4, మే 2015, సోమవారం

అంతర్మధనం

   ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః. 

అంతర్మధనం 

 
                పురాణ కధలు, తెలుసుకోవలసిన విషయాలను యధాతధంగా కాక ,పాత్రలతో కధా రూపంగా అందించారు ,పెద్దలు . వాటిని కధారూపంగా గ్రహిస్తే ,అస్తవ్యస్తంగా అనిపించక మానదు . అందువల్లనే పుక్కిటి పురాణాలుగా ఎన్నో చోట్ల విమర్శించ బడుతున్నాయి . ఉదాహరణకి పంచ తంత్ర కధలతో ఎన్నో విషయాలను ,నీతిని పిల్లలకు పరిచయం చెయ్యడం మనకు తెలిసిందే . నిజానికి జంతువులు ,మాట్లాడ్డమేమిటి అని పిల్లలు అడిగితే పెద్దల దగ్గర ఉన్న ఒకే ఒక సమాధానం ,తెలియ జెయ్యవలసిన విషయాలను మనకు అందించడానికి, కధారూపంగా అందించారని చెప్పక తప్పదు . అబద్ధంఆడకు,అన్యాయం చెయ్యకు ,ఇలా చెప్పినప్పుడు అది విన్నా , మనసు ఆవిషయాలను గురించి ఆలోచించదు . కానీ కధా రూపంలో అయితే ,మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ,దాని గురించి అనేక రకాలైన ప్రశ్నలు పుట్టిస్తుంది . నెమ్మదిగా సారంశం చక్కగా మనసుకు అందుతుంది .
                మనసును ,ఏది చెప్పదలచు కున్నామో దానిచుట్టూ పరిభ్రమించేలా,చెయ్యడమే 'కధ' యొక్క మూల సారంశం .దాన్ని దృష్టినుండి జారవిడిస్తే కధకు,ఏ విలువ ఉండదు . వేదాలకు మూలమైన నాలుగు మహావాక్యాలు ,చెప్పి వదిలేస్తే ,వేదాల విస్తారం జరిగేదా ?వేదాలుగా విప్రులు విని అవగాహన చేసుకుని ,ముందు యుగాల్లో అందరికి తెలియ జేసేవారు .కానీ కలి ప్రభావం వలన,సంపూర్ణ విజ్ఞానం ,కొంత నష్టమౌతుందని తెలిసి ,శ్రీ మహా విష్ణు అవతారమైన వ్యాసులు , బ్రహ్మ సూత్రాల వంటివే కాక,వేద విభాగంతో బాటు ,ఇతిహాసాలు ,పురాణాలూ ఇలా ఎన్నో,మానవాళికి అందించారు. వీటి ఆధారంగా మూలమైన వేద ప్రదిపాదితమైన'అహం బ్రహ్మస్మి'వరకు ప్రయాణించాలనే,పెద్దలఆకాంక్ష అర్ధం చేసుకోవాలి .  పిల్లలు'జంతువులుమాట్లాడతాయా' అని అడిగినట్లు ,ప్రతి ఈక ఎలా పీకాలి, అనే ఆలోచిస్తే మిగిలేది శూన్యమే.
         జన్మల పరంపరలో, ఎవరి బుద్ధి ఎక్కడ వరకు ప్రయాణించిందో,ఏ విషయాలను ఎంతవరకు అవగాహన చేసుకోగలదో దాన్ని,కులాచార ప్రాతిపదికగా నిర్ణయించడం ,ద్వాపరం చివరలో శ్రీ కృష్ణుని భగవద్గీతలో చూస్తాం . కానీ ముందు యుగాల్లో కూడా ,సత్య యుగంనుండి సప్త ఋషులు ,గోత్రాలు ,వంశాలు ఉన్నట్లుగా ,మనకు ఇతిహాసాల్లో కనిపిస్తుంది . బ్రాహ్మణులు వేదాధ్యయనం,క్షత్రియులు పరిపాలనం ఇలా.రాజర్షిగా విశ్వామిత్రుని చూసినపుడు,అతనిలోని క్షాత్రం,వసిష్టుని,నందిని ధేనువును వశం చేసుకోవాలన్న కోరికగా ,బయట పడింది . దాని కారణంగానే తపస్సు కనిపస్తుంది కానీ ,తనలో ఉన్న రజో గుణాన్ని గెలవడానికి ఉపయోగ పడలేదు .అలాగే అన్నికులాలవారు పూర్వం తపస్సును ఆచరించినా,వారి సంచిత  కర్మానుసారం ప్రయోజనం మాత్రం 'అహం బ్రహ్మస్మి'అని చెప్పలేము .దీనికి జడ భరతుని వంటి ఉదాహరణ లెన్నో ఉన్నాయి .
                ఇలా తమ క్షేత్ర స్థాయి ,అనుసరించి గుణ స్వభావాలను గెలవడానికి బుద్ధిని ప్రేరేపించేదిగా మాత్రమే ,కుల వ్యవస్థను స్వప్రయోజనం కోసం అనుసరించాలనేదే గీతాచార్యుని ,తాత్పర్యం కావచ్చు. దీన్ని కదిలిస్తే కందిరీగ తుట్ట అని , విజ్ఞులందరూ దీన్ని పక్కకు పెట్టి ,ప్రవచనాలు చేసినా,స్వప్రయోజనాన్నికాపాడుకోడానికి మాత్రం,విధులను  ఆచరిస్తున్నారు. కానీ స్పష్టంగా నామ జపం అందరికీ సమానమే ,కానీ తమ తమ ఆచారాలు పెద్దల ద్వారా తెలుసుకుని అంతవరకే పాటించాలని చెప్పే వారుకనిపించడం లేదు . అన్నప్రాసన రోజున ఒక్క మెతుకు పసి పాపకు ముట్టిస్తారు . అంతమాత్రాన ఎప్పటికీ అంతే తింటే శరీరాలు నిలబడవు . అవసరానికి తగినంత అందించ వలసిందే . అలానే ఎవరికి తగిన సాధన ,పెద్దల ద్వారా,గురువుల ద్వారా తమంత తామే స్వీకరించి ,ముందుకు సాగాలి . ఆకలి వయసును బట్టి పెరిగినట్లే,ఆహారం అందక , లేదా సరిపోకపొతే పడే బాధ లాగే ,సాధన పరిణతి పెంచుతూ బలిష్ఠoగా ,ఆరోగ్యంగా ఉంచాలి . అంతే కానీ రామా అంటే తరించి పోతాం .ఎక్కువైతే అజీర్తి అన్నట్లుంటే ,సాధన అనేది కుంటు పడుతుంది . పూర్వం మన పెద్దలు వారికి తెలిసిన కొన్ని రకాల ఆహారపదార్ధాలతో సరిపెట్టుకున్నారు.అలాని తరువాతి తరంవారు అదే తింటాము అని,అలానే బ్రతకడం లేదే.సద్బ్రాహ్మణ వంశాలలోకూడా పరాయి పాలనలో ,ఎన్నో ప్రభావాలకు లోనై ,సాధన గాడి తప్పిన మాట వాస్తవం.కానీ దారితప్పిన పిల్లలను,వెదికి తెచ్చుకుని ప్రశాంతంగా ఉన్నట్లు ,మళ్లీ సాధన కొనసాగించ వలసిందే .
      వసిష్టుడు నందిని ధేనువు నుండి సకలమూ పొందినట్లు మనకు తెలుస్తుంది . విశ్వామిత్రుని అసూయకు కారణం కూడా అదే కారణమని మనం వింటున్నాం పెద్దలనుండి . వశిష్టుడు సత్వగుణ ప్రధానమైన తపస్సు వలన నందిని ధేనువును పొందాడు . దానిని ధేనువు రూపంతో చెప్పారుకాని ,నిజానికి అతని తపస్సు నుండి అన్నీ కలిగి ఉన్నాడు . దీన్నిగమనించాలి . అందువల్లనే సత్వగుణ ప్రధానమైన తపోబలం వలన వాక్సుద్ధి సహజంగా ఏర్పడుతుంది .తపస్సు చేయలేకున్నా సత్వ గుణ స్వభావులైన , బ్రాహ్మణులకు ప్రాధాన్యత నివ్వడం వలన ,సత్వగుణ అధిష్టాన రూపమైన,లక్ష్మీ , నారాయణ కృప కలుగుతుంది .శరీరంతో బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉండడం వలన ,నమస్కరించి నపుడు ,వారిలో ఉన్న రాజస ,తామస ప్రవృత్తులు పక్కకు జరిగి ,పరమాత్మ యొక్క అప్రఘటిత కృపతో,వారినుండి ఆశీర్వచనం వెలువడుతుంది. అలానే వారిని అకారణంగా ఇబ్బందికి గురి చేసినపుడు అప్పటికి మాములుగా ఉన్నా ,తరువాత ప్రభావం తీవ్రంగా ఉండడం సహజమే .దీనికి సత్వగుణం యొక్క ప్రతిభే కారణం కానీ ,బ్రాహ్మణ శరీరం కాదు.
              శరీరం లోని గుణ ప్రాధాన్యాన్నిగుర్తించి ,పరమాత్ముని నియతిని గుర్తించాలే కానీ ,వారు అప్పుడు కలిగి ఉన్న భావజాలాన్ని కాదు .దీని వలన నమస్కరించిన వారు సత్ఫలితాలనే పొందుతారు. నమస్కారాన్ని చేసినపుడు  ,చేసినవారికి ఆశీర్వాదం తప్పక లభస్తుంది ,కానీ పొందిన బ్రాహ్మణునిలో ,అది రాజస ప్రవృత్తిని కలిగిస్తుంది . ఇందువలన నష్టపోయేది బ్రాహ్మణుడే .అందువలననే వీరికి త్రికాల సంధ్యావందనాది ఎన్నో పరిష్కారాలు విధించబడ్డాయి .వాటిని పాటించక మళ్లీ నష్టపోతున్నది,బ్రాహ్మణులే.ఎటు చుసినా నష్టభయం వీరికే.బ్రాహ్మణులైనా రావణాసురుడు,అలానే పరశురాముడు , విశ్వామిత్రుడు ఇలా ఎందరో స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన,వేద పథం ,తపస్సుకూడా,ఎలా జరిగింది,అని ఆలోచనకు తావిస్తుంది.ఎక్కువగా ఏగుణాలు కర్మానుసారం జీవుడు కలిగి ఉన్నాడనేదాన్ని మాత్రమే కులము అనేది నిర్ణఇస్తుంది.ఎన్నోగణాలున్నాయి అంటారు అటువంటి పదమే కులము కూడా. క్రమంగా గుణాలను తమస్సు నుండి రజస్సుకి ,తరువాత సత్వ గుణ ప్రాధాన్యతను బుద్ధికి నచ్చజెప్పక తప్పదు . ఈ సాధనా క్రమంలో శరీరం ,ఎన్నో సార్లు పడిపోతుంది . మళ్లీ అప్పటి గుణ ప్రాతిపదికతో మళ్లీ శరీరం స్వీకరిస్తుంది .ఇటువంటి క్రమబద్ధ ప్రణాళికను ,కలి  ఎంతో    చులకన పరిచింది . అన్నీ తెలిసిన పరమాత్మ శాంతి మంత్రంగా 'గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం 'అంటే నమ్మడానికి
కూడా అలసత్వం అడ్డువస్తోంది.ఈ మంత్రానికి సత్వము వైపు ప్రయాణించిన జీవులకు చెందిన శరీరాలు [బ్రాహ్మణులు ]  శుద్ధ సత్వం 'గోవులు'. యజ్ఞ ప్రధాన జీవితానికి ఆధారం గోవులు ,అనేది అందరికి తెలిసిన విషయమే . గోవులు అనేది ఇంద్రియాలకు కూడా వర్తిస్తుంది . జ్ఞానేంద్రియ  కర్మేంద్రియ సమూహం ,నిత్యమూ , శ్రేయో మార్గంలో పయనించి నపుడే పరమార్ధాన్ని అవగాహన చేసుకోగలవు . లేకుంటే ప్రేయో మార్గంలో ప్రవేశించి నిమ్న స్థాయికి చేరుతాయి . వీటిని కాపాడితేనే లోకానికి నిర్భయం ,ఇలా తమను తాము కాపాడుకోవలసిన బాధ్యత అందరిమీద ఉంది . నాటకంలో పాత్రలవంటి శరీరాలను గుర్తించడానికి కాదు.వేద మంత్రాలలోనే అధిష్టానమైన పరమాత్మ చెప్పినది అర్ధం కాకపోతే,సామాన్య జీవితంలో ఎదురయ్యే వాటిని ,ఎలా విశ్లేషించగలం ?
