3, ఆగస్టు 2016, బుధవారం

లక్ష్మి

లక్ష్మి 
   సమయము లక్ష్మీ స్వరూపము . కాలస్వరూపిణి ఆది లక్ష్మి . శుద్ధమైన మనసు[చంద్రుడు] మాత్రమే నిరాకరమైన సమయాన్ని గుర్తు పడుతుంది .అందువలన లక్ష్మి చంద్ర సోదరి .  సంకల్ప వికల్పాలు లేని సమయాన్ని లక్ష్మీ స్వరూపం అని గుర్తుపట్టిన ముని జనుల సమూహాలతో ఆవృతమైన జ్ఞాన స్వరూపిణి ,వేదాలచే స్తుతింపబడిన మోక్ష ప్రదాయిని . మోక్షము అద్వితీయమైన వర్తమానమే . ఇది ఎక్కడ ,ఎవరికి లేదు ?ఇది విష్ణు శక్తి . శ్రీ మహాలక్ష్మి . ఇంద్రియ ,మనో ,బుద్ధులు 
ఈ విషయాన్ని తెలిసి వర్తమాన క్షణాన్ని మౌనం అని గ్రహించి ఆక్షణంలో రమించేదే మోక్షం . ఇదే ధ్యానం .
       ఈ సమయాన్ని ఇంద్రియ మనో బుద్ధులు తమ ఆధీనం చేసుకుని విహరించేదే విష్ణుమాయ .కానీ కర్తవ్య కర్మ కొరకు కదలక తప్పదు . పని చేసే ఆ సమయంలో మాత్రమే దానికి సంబంధించిన వ్యవహారం కలిగి ,వేరొక పనిలో, మొదటి పని యొక్క ఆలోచనలు లేకుండా ఉండడమే ఏకాగ్రత .ఎన్ని జన్మల సంచితమైనా ఈ విధమైన ఏకాగ్రతను భంగంచెయ్యలేదు . వర్తమానంలో ఉండడం వలన , చైతన్యరూపమైన పరమాత్మ సన్నిధిలో ,పురాకృత కర్మ తన ప్రభావాన్ని కోల్పోతుంది .పురుష 
ప్రయత్నం అని పెద్దలు సూచించినది ఇదే . తన ప్రయత్నంతో ఇలాచేసే ఈ ప్రయత్నం భగవత్కృపతో సాధనగా మారడం 
ఎంతో సహజం . ధ్యానం సహజంగా కుదురుతుంది . భౌతిక ప్రపంచంలో చరించే దశలో ఏకాగ్రత సాధన . పని ఆగిన క్షణం 
శుద్ధమైన మనసు , నిరాకార సమయంలో మునగడమే ధ్యానం . అక్కడ ఉన్నది చైతన్యం యొక్క మూలం ,ఖాళీ కాదు .
మోక్షలక్ష్మి ,ఆది లక్ష్మి .
     ధాన్యలక్ష్మి-2
      ప్రపంచంలో చరించే దశలో మంచి ,చెడుల సంఘర్షణ సహజం .ఇది క్షిర సాగర మధనమే . మనసును మంచికి
ప్రేరేపించి కార్యసాధన చేయాలి . దీనినే దేవతల గెలుపు అన్నారు . దేవతలంటే ఇష్టమని ,రాక్షసులంటే అయిష్టమనే అర్ధం కాదు . పిల్లల దుష్ప్రవర్తన ఎవరూ సహించరు . అలానే మనసు చేసే మాయలో చెడుకి సహకరించక ,మంచిని ఎంచుకుని
సాగడం దేవతల గెలుపు . ఈ సాధన వలన సమయం అనుకూలిస్తుంది . అంటే లక్ష్మి కృప కలుగుతుంది .సాధన పరంగా
దీన్ని అర్ధం చేసుకోవాలే కానీ ,ఆర్ధిక పరంగా ఆలోచించి నిరాశ పడకూడదు . జన్మ పరంపరలనుండి దాటించే కృప కన్నా
ఐశ్వర్యమేముంది ?సమయమనే సముద్రంలో వ్యాపించి వసిస్తున్న మహాలక్ష్మి ,మనకు సర్వ సమృద్ధిని కలిగించే ధాన్యలక్ష్మి.
నిజానికి ,చిన్నప్పుడు బుద్ధిగా సమయాన్ని వినియోగించి సాగించిన అధ్యయనమే ,తరువాత ఆర్ధిక సమృద్ధిగా అంది వస్తుంది . అంటే సమయమే సమృద్ధి . అందుకే అమ్మ ధాన్యలక్ష్మి .
  ధైర్యలక్ష్మి -3
   ఎప్పుడైతే సమయపాలన విలువ తెలుస్తుందో , అపుడే మనో ప్రపంచం దాడి చేస్తున్న విషయం అర్ధం అవుతుంది . దీన్ని
గమనించి శ్రద్ధతో విష్ణు పాదాలయందు ద్రుష్టి నిలిపితే ,భవసాగరం భయపెట్టలేదు . విష్ణుపాదాలను పూజిస్తున్న లక్ష్మి కృప
కలుగుతుంది . విష్ణు పాదాలు ,అవి సూచిస్తున్నది , అహం యొక్క ఆధారభూతమైన చైతన్యాన్నే . రెండు పాదాలుగా
మనకు పరిచయమైన ద్వైత దర్శనలోని ,ఒకరే[అద్వైతం] కలిగిఉన్న రెండు పాదాలు. ఉన్న చైతన్యమే ,దృశ్యమానమైతే ,రెండు . చరించే ధర్మం ఒక పాదం . చెరించే దశలో కూడా తనలో స్థిరంగా తెలిసే చైతన్యం రెండోపాదం . ఎపుడూ వర్తమానంలో ఉండడంవలన కొత్తగా కర్మ ఏర్పడదు . వర్తమాన క్షణంలో ఎవరికీ అహం అనేది శరీర పర్యంతంగా భ్రమ
పెట్టదు . ఎందుకంటే రెండో వస్తువు ఉన్నపుడే పోలిక ,భ్రా0తి కలుగుతాయి . వర్తమాన క్షణంలో రెండోది లేదు . ఈదశలో పురాకృత పాపము అని తెలియబడుతున్నది కూడా ,మాయగా తెలియబడుతూ ,తన సత్తాను కోల్పోయి ,పాపక్షయం
అవుతుంది . భవ భయహారిణి ,పాపవిమోచని ,శ్రీ ధైర్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది .
సశేషం