9, జూన్ 2014, సోమవారం

సాధన

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః

సాధన

       జిజ్ఞాసువు అయిన వారికి శాస్త్ర మర్మం తెలుసుకోవాలనే తపనతో ,సాధన సాగుతుంది . అందువలన పరమాత్మ పాదాలయందు ధ్యాస ఉంచినా ,శాస్త్ర విషయాల నుండి ,అలానే తనచుట్టూ పరిసరాల నుండి అన్వయంతో పరమాత్మాను 
సంధానమే ,ఎంతో తృప్తిని ఆనందాన్ని ,ప్రసాదంగా ఇస్తుంది . ఈ దశ కారణాతీత ఆనందాన్ని పరిచయం చేస్తుంది .
                నారాయణ స్వరూపం ,స్వస్థితిని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ ,తనలో తాను ములిగే మునకతో, అంతఃకరణ స్నానంతో,సాధనకు శ్రీకారం . కుమ్భకంలో స్వస్థితిని సంభావించి ,ఆలోచన లేని స్వరూపాన్ని స్మరించి ,అదే శ్రీ మహా  విష్ణువు ప్రసాదించిన అమృతంగా గ్రహించి ,ఈ స్థితిని దూరం చేసే జగత్తుకు సంబంధించిన ఆలోచనలు , జగన్మోహినిగా తెలిసి ,విష్ణు పాద రూపమైన ,స్వస్థితిలో నిలకడ సాధించాలి . 
         ప్రతి ఆలోచన నిజానికి తననుండి ,తనను దూరం చేసేదే . దీన్ని సహించలేని స్థితి గోపికలది . దీనికి జ్ఞానం కన్నా సాధన అవసరం . ఈ సాధన మానసికమూ కాదు ,శారీరికమూ కాదు . ఎరుక మాత్రమే . అందువల్ల మాత్రమే దీనికి  జ్ఞానం అనే పేరు ,కానీ నిజానికి నామరూపాతీత స్థితి . నిజానికి ఆలోచనలే అమృత మధనంలోని ,ప్రారంభం లోని విషం . ఇవి తననుండి తనను దూరం చెయ్యడంవలన ప్రపంచం మనసుపై దాడి చెయ్యగలుగుతుంది . ఇది శివుని తెలుసుకోడానికి  బ్రహ్మ చేసిన ప్రయత్నం . లేదా పురాకృత విషయాలను తవ్వి తలకెత్తుకోవడం ,ఇది విష్ణువు మూలాన్ని ,లేదా కారణాన్ని తెలుసుకోవాలనుకోవడం . నిజానికి కార్య ,కారణాతీత స్థితి ,కాలాతీత స్థితి , స్వస్థితి .
      విష్ణువు కృపతో సాధన సాగే సమయంలో ,దాన్ని శరీరానికి ముడి పెట్టి ,తన సాధన అని అహం ప్రారంభమయ్యే క్షణమే ,గ్రహణం . దీన్ని అధిగమించేదే గ్రహణ సమయంలో చేసే సాధన . దీన్ని గుర్తు పట్టి మళ్లీ మునగడమే ,సూర్యుడు , చంద్రుడు రాహువును ,గుర్తించడం . మళ్లీ మళ్లీ ఈ గ్రహణం వస్తూనే ఉంటుంది . ఇదే సాధనకు అసలైన ప్రతిబంధకం . దీన్ని ఎంతగా గుర్తు పడితే అంతగా శరీరాధ్యాస తగ్గుతుంది .
        నిజానికి సూర్యుని ప్రతిభకు ,రాహువు అడ్డు పడగలడా ?అలానే అంతరాత్మ చైతన్యాన్ని,అహం ఎన్నటికీ కప్పి 
ఉంచలేదు .ఇది శరీరాధ్యాస మాత్రమే.మనస్సనే ప్రపంచానికి రాహువు అడ్డు వస్తున్నాడని తోస్తుంది కానీ ,సూర్యుని స్థాయి  నుండి అసత్యం .అసత్యం ఎన్నటికీ పారమార్ధిక సత్యం కానేరదు. కనుక శరీరాధ్యాస ,పాక్షిక సత్యం మాత్రమే .
         ఈ విషయామే మరో పౌరాణిక విషయంగా అనుసంధానం అవుతున్నది .పార్వతీ దేవి ,ఒకసారి శివుని కళ్ళు 
మూసిందట .లోకాలు అల్లకల్లోలమయ్యాయి .ఇది గ్రహణంగా గుర్తిస్తే ,అమ్మవారు దోష పరిహరానికై తపస్సు చేసిందట . తను పరమాత్మకు వేరుగా ఉన్నందు వల్ల జరిగిన అనర్ధాన్ని గుర్తించి ,తపించి అర్ధనారీశ్వర తత్వాన్ని పరమేశ్వరుని  నుండి వరంగా పొందింది . ఉన్న ఏకైక సత్యాన్ని ఎన్నో కోణాలతో అర్ధమయ్యేలా చేసేదే మన వాజ్ఞ్మయమంతా . అధికారి  బేధాన్నిబట్టి ఇవ్వబడిన సాధనా విషయాలే అన్నీ . పైకధ కేదార వ్రతంగా మనకు తెలుసు .