               పూజ . ఈ విషయాన్ని తీసుకున్నప్పుడు ,భావనా బలం ప్రాధాన్యత వహిస్తుందని అందరికీ అవగాహనలో ఉన్న విషయమే . ముందు గణపతి పూజ చేస్తాము .విఘ్న నివారణకి . గణపతి ,కుమార స్వామి ,స్కందుడు మొదలైన బ్రహ్మ మానస పుత్రులు ,ఎప్పుడూ బాల్య అవస్థలో ఉంటారనేది కూడా పెద్దలవాక్కు . పిల్లలంత నిష్కల్మషంగా పూజ చెయ్యాలనే భావం మొదటిది . వీరి భావనా బలాన్ని ఏ విధంగా అంచనా వెయ్యాలి?వాళ్ళకి తల్లి దండ్రులే ప్రపంచం . వేరే ప్రపంచమే లేదు ఏదైనా అడగాలన్నా. ప్రపంచపు జాడ తెలియనివారికి కోరికలేవి ?తమ అహం లేక ,భగవంతుని అమ్మగా చూసినా ,తండ్రిగా చూసినా మొదటి లక్షణం ,అహం లేని బాల్యం . ఇది ప్రాధమిక లక్షణం పూజకి ,అని చెప్పేదే గణపతి పూజ .       
           బంగారు కలశాలతో అభిషేకం ,అమ్మ కంకణాల రవళి ,పవళింపు సేవ తరవాత ,సుప్రభాత సేవలో ,'కమలాకుచ చూచుక కుంకుమతో'అని,తన మనసుతో విహరించే స్వేఛ్చ మనసుకు రాని ,బాల్యాన్ని స్మరించి , అమ్మ ముందు నిలుచున్న ఆకలి అని కూడా చేప్పలేని ,ద్వైతాన్ని పూజా పుష్పంగా సమర్పిద్దాం .మరో అర్ధంతో అంతరార్ధాన్ని భావిస్తే
సృష్టికి పోషణ పరంగా అమ్మను స్మరిస్తూ ,లోక బాంధవుడైన సూర్యుని ,అమ్మవారి కుంకుమతో పోల్చి ,ఆకాశా న్నంతటిని విష్ణువుగా ,సంభావించిన విశ్వరూప సందర్శనగా ,భావించినపుడు ,తృప్తి కలుగు తుంది . ప్రపంచం మనసులోకి ప్రవేశిస్తే ,పైన తెలిపిన సుప్రభాత సేవలోని అంతరార్ధం తెలియజేసే గురువును ప్రసాదించమని ప్రార్ధిద్దాం . ఇక్కడే రమిస్తే ,మనసును త్రిపుటినుంచి దాటించే శక్తి పరమాత్మకు కూడా ఉండదు . మనసు ,శరీరం,వాటి పరిధిని దాటి ప్రయాణిస్తే ప్రమాదాలు బుద్ధి భగవత్క్రుపతో పరమాత్మపై భారం వేసి ,శాస్త్ర అవగాహనలో ప్రతి మానసిక అవరోధాన్ని దాటి ,అంతరార్ధం అనే సీతమ్మను తెచ్చి ,ఆత్మా రామునితో పట్టాభిషేకమే పరమ గమ్యంగా ,ఆంజనేయునిగా పరిశ్రమించక తప్పదు .
       శాస్త్రాలలోని ఎన్నో విషయాలకు అంతరార్ధాన్ని వివరించే,ప్రవచన చక్రవర్తులకు శతకోటి నమస్కారములు సవినయంగా.కానీ భౌతిక పరమైన అర్ధం మనసు వరకు ఉత్తేజ పరుస్తుంది.అంతరాత్మకు చేరాలంటే,అది త్రిపుటిని దాటి సమన్వయం అయితే జీవికి ఉద్ధరణకు హేతువు అవుతుంది .మనో ఉత్తేజం శరీరంతో సరి .త్రిపుటిని దాటిన క్షణం మనసు స్తంభిస్తుంది.ఈ పరిచయం జీవికి ఎంతో అవసరం .ఎన్నో జన్మలలో మనసు వెనుక పరిగెట్టింది చాలు ,  అని విసిగి ,చెవి ఒగ్గి వినే శ్రోతకు ,తరవాత ,తరవాత అని ఊపిరి బిగించి ఎదురు చూస్తున్న,చకోరం వంటి వారికి త్రిపుటిని దాటించేలా మాట,వారిని జన్మ పరంపర నుండి దాటిస్తుంది .
        భక్తి పరిధిలో అందరికి అవగాహనలో ఉన్నది ,ఉపాసనా మార్గంగా చెప్పబడుతున్నది ,భగవంతుని లీలగా , చరిత్రను రూప ధ్యానాన్ని ,ఉపచారాది సేవలను, మనసు గ్రహిస్తుంది . దీన్ని ప్రాధమికంగా భక్తి మార్గంగా అందరూ అంగీకరిస్తారు . దీనికి ఖచ్చితంగా ద్వైతమే ఆధారం . దీని విస్కృత పరిధిగా కర్మ యోగాన్ని భావించినపుడు 'అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః 'అనేది అన్వయం అవుతుంది.దీనిలోని అంతరము,బాహ్యం అనే రెండిటిని కలిపే ప్రయత్నం జరిగింది భగవానుని చరిత్రకైనా,రూపధ్యాననికైనా,ఉపచారాది సేవలకైనా  మనస్సు ప్రధానం .
కానీబాహ్యానికిఅన్వయించడానికి  బుద్ధి చాలా ప్రయాసకు లోను అవుతుంది . భక్తిలో జీవికన్నా,పరమాత్మ వేరుగా భావన ఉంటేనే పైన అనుకున్నవి సాధ్యం . భావనా పరిధినుండి ప్రపంచంలో కాలు మోపాలంటే ,బాహ్య ప్రపంచంలోకి రాకతప్పదు.
          బాహ్యం అంటేనే శరీరం అనే ఉపకరణాన్ని భూమి అనే కార్య క్షేత్రంలో ప్రవేశ పెట్టక తప్పదు . మనస్సు అనే బిందువు పరిధి ,కార్య క్షేత్రంగా బాహ్యానికి విస్తరిస్తుంది ,కర్మ మార్గంగా.మనస్సుకు నిరాకారమైన కాల్పనిక భావన ఆధారం.కానీ కర్మ మార్గానికి ,పంచభౌతిక శరీరం అవసరం .ఇదికూడా  ద్వైత పరంగా అన్వయమౌతుంది . త్రిగుణాల ప్రాతిపదిక దీనికి పరిధి అవుతుంది .నిరాకార చైతన్యంయొక్క లీలగా సృష్టిని  గమనించినపుడు ,అర్ధ నారీస్వరమైన నిరాకార చైతన్యం,శివుడు,శక్తిగా,సాకార రూపమైన శరీరంగా భాసించినపుడు,శరీరం శివుడైతే,అందులోని చైతన్యం శక్తిగా తెలియ బడుతుంది. నిరాకారంగా శివ తత్వంగా[భూతకాలంగా] ,పరిచయమైన స్వరూపం సాకరంగా,విష్ణు రూపంగా [వర్తమానకాలంగా]అనుభూతమౌతుంది . మళ్లీ భవిష్యత్తుకు పునాది అవుతుంది . అందువల్లనే ,విష్ణువు నుండి బ్రహ్మ యొక్క కల్పనకు ,సృష్టి అనే భావాన్ని అన్వయించవచ్చు . శరీరాన్ని విష్ణు రూపంగానూ ,నిండి ఉన్న శక్తిని ,లక్ష్మిగాను భావించినపుడు ,ఎంత శ్రమిస్తారో అంత వైభవం శరీరానికి కలుగుతుంది . ఇది లక్ష్మి దేవి విష్ణువుకు చేసే  అలంకారంగా భావించ వచ్చు . సృష్టిలో అంతా లక్ష్మీ కృపగా తెలియబడుతూ ఉంటుంది . సత్యం మీద ఆధార పడి ,తన జన్మరీత్యా ఏర్పడిన శరీర ,కుటుంబ పరిధిలో న్యాయ ,ధర్మ పరంగా శ్రమించి ,తమో గుణ ప్రభావానికి లోనుకాక ,చేసే ప్రతి పని పరమాత్మ లీలగా గ్రహించ వచ్చు . ఇది అష్టైశ్వర్యాలను కలిగిస్తూ ,ముక్తిని ప్రసాదిస్తుంది . కానీ అహం అనేది నామ , రూపాలకు పరిమితమైనదిగా భావించినపుడు ,జన్మ పరంపరకు కారణ మౌతుంది .బాహ్య వ్యవహారానికి మాత్రమే ,అహం అనే 'కోటుని'ధరించి,అంతరంగంలో పరమాత్మదే అహం అని గ్రహించి,నావలోనికి నీరు  ప్రవేశించకుండా,భవసాగరాన్నిదాటే
 ప్రయత్నం చెయ్యాలి.కర్మ,పాత్ర శుద్ధికి [చిత్త శుద్ధికి ]ఉపయోగ పడితే,అంటే కర్తృత్వ భావానికి లోను కాకుండా, కార్య క్షేత్రంలో సహకరిస్తే ,శుభ్రంగా తుడిచిన అద్దంలో, ప్రతిబింబంలా ,అంతటా ప్రకాశించేది తాననే జ్ఞాన మార్గానికి ,మార్గం సుగమం అవుతుంది .కర్మ యాంత్రికమైతే ఇహలోక ఫలాలను మాత్రమే ఇవ్వగలదు .కానీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మ ,మళ్లీ జన్మించ వలసిన అవసరమే లేకుండా చేయగలదు .అంతర,బాహ్య అనే హద్దులు చెరిపి ఏకత్వమే ,అనంతత్వ మే పరిధి, జ్ఞాన మార్గం.ఇలా భక్తి ,కర్మ,జ్ఞాన మార్గాలు ఒక దానితో ఒకటి ముడి పడి విడదీయలేని త్రిపుటిగా ప్రకటించ బడుతున్నాయి. వీటిని గమనించే సాక్షిగా వీటికి ఆధారంగా, పరమాత్మసర్వే సర్వత్ర ప్రకాశిస్తున్నాడు .అ,ఉ ,మ అదే త్రిపుటి ,బిందువే సాక్షి . సృష్టి ఓంకారమే
        సృష్టిలో పొందిన వాటికి ,భగవంతునికి కృతజ్ఞత తెలిపేదే పూజ .తన పరిధిలో ఊపిరి ఉన్నంతవరకు ,ఏపని నిర్దేసించ బడిందో దానితో ,అపరిమిత తృప్తి కలిగి,అహం బ్రహ్మస్మి వరకు చేసే ప్రయాణం కర్మ .అన్ని జన్మలు మజిలీలే .తనది అనే మూట విప్పి ,ఏదో ఒక క్షేత్రంలో ఆగి సత్రంలో వండుకుతిని ,పరమాత్మను సేవించి ,మరలా ప్రయాణానికి సరిపడా ,ఏదో ఒక పనిచేసి,కొంత సంపాదించి, గమ్యంచేరే వరకు తిరుగాడుతూ చివరకు ,గురు కృప ,పరమాత్మ దయతో,అంతటా తానై వెలిగే పరమాత్మలో [సముద్రంలో ]ఉప్పు బొమ్మగా ,తనను తాను గుర్తించి విశ్రాంతిని పొందిన పరమ హంసకు నమస్కారం .
     అర్ధనారీశ్వర తత్వం,నామ రూపాత్మక మైనప్పుడు,అయ్యవారి సమాధి స్థితి నుండి ఆయనకు తపోభంగం కానీయక,అన్ని అవరోధాలను,ఆయన శక్తి అయిన పరమేశ్వరి,లోకపాలన,దుష్ట శిక్షణ ,శిష్ట రక్షనాది సర్వ కార్యకలాపములను,తానే  వహిస్తూ అమ్మగా పరిపాలిస్తున్నది . శ్రీ మహా విష్ణువును అమ్మవారి ప్రతిరూపంగా భావించడం మనకు తెలిసినదే . ఇదే ఒక శరీరం,ఒక వ్యక్తిగా భావించి నపుడు ,ఎన్నో జన్మల కృషితో బలపడిన,ఆధ్యాత్మిక పరిధిని కాపాడుకోవలసిన బాధ్యత తప్పక అంతరంగ చతుష్టయానిదే . ఆధ్యాత్మిక పరిధి పరమాత్మగా భావిస్తే ,దాని కంచెగా అంతరంగం జీవాత్మ పరిధిగా భావించ వచ్చు .
