2, అక్టోబర్ 2016, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః .
ప్రతి సంవత్సరము ,శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎంత శక్తి ఉన్నా ,ఎంతో శ్రద్ధతో అందరూ సేవిస్తారు . దురిత
నివారణ అమ్మవారి అనుగ్రహం . దురితాలలో ఎవరూ జ్ఞానాన్ని సముపార్జించ లేరు . అందువలన ఈ నవరాత్రులు
దురితాన్ని దూరం చేస్తే ,శరత్తులోని నీటిలా మనసు తేలికపడి ,జ్ఞానం వైపు చూడడానికి సాహసం చేస్తుంది . వసంత నవరాత్రులు ,సరస్వతీ అనుగ్రహంతో ,ధర్మం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి, అనే దిశా నిర్దేశం చేసే ,వ్యాపక పరబ్రహ్మ
తత్వమైన రామతత్వాన్ని ప్రకటిస్తూ, జ్ఞాన రూపంలో అమ్మఅనుగ్రహం లభిస్తుంది . కానీ ప్రకటంగా రామ నవమి
వేడుకలకు ప్రాధాన్యం . జ్ఞానం యొక్క ప్రకట రూపం ధర్మం . దురితాలతో పోరాటం అలసట కలిగిస్తుంది . సేద తీరాలంటే ధర్మాన్ని ఆలంబన చేసుకోవలసిందే .
   పరమార్ధంలో బయట మనకు కనిపించే దుఃఖాలు పోగొట్టడమనే అర్ధం ఉన్నా ,నిజమైన అమ్మ యుద్ధం దేనితో
అనే ప్రశ్న చాలా అవసరం . ఎన్నో శరన్నవరాత్రులు ,వసంత నవరాత్రులు చూశాక ,ఎప్పుడూ ఈ పోరాటం మనలో
ఆగడం లేదనేది మనం గమనించ వచ్చు.మనను గెలిపించాలని అమ్మ ఆరాటం అర్ధం ఏమిటి ? చీడ పట్టిన చేనును 
రైతు జీవ కారుణ్యం ,ఆ జీవులు మనలాంటివే అంటే ,ఆజ్ఞానం [అజ్ఞానం]రైతుకు ఎంతవరకు మంచిది ?దీన్ని
సమానత్వం అనే పేరుతొ ఎంతవరకు సహించాలి ?దీన్నే శాస్త్రంలో అసుర లక్షణం ,మంచి లక్షణాల మీద చేసే
యుద్ధంగా గ్రహిస్తే ,దీన్ని రైతుకున్న పక్షపాత ద్రుష్టి అనడం ఎంతవరకు సమంజసం ?
   సర్వత్రా వ్యాపకమైన పరమాత్మ ఎవరి పట్ల అధిక ప్రేమను కాక ,మంచి లక్షణాల [ధర్మం]పట్ల ఉన్న బాధ్యత వల్ల
సక్రమ మార్గాన్ని మనకు పరిచయం కలిగించాడనికి ,నిరాకరమైన మౌన వ్యాఖ్యను ,శబ్దరూపమైన వేదరాశిగా , అందుకోలేని  వారికి ఇతిహాస ,పురాణ రూపంగా అందించాడు ,తపించిన మునుల ద్వారా . అలా మనకు అందిన
పూజలో,నిరాకరమైన మనసు ,పరమాత్మలో లయిస్తే ,ఉన్నది పరబ్రహ్మమే . అమ్మవారు చేస్తున్న యుద్ధం ఏమిటి
అంటే ,లీలగా కనిపిస్తున్న ఈ ప్రపంచ అంతా సాలీడు అల్లిన గూడులా అంతా , పరమాత్మ నుండే వచ్చింది . అందు లోనే ఉంది . మళ్ళీ పరమాత్మలో లయమౌతుంది .ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యం . కానీ ఎప్పుడూ దీన్ని
పట్టించుకోకుండా ,తను ,తన  కష్టాలు ,నష్టాలు ,వీటిని తీర్చడానికే పరిమితమైన పరమాత్మ . కలుగుతున్న సుఖ
భ్రాంతికి , తన ప్రతాపంతో తాను సాధించిన విజయాలకు కర్తననే అహం . ఇలా సాగే జీవుని ప్రయాణంలో ,సమయం
లోపల సామాన్య సత్యాన్ని తలకెక్కించాలనే తాపత్రయం అమ్మవారిది . దీనికే ఇంత యుద్ధం . ఉన్న పరమాత్మదే
సృష్టి లోని ప్రతి అణువు . అది నాది అంటే అమ్మ ఊరుకోదు . కర్తను నేను అంటే ఎలా ?శరీరంలో శక్తి అమ్మవారిది.
సృష్టి రూపంలో ఈశ్వరుని , ఆయన శక్తిగా సంపదను గుర్తించే వరకు ఆమె యుద్ధం ఆగదు . ఈ జ్ఞానం కలిగే వరకు
ధర్మ యుద్ధం చేసి ,ఆత్మా రాముడై జీవుడు వెలగాలి .