    ఏ సాధన అయినా త్రిపుటి సహజమే . అదే ఓం కారంలోని మూడు మాత్రలు . ఈ మూడు కలిసే ప్రజ్ఞా కేంద్రమే , బిందువే  తత్వం .అలానే త్రివేణి సంగమం .సరస్వతి అంతర్వాహిని .సత్యం అనంతమైనది ,ఆనంద స్వరూపమైనది,తన స్వరూపమే , ఏకమే ,అనే జ్ఞానం అంతర్వాహినిగా ,శరీరాధ్యాస వలన తెలియ బడుతున్న ద్వైతం పట్ల అవగాహన కలిగి ,మనసనే పరిధి  సృష్టిని అధిగమించ లేదు కనుక ,సృష్టిని పరమాత్మగా భక్తితో సేవించి అంటే నియమ పాలన వహించి,తనది ఏదీ లేదనే  వైరాగ్య భావం కలిగిన కర్మాచరణకు బుద్ధిని ప్రేరేపించే జీవన శైలి , సేవగా సంభావించి గమ్యాన్ని చేరాలి . భక్తి గంగ . యమున వైరాగ్యమే . ఈ మూడిటి గమ్యం సాగర సంగమమే .
       ఇదే మనకు భాగవతంలో భక్తిని ,తల్లిగాను ,జ్ఞాన వైరాగ్యాలను ,కుమారులుగాను పరిచయం చేసింది . భక్తి నుండి  మాత్రమే జ్ఞాన ,వైరాగ్యాలు కలగాలి ,లేదా అవి సరిగా గమ్యాన్ని చేర్చలేవు . వాటి ప్రాదుర్భావం ,భక్తీ నుండి మాత్రమే  సాధ్యం . జ్ఞాన వైరాగ్యాలు ముసలివారై ,తల్లి భక్తి ప్రౌఢగా భాగవతం పరిచయం చేస్తున్నది . శ్రుతుల వలన కలిగిన కేవల  జ్ఞానం వృద్ధాప్యం మాత్రమే . అది పరమాత్మానుసంధానం వల్లనే రసవంతం అవుతుంది . విష్ణువే రసో వై సః . వర్తమాన  క్షణంలో తనలో తాను మునిగి అమరు డవాలి . అలానే భక్తితో కూడిన వైరాగ్యం మాత్రమే సేవగా తరింపచెయ్యగలదు .
       యజ్నమే కర్మగా ,కర్మనే యజ్ఞంగా, భావనా బలంతో సాగే జీవిత విధానం భారతీయుల శైలి . ఎన్నో యజ్ఞాలు ,
యాగాలను శాస్త్ర బద్ధంగా నిర్వహించాలని ,ప్రతిరోజూ నిత్యాగ్నిహోత్రం నిర్వహించడం గృహస్థాశ్రమ ధర్మంగా ,శాస్త్రాలు 
శాసిస్తున్నాయి . ఒక వ్యక్తి జీవిత అవసరాలకు ,సమాజం నుండి ఎంతో వస్తు సముదాయం అవసరం . తాను సంపాదించి  వీటిని పొందుతున్నానని సహజంగా అందరూ భావిస్తారు . కానీ నిజానికి కష్టానికి కూలి చెల్లించ గలమే గాని ,దానికి  ప్రకృతి ,పరమాత్మ ,సహకరిస్తేనే అది అందరికీ అందుతుంది . నాటే గింజ ,పోషణ ,ప్రతివారికి అందే సౌలభ్యం ,వీటికి ప్రకృతికి ,పరమాత్మకు ,కృతజ్ఞతను తెలపడం మానవుల ,కనీస బాధ్యత . మిగిలిన పశు సంతతికి ఇది వర్తించదు . వాటికి అవసరాలు తీర్చుకోవడం మాత్రమే తెలుసు .కానీ అవి వాటి పరిధిని మించి వర్తించవు.వాటి తిండి వరకే పరిమిత మౌతాయి. తన పరిధిని దాటి అందరిదీ తనకే కావాలనే ,రాక్షసత్వాన్ని  విడిచి పెట్టి ,ప్రకృతి నుండి తాను తన ప్రారబ్ధం వలన పొందిన వస్తు సంచయానికి ,కృతజ్ఞతగా యజ్ఞం విధించబడింది .