     బాల్యంలో తల్లి ,బిడ్డను కాపాడినట్లు ,సర్వం బ్రహ్మ మయం,అనగలిగే ధృఢ ప్రజ్ఞ కలిగే వరకూ,అన్నిపరిస్థితులను
సోపానాలుగా మార్చి జీవ బ్రహ్మైక్యం వరకు సాగే ప్రస్థానంలో , అంతరంగం యొక్క పాత్ర చాలా ప్రధాన మైనది . అందు వల్లనే అమ్మవారిని ,త్రిమూర్తులకు జననిగా ప్రతిపాదించి ఉండవచ్చు .జీవ బ్రహ్మైక్యం ,అర్ధ నారీశ్వరమే .శరీర పరిధిని అతిక్రమించిన పరమాత్మ తత్వానికి ,రెండవది లేక మిగిలే సత్తా స్వరూపం విభజనకు అతీతమైనది.ప్రతి జన్మలోను ,అంతర , బాహ్య పరిధులను అతిక్రమించక,అంతా పరమాత్మదనే నిస్సందేహమైన ధృఢ [భక్తి] లేదా యుక్తిని గ్రహించి ,జన్మ పరంపరలనే ,సంసార సాగరాన్ని దాట వలసిందే .వసుదేవుడు చిన్ని కృష్ణుని తలకెత్తు కున్నట్లు ,హృదయంలో పరమాత్మ ఉంటే చాలనుకోకుండా ,తలపుల నింపితే ,స్వామి జనన ,మరణ శ్రుమ్ఖలాల చెర నుండి విడిపిస్తాడు .శ్రవణం వలన పెద్దల ద్వారా విని ,అంతా పరమాత్మదని పదే ,పదే భావించడం యుక్తి . అది భావించ వలసిన అవసరం లేక జీవిత విధానంగా మారడం భక్తి .
           అన్ని[కర్మ ,భక్తి ,జ్ఞాన]మార్గాలను విడిచినవారికి , తమోగుణం వలన ,ఆవరణ ,విక్షేపం బలపడతాయి .  ఇంచుమించు ఒక మతానిది ఇదే దారి.కొంత రజోగుణం పెంచి మా మతంలో జన్మించిన వారికే భూమి మీద జీవించే హక్కు  ఉంది,అని యుద్ధానికి దిగేదే రెండోమతం. సృష్టిలో యుద్ధంతో సంపాదన,అనేది క్రూర మృగాలకు సంబంధించిన విధానం.అవి సాధారణంగా సాధుజంతువులను,ఆహారంగా సృష్టి ధర్మంగాతింటున్నాయి.కానీ ఒక సింహం, రెండోదాన్ని తినదు .అలానే సత్వ గుణ ఆధారంగా ఏర్పడిన వర్గీయులను బాధించడం ,క్రూర చర్య అనిపించు కుంటుందే కానీ ఏమాత్రం మానవత్వానికి సంబంధించింది కాదు . రెంటికి భిన్నంగా గుణాతీత స్థితిని సాధించడానికి సత్వగుణాన్ని సాధనంగా పరిచయం చేసింది వేదం . ఇది మతం కాదు . ధర్మం . అన్ని జీవులు ,చెట్లు ,కొండలు అన్నింటికి ధర్మాలుంటాయి . అటువంటి ధర్మం,జనన మరణ చక్రం నుండి ,విడి పడడానికి  మార్గాన్ని చాలా విస్కృత పరిధిలో ఎన్నో ప్రయోగాలను , దాన్నించి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను ఇస్తూ ,పిల్లలని ఒక తరగతి నుండి పైతరగతికి సునాయాసంగా చేర్చినట్లు మానవులను ఉత్తమ గతికి చేర్చేదే వేద మార్గం . పిల్లలు ఒక తరగతినుండి వేరొక తరగతికి చేరినప్పుడు ,వారికి ప్రజ్ఞ పెరుగుతుంది . అంతే కాని బట్టీ పట్టినట్లు పాఠాలు గుర్తు ఉండవు , అలానే పరిణతిని బట్టి వారిని గమ్యం వైపు నడిపేదే వేద మార్గం .దైవనికున్ననామరూప బేధాలను అధిగమించి,అంతటా పరమాత్మను చూసే స్థాయికి చేరిన వారికి,పరాయి అనేదే లేదు.దీంట్లో మతంలో కలుపుకోవడము లేదు. వేరే వారితో యుద్ధమూ లేదు .దీనికి వేద మార్గనుయాయులు సత్యాన్ని అలానేసత్వ గుణాన్ని ఆశ్రయించారు 
         దీన్ని చాతకాని తనంగా భావించడం  మూఢత్వం ,అనడం మూర్ఖత్వం .నామరుపాలను పక్కకుపెట్టి సాధన చేపట్టి నిజానిజాలను గుర్తించేదే వేద పధం .దీనికి గుర్తు కోసం పెట్టుకున్నదే 'హిందూ మతం'అనేపేరు.తత్వ ప్రాధాన్యాన్ని గుర్తు పట్టాలే కానీ నామరూపాలతో,ఎంత తల బాదుకున్నా సమయ నష్టమే గానీ మిగిలేదేమిలేదు .
       ఓం నమో వేంకటేశాయ .ఎన్నో ప్రతిబంధకాలు సాధనలో సహజం .తను తప్పు చెయ్యకున్నా తనను,ప్రపంచం తప్పుగ అర్ధం చేసుకుందన్న బాధ సహజంగానే చాలామంది విషయంలో ఎదురయ్యే పెద్ద సమస్య . న్యాయా న్యాయాలు , సత్యా సత్యాలు విచారించి ఎంత తలపట్టుకున్నా సమాధానం దొరకదు . ఇవి మాట్లాడినా పట్టించుకునేవారు ,అర్ధం చేసుకోగలవారు దొరకడం దుర్లభం . ఇందులో సాధనను మింగేసే ఆలోచనలు చివరకు సాధకుని వెర్రి ముఖం వేసేలా చేస్తాయి .
       తిరుమలలో సింహద్వారం దాటి లోపలికి వెళ్తున్నపుడు ,అనంతాళ్వార్ గునపం కుడివైపు ద్వారం పక్కన కనిపిస్తుంది .ప్రతిసాధకునికి కలిగే ప్రశ్నకు సమాధానం చెప్తున్నట్లు.స్వామి లీలా వైభవంలోని విషయంగా అనుగ్రహించిన ఈ సంగతి ఎంతో మందికి ఊరట నిస్తుంది. భగవంతుడు కూడా సహాయం చేసి, అనంతాళ్వార్ చేత గునపపు దెబ్బకు గురయ్యాడు. ఇది ఉదా హరణగా తాను కూడా గడ్డం మీద గడ్డపార గుర్తు చూపించి ,గుర్తు సహజమేనని తన భక్తులకు బోధిస్తున్నట్లు అర్ధం చేసు కోవచ్చు . భగవంతుడు భక్తుని అనుగ్రహించి నందుకు గుర్తుగా దీన్ని తీసుకున్నా ,తెలుసుకున్న భక్తులకు ,ఆలోచించి బాధ పడకు ,నాకన్నీ తెలుసు అని అభయ ప్రదానం చేస్తున్నట్లు గ్రహించి ,చిత్తం శ్రీనివాసునిపై నిలిపి సమయాభావాన్ని దాటవచ్చు.
       శ్రీ మహా విష్ణువు, ముక్తి ప్రదాత అనేది అందరి విశ్వాసం . సకల సంపదలను శివుడిస్తాడనే నానుడి ఉంది . కొద్దిగా పరి శీలిస్తే ,వర్తమానంలో మాత్రమే ఆత్మానుసంధానం సాధ్యం . అదే ముక్తి పధం . వర్తమానం విష్ణు స్వరూపం కనుక ,విష్ణువును ముక్తి ప్రదాతగా ,శాస్త్రాలు పరిచయం చేసాయి . పురాకృత కర్మ ఫలంగా మాత్రమే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది . భూతకాలానికి అధిపతి శివుడు ,అందువలన భావ దారిద్ర్యం కానీ ,ఆర్ధిక పరమైనవిగాని ,భౌతిక ,ఆధ్యాత్మిక పరమైన అన్ని బాధలను శివ అభిషేకం తొలగిస్తుందని మనకు తెలుసు .పురాకృత ఐశ్వర్యం జీవికి చేరడానికి ,అదేజన్మలో అడ్డుగా ఉన్న,పాప ప్రతి బంధకాన్ని, శివ  కరుణతో దాటితే ,ముక్తికి కలిగే ఆటంకాలు తొలగి ,విష్ణు సాయుజ్యమనే ఆత్మ ప్రాప్తి ,ఆనందంగా , అనుభవ సారంగా అందుతుంది . జన్మించిన ప్రతి వారి పరమ గమ్యం ముక్తి [జన్మ పరంపరల నుండి ]కనుక ,తరువాతి జన్మకు అవసరము ,అగత్యం లేవు కనుక ,భవిష్యత్తుకు పూజ అనేది విధించ బడక పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు . బ్రహ్మకు పూజ లేకపోవడంలోని ఆంతర్యం ఇదే . అందువలన పూజకు ,అంతరాత్మ శుద్ధి ,తనకు ముక్తిని ప్రసాదించగల శరీరం  ఇచ్చిన భగవంతునికి  కృతజ్ఞత ,ఇదే ప్రాధమిక ప్రార్ధన . ఈ రెంటికి అహం యొక్క ఆవశ్యకత లేదు . అహం శరీరాభిమానాన్ని , అడ్డు తీసుకురాదు కనుక భవిష్యత్ ప్రాతిపదిక అనేది శూన్యం . రాక్షసులు బ్రహ్మ నుండి వరాలు పొందారు అంటే, అదే శరీరం కొనసాగాలనేదే ప్రాధమిక ప్రతిపాదన . కానీ అహంను శరీరం పరిధిలో అర్ధం చేసుకోవడమే అనర్ధం.ఎప్పుడూ ఉండడం అనేది ఆత్మ లక్షణం .ఏనుగును సూది బెజ్జంలో ఎలాగైనా సరిపెట్టాలనుకోవడమే,అజ్ఞానం మాయ.
          ఒక భాండాగారం నుండి కొంత వస్తు సముదాయం ,పరిమితకాలానికి తీసుకుని,మళ్లీ అవసరాన్ని బట్టి వెళ్లి, తెచ్చు కోవడం అందరికీ తెలిసిందే . అలానే పురాకృత కర్మ భాండాగారం నుండి పరిమిత కాలానికి ,ఏ శరీరం ప్రాప్తించిందో దాన్ని బట్టి కొంత ప్రారబ్ధ కర్మాగాఅందుతుంది .ఉ దా;రైతులందరూ దాచుకున్న పంట రిసీటుని బట్టి స్టోరేజి అధికారి వారి అవసరానికి ఇచ్చినట్లు అందరికి వారివారి ప్రారబ్ధం చేరుతుంది . అంతా సమానం అనే సూత్రం ,కోటి రూపాయలు దాచిన ఆసామికి ,ఐదు వందలు దాచిన వారికీ ఒకేలా డబ్బు ఇవ్వాలనే వాదంలా ఉంటుంది . బ్యాంకు అకౌంట్ ప్రొసీజరు ఇద్దరికీ ఒకటే అయినా అందే సొమ్ము మాత్రం ఒకలా ఉండదు . అందు వలననే మానవులందరూ ఒకలాగే జన్మ ,వ్యాధి ,జరా , మరణాలకు ప్రొసీజరు ఒకటే అయినా సమాజంలో ఎన్నో విధాలైన హెచ్చు తగ్గులు కూడా అంతే సహజం . దీన్నిబట్టి ఎవరి పరిధి వారిది .
          మరణం అసహజం ఏ మాత్రం కాదు . సరుకు తెచ్చుకోడానికి మళ్లీ గోడౌనుకు వెళ్లి రావడమే .శరీరం మారినా మళ్లీ అదే కహానీ . తెచ్చుకునే సరుకు పాంచ భౌతిక దేహం ,దాని ఉపభోగాలుగా కూడా ,వేరే రూపంలో ఉన్న పంచ భూతాలు .నామ,రూప బేధాలే కానీ అన్నీపంచ భూతాలే .అందువల్లనే మన్మధునికి ఐదు బాణాలు .మోహం పాంచ భౌతికంమాత్రమే.మన్మధుడు లక్ష్మీ పుత్రుడు.అమ్మవారి వర్తమాన రూపం లక్ష్మి.వర్తమానంలో మనం కోరుతున్నది  పొందుతున్నది పంచ భూతాలనే . అంతే కాదు భవిష్యత్తు అనే ఉచ్చు కూడా పాంచ భౌతికమే కానీ వేరే కోరేది లేదు ,ఎవరూ ఇచ్చేది లేదు . దీన్ని కోరుతున్నది ,పొందుతున్నా అనుకుంటున్నది ,ఎరుకగా తెలుస్తున్న అహం అనే కర్త మాత్రమే .అహం అనేదాన్ని శరీర  పరం అనుకునే వ్యామోహమే జన్మకు ఆగామి అనే ,భవిష్యత్ జన్మకు కారణం .
