24, జూన్ 2015, బుధవారం

శ్రీ గురుభ్యో నమః

                                               శ్రీ గురుభ్యో నమః


   జగత్తు ,జగత్తుగా అసత్యం .పరమాత్మగా  సత్యం .దీని పరిపుష్టియే సాధన . కంటిని కొద్దిగా వత్తితే ఒక వస్తువు
రెండుగా కనపిస్తుంది . అలానే ఎన్నో జన్మలుగా జగత్తు ,నామరూపాలుగా మాత్రమే నిజం ,అనే వత్తిడి  వలన ,ఏకమైన
పరమాత్మ ,మనసనే కంటికి వివిధంగా మాత్రమే తోస్తున్నాడు . నిజానికి నామరూపాలు శరీరానికి బాహ్యంలో ఉన్నాయి .
కానీ వాటిని తనకు సంబందించినవిగా భావించడం ,మనసు యొక్క పరిమితి .శరీరం అనే పరిమిత వ్యక్తిత్వ భావనకు
చెందిన ,మనసు పరిధి ,దీన్ని ,అధిగమించ నివ్వదు . పిచిక అద్దంలోని ప్రతిబింబాన్ని నిజం అనుకుని ,ముందుకు , వెనుకకు  తిరిగి ,అద్దాన్ని ముక్కుతో కొడుతూ పరీక్షిస్తుంది .
       అద్దానికి ఉన్న కళాయి వలన ప్రతిబింబం ఉంది . జీవుడు తాను సృష్టిని క్రీడగా మొదలుపెట్టి ,అది నిజమని ,తను
కర్తనని ,భార వాహిగా మారి ,కర్మ బంధాలను ,తనకుతానే బిగించు కుంటాడు . కానీ ఇవి భావనా పరమైనవే కానీ నిజమైనవి కావు . దీన్నే,అద్దానికి వెనుక ప్రతిబింబానికి ఆధారమైన కళాయి ,అనవచ్చు .పిల్లలు ,తల్లిగా ,తండ్రిగా ,ఇలా  కాసేపు 
ఆడతారు . కానీ నిజం కాదని వాళ్ళకి అపుడే తెలుసు . కానీ ఎన్నో జన్మలుగా దాన్నే నమ్మిన వ్యక్తులు ,ఎప్పటికీ అదే
నిజం అని భావిస్తూ ,నిజం,కాని  సంబంధాలనే ,మాయా శృంఖలా బద్ధులై ,ఎప్పుడూ ఉన్న సహజ స్థితిని ,ముక్తి అనే
పరమాధ్బుత ఆవిష్కారం , అనే భ్రాంతిలో ,వదల వలసింది ,నామరూపాలు ,నిజమనే భ్రాంతి మాత్రమే ,అనేది మరచి ,
అలసి పోతున్నారు . ఆడి ఆడి ,అలసిన పిల్లల్లాగే .