        అగ్ని, మానవులు వస్తువులుగా వాడే యజ్ఞ సమిధలను ,పరమాత్మకు స్వర రూపంగా అందించే ,మంత్రాలతో కలిపి ప్రకృతికి అందిస్తుంది .ప్రకృతి ,కృతజ్ఞతను గుర్తించిన ,తన సంతానానికి సకలాన్నీ ఇచ్చి రక్షిస్తుంది . ఇది ఇలా సాగాలంటే గోవులు ,బ్రాహ్మణులూ రక్షించబడాలి . శాస్త్రం కోసం బ్రాహ్మణులు ,ద్రవ్యం కోసం గోవులు ,అందు వల్లనే శాంతి మంత్రంగా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం . యజ్ఞం కర్మాగా ఎంత పవిత్రమైనదో ,యజ్ఞ భావన అంతే పవిత్రమైనది . భగవంతునికి ,ప్రకృతికి,తన జీవితం కృతజ్ఞతను తెలిపే సాధనంగా భావించి ,దానికే అంకితమై ,అలానే దానికే అంకితమైన గో,బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యతనిస్తూ,యజ్ఞాలకు సహకరిస్తూ ,సాగించే జీవితం ,బ్రహ్మయజ్ఞంగా భావించే వారికి,యజ్ఞం సకల సంపదలను ప్రసాదిస్తూనే ,భక్తి ,జ్ఞాన ,వైరాగ్యాలను కానుకగా మానవాళికి అందించ గలదు . ఇది క్రమ ముక్తికి సోపానం .
      శాస్త్రం తన సంపాదనలోని పదవ వంతు ధర్మ కార్యాలకు వినియోగించాలని విధిని విధించింది . అలానే తనకున్న సమయాన్నీ ,శారీరిక శక్తిని అని గమనించాలి . సమయము,శక్తి కలిస్తే ధర్మం ,సంపాదన అర్ధం ,మనస్సులో ఎటువంటి వికల్పము లేకుండా ఈ మూటిని వినియోగించాలనే తపనే కామంగా,పరిశ్రమిస్తే కలిగేది చిత్తశుద్ధి . దీనివలన జ్ఞానం . ఇది మాత్రమే మోక్ష ద్వారం .
                  తనంత తానుగా నిర్వహించేది తమ కుటుంబానికి ,తమవంతు కృతజ్నతకు మాత్రమే ,బ్రాహ్మణులు     తమ ఇంటిలో నిత్య అనుష్టానం ,అగ్నిహోత్రంతో నిర్వహిస్తారు . అదే విధంగా సంకల్పిమ్చినవారికి,సహాయపడే వారికి చూసినవారికి ,చూడలేక పోతున్నామనే తపన కలిగినవారికి,వారి,వారి భాగస్వామ్యాన్ని బట్టి ,ఎవరికి ఎంత చెందాలో ,అంత అందిస్తూనే లోకానికంతటికి మేలు చేసేలా ,ఆలయాలలోను ,వీలైన స్థలంలోను యజ్ఞాలు నిర్వహిస్తారు . తమంత తాముగా సమయాభావం వల్లగాని ,ఆర్దికాభావం వల్లగాని ,ధర్మానికి కట్టుబడి తాము చెయ్యకూడదనుకుని ,ఇలాంటి ఎన్నో కారణాల వలన ధర్మ గ్లాని సంభవించకుండా,అందువలన లోకం సుభిక్షంగా ఉండాలని జరిగే యజ్ఞాలలో పాల్గొని,తమవంతు ధర్మాన్ని పాటించడం శ్రేయస్కరం .
           స్వధర్మ నిరతి ,యజ్నమే . కానీ ఒక సమృద్ధి కలిగిన వ్యక్తి ,పత్రం ,పుష్పం ,ఫలం ,తోయం ,అని ,ఎంత ఉన్నా
తన శక్తికి తగినంత ,సమాజ రూపమైన ,పరమాత్మకు సమర్పించకుండా ,లోభత్వాన్ని పొందడం ,అధర్మమే . ఎవరికి
ఈ విషయాలకు లెక్కలు చెప్పకున్నా,హృదయాంతర్వర్తికి అన్నీ తెలుసు .కనుక లోభాన్ని విడువడమూ యజ్ఞాంగమే . అలాగని ,తన కులాచారం కాని ,వేద ప్రతిపాదిత కర్మలను చెయ్యడమూ అధర్మమే . పూర్వ ప్రతిపాదిత కులాచార ,పెద్దల ద్వారా తెలిసిన , తమ పరిధి లోని విషయాలకు ప్రాధ్యాన్యత ఇవ్వాలి . సామాజిక మార్పుల వల్ల     ఎంతో ఉన్నత పదవులను పొందినా ,ఆచార వ్యవహారాలకు మాత్రం ,తమకట్టుబాట్లను పాటించి ,ధర్మ రక్షణకు సహకరించాలి .