         దీనికి ఉదా ;ఒక పని కంప్యూటర్లో చేస్తున్నప్పుడు ఎన్నో విండోలు ఎన్నో సార్లు ఓపెన్ అవుతాయి .ఒక్కొక్క విండో ఒక్కొక్క జన్మ,పని పూర్తి చెయ్యడం ముఖ్యం కానీ,అయ్యో ఈరోజు విండో రేపు రాదేఅనుకోవడం లాంటిదే మరణ భయం. అదే పనిలో పొరపాట్లు జరిగితే పని కోసం ,ఎక్కువ సమయం పడుతుంది ,ఎక్కువ విండోలు అవసరమౌతాయి .మనకో సామెత ఉంది . అయ్యవార్లింగాలు ఏం చేస్తున్నారంటే ,ఒంటిట్లో ఒలకబోసి ఎత్తుకుంటున్నారని ,అలా ఈ జన్మలోనే అంతా పంచభూత కోటి అనే విరాగం ఆవిష్కరించి,త్రిపురాసుర సంహారం[భూత ,భవిష్యత్ ,వర్తమానాలనే ]త్రిపుటిని దాటి శివోహం అనవలసిందే .
               దానికి అనుసంధానంగానే మన శాస్త్ర విషయాలన్నీ నిగూఢమైన పరతత్వాన్ని ఎన్నో సంకేతాలతో మనకు అందేలా మనముందు కధలుగాను,ఆచార వ్యవహారాలుగాను అందిస్తూ వచ్చారు పెద్దలు.ఇది కళ్ళకు గంతలు కట్టుకున్న దోబూచులాట అన్నీ మన ముందు ఉన్నాయి . కానీ తడుముకుంటూ ఒకరి వెంట ఒకరు సత్యాన్వేషణలో క్రీడిస్తున్నాము. శరీరాలు వేరైనా అందరిలో శ్రీ కృష్ణుని బాల్య క్రీడ కొనసాగుతోంది . గోపిక లందరితో ఒకేసారి శ్రీ కృష్ణుని చూపిస్తూ మనకు తెలియ జేస్తున్నదిదే.శ్రీ కృష్ణుని పరతత్వంగాను ,దానిమీద ఆధార పడిన ప్రపంచాన్ని,కంటికి వివిధంగా కనిపిస్తున్న సృష్టిని గోపికలుగాను ,శ్రీమద్ భాగవతం మన ముందుకు తెచ్చింది . సృష్టి వివిధమే . ఆధారం ఒక్కటే . సృష్టిని పంచభూత మూల తత్వంగా సంభావిస్తే ఆమె శ్రీ రాధ .గోపికలందరి గృహాలలో వెన్న తిన్న కృష్ణుని బాల్యక్రీడ తత్వ ప్రతిపాదనం . గోవులు వేరైనా పాలన్నీ ఒకటే . ప్రపంచ మంతా అలాగే ఒకటే,కానీ దానిలోని పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి  వివేచానగ్నితో [పాలను కాచి]అంతా ఒకటే అనేదానిలోని  అంతరార్ధాన్ని భావన చేసి ,కానీ ద్వేషం లేకుండా కొద్దిగా చల్లార్చికానీ ధర్మం అనే వెచ్చదనాన్ని ,తగినంత ఉంచి,భక్తిని తోడు చేసి ,సాధన అనే సమయంలో కదలిపోకుండా ,స్థిరంగా ఉండి ,బాగా మనసు అనే పాత్రలో దిట్టంగా పేరుకోనిచ్చి ,బుద్ధి అనే కవ్వంతో చిలికి ,గురువు అనే స్తంభానికి కవ్వాన్ని,బలమైన అనుసంధానం అనే త్రాటితో బిగించి ,గురువు పట్ల నమ్మకమనే చుట్ట కుదురును ,పాత్ర [కడవ]కు కదలకుండా ఆధారంగా చేసి ,కర్మఅనే చేతులకు తాడు కవ్వం మధ్యలోనే చిలికే నేర్పు నిచ్చి,తనలోని శరీరమే తననే,అహాన్ని,పాలనుండి విడిన వెన్నలా పరమాత్మకు నివేదించాలి.కానీ చిన్న క్రుష్ణునిలా పరమాత్మ మనం ఇవ్వాలని ఎదురు చూడడు . తానే తీసుకుని తింటాడు . అంటే సాధన లో అహం అనే చిన్న బిందువును ,పరమాత్మ సోహం అని స్వీకరిస్తాడు . అతడే శివోహం అంటూ తనలో తానే ఆనందిస్తాడు .
      పరమాత్మ స్వరూపం సూర్య నారాయణుడు .ఈయన రధంలో అధిరోహించి నపుడే కాలం కూడా సర్ప రూపంలో

రధం,అధిరోహిస్తుందని పెద్దలు శాస్త్ర అవగాహన ఉన్నవారు అంటారు .  ఈయనను పన్నెండు నెలలో ద్వాదశ నామాలతో పిలుస్తారు . చైత్రంలో ధాత[భాను] సూర్యుణ్ణి ,వాసుకి నామంతోకాల సర్పాన్ని పూజిస్తారు . ద్వాదశ నామాలు సూర్యునికి, అలాగే 12నామాలు కాలసర్ప రూపానికి ఉన్నాయని పెద్దలు తెలియ జేస్తారు .దీని అంతరార్ధం తీసుకుంటే రాహు , కేతు వులు,సర్ప రూపాలు ,రాహువు తల ,కేతువు తోక . ముఖానికి అధి దేవత రాహువు ,పాదాలకు కేతువు . కేతువు మోక్ష కారకుడు .ఇలా చూసినపుడు,సూర్య గమన రూపంలో కాలం జర జరా జరిగి ఎవరి చేతికి చిక్కక జారి పోతుంది .రాహువు జీవి పుట్టుక కేతువు మోక్ష ప్రాప్తి . విష్ణు పాదంగా కేతువును స్మరిస్తారు . అమ్మవారి ముఖంగా రాహువును స్మరిస్తారు . ఇలా చూసినా సృష్టిలోకి అమ్మద్వారా వచ్చినా ,వర్తమానమైన విష్ణు రూపంలో పాదం సూచిస్తున్న ఆధార రూపమైన పరబ్రహ్మ తత్వాన్ని జనన ,మరణాల మధ్యకాలంలో సాధించ వలసిందే .జీవుడు శరీర రధాన్ని అధిరోహించి నపుడే కాలం అనేది ,అతనితోపాటే పరిగణన లోనికి వస్తుంది .
       శ్రవణ ,మనన ,ఇలా సాధనా క్రమం ఉంటుంది . కానీ ఎక్కడా దృశ్యం అనేది సాధనా క్రమంలోకి రాదు .సాధకుడు దృశ్యం అనే మాయను గెలిస్తే ,శ్రవణం అనే శబ్ద స్వరూప పాంచజన్యం స్వామి నుండి సాధకుని చేరుతుంది . అప్పటివరకు దృశ్యం విష్ణుమాయగా ,జగన్మోహినిగా,జగత్తనే సురను మాత్రమే బహిర్ముఖమైన,శరీరమే తాననే,రాక్షసులకు అందిస్తుంది . దృశ్యాన్ని మాయగా ఎరిగిన విజ్ఞులకు ,అది అమృతత్వ రూపమని ,జగన్మోహిని రూపమైన విష్ణువు ,తన పాదాలను మాత్రమే చూడమని దేవతలకు సూచించాడు . పాదాలు దేనిమీద ఆధార పడ్డాయి ?ఆధార వస్తువును ఏనాడూ విడిచి ఉండవు . అంటే స్వస్వరూప ధ్యానాన్ని ఏమరక ఉంటే,విష్ణువు  అమృతత్వాన్ని తానై అందిస్తాడు .
         మంత్రాన్ని శ్రవణం ద్వారా పొందాలనే సూచన,ఈ విషయాలను తెలియజేస్తుంది .అలానే వేదాలను శ్రుతులు అన్నారు .వ్రాసి ,దృశ్యంగా మంత్రాలను తెలుసుకోవడం వలన , వాటికి విలువ లేదు .అక్షరాలను ,ఆకార మాత్రంగా చూసి వాటి ద్వారా భౌతిక విషయ పరిజ్ఞానం పొందవచ్చు గాని ,ఆధ్యాత్మిక ప్రగతికి ,ఇది సరిపోదు అనడం అక్షర సత్యం . శ్రద్ధతో గురువును ఆశ్రయించి ,వారి కరుణకు పాత్రులై ,శ్రవణం ద్వారా మంత్రాన్ని పొందడానికి ,అహం విడవాలి . ఇది నచ్చితే మంత్రాధి దేవత సంతోషంతో వాంఛిత ఫలాలను అందిస్తుంది .
       పురాణ ప్రసిద్ధ పాత్రలన్నీ భగవత్తత్వాన్ని ప్రతిపదిస్తూనే ,మానవీయ విలువలు కాపాడుకోడానికి ,do's,don'ts కూడా ప్రతిపాదిస్తా యి . ఈ దృష్టితో అవగాహన చేస్తున్నప్పుడు ,ఆ పాత్రలకున్న భాగవత తత్వాన్ని కించ పరచినట్లు పామరులు , భావిస్తారే తప్ప ,విజ్ఞులు కాదు .ఉదాహరణకి,సీతమ్మ బంగారు లేడిని కోరి నందు వలన,కోరి కష్టాలు తెచ్చుకుంది .ఇది మానవ సంబంధిత ,ఆలోచనా సరళిని ,నియమించి ,మూలకారణమైన ,కోరిక [కామ]అనేదానికి , దృష్టి అనేది ,ఎలా కారణ మౌతుందో నిరూపిస్తుంది . దృష్టిని ,బుద్ధిని ఉపయోగించి నియంత్రించి ,శాస్త్ర జ్ఞానంతో మేళవించి , పదార్ధం యొక్క మూల స్వభావంతో దాన్ని అర్ధం చేసుకుని ,మాయను గుర్తించి [స్వర్ణాన్ని గుర్తించి ,ఆభరణం అనే రూపాన్ని దృష్టి నుండి తొలగించి ]మనసును స్వాధీనంలో ఉంచి ,ఎదురయ్యే కష్టాలను అధిగమించ వచ్చు .
          నిజానికి సీతమ్మ మనో నిగ్రహం లేనిది,కనుక ఇలా జరగలేదు . రావణాసుర వధ అనే అత్యంత సూక్ష్మ ,తత్వ వివేచనకు మార్గం సుగమం చేసి ,మానవులకు మార్గ దర్శనం చేస్తున్నది .ఇంద్రియాలను ప్రేరేపించడంలో ,దృష్టిదే ప్రముఖ పాత్ర . దీని కారణం గానే ,ప్రతి పదార్ధం పట్ల ఆసక్తి కలుగుతుంది .[హిందీలో ఆసక్తి అంటే ,రాగలిగేది,అలానే జాసక్తి ,అంటే పోగొట్టగలిగేది.]నిజానికి పదార్ధాల పట్ల ఆసక్తి కూడా ,వివేచనతో ,పోగొట్టుకోవచ్చు .
