11, జులై 2016, సోమవారం

నామరూపాలు

 
 నామరూపాలు 
       నామరూపాలు,ఖేదాన్ని కాక మోదాన్ని ప్రసాదించే విద్య మోక్షవిద్య . సర్వమ్ విష్ణు మయం జగత్ . కనుక 
నామరూపాలు కూడా విష్ణు రూపమే . భగవంతునిచేత రూపొందించబడిన విగ్రహాలే నామరూపాలు . వాటికి పరంపరా 
ప్రాప్తిత కర్మల ఫలాలతో కలిపి చూడక ,చైతన్యవంతమైన విగ్రహాన్ని మాత్రమే చూసి చేసే సేవ ,మాధవసేవ . దీనివలన 
క్రమంగా నామరూపాలు చైతన్యమనే ఎరుక బలపడుతుంది . దీనికి మానవ సేవ పేరుతో చందాల అవసరం లేదు . తాను 
ప్రపంచంలో తనుకాక ఎవరితో మెలిగినా అదే స్పృహ కలిగి ఉండాలి . దీనివల్ల క్షమాది షట్క సంపత్తి ఏర్పడుతుంది . దీనివలన మానవ సంబంధాలు బలపడతాయే కానీ చెదిరిపోవు . అంతే కానీ ,నామరూపాలతో ప్రాప్తిత కర్మను కలిపి చూడడం వలన కామక్రోధాది దుర్లక్షణాలు కలుగుతాయి . కానీ కర్మతో ముడిపడిన అనుబంధాలు ధర్మబద్ధంగా అనుసంధానం చేసినపుడు మాత్రమే జీవనం సార్ధకత పొందుతుంది .
          నామరూపాలు ,ధ్యాన సమయంలో తన ఉనికిలో నిలువనివ్వక ,మనో సామ్రాజ్యం ఆహ్వానిస్తుంది . ఎప్పుడూ
ఖాళీ లేకుండా పరుగులు తీసే అలవాటు వల్ల ,ధ్యానం అనగానే ఆ తీరికని వాడుకోడానికి మనస్సు ఎంతో ఉత్సాహంగా
తన ప్రతిభను ప్రదర్శించి ,మాయలేడిలా భ్రమ పెడుతుంది . సీతలా శరీర పర్యంతంగా తనను భావించే అహం ,లేడివెనుకే
చైతన్యాన్ని పంపుతుంది . మిగిలినది అందరి ఎరుకలోని ,ధ్యానం అనే స్ఫురణ జారిపోవడమే జరుగుతుంది .దీనికి తోడుగా ధర్మ బద్ధమైన జీవన విధానం ,శరణాగతి ,ప్రపత్తి అనే మూడు ఆయుధాలతో ,దశానన చెరనుండి ,పరమాత్మ కృపతో
రామపత్నిగా ,రాజపత్నిగా మోక్షాన్ని జీవులు పొందవచ్చు .
      సీత ఎప్పుడు రామునిదే . అలానే సృష్టి ఎప్పుడూ పరమాత్మదే . సృష్టికి పూర్వము ,సృష్టిగాను ,సృష్టినుండి లయించిన తర్వాత కూడా . యిలా మూడుగా గాని ,జీవాత్మ పరమాత్మ యిలా రెండుగా గాని అనిపించడమే మాయ. దీనికి పెద్దలు
చూపిన ఉపమానము ,ఘట లేదా మఠ ఆకాశము . ఇవి తయారైనప్పుడు ఆకాశం ఏకమే . అవి అలా ఉన్నప్పుడూ ఆకాశమే ,కుండ విరిగినా ,మఠం కూలినా ఉన్నది ఆకాశమే . నిద్రలో ఉన్న వారికి వారు లేరనే అర్ధం లేదు . ఉన్నారు కానీ
తెలియడం లేదు . మెలకువలో తాను ఉన్నాననే స్పష్టత ఉన్నది . మెలకువ లోని స్పష్టత మాయతో కూడి ఉన్నది . దీన్ని మాయా ముక్తం చేయడం కర్తవ్యం . మాయలేడి వెంట వెళుతున్న చైతన్యం మనకు దొరకదు . అందుకే ధ్యానం . దీన్నే
ఆలోచనకు సాక్షిగా ఉండడం అంటారు . దీనికి తనలో విషయాన్ని తెలుసుకోవాలనే తపన ముఖ్యం . రోజులో ఎన్ని సార్లయినా ,ఎవరు ఆలోచిస్తున్నారు ?వింటున్నారు?చూస్తున్నారు ?అని మనసుని నిలిపితే ,మోనమే సమాధానం .
కానీ తెలుసుకుంటున్న వారుగా అక్కడ ఉన్నారు . మోనానికి అర్ధం ఉండడం . అదే ఉనికి . కానీ ఉన్నది శరీర పర్యంత
వ్యక్తి కాదు . పరమాత్మ . అక్కడే ఉంటే పరమాత్మ . దేహంతో తాదాత్మ్యం చెంది చెప్పినా ,విన్నా ,ఏం చేసినా జివి .
దీన్నే మోన వ్యాఖ్య అంటారు . మోనంలో ఉన్న చైతన్యం పరమాత్మ మాత్రమే . ఆలోచన మొదలైన క్షణం సృష్టి . సృష్టి
లేకున్నా ఉనికి ఉన్నది . కానీ ఉనికి లేక సృష్టి లేదు .దీన్ని శంకరాచార్యులవారు కోహం అని ప్రశ్నించారు . దీన్నే
రమణులు ఎవరు నేను ?అన్నారు .
   