     ఈ విషయాలను పదే ,పదే చెప్పడానికి కారణం ,ఎంతోమందికి ఉన్న కులాచారం తప్పు అనే భావం వలన , చెయ్య వలసినవి చెయ్యక పోవడం ,చెయ్యకూడనివి చెయ్యడం అనే ప్రపంచ పోకడ వలన ,పొందవలసిన ఆత్మ జాగృతికి ,తామే అవరోధంగా మారడం శ్రేయస్కరం కాదని సవినయంగా ,తెలియజేయడాన్ని ,మన్నించాలని కోరుతున్నాను . ఒక సాధారణ వ్యక్తికే తన కర్తవ్యం ,విలువలు , ఏది ఎంతవరకు సబబు , అనేది తెలుసు . అలాటిది జగన్నిర్మాత ,అంతర్యామి అయిన పరమాత్మ ,పురాకృత కర్మ ప్రకారం ,సాధన , విద్య ,ఐశ్వర్యాలను వితరణ చేసే దిశగా ,ఏర్పరచిన వ్యవస్థలో ,పూర్వ ఆచార ,సాధన పటిమకు తగిన కులాచార వ్యవస్థను ఏర్పరచడం జీవుల ఉన్నతికే . ఇప్పుడు తన స్థితిని గుర్తించి ,సాధన సాగించాలనేదే  తాత్పర్యం .ఎంతో కృషి పురాకృతంలో చెయ్యడం వలననే ,అన్ని కులాలలోను విద్యావంతులు ,ఐశ్వర్య వంతులు  ఉన్నారు ,దీనికి ఎవరు ఎంత ,పూర్వ పుణ్యంతో తెచ్చుకున్నారో దానికి ,కులంతో ,ఏ సంబంధం లేదు . వారు విద్యావంతులు ,ఐశ్వర్యవంతుల ఇంట ,జన్మించి ఆవిషయాలలో అభివృద్ధి సాధించ వచ్చు . కానీ పూర్వ భగవత్సాధన విషయం ,ఆచార సంప్రదాయాలు మాత్రమే , బ్రాహ్మణ కుల యవస్థకు మూలం .
     ఒకే రకమైన లోహంతోను ,అలానే కాగితం తోనూ ,నాణాలు ,నోట్లు ,చలామణిలో ఉన్నాయి . లోహం ఒకటే అయినా కాగితం ఒకలాంటిదే అయినా వాటి విలువలు వాటివే . రూపాయి పది రూపాయలు అని ఏ బ్రహ్మ వేత్త బాహ్య ప్రపంచంలో వర్తించడు . సరే సామాన్యుని విషయం సహజమైనదే . దీన్ని తప్పు అనడం లాంటిదే ,వర్ణ వ్యవస్థ కూడా . ఆచార కాండ దీని మీద మాత్రమే ఆధార పడింది . అంతా బ్రహ్మమయం అంతరంగానిది . బాహ్య ప్రపంచం సాకార రూప పరమాత్మ స్వరూపం.అంతరంగంలోని పరమాత్మ,మనతో మాట్లాడుతూ ,ఆడుతూ ,పాడుతూ ,నవ్విస్తూ ,ఎడ్పిస్తూ ,అన్ని రూపాలతో నర్తిస్తూ ,నర్తింపజేస్తూ ,అంతా తానేనని , అనుభవంలో జీవాత్మగా భావిస్తున్న సాధనకు ,ఎన్నో అవరోధాలను ,కరుణతో దాటించి ,అక్కున చేర్చి తనపదవి నివ్వడమే ,కుచేలోపాఖ్యానం . కానీ శరీర పర్యంతం బాహ్యంలో పరమాత్మను ,అన్ని రూపాలతో అంగీకరించి ,ఆయన ఏర్పరిచిన వ్యవస్థను గౌరవిస్తూ ,గమ్యం చేరడం కర్తవ్యం .
       పరమాత్మను చేర్చే పరమ ధర్మం ,మనిషి తనలో ,నిరంతరం సాగే క్షీరసాగర మధనంలోని రాక్షసులను , దేవతలను గుర్తు పట్టి ,దుష్టశిక్షణ ,శిష్టరక్షణ బాధ్యతను ,స్వీకరించడమే ప్రారంభ ధర్మ సోపానం.దీనికి సూచన అందితే ,అంతరంగంలో గురువు అనుగ్రహించినట్లు భావించ వచ్చు . ప్రతి వారికి బాల్యం నుండి భగవంతుని గురించిన కొంత పరిజ్ఞానం ,పెద్దలనుండి సహజంగానే వస్తుంది . నెమ్మదిగా తమలో బాహ్యం ఆకర్షించడం మొదలవుతుంది . ఉదాహరణకి ,శ్రీ రామ జయ రామ జయ జయ రామ ,అనే నామం 11సార్లు అనుకోవాలి అనుకున్నప్పుడు ,బాహ్యానికి సంబంధించిన ఆలోచనను ,తనలోని రాక్షస భావంగాను ,ఏ భావన లేని సాత్విక స్థితిని దైవ భావంగాను గమనించి నపుడు ,బాహ్య వస్తు ,వ్యవహార చింత సురా పానం గాను ,సాక్షి భావమే అమృత పానం గాను , బాగా అను సంధానం చేస్తూ ,సాక్షి చైతన్యాన్ని విష్ణువుగా,తెలిసి ,సాధన సాగితే ,మనసు అత్యవసర విషయాలను మాత్రమే గ్రహించి ,సత్వ గుణాన్ని చాలా సహజంగా స్వీకరిస్తుంది . ఇది చాలా సాధారణమైన మంచి లక్షణం కావడం వలన ,చేసే పనిలో కలిగే ఏకాగ్రత వలన ,ప్రాపంచిక విషయాల్లో కూడా అన్నిటా విజయం కలుగుతుంది . దీనికి కారణం గురుకృప ,దైవకృపగా ,గుర్తించడమే ,విష్ణువు ఆధారంగా సాగే అమృత మధనం.