           నిగ్రహించ నప్పుడు ఇంద్రియాలు ,వాటి విషయాలతో ,తాదాత్మ్యం చెంది ,అంతా శరీరానికున్నప్రజ్ఞ అనుకుని , క్రమంగా దశ ఇంద్రియాలు బలపడి ,దశాననుడై ,తాను కలిగిఉన్న సకలమూ,తన ,మానవ ప్రజ్ఞ అని భ్రమ పడి విర్రవీగడమే , దశాననుడు. వీడికైనా ,ఏదో ఒకమూల ,ఇది నిజం కాదేమో అనే భావం ,విభీషనునిలా ,ప్రశ్నిస్తూనే ఉంటుంది . కానీ అలా జీవునిచే తోసి వేయ బడినా ,జీవుని ఉద్ధరణకు ,భగవంతుని కరుణ వలన ,ప్రార్ధన రూపమై ,అతని పూర్వ పుణ్యం , ఆంజనేయునితో ,పరిచయాన్ని ఇస్తుంది .అప్పుడు సాధకుడై ,శాస్త్ర అవగాహనను,సాధనను,కృషితో పెంచి ,అంతరాత్మకు శరణాగతుడై ,క్రమంగా వానర మూక వంటి ఆలోచనలను ,క్రమ బద్ధీకరించి ,వాయువేగంతో చరించే మనసును,రామ నామమనే ,ధనుస్సుకు ,ఏకాగ్రత అనే ,బాణాన్ని సంధించి ,శబ్ద మూలాన్ని ,తెలిసి ,మౌనమనే తపస్సుతో ,స్వస్థ చిత్తుడై [జన్మ మూలమైన అజ్ఞానం ]అనే నాభిని గురిచూసి ,అంతా తన ప్రజ్ఞ అనే అజ్ఞానాన్ని ,నశింప జేసి ,మనసును, అంత ర్ముఖం చేసి ,స్వానంద మగ్నమైన ,ఆత్మా [సీత ]రాముడై రమిస్తాడు .
            రాముణ్ణి ,లక్ష్మణుడు ఎప్పుడూ అనుగమించాడు . ఇది మనకు తెలుసు . ఇలా తనంత తానుగా తత్వాన్ని స్వీకరించిన వారికి ,పరమాత్మ ధనుర్ధనుడై ,కనురెప్ప పాటుకూడా వీడి ఉండడు .వీరికి మాత్రమే పరమాత్మతో ఉన్న అనుబంధం తెలుసు నిజానికి జీవాత్మ పరమాత్మకన్నా అన్యం కాదు .ప్రతిబింబానికి ,బింబం కన్నావేరుగా అస్థిత్వం లేదు .   ఇలా మనకు రాముని శరణాగతి మాత్రమే గతి . అంత పరమాత్మదనే భావనా బలంతో సాగే వారికి అనుక్షణం,భగవంతుని రక్షణ అనుభూత మౌతూ ఉంటుంది . అమ్మవారు ,స్వామి శక్తి . ప్రపంచ రూపం . ఈ విశ్వరూపాన్ని ,రూప రహిత పరమాత్మగా,తనలో తానే లయం చేసుకుని , సత్చితానంద ,సద్రూపం పరమాత్మ .  చిద్రూపం ,సృష్టి రూపమైనది , అమ్మవారే .వీరి అబేధ స్థితిని అనుభవానికి ,తెచ్చుకునే ,సాధకుడే లక్ష్మణుడు .
         అన్నగా రామావతారంలో వచ్చిన పరతత్వం,తమ్ముడుగా వచ్చిన రూపం కృష్ణ రూపం .తానే సకలమూ నిర్వహిస్తున్నాననే భావంతోచరించే జీవతత్వం ,బలరామ రూపం.కానీ అతనికి అవగాహన లేకున్నా,సకలమూ నిర్వహిస్తున్న పరమాత్మ,అవతరించిన  కృష్ణుని మూర్తి తమ్మునిగా అలరించి ,దోబూచులాడుతూ జీవునితో ఎన్నో జన్మలలో ఎప్పుడూ అంతరమే లేక క్రీడిస్తూనే ఉన్నాడు .సోదర భావాన్ని, పరమాత్మ పరంగా అన్వయించి ,తమను తాము ,అన్నగా ఉన్నా , తమ్ముడుగాఉన్నా భగవంతుడే తమకు అండగా ఉన్నాడని నమ్మేవారిని,రామునిలా ,క్రుష్ణునిలా పరమాత్మ కాచి రక్షిస్తాడు.   దీనికి పరమాత్మ తత్వాన్ని అన్వయించి నపుడు వారి మధ్యన పొరపొచ్చాలు రావు . వచ్చినా త్వరగా సమసి పోతాయి .
        సమస్త సృష్టిని భగవంతునితో అన్వయించేదే భక్తి .ప్రతినిత్యం చేసే పూజలో ,ప్రతి సంకల్పానికి,కలిగే వికల్పాన్ని   నివారించే  గణపతిని,అమ్మవారిని అమ్మగా,శివుణ్ణి తండ్రిగా,రాముణ్ణి అన్నగా  ,కృష్ణుణ్ణి తమ్ముడుగా ,విశ్వమంతా విష్ణువుగా, ఐశ్వర్యమంతా లక్ష్మిగా ,జ్ఞానమంతా సరస్వతిగా ,దండ పాణి మనల్ని నడిపించే గురువుగా,ఇలా కనిపించేదంతా పరమాత్మే అనేదే,అనేక దేవతా మూర్తుల ఆరాధనం .విశ్వమంతా విష్ణు రూపమే .విశ్వరూపంగా కనిపిస్తున్న, సకలానికి మూలం ,పంచ భూతాలే .దీని ఆధారంగా చేసే పంచాయతన పూజలో ,విశ్వాన్నంతనీ మూల తత్వంలో లయింపచేసి,సర్వంలో పరమాత్మను అనుసంధానం చెయ్యడమే ,దీని పరమార్ధం . ఎన్నో జన్మల్లో, సృష్టితో ఉన్న అనుబంధం ,అహంతో అనుసంధానమై ,ఇది నిజం , అనేదే మనసు ఒప్పుకుంటుంది కానీ ,అంతా పరమాత్మే అంటే ఒప్పుకోదు .సృష్టిలో మూల తత్వాన్ని పరిచయం చేసి, ఆలోచింప చేసి ,నెమ్మదిగా స్వస్వరూపాన్ని,సాక్షిగా పరిచయం చెయ్యడమే ,పూజలోని ఆంతర్యం . శరీరం గాను ,ప్రపంచం గానుఉన్నది,పంచ భూతలే .ఇది మనసులో చింతన చేసినకొలదీ,చైతన్యమే స్వరూపంగాబుద్ధి నిర్ధారించి,క్రమంగా బాహ్యంలో మనసు చరించే దిశలను గమనించి , సాక్షి తత్వాన్నిఅవగాహన చేసుకుంటుంది . శరీరం ,అలానే ప్రకృతి లోని పాంచ భౌతిక పదార్ధాలు,నశించినపుడు ,చైతన్యం మినహా పోగొట్టుకున్నది ఏదీ లేదు .శరీరం పొతే అంతా పోయింది అనుకునే ,అజ్ఞానాన్ని అధిగమించేలా ,అవగాహన పెంచేదే పూజ . శరీరం మరచి నిద్రించినపుడు తానున్నట్లే ,శరీరం విడిచినపుడూ తానున్నాడు .
       విశ్వంలో అన్ని పనులూ చేస్తున్నా,తాను శారీరికంగా వేరుగా ఉన్నట్లే ,అందరూకలసి ఉన్నాతన ఉనికి,తనకు ప్రమాణ మైనట్లే,వీనిలోని సాక్షిత్వమే ,తన శరీరానికి సాక్షి . చైతన్యం శరీరానికి సాక్షి మాత్రమే. శరీరం కాదు . చైతన్యమే స్వరూపం . విద్యుత్తులా అది ఏకం ,వినియోగానికే ,వైరుద్ధ్యం.పంచభూత తత్వాన్ని అనుసంధానం చేసి , తన స్వరూపాన్ని సాక్షిగా గుర్తించడమే ముక్తి . చూస్తున్నాఏవస్తువులకూ అంటుకోని,దృక్కే పరమాత్మ .వింటున్నాఅంటున్నా,శబ్దాన్ని గమనించే సాక్షి పరమాత్మ.తింటున్నా సారం శరీరానిదే ,ఇది బావుంది ,ఇది బాగాలేదు ,అని విశ్లేషించే బుద్ధికి సాక్షి పరమాత్మ .సముద్రం , అమ్మో ఎన్ని అలలో అని భయపడదు . అలలకు విచారించదు . అలానే అన్నీ నావే అని మోహ పడదు .అలానే ప్రపంచంలో దేనికీ పొంగక ,క్రుంగక సత్యాన్వేషి  ,నిరంతర పరిశీలనా ,తత్పరుడై ఉంటాడు . సముద్రం పరమాత్మ .అలలు సృష్టి . దీనికి పరమాత్మ కన్నా వేరే అస్థిత్వం లేదు . అలలు ఎంత విబేధించినా , ఉన్నది ,పరమాత్మే .
              ఇలా పంచభౌతిక తత్వాన్ని అన్వయించి ,సృష్టిని గమనించే దిశగా సహకరించేదే ,పూజాంగమైన జపం కూడా ఒక కొలను నీటిలో ,చేతి ఉంగరం జారి పడిందనుకుందాము . దాన్ని ముందు సరిగ్గా చూడాలి . తరవాత కదా తీయడం . గాలికి నీరు కదులుతోం దనుకుందాము . చాలా నిశితంగా పరిశీలిస్తాము . ఇదే జపంలోనూ అవసరమైన సాధన . భగవత్ కృప వలన ,విశ్వం పాంచ భౌతికమని ,రెండోది లేని పరమాత్మ మాత్రమే అంతటా ఉన్నాడని ,అందులో భాగమైన ,తనలోను ప్రకాశిస్తున్నది ,పరభ్రహ్మమని బుద్ధి నిర్ధారించిన దశలో ,సాధనకు ,జపయోగం సహకరిస్తుంది . నామాన్ని ఎన్ని కోట్లు జపిం చాం ?అనేదానికన్నా, జపిస్తున్నపుడు ,సాక్షిత్వాన్ని గుర్తు పట్టామా అనే దానికే ప్రాధాన్యం ఇవ్వాలి . తెలియని దశలో చేసిన పూజ కానీ ,జపం కానీ ,అంతర్ద్రుష్టిని కలిగించడమే ప్రయోజనంగా కలిగినవి . చిత్తశుద్ధి ద్వారా ,సాక్షి తత్వాన్ని పరిచయం చెయ్యడమే ,పూజ ,జప ,కర్మల ప్రయోజనం .
          కళ్ళు మూసుకుని ,సర్వే సర్వత్ర ప్రకాశిస్తున్న చైతన్యం ,తనలోను సర్వక్రియలను నిర్వహిస్తున్నందు వలన , తన అహం అని పరచయమున్న,స్ఫురణలో ఉండి ,ఏదైనా నామాన్ని జపానికి తోడుగా తీసుకుని ,దృష్టిని కళ్ళు మూసిన కేంద్రంలోనే , మనకు తెలియకుండానే ,అది భ్రూ మధ్యం సహజంగానే ,అవుతుంది . దీని కోసం వేరే శ్రమ ఏమీ లేదు . దృష్టిని స్థిరంగా ఉంచి ప్రారంభంలో చాలా వేగంగా జపం చెయ్యాలి . వాయు వేగంతో చరించే మనసు జపవేగానికి ,ఉక్కిరి ,బిక్కిరి అయి ,ఉపిరి చాలా సార్లు కుమ్భకాన్ని ఆశ్రయిస్తుంది . ఈ దశలో దృష్టిని ,అలానే జపాన్ని గమనిస్తున్న స్ఫురణను గమనిస్తే ,అదే సర్వ సాక్షి . నిజానికి ప్రపంచమంతా ,మనలో శబ్ద ,రూపాలుగా మాత్రమే ,నిక్షిప్తమై ఉంది . రూపానికి ,  దృష్టిని ,ఏకీక్రుతం చెయ్యడం , అలానే శబ్దాన్ని , నామానికి జోడించి ,వాయు స్తంభనంలో ,మనస్సు లయించడం వలన , నీళ్ళలోని ఉంగరంలా అహం స్ఫురణ అనుభవానికి వస్తుంది . ఒకసారి పరిచయమైనా ,ఇది అలభ్య యోగం . తరువాత దీన్ని జీవితంలోని ,ప్రతి క్షణానికి అను సంధానం చేసే దిశగా చేసే సాధన ,తామరాకు మీది నీటి బొట్టు లాంటి ,ప్రపంచ రూప మైన నామ రూపాల నంటక ,సారమైన పరబ్రహ్మగా , ప్రపంచాన్ని చూసే దిశా నిర్దేశం చేస్తుంది .   