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హిందూ ఆచార పరమార్ధాలు

   హిందూ  ఆచార పరమార్ధాలు.
హిందూ ధర్మ పరిధిని కాపాడుతూ ,ధర్మ పతాకాన్ని ఎగురవేసే బాధ్యత ,ఎక్కువగా స్త్రీలమీద ఆధార పడింది .
అమ్మగా అబ్బాయిలకు ,అమ్మాయిలకు కూడా వారి ధర్మాలను కాపాడుకునేలా చేసే బాధ్యత తల్లిదే . ఎందువల్లనంటే మగవారిని బయట పనులకు పంపి ,ఇంటి బాధ్యతను ఇల్లాలికి ,మన ధర్మం అప్పజెప్పింది . నాజూకుగా ఉండే పువ్వులను ఎండలో ఉంచము కదా . ప్రస్తుతానికి నేను వ్రాయబోయే విషయానికి ఇది చాలు .
 అన్నిటికి తాత్వికార్ధం మాత్రమే వ్రాస్తున్నాను .
1. స్త్రీ కంటే వయసులో పెద్దవారికి ఇచ్చి కన్యా దానం చెయ్యాలి . ఎందుకు ?
శక్తి స్త్రీ . అది కలిగినవాడు శివుడు . సృష్టిలో స్త్రీ శక్తికి ,పురుషుడు శివునికి సంకేతం . నిరాకార చైతన్య శివుని నుండి కదలి సృష్టిలో స్త్రీగా ప్రకృతి వచ్చింది . అంటే ఆద్యుడు పురుషుడు . అందువలన వయసులో కొంత పెద్ద అనేది గ్రహించాలి . కనుక ఆడ పిల్లలకు బొట్టు పెడతారు . అంటే ఆమె పుడుతూనే సుమంగళి . అందుకే ఒకవేళ ,[అమంగళము ప్రతిహత మగుగాక ]భర్తని కోల్పోతే కుంకుమ పెట్టుకోరు . కానీ ఎంతమంది సువాసినులు కుంకుమ
ధరిస్తున్నారో వారికి వందనాలు . ఎర్ర స్టిక్కర్లు కాదు .
2. సువాసినిలు పూజలు ,నోములు నోచినపుడు కూడా కాళ్లకు పసుపు రాసుకోరు.ఎవరికీ రాయరు . చేతికి
ఇస్తున్నారు .ఎందుకు ఆలా చెయ్యకూడదు ?
తమను తాము గౌరిగా నమ్మి, సుమంగళిని వాయనానికి ,పిలవడం అనేది వ్రతాలలో భాగం . పార్వతిగా నోములు . వ్రతాలు అన్నింటిని గౌరి దేవి మనకు పరిచయం చేసింది . అంటే ఆమె కన్యాదానం చేయబడినది . మనకు విష్ణువు
పార్వతి ,పరమేశ్వర కళ్యాణం చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉంటాము . అంటే అమ్మవారికి పుట్టిల్లు ,అన్నగాని , తమ్ముడు కానీ విష్ణు రూపుడే . పీత [పసుపు]రంగు వస్త్రాలను విష్ణువు ధరిస్తాడు . అంతే కాదు ,ధర్మానికి ప్రతీక
అయిన నంది యొక్క కొమ్ము ,భూమి మీద పసుపు కొమ్ముగా మారిందని ఐతిహ్యం . బృహస్పతి కూడా పసుపు