తన విజయం నుండి ,ఒదిగే లక్షణాన్ని కలిగి ,అహం అనేది వంచించని స్థితిని కలిగి ,ఉండడమే ,తనలోని విష్ణువు యొక్క కూర్మావతారం . తనలో తాను మునిగి ,బాహ్యంలో చరించినా దేన్నీ అంటని సహజ స్థితికి,పరిణామమే దేవతలకు అమృతం అందడం అనేదానికి మూల కారణం . సురాపానం చేసిన వారికి అమృతం అందక పోవడమే , న్యాయం .ఒకే క్లాసులో చదివినా ,బాగా శ్రమించి చదివిన వారికీ ,అల్లరి చిల్లరిగా చదివిన వారికీ ,ఒకేలా మార్కులు వేస్తె న్యాయం కాదు కదా ? పొలంలో నాటిన గింజలుకాక ,మిగిలినవి కలుపు మాత్రమే .ప్రూనింగ్ చేసి , శ్రద్ధతో,ఎరుకతో చేసే కృషి మాత్రమే ఆహారాన్ని, ఆనందాన్ని ఇస్తుంది . లేకుంటే,ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి , అనేక క్రిమి కీటకాలు ,పాములు తేళ్ళు చేరడం సహజమే .
      తమచుట్టూ ఉన్న సమాజానికి సమయమనే ,భగవద్విభూతిని సాక్షాత్తుగా లక్ష్మిని తమవశం చేసుకోవడం సహజం .విష్ణువుని[అంటే సాక్షిని]విడిచి వుండని అనపాయిని ,లక్ష్మి ,జగన్మోహినికి [సురాపానానికి]దాసోహం అన్నవారిని,ఎన్నటికీ చేరదు .ప్రారబ్ధ వశంగా అందిన సంపదకు ,ఎదుగూ ,ఉండదు . స్వరూపమైన విష్ణు తత్వాన్ని నిరంతరం చింతన చేసే వారికి శ్రీనివాసుని అనుగ్రహం,అన్ని సద్గుణ రూపాలుగాను,మన శాంతి రూపంలోనూ సాధకుని చేరుతుంది .
                   ఎన్నో సార్లు అందరికీ ఒక మంచి పనికి పూనుకున్నపుడు ,ఎన్నో అవరోధాలు మనసుకు వికల్పాలు కలిగిస్తాయి . పూజ ,జపము ,ధ్యానము ,ఎవరికైనా సహాయము ,తీర్ధ స్నానము ,యాత్ర ,ఇలా అన్నిటికీ ముందు , అంత అవసరమా ?అనే ప్రశ్న విసిగించడం సహజమే . కానీ ఒక సత్సంకల్పానికి , పరమాత్మ కృప ,అలానే పురా
కృత పుణ్యము కారణము . దీన్నే పెద్దలు అదృష్టము అన్నారు . ఎన్ని సంపదలున్నా, శ్రేయోమార్గాన్ని చూపిన
క్షణమే కదా విలువైనది . విలువైన సంకల్పాన్నివ్వడం వరకూ పూర్వ జన్మ పుణ్యం తీసుకు రాగలదు . కానీ
చెయ్యాలనే ధృఢ సంకల్పం మాత్రం ,పురుష ప్రయత్నమే .మన ముందుకు శ్రేయోమార్గం తీసుకు రాగల అదృష్టం,
చేయించగల సామర్ధ్యాన్ని, యివ్వడంలో విఫలం అవుతుంది . తన ప్రయత్నమే తనకు సంకల్ప సిద్ధిని యిస్తుంది .
జీవితమంతా ఈ రెండింటిని ,సరిగ్గా అన్వయించడంలోనే శ్రేయస్సు దాగి ఉంది .
          పుణ్య ,పాపాలు విడదీయ లేని జంట . పాలు నీళ్ళలా . సత్సంకల్పం పుణ్యం ,విఘ్న కారణమైన ,వికల్పం
పాపం . వికల్పాన్ని ,గుర్తుపట్టి విఘ్నాధిపతిని స్మరించి ,వికల్పాన్ని విస్మరించి ,ద్వందాతీత స్థితికి చేరడానికి
సోపానంగా చిత్తశుద్ధి కరమైన ,పవిత్ర కర్మలకు ,పాలను ,నీటిని విడదీయగల హంసలా సాధన సాగించాలి .చెయ్యక
పోయినా ,పరవాలేదు . అనే వాదం వలన ,పుణ్యం వలన ముందుకు వచ్చిన ,శుభ సంకల్పం ,చిత్తశుద్ధిని ఇవ్వ
లేక ,నిర్వీర్య మౌతుంది . దీనివలన ఎన్నో జన్మల పరంపరలో కలిగిన మానవ జన్మ, తనకు  కలిగిన అవకాశాన్ని
కేవల తమో గుణ లాలసతో చేజార్చు కున్నట్లు అవుతుంది . దీనికి ఎంతో మెలకువ అవసరం . క్రమంగా మెలకువ
జ్ఞాన కారణ మౌతుంది .