              మనకు ఒక్కరికి ఒకపేరు ,పిలిస్తే పలకడానికి . తండ్రి చేసిన నామకరణం తనని తాను గుర్తు పట్టి ,ఎవరు   పిలిచినా పలికేలా చేస్తున్నది.అటువంటిదే మనకున్న దేవతా వ్యవస్థ కూడా. ప్రపంచము,నామ,రూపాలు ఎంతవరకు నిజమని తోస్తాయో అంతవరకూ వీరి సహాయ సహకారాలు,మనం నమ్మినా, నమ్మకున్నా ఉంటాయి . మనిషి ఉన్నంతకాలం ,ఈ ప్రపంచంలోని అవసరమైన వస్తువు లన్నీ వాడుకుంటాడు . జీవనం అంటేనే సృష్టితో కలిసి జీవించడమే .   నేనివేవి వాడుకోలేదు అంటే సత్యత్వం లేదు . కానీ ఎన్ని ఉన్నా శవానికి వేటితోను సంబంధంలేదు .అంత మాత్రాన బ్రతికి ఉండగా వేటితోను సంబంధం లేదు అనడం అసహజం . అలానే మనకు తెలియని,దృగ్గోచరం కాని వ్యవస్థ లెన్నోఅటువంటిదే ,దేవతా వ్యవస్థ .  బహు రూప సృష్టి నుండి,సృష్టి నామరూపాత్మకమే  అనే దిశగా ,సృష్టి పరిధిని తగ్గించి ,నామరూపలే ప్రధాన సృష్టి అనుకుంటే,బాహ్యంతరాలలో వీటి నుండి మనసును,నిగ్రహించే దిశగా,అమ్మను ,అన్నిరూపాలను [దృశ్యపరమైన]  అవరోధాలను అధిగమించ డానికి ,విశాలాక్షి గాను,శబ్ద పరమైన అవరోధాలను అధిగ మించడానికి ,భ్రమరాంబిక గాను ఆశ్రయించి ,సాధనలో పురోగమించ వచ్చు. అన్ని దేవతా మూర్తులను ,ఒకే సూర్యునిలో ఆరాధించి ,ఏకత్వాన్ని మనసుకు నచ్చ చెప్పవచ్చు .బాలార్క బింబాన్ని ద్రుష్టి ఏకాగ్రం చెయ్యడానికి భావించ వచ్చు .ఏ భగవన్నామ మైన అన్నీ ,అ,ఉ,మ ,అనే స్వర స్థానాల నుండి రావలసిందే ,అంటే శబ్దాలన్నింటిని 'ఓం'కారంగా గుర్తించి , తనకిష్ట మైన నామాన్ని జపానికి అనుసంధానం చెయ్య వచ్చు . అన్ని రూపాలను గుర్తిస్తున్న చూపు ఏకమని గుర్తెరిగి , ఇష్టమైన దేవతా మూర్తిని ,అన్ని రూపాలను చూపే వెలుగుగా ,తెలిసి అరుణ సూర్య బింబాన్ని ధ్యానించ వచ్చు .          
            ధ్యానం పరమార్ధం మనసును ఎక్కడ ఏకీకృతం చేసాము ?అనేదానికన్నా ఏకాగ్రత అనే అంశం ,మీద ధ్యాస  ఉంచితే ,సాక్షిత్వమే ఏకాగ్రత అనేది అనుభవానికి అందుతుంది .సాధన అనే దిశలో ఎన్నో ఆరాధనా విధానాలు ,ఎన్నో నామాలు వీటితో మనసు,తన ప్రాతిపదిక అయిన ,వివిధత్వాన్ని చేజారి పోకుండా కాపాడు కుంటూ ఉంటుంది .ఎంతో సాధన చేస్తున్నట్లు నటిస్తూ ,ప్రపంచాన్ని ఎప్పుడూ చుట్టి వస్తూ ఉంటుంది . దొంగను ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తే ,ఆచోటు తప్ప ప్రపంచమంతా పరిగెట్టించి నట్లు ,నిశితంగా పరీక్షించి గమనిస్తే దొంగలా దొరికి పోతుంది . అది అసలు లేదు . లేని ఉనికిని కాపాడుకోడానికి నామ రూపాలను మన ముందుకు తెచ్చి ,ఏదో ఉందని భ్రమింప చేస్తుంది .నిజానికి నామ,రూపాలే మిధ్య.  ప్రపంచం ,నామ రూపాల నుండి విడిపోతే ,పరబ్రహ్మమే .
               నిరాకార పరతత్వం శివలింగంగా పరిచయం చెయ్యబడుతున్నది.శక్తిని అధిష్ఠించి [పానవట్టం] కలిసి ఉన్నా , నిరాకారాన్నిసూచిస్తూ . సాకారరూప సృష్టిని సూచిస్తూ ,  పరమాత్మను గమ్యంగా సృష్టికి పరిచయం చేస్తూ ,శివుని అధిష్టిoచి ,కనిపిస్తున్నది ,శక్తి యొక్క సాకారమనే సృష్టి రూపం . అమ్మ యొక్కలలితా రూపం , శివుని అధిష్టించి సృష్టిని  సూచిస్తున్నది . సృష్టికి మాత్రమే ,స్థితి అనే మరో రూపం అవసరం ,అదే లలితా దేవి యొక్క ,విష్ణు రూపం . నిజానికి స్థితి మాత్రమే ప్రతివారి అనుభవంలోను ఉన్నది . జనన ,మరణాలు ఎవరి అనుభవానికి అందవు . అందు వల్లనే విష్ణువే విశ్వము . ప్రతివారు స్థితి పరంగా విష్ణు రూపులు . స్త్రీలు లలితా రూపులు . పురుషునికి తన సహచరి మాత్రమే లక్ష్మి అంశ . మిగిలిన స్త్రీలు విష్ణు సోదరి అయిన లలితా రూపాలే . తల్లి ,తండ్రులు శివ ,శివానీలే .
            పరమాత్మను విడిచి పెట్టడం కుదరని పని . సృష్టిని పట్టుకోవడము వీలుకాదు . వీటిని వ్యతిరేకంగా చూడడమే  సృష్టి . ఉన్న పరమాత్మను ఉనికిగా ఎరుగక ,నామరూపాలతో ఎప్పటికీ ఉండాలనే తపనే మాయ . అలానే మౌనము , మాట ,స్వరూపంగా శివుడు ,పార్వతి . కళ్యాణం గమనిస్తే , అలాంటి కొత్త జంటను ఒకరి నొకరు , విడిచి ఉండలేని స్థితిని  గమనిస్తే ,ఇది ఒకరిలో ఐతే ఎప్పటికీ నిలిచి ఉంటుంది . ఎలాగంటే ,అంతరంగం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది . వింటున్న మౌనాన్ని గుర్తు పడితే ,ప్రతి వ్యక్తీ ,తనలో తానే రమించే జంటే .
       బాహ్యంలో ద్రుష్టి సారిస్తే ,ఒక కారు డ్రైవ్ చేస్తున్నాం అనుకుందాం . అన్ని మార్జిన్లూ గమనిస్తాం . కానీ ఈ శరీరం
అనే వాహనాన్ని నడుపుతున్న ,జీవితమనే బాటలో ,తారస పడిన వారందరితో సరైన దూరాన్ని పాటిస్తున్నమా అనేది ఎవరికి వారే అర్ధం చేసుకుని నెమ్మదిగా గమ్యాన్ని చేరాలి . ప్రతివారి వాహనంలో వారొక్కరే ఉన్నారు . తోడుగా ఉన్నది పరమాత్మ మాత్రమే .డ్రైవింగ్ నేర్చుకునే నేపధ్యంలో ,ట్యూటరుకు కూడా పూర్తి అవకాశం , ప్రక్క సీటులో ఉన్నా సంపూర్ణంగా ఉంటుంది . స్టీరింగ్ చేతిలో ఉన్నా కంట్రోల్ మాత్రం ట్యూటర్ చేతిలో ఉండడం తెలిసిందే . అలానే శరీర రధం లోని ,జీవాత్మ ,పరమాత్మ, కూడా . దీన్ని నడుపుతున్న సమయంలో ,పరమాత్మ ,జీవుని కర్మ ఫలంగా ఏర్పడిన శరీరాన్ని అతని పూర్వ పుణ్య ,పాప ఫలాల్ని అందించే దారిలో తానే ,నడుపుతున్నాడు . కానీ కనిపిస్తున్న శరీర తాదాత్మ్యం వలన జీవి , ప్రతి పని ,తన నిర్వహణే అనుకుని మళ్లీ ,మళ్లీ తనకు తానే కర్తృత్వ అభిమానాన్ని పొంది ,జన్మ పరంపరకు శ్రీకారం చుట్టుకుంటున్నాడు . నిజానికి జీవుని ప్రతి ప్రయాణానికి పూర్తి బాధ్యత పరమాత్మ మాత్రమే భరిస్తున్నాడు . ఇది తెలిసి కర్త్రుత్వాన్ని విడిచి ,గమ్యం చేరవచ్చు .
                       వేరెవరు ఈ వాహనంలో ప్రవేశించ లేరు . ఈ ప్రపంచమంతా శబ్ద ,రూపాలే ,అంతరంగంలో .
బాహ్యంలో పంచ భూతాలే .కృష్ణుడు తను నడుపుతున్న రధంలో నరుడున్నాడని తెలిసి రధాన్ని నడిపాడు . మనల్ని నడిపిస్తున్నానని ఆయనకు తెలుసు . కానీ మనం ,మన అంతరంగంలో కదులుతున్న ,అన్ని నామరూపాలు పరమాత్మవే అనిగ్రహించి జీవించినపుడు ,మనంకూడా శివునికి వృషభంలా ,విష్ణుని గరుడునిలా సేవించిన వారమోతాము .
       జ్ఞానీ ,అజ్ఞాని బేధాన్ని యిలా చూద్దాం . ఒక సోలార్ స్ట్రీట్ లైట్ రాత్రి వెలిగితే దాని అర్ధం పగలు సూర్య రస్మిని
గ్రహించిందని . అలానే శరీరం పనిచేస్తోందంటే ,చైతన్యమే ఆధారం . జ్ఞాని తనను తాను పగటి కాంతిలోని దీపంలా
భావిస్తాడు . కానీ అజ్ఞాని తనంతతానుగా వెలిగిపోతూ అన్నిటినీ ప్రకాశింపజేస్తున్న చైతన్యంగా ,తనను తాను భావిస్తాడు . నిజానికి అవగాహనా లోపమే గాని ,వీరి మధ్యన ఏ బేధము లేదు .
       సృష్టిని కాన్వాస్ పైని చిత్రంలా చూస్తే ,ఎన్ని సార్లు వేసి తుడిచినా ఏ మార్పు లేని నిరాకార చైతన్యమే శివరూపమైన , ఆధారమైన  కాన్వాస్ . అన్నిరంగులు ,హంగులతో అలరిస్తున్న అమ్మ సృష్టి ,అద్భుత చిత్రలేఖనం .
తనున్నాననే స్ఫురణకు తానే సాక్షి . అదే అందరిలోని నిరాకార రూప స్వర్ణ సమానం . పైకి కనిపిస్తున్న వివిధత్వం ,
ఆభరణ రూపం . ఏ స్ఫురణ మనకు పరిచయమో ,ఆకాశ స్వరూపమైన బ్రహ్మాండమంతా అదే పరమాత్మ స్ఫురనగా
వ్యాపించి ఉంది .మన ఉనికి మన శరీర పర్యంతంగా మనకు ఎలా తెలుస్తుందో ,పరమాత్మకు విశ్వమంతా తెలుసు . అందు వల్లనే మన శరీరంలోమార్పు ఎలా తెలుస్తుందో ,అలానే మనలోని ప్రతి కదలిక పరమాత్మకు తెలుసు . భగవంతుడు లీలగా సృస్టించిన ఈ సృష్టిలో ,ఒక గొప్ప రహస్యాన్ని దాచి ఉంచాడు . అదే మళ్లీ మళ్లీ సృష్టి చెయ్యకుండా ,జీవులన్నీ తమను తాము ఎలా కావాలో అలా తమ తరువాతి జన్మకు రచయితలుగా ,వారికి ,వారే సృస్టికర్తలుగా చేస్తుంది మాయ . దీనికి పరమాత్మ నియమించిన ప్రకారం ,ధర్మ బద్ధంగా జీవిస్తే అది శ్రేయో మార్గాన్ని చూపించి పరమాత్మను చేరుస్తుంది . పై విధానాలను ఉల్లంఘించి యాత్ర సాగిస్తే ప్రేయో మార్గం ,నిమ్న యోనులందుంచి మాయగా పరిబ్రమింప జేస్తుంది . ఈ రెంటికి ఎవరి ప్రమేయమూ లేదు . ఎవరి స్వయంకృతం వారిది . అందుకే మన పెద్దలు ,ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనను రక్షిస్తుందని చిన్న వాక్యంలో చెప్పారు .
      సృష్టి అంతా ఒక మేళా అని భావిస్తే ,అందరి దృష్టి మేళా లోని వస్తువుల పైనే నిలిచి ఉంటుంది . మేళా అంటే గుడి ముందు ఉన్న వ్యాపార సముదాయాలే . గుడిలోని పరమాత్మను స్మరించేది ఎంతసేపు ?అనేది ఎవరికి వారికే తెలుస్తుంది . దీనికి వాడ వాడలా జరిగే సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలే ఉదాహరణ . అలానే సృష్టిలోని వస్తు సముదాయమే ,గమ్యంగా జీవిస్తున్న వారే మనచుట్టూ కనిపిస్తున్నారు . లేదా కొద్ది మార్పుతో ,పేరు ప్రఖ్యాతులు ,పిల్లలపై మమకారం ,ఆర్ధిక సమస్యలు ,ఇలా పరమాత్మ కాక మిగిలినవి మాత్రమే ఎక్కువ శాతం ప్రజల్లో కనిపించేవి . షష్టి తీర్ధం నిజానికి సుబ్రహ్మణ్యుని కోసం ఏర్పడింది కానీ ,అది మేళా వరకే చాలావరకు పరిమిత మౌతుంది . నిజానికి గమ్యం పరమాత్మను చేరడంగా సాగే సృష్టి యొక్క మార్గ మంతా ,పాంచ భౌతిక వస్తువుల మేళాతో నిండి ఉంటుంది . వీటి హోరులో అవే గమ్యంగా సాగుతున్న జీవితాలు ,మళ్లీ మళ్లీ అక్కడే జనన ,మరణ సుడి గుండాల్లో చిక్కుకుని ,పాంచ భౌతిక ప్రపంచమే గమ్యంగా తిరుగాడు తున్నాయి . ఇంటిని విడిచి బడికి వెళ్ళిన పిల్లలు ఎంత ఆటలు ఆడి ,ఎంత తిరిగినా ఇంటికి చేరడం ఎలా తప్పనిసరో , అలానే ఎంత పాంచ భౌతిక ప్రపంచమే కంటిముందు కనిపిస్తున్నా,తప్పక తిరిగి చేరవలసిన స్వ స్వరూపాన్నిగుర్తు పట్టనంత వరకు, తిరిగి,మాయా పరివ్యాప్త మేళా చక్ర బ్రమణం తప్పదు .
         ఆంజనేయుని ,సుందరకాండ పరిశిలిస్తే ,తన తపస్సుతో రాముని దర్శించినా ,పరమాత్మ కృపతో గమ్యమైన రామ దర్శనం జరిగినా ,తరువాత ఆంజనేయుని  సాధన అనే పర్వం  పూర్తి అయినట్లు ఎక్కడా చెప్పబడలేదు . రామ శక్తిని రామునితో కలపడమే రామాయణ సారం . అదే జీవికి రామాయణ ఉపదేశం . పరమాత్ముని చైతన్య స్ఫురణగా తెలిసినా, కనిపిస్తున్న పాంచ భౌతిక ప్రపంచం ,రాముని లీలగా తెలిసి ,దాన్ని రామునికే సమర్పించడమనే ,అంతరంగ వైభవమే హనుమంతుని ,వరిష్టమైన బుద్ధి ప్రకాశం . ఈ విషయమే మానవ జన్మకు ,మార్గ దర్శనం . దృష్టిలో ఉన్న సమస్త సృష్టి రామ మయమనే పట్టాభిషేకమే ,అసలైన సాధన .
              పంచ భూత లింగాలు మనకు తెలిసినవే . కంచిలో పృధ్వీ లింగం ,చిదంబరంలో ఆకాశ లింగం ,కాళహస్థిలో వాయులింగం ,అరుణాచలంలో అగ్ని లింగం ,జంబుకేశ్వరంలో జలలింగం . ఇలా పంచ భూతాలను లింగాలుగా పరిచయం చేశారు . నిరాకార పరతత్వాన్ని లింగరూపంగా ఆరాధించడం మనకు తెలిసిందే . అదే ప్రకారం పంచ భూతాలను , పరమాత్మ స్వరూపమైన లింగాలుగా శాస్త్రాలు ప్రకటించాయి . దీనివలన పరమాత్మను ,అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్త నారాయణ స్థితః . అనే వాక్యం ఎంతగా అనుసంధాన యోగ్యమో పెద్దలు తెలియ జేశారు . దీనివలన సర్వే సర్వత్ర పరమాత్మాను సంధానం , ప్రతివారి స్వ స్వరూపంగా  అనుభవంగా అందుకోవడానికి ,ఎంత దగ్గరగా ఉందో ,కొద్దిగా ఆలోచిస్తే ,అనుభవానికి అందుతుంది.ఈ విషయాలను అనుసంధానం చేస్తూ తనలో తాను మునిగే తపస్వికి ,అందని దూరాలు ఏమి ఉన్నాయి ?తన శరీరం గాను ,కనిపిస్తున్న ప్రపంచంగాను ఉన్న సత్తా స్వరూపం పరమాత్మ మాత్రమే . దీన్ని  ఆలోచన పరిధినుంచి జారిపోనీక , సాధన సాగిస్తే జీవాత్మ భావము ,కర్తృత్వ భావము ,మంచులా కరిగి ,నిరాకార పరతత్వం  తన స్వరూప మౌతుంది .
      పంచ భూతాలు ,పరమాత్మ రూపంగా సాగే సాధనా పరిధిలో,శరీరం యొక్క దేశ,కాలాలను అనుసరించి చరించడమే ధర్మం యొక్క సారంశం . తన పరిస్థితిని ఎవరితోనూ పోల్చుకోక ,ఎవరిని అనుకరించక ,అహమనేది పరమాత్మ ,నీడగా భావించి,దానికి ఎటువంటి ప్రత్యేకతను ఆపాదించక,అంతరంగానికి [అహం]జ్ఞాని  లేని జ్ఞానాభ్యాసానికి,బాహ్యవ్యవహారానికి  మనసుకు భక్తుడు[అహం] లేని భక్తిని,చేతలకు కర్తృత్వ భావం లేని కర్మను ,కేటాయించి ,సాక్షిగా పరమాత్మతో ఏకత్వం దిశగా వేసే అడుగులు ,స్వస్వరూపనికి సోపానాలు . ఈ సాధన పంచ భూతాలను పరమాత్మగా చూసే వారికి మాత్రమే అనుసంధాన మౌతుంది . మిగిలినవారికి అయోమయాన్ని మిగులుస్తుంది . యదార్ధ సత్యమైన అద్వైతాన్ని పక్కన పెట్టి , ధర్మ పరిరక్షణ ఎండమావి . అదే సమయంలో ప్రతిబింబానికి సత్యత్వాన్ని అంటగట్టి ,దాన్ని శరీరాధ్యాసకు జోడించి , అంతా ఒక్కటే అంటూ ,పరమ సత్యాన్ని పాక్షిక సత్యానికి అన్వయించడం ,అవివేకం . తను శరీరమనే అధ్యాస వలన మాత్రమే తనకన్నా పై స్థాయిలో వారితో పోటి అనే మానసిక స్థితి ఏర్పడుతుంది.దీనివలన చేస్తున్న పని శ్రమగా అనిపిస్తుంది . ఎంత కష్ట పడినా చేరుకోలేని తీరాలు నిస్ఫ్రుహకు గురిచేస్తాయి .ఈ సందర్భంలోనే హిందూధర్మానికి మూలమైన పునర్జన్మ సిద్దాంతం మాత్రమే మనిషికి , స్వాంతన యివ్వగలుగుతుంది . భౌతిక వాదం పేలవంగా నిలబడుతుంది . ఈ సృష్టిలోని ఆర్ధిక పరమైన , శారీరక పరమైన దేశ ,కాల పరమైన బేధాలకు , పరమాత్మ కారణం కాదు .కొద్దిగా ఆలోచిస్తే పరమాత్మకు ,తన పర , బేధం ఉండదు .
        అయితే ,మూస వంటి సృష్టి జరగాలి ,కానీ అలాలేదే . బేధాలు స్వయంకృత అపరాధాలు . అవే  రకరకాల సృష్టి
బేధాలు . అందువల్లనే మౌలికమైన ఏకత్వాన్ని పునాదిగా గ్రహించి ,బేధాలను అధిగమించే ప్రయత్నంలో , భారతీయులు కర్త్రుత్వం లేని కర్మకు ప్రాధాన్యం ఇచ్చారు .అదే ప్రాధమిక సాధన . సంపూర్ణ ప్రజ్ఞతో కర్మలను నిర్వహించి ,ఏమాత్రం అలసత్వం లేక తన వరకు వచ్చిన పనికి ఎంతో ప్రీతితో స్వాగతం పలికి ,అంతే ప్రీతితో నిర్వహించి ,పూర్తి చెయ్యడమే పూర్ణాహుతిగా సమర్పించడమే గీతా సారం కదా . ఇలా కర్తృత్వ రహితంగా చేసే ప్రతిపని యజ్ఞంగా భావించబడి , ఆగామిగా ఎటువంటి కర్మ ఫలాలను అందించక , భగవంతునికే సమర్పించబడి ,పాప నివృత్తి చేసి ,మనసును జ్ఞాన ,వైరాగ్యాలకు అనువైన దిశలో సమాయత్తం చేస్తుంది . దీనికి తల్లి ,దండ్రులు పనిని ఎంత పవిత్రంగా భావిస్తారో , చిన్నప్పటి నుండి తెలిసిన విజ్ఞులైన వారే ముందు తరాలకు అందించ గలుగుతారు .
      ఈ పై విధానానికి ఏదైనా కుల ,మత ,వివాదం లేదుకదా . దీనికి ఏవిధమైన వివాదాలు లేవే ?దీనికి ఏమంత్రాలు
వల్లించ వలసిన పని లేదు . దీన్ని ఆర్ధిక వ్యవస్థకు ప్రాతిపదిక అనవచ్చు . కర్మకు మాత్రమే ఆర్ధిక పరమైన అంశాలతో సంబంధం ఉంది . అందరికీ జీవించడానికి అవసరమైన విధానాలతో ఎవరికీ వారు ఎటువంటి విబేధాలు లేక , భగవంతునిచేరే మొదటి సోపానం కర్తృత్వ రహిత కర్మ యోగం . కర్మ జరుగుతూనే భగవంతునితో కలపడమే యోగం . జీవుడు కర్త్రుత్వాన్ని విడిస్తే దేముడు . శంకరులు జగత్తు ,జగత్తుగా మాయ . కానీ పరమాత్మగా సత్యం అన్నారు . శివోహం అన్న సిద్ధుని దృష్టిలో ,జీవుడు ,జీవుడుగా అసత్యం . దేముడుగా సత్యం . జీవాత్మ భావాన్ని పొందిన జీవి ,తిరిగి కర్తృత్వ భావాన్ని విడిచి ,పరమాత్మను చేరే మొదటి సోపానం , కర్మ మార్గం .' పైసామే పరమాత్మ '. అంటారు . జీవించడానికి అవసరమైన జీవికను కూడా పరమపద సోపానంగా మార్చుకున్నది మన సంప్రదాయం . అలా జీవించి సంపాదించిన ప్రతి రూక లక్ష్మీ స్వరూపమై ,శాంతిని ,పరమాత్మ కృపను అందించ గలుగుతుంది . ధర్మంలోని ప్రధమ మైన ప్రాతిపదిక ,తాడును పామనుకునే భ్రాంతిని తొలగించడమే . సంపాదనలోని కర్తృత్వం జగత్తులోని పాప ,పుణ్య రూపమైన ,సర్ప భ్రాంతిని పోనీక జన్మ కారణ మౌతుంది .
        దీనివలన ప్రతి దానికి ఇతరులను తప్పుపట్టి ,తను తప్పించుకునే తత్వాన్ని విడిచి తనను తాను పరిశీలించి సత్యాన్ని గమనించాలి . రూపము ,ఆయుష్యు ,సుఖ ,దుఃఖ రూప అనుభవాలు ,జీవి తన వెంట తెచ్చుకుంటాడు . దీన్ని దృష్టి నుండి జారిపోనీక ,లాభాలాభాలు ,జయాపజయాలు ,వీటికి వేరేవారిని బాధ్యులుగా మనసులో తలచక , ఓర్పుతో సహించడమే పరమాత్మకు చేసే ,కాయిక నమస్కారం .
