18, ఫిబ్రవరి 2018, ఆదివారం

                                                                        సనాతనం.
                                                                       [కన్యాదానం.]
   భారతీయ సంప్రదాయంలో కన్యాదానానికి పెద్దపీట వేయబడింది. ఇదే నాలుగు ఆశ్రమాలకు పట్టుకొమ్మ అయిన
గృహస్థాశ్రమానికి ప్రారంభం. దీన్ని స్త్రీ ,పురుష పరంగా కాక ,అద్వితీయమైన అర్ధనారీశ్వర తత్వంలో అర్ధంచేసుకునే
శాస్త్ర మననంలో భాగంగా స్వీకరించాను. జీవి పుట్టిన పిదప ఆహారంతో క్రమంగా మనసు తయారవుతుంది. ఇదే కన్య. నిజానికి మనసు దేన్ని మనం కోరుకుంటే దానిలో లగ్నం అవుతుంది. ఇది అందరి అనుభవంలోని విషయం.
ఇందువల్లనే శాస్త్రం ,ధ్రువుణ్ణి ,ప్రహ్లాదుని,శ్రీరాముని సంకేతంగా చూపి బాల్యంలోనే పిల్లలకు అపరోక్షానుభూతిని
పరిచయం చేయమంటుంది. ఏ కోరిక అయినా ధ్రువుణ్ణి,ఏ ప్రశ్న అయినా ప్రహ్లాదుని,ఏ వైరాగ్యమైన శ్రీరాముని వలె,గురువును ఆశ్రయించి వారికి అనువైన విధానంలో పిల్లలకు తత్వాన్ని పరిచయం చేయడం కనీస ధర్మం.
పై వారిలో ఎవరూ సన్యాసులు కాదు,గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించారు. జ్ఞానం అంటే సన్యాసం అనేది అపోహ. తన నిజానిజాలు తను తెలుసుకోవడం భగవత్ జ్ఞానం.
     మనసు కలిగిన జీవి , దానికి తండ్రితో సమానం. అష్టవర్షాత్ భవేత్ కన్య. ఆ వయసు నుండి మనసు తండ్రి ఏది చూపిస్తే అందులో లయమవడం ప్రారంభిస్తుంది.ఇలా అన్నంతో అంటే భూమినుండి అయోనిజగా జన్మించినది,కన్య.
అందు వల్లనే జనకుని ,విష్ణుచిత్తుని ఇలా ఎంతోమందిని, అమ్మాయి తండ్రిగా పరిచయం చేసింది శాస్త్రం. ఒక సంక్లిష్ట
విషయాన్ని అందరికీ అర్ధమయ్యేలా వ్యక్తులతో నిర్మితి చేసేది నాటకం.యదార్ధమైన పరతత్వాన్ని భూమిపై , ప్రకటించి  చూపినవి ఇతిహాసాలు. కన్యకు పరమాత్మను పరిచయం చేసి అతనితో ఎప్పుడూ,నిరంతరాయంగా లగ్నమై పోయేలా చెయ్యడం తండ్రి కర్తవ్యం. అలా చేసేదే కన్యాదానం. అపుడు సీతకు అరణ్యం కూడా ఆహ్లాదం గానే ఉంది. అరణ్యం అంటే జీవితం. ఒడిదుడుకులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.ఇది బాహ్యచరణ.
    అంతరంలో తన స్వస్థితిలో కదలక,నిమిత్త మాత్రంగా కర్మాచరణ పాతివ్రత్యం.కానీ మనసు ఇంద్రియ విషయాలతో
ప్రాపంచిక విషయాలతో నిండి ఉండడం,భార్యా లోలత్వం.అంటే మనసు తాను పరిభ్రమించడానికి ,పరమాత్మయొక్క
దివ్య విభూతి అయిన కాలాన్ని నష్ట పరుస్తున్నది. దీనివలన జీవి కర్మల ఫలితంగా జన్మ పరంపరలు పొందుతాడు.
బాహ్యంలో చరించడం అంటే జీవికి కర్త్రుత్వాన్ని ఇవ్వడం,బాహ్యంలో మాత్రమే శరీరంతో కలిసిన అహం ప్రజ్ఞ ప్రవర్తిస్తుంది.అందువలన ముక్తి అసాధ్యం.అందువల్లనే బాహ్యంలో కన్యాదానం వలన ఏడు తరాలు తరిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తాయి.మనసు లయిస్తేనే కానీ పైన అనుకున్నట్లు ముక్తి అసాధ్యం.దశరథుడైన వానికి రాముడు
లభించాడు యజ్ఞంతో. సీత జనకునికి మనో రూపంగా లభించింది. వీరిద్దరి కళ్యాణం ముక్తి. అంటే పురాకృత కర్మ
అనే యజ్ఞ కుండంనుండి ఆవిర్భవించినది శరీరం,అన్నగతంగా ఏర్పడింది మనసు. ఈరెండూ కలిస్తేనే జీవన్ముక్తి.