లక్షణం . నీటికి ప్రవహించడం లక్షణం . ఇవి వీటి ధర్మాలు . పరమాత్మనుండి కదిలిన సృష్టికి అతని లక్షణాలే కలిగి ఉండడం ధర్మం . సర్వే సర్వత్రా ఉండడం వలన అంతా తానే ,అంతా తనదే .ఇది ప్రధమలక్షణం . ఇది అందరూ కలిగివున్నారు . ముందుగా ఈ లక్షణాలు శరీరానికి ముడిపెట్టకూడదు . ఇదే మనకు జ్ఞానులలో కనపడే మొదటి లక్షణం . ఎంతోమంది జ్ఞానులు విదేశీయుల దాడులలో 'మీరేమి చెయ్యలేరు . పొతే పోయేది నా శరీరమే' అని జవాబిచ్చారు .మనకి ప్రపంచం కనిపించడం అనేది పంచేంద్రియ విషయమే . నిద్రలో అది ఉన్నా తెలియదు .  అజ్ఞాన కారణంగా . కానీ అజ్ఞాన కారణంగా నిద్రలో లేనట్లే ,అద్వైత జ్ఞాన కారణంగా జ్ఞానులకు ,ఊహా మాత్రంగా గాని , కలలాగా కానీ దీని అస్తిత్వం ఉంది . అందుచేత ధర్మం అనేవిషయాన్ని అర్ధం చేసుకోడానికి ,పరమాత్మ పంచ భూత ప్రకృతిగా ఉన్నాడు అని అనుకుందాము . అందరూ పాడుతున్న అన్నమయ్య పాట ,అందరికి ,నేల ,నీరు ,గాలి సమానమని చెపుతున్నది .నిద్రలో లేని బేధం మెలకువలో ఉంది . నిద్రలో ఏమి తెలియనీయని అజ్ఞానం , మెలకువలో  శరీరధ్యాసను కానుకగా ఇస్తున్నది . దీనినే మాయ అని శాస్త్రం అంటుంది . పంచభూతాలు ,కొన్నిసమీకరణలతో ఏర్పడిన శరీరం ,పంచ భూతాలే కదా . అది వాటితోనే పోషించబడుతుంది .తిరిగి వాటిలోనే కలిసి పోతుంది దీనిలో తనది ఏముంది ?
    ఇదే ప్రధమసూత్రం హిందూ ధర్మానిది . ఇది అద్వైతం . దీనికి నేను ఉన్నాను అని జోడిస్తే ద్వైతం . ద్వైతం ఉంటే రెండవది ఉండడం వలన ఉన్నదాన్ని భాగించి సర్దుకోవలసి ఉంటుంది . దీనినే పరిధి అంటారు . ఇలా పరమాత్మ నేను , నాది అని విభాగించ బడినట్లు కనిపిస్తున్నది ,మెలకువ .నిద్రలో విభజనం లేకున్నా అద్వయ ప్రభావం వలన విశ్రాంతి ఉంది .అజ్ఞానం వలన తెలియమి ఉంది . ఇంతకీ అద్వైతమే విశ్రాంతి . అది అందనంతవరకు అశాంతి .అందుకునే పధ్ధతి ధర్మం . మెలకువ ద్వైతం కావడం వలన పరిధి ప్రారంభం అవుతుంది .ఇదే ప్రపంచం ,నాది అని సూచించ బడుతుంది అంతా తానేనన్న అనుభవం అంతా తనదే అనే భావాన్ని మనిషిలో 'నేను'అనేది కలిగి ఉంటుంది . దీని కోసం ప్రపంచంలో తాపత్రయ పడుతుంది 'నేను'. దీన్ని మాత్రమే శాస్త్రం నిరసిస్తుంది . సముద్రం  తాను కలిగి ఉన్న అలలను తానే పొందాలనుకునే తపన లాంటిదే ఇది . దీన్ని జ్ఞానంతో తొలగించుకోమని హితవు పలికేదే హిందూ ధర్మం . ఇంకా చాలా చర్చించుకుందాము .