    నిశ్చలంగా ఉన్న నీటిలో ప్రతిబింబం స్థిరంగా కనపిస్తుంది . ఏదైనా చిన్న వస్తువు నీటిలో పడినా ప్రతిబింబం చెదిరిపోతుంది. నిజానికి  ప్రతిబింబం కదలడం అబద్ధం . నీరు కదలడం నిజం . కానీ నిజానికి ప్రతిబింబము అబద్ధమే . బింబమే నిజం .ఇలాబింబ రూపమైన పరమాత్మ నిజం . ప్రతిబింబ రూప జీవ భావం కల్పన . ప్రపంచరూపమైన అద్దంలో , తన ప్రతి బిమ్బానికి ఏ వికల్పమూ లేదు . కానీ తనకు భిన్నమైన ,పాత్ర స్వభావం అనే బరువు మనసుకు తాకినపుడు ,తన మనస్సు చలించి.ఎన్నో ప్రతి స్పందనలు కదలడం సహజమే.ఇక్కడ పాత్ర అనేది,మనిషికి ఆపాదింపబడిన ,తండ్రి,కొడుకు    అన్న ,ఇలా అమ్మ ,కూతురు ,భార్య ,ఇలా ఎవర్నీ ఆపాదించని వ్యక్తికి సమస్యలు లేవు . పాత్రతో తాదాత్మ్యం ,అదే సమస్య . నిద్రలో నందానికి అనుబంధాలు అడ్డురావు . మెలుకువలో తాదాత్మ్యం లేకుండా చేసే పాత్ర పోషణ ,ఎటువంటి కర్మ ప్రతి బంధము లేక ,తన పురాకృత కర్మ ఫలాలను ,ప్రారబ్ధంగా అందించి ,మనసులో ఎటువంటి వికల్పాలు కలగనీక శమిస్తుంది . దీనిలో అహం కనుమరుగై ,బింబ రూప పరమాత్మ తత్వం ,స్వరూపంగా అందుతుంది .ఈ సాధన జ్ఞాని లేని జ్ఞానం . ఇది తనలో తాను మునిగిన ,కారణ శరీరాన్ని కరిగించే ఆత్మ నమస్కారం . ఇది అవగాహనకు అందితే మాత్రమే తరువాతి మెట్టు భక్తిలోని భక్తుడు చేసే నమస్కారం పరిచయ మౌతుంది .
        మాయ అనేది,లేనిది ఉన్నట్లు కలిగే ప్రతీతి .ఇది ఒక పట్టాన ఉదాహరణకు అందనిది . రజ్జు సర్ప భ్రాంతి , మనసుకు అందినట్లే ఉంటుంది ,కానీ అనుభవానికి దొరకదు . కానీ వ్యక్తికి ఆపాదించుకున్న పాత్ర బరువును దించినపుడు ,నిద్రకాని స్థితిలో ,దొరికే స్వస్వరూపమే ,మాయను పరిచయం చెయ్యగలదు . శరీర పర్యంతం కాని స్వరూపం అందరికీ సమానం .అన్ని జీవుల హృదయంలోను 'నేను' అనే స్ఫురణగా పరమాత్మ ప్రకాశిస్తున్నట్లు భగవద్గీత ప్రకటిస్తున్నది . నిష్కర్షగా అన్ని జీవులను పరమాత్మగా తెలిసి ,అయన సృష్టిలో ,తనంత తాను రచించుకున్న ,పాత్రను ఎటువంటి తొట్రుపాటు లేక పోషించి ,శరీరంతో బాటే రంగస్థల నిష్క్రమణమే విదేహ ముక్తి . శరీరం విడిచినా ,కలను నిజమనుకునే పసిపిల్లవానిలా , పునరపి  జననం ,స్వయంకృతం .
       భక్తికి మనసు ముఖ్యం . భావనాబలం దీనికి ఆధారం . భావనకు ఆధారం సత్య దూరం కాకూడదు . మిధ్యా , లేక, పాక్షిక సత్యాన్ని, ఆరాధనకు ఆలంబనగా కాక , నిత్య సత్య స్వరూపాన్ని భావించి అనుసంధానం చెయ్యాలి . విగ్రహం  అనే పరమ సత్య స్వరూపాన్ని గ్రహించడానికి తప్పక మూల భూత తత్వం అవగాహన తప్పనిసరి . రాతి విగ్రహం ,లోహ  విగ్రహం ,ఇలా ఏ విగ్రహమైనా ,ఆకారం ,దానికి ఆధారం రెండూ తప్పనిసరి . మనం పూజించే విగ్రహాలను అలా ఉంచితే , పరమాత్మ చేసిన సృష్టిలో పంచ భూత నిర్మిత ప్రపంచం మన కళ్ళముందు ఉన్నది . కానీ పంచ భూతాలను గుర్తించే  చైతన్యం ,వీటికి ఆధారం . నిద్రలోను , సృష్టిని గుర్తించడం అసాధ్యం . అంటే సృష్టికి ఆధారం గుర్తించే చైతన్యమే .
      అలానే మానవ కల్పిత విగ్రహానికి కూడా ,గుర్తించే తాను చైతన్య మైనట్లే ,విగ్రహము చైతన్యమే .పంచభూత తత్వం లోనిదే ఏ విగ్రహమైనా . గుర్తించే వారి చైతన్యం పరమాత్మ చైతన్యంతో ఏకీకృతం అవడమే నిజమైన పూజ . అపుడు  మాత్రమే విగ్రహం అనే భావాన్ని విడిచి అంతరంగం,జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చెయ్యగలదు.  విగ్రహ మాత్రంగా చూస్తే నిద్రలో భగవంతునితో ,భక్తుడి అనుబంధం కొరవడుతుంది . అలానే మెలకువగా ఉన్నంత వరకూ విగ్రహం ముందు  ఉండడమూ కుదరదు . కానీ పూజలో ఉన్నంత వరకూ తనలోని చైతన్యాన్ని పూజించే విగ్రహం గాను ,అలానే చైతన్యం  అఖండం కావడం ,వలన సృష్టి అంతా చైతన్య మయం అనే దృష్టి కలిగే అనుసంధానమే నిజమైన దేవతారాధన . దీని  వలన ,విశ్వం దర్పమాణ నగరమన్న శంకరుల భావం మనసుకు అందుతుంది .దర్పణం ముందు ఎన్ని కదిలినా ,ఏ ఒక్క ప్రతిబింబము దాన్ని అంటక ,కదలి పోతుంది .
          అలానే సృష్టిలోని కదలికలన్నీ పరమాత్మవన్న ధృఢ విశ్వాసం ,మనసు పైన ఎటువంటి సంస్కారాలను కలగనీక , చైతన్యం   పరమాత్మదన్న జ్ఞానాన్ని బలపరుస్తుంది .  విశ్వమంతా విష్ణువుగా ,ప్రహ్లాదుని  రక్షంచిన విష్ణువై అనుక్షణం , తనను రక్షిస్తున్న భావన మనసుకు ఆలంబనమై ,భయం విడిచి ,అంతటా పరమాత్మను చూసే  ప్రయత్నం , మనోబుద్ధులు గ్రహిస్తాయి . పూజలోని ఆంతర్యం అందుతుంది . ఇదే భక్తితో చేసే నమస్కారం .
           సాధన త్రికరణ శుద్ధిని కలిగి ఉండనప్పుడు గమ్యం చేరడానికి కాలాతీత మౌతుంది . మనోవాక్కాయ శుద్ధి
మాత్రమే కాకుండా ,ఆధారంగా సత్య ,ధర్మాలను గ్రహించినపుడు మాత్రమే పరమాత్మ కృప కలుగుతుంది . అంతటా పరమాత్మను అనుసంధానం చేస్తూ మనసు వ్యగ్రత పొందనివారు ,శాంతి స్వరూపమైన పరమాత్మగా ,ఆత్మ రూపంగా ఉన్న స్థితిని అనుభవంగా గ్రహించి ఉంటారు .
        అందు వల్లనే ఒకటే సాధన అయినా ,గమ్యం కూడా ఒకటే అయినా ,సమయం మాత్రం అందరికీ ఒకేలా వర్తించదు .ఒకే సాధనలోని తారతమ్యాలు అధిగమించడానికి ,సత్యాధారిత ,జీవిత గమనం అవసరం .దీనికి ప్రాధాన్యత కొరవడి నపుడు సాధనలోని ప్రగతి మనసుకు అందదు . ఆత్మ ,పరమాత్మగా ప్రకాశించడం అనేది అనుభవంగా అందడమే గమ్యం . అది భోజనం చేసినవారి తృప్తి వంటిది . కానీ ఒకసారి అనుభవమైన అంతరార్ధం , తిరిగి సందేహాలకు తావివ్వదు . అందువల్లనే జీవిత విధానాన్నే,సాధనగా మలుచుకోనేదే ,భారతీయ ప్రస్థానం . అంతేకాని ఒక జపమో ,యజ్నమో ,ధ్యానమో ,ఇందులోని వన్నీ కలిపినా ,నిత్య జీవిత విధానం మనసును ప్రభావితం చేసి ,గమ్యాన్ని తెరచాటు చేస్తుంది .సంపూర్ణంగా సృష్టిని పాంచ భౌతిక ,స్వాప్నిక కల్పనగా ,గుర్తెరిగి ,రాగ , ద్వేషాలను  మనసుకు అందించక ,ప్రపంచాన్ని వేదికగా భావించి ,తన ఎదుటి పాత్రలను గుర్తించి ,అనుగుణమైన భావాలను ,కర్మలను ,వారికందించి ,తనపాత్ర పోషిస్తున్న ,స్పృహ నెరిగి ,దేనిని సత్యమని భావించక ,కానీ తాను వహిస్తున్న ,పురాకృత కర్మ ఫలితమైన జీవనాన్ని ధర్మ బద్ధంగా దైవ పుజాగా ,గ్రహించి ఆత్మ ,పరమాత్మగా మాత్రమే సత్యమనే పధాన్ని ,మనసు నుండి జారిపోనీక ,గమ్యాన్ని చేరాలి .
            అది దూరము కాదు ,దగ్గరా కాదు . అది తనే . తనకన్నా వేరైన దాన్ని పొందవచ్చు . కానీ తానే అయితే , నిద్ర నుండి మేల్కొన్నట్లే . సరి అయిన అవగాహన కొరవడి నప్పుడు ,ఆత్మ ,పరమాత్మ ఒకటే కనుక , తాను పరమాత్మయే అని ,శరీర సబంధం లేని ,పరమాత్మకు ,తన శరీర తాదాత్మ్యాన్ని అంటగట్టి ,దేమునిలా తనను ,తాను పరిచయం చేసే ,మానసిక వికృతికి ,చోటివ్వక ,మౌన వ్యాఖ్యా ప్రకటిత పరమాత్మ తత్వంగా ,తనలో తానే మునగాలి .

   సృష్టిలోని ప్రతి కణము సోమ స్కంద మూర్తియే . జీవులు తాము కర్తలమని భావనతో చేసిన పనులకు ,తామే ఫలితాలను పొందడ 
మనేది నిత్య సత్యం . ఎన్నో జన్మల అజ్ఞాన కారణంగా ఏర్పడిన కర్మ భారాన్ని ,తొలగించుకోడానికి ,శరీరం మాత్రమే 
సాధనం . కర్తృత్వ భావనయే సుబ్రహ్మణ్యుడు . వీనికి అవసరమైన శరీరం అనే ఉపాధిగా ,శివుడు శరీరం గాను ,చైతన్యంగా శివాని ,అర్ధ నారీశ్వర రూపంతో జీవులకు ,సహకరిస్తున్నారు . ఇది సృష్టి [శరీరం]ఆవిర్భావానికి ,తల్లి తండ్రుల కలయిక . 
ఇది బ్రహ్మ తత్వానికి ప్రతీక . భూమి మీదకు వచ్చిన ,అమ్మ యిచ్చిన శరీర రూపమే వినాయకుడు . జీవి యొక్క పూర్ణ రూపం ,శివ కుటుంబమే . 
     సృష్టిలో ఉన్నంత కాలము, విష్ణు రూపమే . కనుక రూపానికి ముందు ఉన్నది ,సృష్టి గాను ఉన్నది ,'శివాయ విష్ణురూపాయ , విష్ణురూపాయ శివాయ నమః'. సృష్టి లోనికి వచ్చినవానికే మొక్షాపేక్ష . తనలో మునిగి ఎవరికి ,       మోక్షమో ,తెలుసుకున్న వారికి ,సృష్టి అంతా మోక్ష రూపమే . ఉపాయం ఒక్కటే . శరీరంగా అనుభవంలో స్తున్నది ,  శివ ,పార్వతులుగా గుర్తెరిగి ,తెలుసుకుంటున్న సాక్షి ,అనేవాడికి ఉనికే లేదని ,వర్తమానం లోని క్షణంలో లయమై ,విశ్వమంత  విష్ణువై ,పరమ శాంతిని పొందాలి .
  సంక్షిప్తంగా వ్రాయడం వలన face book లో ఈ విషయాలు పొందుపరుస్తున్నాను .