           తీర్ధ స్నానం ఎంతో పవిత్రమై , సంచిత పాపరాశిని ధ్వంసం చేసి ,చిత్తశుద్ధి కారణ మౌతుంది . అలానే క్షేత్ర
దర్శనం కూడా . ఋషులు తమ తపస్సును ఆయా స్థలాలలో చేసి ,ఫలితాన్ని మానవాళి శ్రేయస్సుకు ,అక్కడ
నిక్షిప్తం చెయ్యడం వలన అవి ,ఎంతో శక్తి వంతమై పాప ప్రక్షాలణతో ,చిత్త శుద్ధిని కలిగిస్తాయి . కరెంటు యొక్క
సామర్ధ్యం అంతటా ఒకటే అని తెలిసినా ,జీరో వాట్ అతి తక్కువగాను ,1000వాట్స్ చాలా ఎక్కువ పవర్ కలిగి
ఉండడం మన పరిచయం లోనిదే . అలానే తపించిన వారి శక్తి సామర్ధ్యాలు ,ఎంతో శక్తి కలిగి ఉండడంలో ఆశ్చర్యం
ఏమీ లేదు . అంతేకాక తపస్సును త్యాగం చెయ్యడం వలన ,వారి శక్తి ద్విగుణీ  కృతం అయింది . అందువల్లనే
ఏపాటి పూజ ,జపము ,దానము ,ఇలా ఏదైనా పూర్తి అయిన వెంటనే 'కృష్ణార్పణం 'అనే గొప్ప విధానానికి మన
పెద్దలు ,పెద్ద పీట వేశారు . ఇలా చెప్పిన క్షణంలోనే తాను చేసిన పని భారం తొలగడంతోబాటు ,అహం అనేది , తాను
చేసినది సమర్పించిన భావం వలన ,చిత్తశుద్ధిని కలిగించి ,లుప్తమైపోతుంది .
              అలానే వస్త్ర ధారణ విషయం తీసుకున్నా ,ఇంట్లో తనకు హాయి నిచ్చే వస్త్రాలు ,ఆఫీసుకు తగిన వస్త్రాలు , పండుగలకు ,పెళ్ళిళ్ళకు తగిన వస్త్రాలు ,యిలా విభాగాలు అందరికీ ఉన్నాయి . అలానే పూజకు పెద్దల ద్వారా ఆచారంగా వచ్చిన వస్త్ర ధారణ వలన ,అలానే ధరించిన ,విభూది ,చందనం ,కుంకుమ వలన ,నేను ఈపనికి పరిమిత మయ్యాను ,అని మనసు స్పందిస్తుంది . అందువలన పూజకు వినియోగించే వస్త్రాలు ,మిగిలిన అన్నిటితో ,కలపక ,విడిగా ఉంచాలని ,మన పెద్దలు మనకు సూచించారు . ధరించే విధానం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది . వీటిని ఆరవేసాక ,తప్పక తడి బట్టలతో మాత్రమే తీసి ,మిగిలిన వాటితో కలపక ఉంచి ధరించడం వలన ,సత్వ ప్రకాశం కలుగుతుంది . దీన్ని పాటించిన కారణం వలన ,రజో గుణ ,తమో గుణ ప్రకోపం తగ్గుతుంది . భగవంతుని పూజకు అవసరమైన సత్వ గుణాన్ని పొందేందుకు యిది కూడా సోపానమే .
        మనస్సే తులసి.విష్ణు పాదోదకంతో పెరిగితే అంతకన్నా పవిత్రం ఏముంటుంది ?ఈతులసి కన్నాపూజార్హమైనది
ఏముంటుంది ?తులసి యొక్క విష్ణు భక్తి అపారమైనది .తులసి లక్ష్మీ స్వరూపమే.నిజానికి ప్రతి జీవి,సృష్టిలో విష్ణువే ,శక్తి లక్ష్మియే .తానంటే తనకు ఇష్టం ,ఇదే అనపాయిని లక్ష్మి అనడంలో అంతరార్ధం . నేనంటే నాకు ఇష్టం . ఇది స్వరూపస్థితి . ఇదే మనకు నిరాకారంగా [సృష్టికి ]కి ముందు అర్ధనారీశ్వరం .ప్రతి జీవిగా సంపూర్ణ అర్ధనారీశ్వరం . తనకు తాను , తనను చూడాలనే తపనే సృష్టి .అది అలా కనపిస్తే ప్రతిబింబమే కాని ,వస్తువు కాదు. ప్రతిబింబిస్తున్న వరకు,ప్రతిబింబానికి , పరిమితు లుంటాయి. అదే ధర్మం .చిన్న అద్దం ఉంది ,పెద్ద కొండ దూరం నించి అందులో పూర్తిగా ప్రతిబింబిస్తుంది . కానీ ప్రతిబింబం ఎంతవరకు నిజం?కొండ ధర్మాలు, ప్రతిబింబానికి వర్తిస్తాయా ?అలానే ప్రతిబింబ ధర్మాలు కొండకి వర్తిస్తాయా ?జీవిగా ప్రతిబింబిస్తున్న వ్యష్టి ,జీవ ధర్మాలతో సంపూర్ణం . పరమాత్మ బింబ ధర్మాలతో సంపూర్ణం . ప్రతిబింబ ధర్మాలలో భాగంగా,చిన్న బీట ఉన్న అద్దంలో కనిపిస్తున్న రెండు రూపాలే , సృష్టిలో భార్య ,భర్త . ప్రతి జంట . వేరుగా ఉన్నంత వరకే ఎవరి ధర్మాలు వారివి .కళ్యాణంతో,ధర్మ,అర్ధ,కామ మూడు పురుషార్ధాలకు ,ఒక్కటై సాగాలి .కానీ మోక్ష గామిగా, సంసారంలో ఉన్నా,సాధనకు ఒకరికి ఒకరు సహకరిస్తూ ,ధర్మాచరణ చెయ్యాలి. పిల్లల బాధ్యత పూర్తి అయ్యే వరకు , ఇంచుమించు షష్టి పూర్తితో కామ, పురుషార్ధానికి శలవు ,ప్రకటించాలి . అంటే శారీరిక ,మానసిక ,బౌద్ధిక అలసటను తగ్గించి , తమలో తామే రమించే ,బింబ రూపమైన పరమాత్మకు మనసుతో చేరువ కావాలి .
        ఈ ప్రస్థానంలో,ప్రతి వారికీ బాల్యం నుండి పెద్దలు అందించిన భక్తి బీజాలు,నెమ్మదిగా అంకురించి ,పెళ్ళితో ,ఒకరి
కొకరు సహకరించడంతో,బలంగా వృద్ధి చెంది,ఇంట్లో పిల్లలకు మార్గ దర్శనం చేస్తూనే,గమ్యమైన బింబతో సారుప్యానికి
మనసు సహకరిస్తుంది . ఈ క్రమంలో మనసు సత్వ ప్రకాశాన్ని పొందడానికి ఉపకరించేవే ,పూజ ,జపము ,ధ్యానము
పూజ కాయికం ,జపం వాచికం ,ధ్యానం మానసికం . ఇదే త్రికరణ శుద్ధి . ఈ మూడు ఏకాగ్రమై ,గమ్యం వైపు సాగాలి .
ఈ మనసే తులసి ,దీనికి అందే నీరు ,పరమాత్మానుసంధానమే , విష్ణుపాద తీర్ధం .పరమాత్ముడే గమ్యంగా సాగే ప్రతి ఆలోచన ఒక తులసి దళమే ,కానీ ఏకాగ్రత ముఖ్యం . 
     తులసి కధను ఒకసారి స్మరిద్దాం .జలంధరుని భార్య తులసి ,మహా పతివ్రత . అలానే పరమ విష్ణు భక్తి తత్పరురాలు . ఆమె పాతివ్రత్య మహిమతో కలిగిన శక్తితో ,జలంధరుడు అకృత్యాలకు పాల్పడ్డాడు . రావణాసురుని ప్రాణం నాభిలో ఉన్నట్లు ,జలంధరుని ప్రాణం ,భార్య పాతివ్రత్యంలో దాగి ఉంది . రామునికి నాభిని గురి చూడడం తప్పనట్లుగానే ,విష్ణునికి తన భక్తురాలిని అనుగ్రహించడం తప్పనిసరి . ఇది సంకేతాలతో చెప్పిన ,ఒకే వ్యక్తిలోని సాధనా రహస్యం . రాధాకృష్ణులకు వివాహం అంటే వీలుకాదు . అది సంకేతాలతో చూపే ఒకే వ్యష్టికి సంబంధించినది . ముందు ప్రస్తావించిన తానంటే తనకిష్టం . రాధా కృష్ణ తత్వం . దసేంద్రియ సహిత శరీర పరిమితంగా తనను తాను భ్రమించే జీవుడే జలంధరుడు . మనసు తనను తాను నియంత్రించుకుని పరమాత్ముని సేవించి పొందే శక్తిని , పరమాత్మ కృపగా తెలియక,తన ప్రయోజకత్వంగా భావించి లౌకికంగా,నా అంతటి వారు లేరు అని ,భక్తికి ,జ్ఞానానికి , సేవకు,అహంకారాన్ని జోడించి విర్రవీగడమే ,జలంధరుని యుద్ధం.కానీ దీన్ని నిర్జించి ,మనసును కరుణతో అనుగ్రహించి ,మనసులోని ప్రతి ఆలోచన పరమాత్మునే గమ్యంగా చేసి , తాను శరీర పర్యంత జీవి కాదని ,ఇది ప్రతిబింబం మాత్రమేనని ,శివోహం అనే దిశగా చేసే పరిశ్రమకు ,భగవంతుని ప్రేరణే , తులసిని విష్ణువు అనుగ్రహించడం .ఎన్నోసార్లు సాధన సమయంలో ,విసుగుతో సాకార రూప ,పూజ ,జప ,తపాలకు మనసు సహకరించక ,విగ్రహ స్వరూపాన్ని కేవలం ,పదార్ధ భావంతో ,చూడడమే ,తులసి శ్రీ మహా విష్ణువును శిలవు కమ్మని
శపించడం . కానీ అప్పుడు కూడా మనసును అనుగ్రహించి ,సాలగ్రామంతో బాటు తప్పక తులసి ఉండాలని , అను గ్రహించి , సదా మనస్సు పరమాత్మతో ఉండాలని సూచించేదే ,తులసి కధ .మనసే తులసి ,మనముందు ఉన్న విగ్రహ రూపమే విష్ణువు.
                         శ్రీ తులసీ ధాత్రీ సహిత కార్తిక దామోదరార్పణ మస్తు .
     
                                           

సంపూర్ణ యాత్ర 

      రామేశ్వరం ,కాశి ,రామేశ్వర యాత్రను ,పెద్దలు సంపూర్ణ యాత్ర అన్నారు . ఈ విషయాన్ని పరిశీలిద్దాం . రామేశ్వరంలో ,సంపూర్ణంగా ,శారీరిక ,మానసిక ,పాప నివారణ రూపమైన సేతు స్నాన ,సకల రామేశ్వర తీర్థ స్నానాలు 
ముగించి సేతువు నుండి రేతిని [ఇసుక ]గ్రహించి ,దాన్ని తీసుకుని కాశి చేరి ,రేతిని కాశి గంగలోను ,త్రివేణి సంగమం లోను కలిపి ,తరువాత కాశిలో 9 నిద్రలు చేసి ,త్రివేణి జలాలను తీసుకుని ,రామేశ్వరం లోని రామనాధ స్వామికి అభిషేకించడంతో 
యాత్ర సంపూర్ణ మౌతుంది . 
        స్త్రీలు తమ రజో సంబంధిత దోషాలను ,గృహస్తాశ్రమ ధర్మంలో పురుషులు వీరితో సహజీవనం చేసేటపుడు తెలిసి, తెలియక కలిగే దోష నివారణకు రామేశ్వరంలో ,ప్రత్యేక సంకల్ప పూర్వక స్నానాలు చేసి ,వారి ధర్మాన్ని అనుసరించి  పితృ తర్పణాలు ,పిండ ప్రదానాలు చేసి ,శుద్ధుడై ,ఇసుక సేతువునుండి గ్రహించి ,మూడు భాగాలుగా [కుప్పలు]గా చేసి బిందు మాధవ ,సేతు మాధవ ,వేణు మాధవ  రూపాలుగా అర్చించి ,బిందు మాధవ ,సేతుమాధవ భాగాలను అక్కడే సముద్రంలో కలిపి ,వేణు మాధవునిగా పూజించిన దానిని ,కాశి యాత్రకు భద్రపరచాలి . కాశిలో సంకల్ప సహిత స్నానాలు  ముగించి ,ఇసుకను సంగమంలో కూడా కలిపి ,కాశి గంగతో ఈశ్వరుని ,అభిషేకించి , త్రివేణి నీటిని గ్రహించి ,వాటితో  రామేశ్వరుని అభిషేకించడంతో యాత్ర సంపూర్ణ మౌతుంది .
      దీన్ని జీవిత యాత్రకు అన్వయిస్తే ,రామేశ్వరంతో యాత్ర ఆరంభం అవుతుంది. రామచరిత పరంధామునిదైనా , మానవ  జీవితానికి ఆదర్శం అవుతూనే ,ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో ,ఆ లీల నుండి గ్రహించ వచ్చు . పరమాత్మ రావణాసుర  సంహారం ,మానవుని అహంకార నాశనానికి గుర్తు . ఆ క్రమాన్ని ,సాధనగా తీసుకుని , బిందు రూపమైన జీవుని ,సింధు  రూపమైన ,విశ్వంగా అనుసంధానం చేసేదే ,సాధన . అంటే బిందువును , సింధువులో కలపడం . తరువాత ఇసుకను గ్రహించి ,అంటే భౌతిక సంపద ,శరీరంతో సహా ,మట్టితో సమానంగా గ్రహించి ,దాన్ని త్రివేణి సంగమంలో కలపాలి . ఆజ్ఞా చక్ర స్థానం త్రివేణి సంగమంగా కూడా అనుసంధానం చేస్తారు . పాంచ భౌతిక వ్యవహారాలకు ,తగినంత మాత్రమే విలువనిస్తూ ,మహా స్మశాన రూపమైన ,శరీరమనే కాశి వాసం చెయ్యాలి . నిత్యం ,అనిత్యమైన సంసారం గురించి చింతనమే శివాభిషేకం రామేశ్వరంలో . ఇలా యాత్ర సంపూర్ణం .