       

6, జులై 2016, బుధవారం

వరాలు ,శాపాలు .

      వరాలు ,శాపాలు .
మనం పొందే సుకృత ఫలాన్ని ,వరమని ,దుష్కృత ఫలాన్ని శాపమని ప్రస్తుత జన్మలో పొందుతాము . ఇది అనివార్యము .
అలానే ఇబ్బందులు కలిగినపుడు జాతకాన్ని పరిశీలించి ,వాటికి పరిహారాన్ని చేయించుకోవడం పరిపాటి. కాలసర్ప దోషాలు 
పితృ దోషాలు ,ఇలా రకరకాలు ,వాటి పరిహారాలు అందరికి తెలిసినదే . వంశంలో తరతరాలు ఆస్తిలా అనుభవించే దోషాలు
ఉంటాయి . ముందు తారాలలో జరిగిన పొరపాట్లకు ,తరువాతి తరంలో ఇబ్బందులు తప్పవు . దీనికి ఉదాహరణయే
భగీరథ చరిత్ర .దీనికి భగీరధుడు ఎందుకు తపించాలి ?హాయిగా జీవితాన్ని అనుభవించ లేకనా ?దీన్ని కృతజ్ఞత అంటారు .
 రాబోయే తరాలపట్ల దయ . అందువల్లనే కదా రాముడు ఆ వంశంలో కలిగాడు . మన విషయాలకు వస్తే ,నాస్తిక వాదం
పేరుతోనో ,అశ్రద్ధ చేతనో ,నా కర్మ ఇంతే అనే నిరాశతోనో ,జీవితాన్ని అలానే గడిపెయ్యవచ్చు . కానీ ఎప్పుడో పెద్దలు చేసిన
దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం . అనేదానిలోని సాధక బాధకాలు ఒకసారి చూద్దాం . సర్వసాక్షి అయిన పరమాత్మ
అంతరంగం నుండి అన్ని పాపపుణ్యాలు లెక్క కట్టి నూతన జన్మను ఇస్తాడు . జనన మరణాల మధ్యన స్వర్గ నరకాలలో
కర్మ తూకంలో సరి సమానమైనపుడు ,తిరిగి మానవజన్మ సాధ్యం . తండ్రి తననే పుత్రునిగా పొందుతాడనేది శాస్త్రం .
అలా వంశంలో పూర్వము తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహిస్తూ మళ్ళీ అదే వంశంలో జన్మిస్తాడు వ్యక్తి . అందువలన
తనకర్మకు తానే కర్త కనుక సర్వులూ సరి అయిన ప్రాయశ్చిత్తాన్ని గ్రహించి ,పూర్వులను ,తమ తరాన్ని ,రాబోయే తరాలను
రక్షించుకోవాలి . ప్రాయశ్చిత్తానికి తగిన శరీరం పొందినందుకు భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు .