4, మే 2016, బుధవారం

త్రిపుటి

     సృష్టిలోని ప్రతి విషయము త్రిపుటికి అనుసంధానమోతుంది . కర్మ ,భక్తి ,జ్ఞానము . చాలా విషయాలు ,పలు మాధ్యమాల్లో వింటూ జ్ఞాన పరిపూర్ణులైనట్లుగా భావించడం ఇప్పుడు అత్యంత సహజం . అందులో మొదటిగా భ్రమింప
చేస్తున్నది ,తమోగుణ రూపమైన అహం . తన శరీర పర్యంత వ్యాప్తిత ,చైతన్యం తన స్వంతమని ,తాను దానికి
యజమానిగా భావించి ,తనకు తానుగా పొందే భావం అహం . ఇది తమోగుణ లక్షణం .
     దీనికి అనుసంధానమైన వెర్రితలలు చూద్దాం . భగవద్గీతను ప్రమాణంగా చెబుతూ ,కోరిక లేకుండా పరమాత్మను
పూజించాలి . ఆశ్చర్యంగా ఉన్నా ఒక విషయాన్ని గ్రహించాలి . నిజానికి ఇది స్థితప్రజ్ఞ లక్షణం . దీన్ని సాధనాపరంగా
చూడకూడదు . ఇది చేరిన స్థితి . శరీరాభిమానం ఉన్నంత వరకు ,కోరిక ,బాధ ,అవమానం వేధిస్తాయి . వీటిని
పరమాత్మకు చెప్పకుండా ,పూజ ముగించి ఏ కోరికా లేకుండా ఉన్నానని తనకు తాను మభ్యపెట్టుకోవచ్చు . కానీ తన
విషయాలను ఆత్మీయులతో పంచుకోకుండా ఎవరూ ఉండరు . అంటే ఓదార్పు వారి నుండి ఆశించే కదా .తనది ధర్మమైనా అధర్మమైనా ,సమర్ధించి తనపక్షాన మాట్లాడేవారితోనే కదా చెప్పేది?అంటే పరమాత్మకన్నా అధికంగా తనకు వారు ముఖ్యులు . ఇది పూర్తిగా తమోగుణ లక్షణం . తన శక్తితో తాను పనులు చేస్తున్న అహం చేస్తున్న అట్టహాసం . [కర్మ]
    పూజలో తనముందు ఉన్నది విగ్రహరూపంలో ఉన్న నిరాకార ప్రత్యక్ష పరమాత్మగా సంభావించి ,తన కష్ట సుఖాలను
ఎంతో ఆర్తిగా పంచుకునేదే పూజ . తనకు పరమాత్మ తప్ప వేరే దిక్కేలేదు చెప్పడానికి . ఇది భక్తి . ఆయనకు ,వస్తు సముదాయంతో కానీ ,మానసికంగా కానీ సమర్పించే ఉపచారాలకన్నా ,తనే తప్ప వేరే లేదనే భక్తుని భావమే భగవంతుని
ప్రసన్నుణ్ణి చేస్తుంది . [భక్తి ]దీనికి గమ్యం జ్ఞాన సిద్ధి . పరమాత్మకన్నా తనకెవరూ లేరనే ఉపాసన అన్నిటికన్నా మిన్న .
ప్రతి సందేహము తీరుతుంది . అలసట తీరుతుంది . ఓర్పు ఏర్పడుతుంది . సహనం సహాయపడుతుంది . చివరగా సర్వే
సర్వత్ర పరమాత్మగా ప్రకటితమై ,చెప్పేవాడు మిగలక ,చెప్పేవి లేని స్థితి ,స్థిత ప్రజ్ఞత్వాన్నిస్తుంది . పరమేశ్వరార్పణమస్తు .