వర్ణం గుర్తు . అంటే ధర్మ రక్షణ చేసే స్త్రీలకు గురు అనుగ్రహం కలుగుతుంది .ఇది మాంగల్య బలానికి ఎంతో అవసరం  తాత్పర్యం ,పుట్టింటినుంచి తన అనుబంధానికి గుర్తుగా అమ్మాయి ,పసుపు ,కుంకుమ తీసుకు వస్తుంది . అంతే కాదు ఇక్కడికి [అత్తవారింటికి]  వచ్చాక సింహద్వారానికి  రాస్తుంది . అనుబంధాలు అక్కడ వరకేనని తాను దానం చేయబడి ,ఈ ఇంటికే వన్నె తెస్తాననే భావం ,అందులో ఉంది . దీనికి ఎవరికి వారు కట్టుబడి ఉన్నామా ?అని
ఆత్మ విమర్శ చేసుకోవాలి . విషయానికి వస్తే ,పసుపుతో తయారైన తోపు ఎఱుపు కుంకుమ ,ఐదవతనానికి గుర్తు .
సరే ,సుమంగళి అయిన స్త్రీ ,శివ శక్తుల కలయిక అయిన శ్రీ చక్ర బిందు రూపిణి . గౌరీ పరదేవత . రాహు గ్రహ అధి
దేవత .అంతే కాదు అమ్మవారిని చూచినపుడు ముఖపద్మం నుండి పాదాలవరకు చూడాలి . విష్ణువు లలితా ప్రతి రూపముగాను ,శివుడు ,విష్ణువు అర్ధ నారీశ్వరుడైన ,హరిహర మూర్తిగాను మనకు తెలుసు . విష్ణువును చూచి నపుడు పాదాలనుండి ,కిరీటం వరకు చూడడం పరిపాటి . అర్ధ నారీశ్వరుడైన పరమాత్మ సృష్టిలో,స్త్రీ ,పుం
రూపాలతో ప్రకాశించినపుడు ,ఆకాశ రూపంలో అంతటా ఉన్న విష్ణువే స్థితి కారుడై ,ప్రకాశిస్తున్నాడు . అంటే
విష్ణు రూపం వర్తమానం కనుక ,సృష్టిగా కనిపిస్తున్న ప్రకృతికి ,శివుని నుండి లీలగా ప్రపంచ రూపంలో కనిపిస్తున్న
విష్ణు ,గౌరీ రూపాలకు ,ఒకేసారి నమస్కరిస్తూ ,నుదుట బొట్టుపెట్టి అమ్మవారిని ,మెడకు గంధం వ్రాసి శివుని ,
అలానే పాదాలకు పసుపురాసి విష్ణువును పూజిస్తున్నామన్నమాట . ఇంత అర్ధవంతమైనది ,మనసంప్రదాయం .









19, సెప్టెంబర్ 2016, సోమవారం

దృశ్యం

దృశ్యం .
దృశ్యం అనేది మనసుమీద చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది .అలా సమాజం మీద చాలా ప్రభావం చూపింది
సినిమా .దీనివలన సంఘంలో ఎక్కువగా నాశనమైనది హిందువుల ఆచార ,సంప్రదాయాలే . దేవాలయాలు ,
కుటుంబాలు ,వారసత్వ పూజా విధానాలు ,ఎంతో ఉన్నతమైన తల్లి ,తండ్రుల న్యాయ సమ్మతమైన హక్కు ఐన
పిల్లల వివాహ విషయాలు అన్నీ,దౌర్భాగ్యపు అవలక్షణాలు సినిమా వలన అంటే ఆశ్చర్యం ఏమిలేదు . ముఖ్యంగా
బ్రాహ్మణ సమాజం తన విలువలను ,వినోదం అనే చిన్న కారణంతో పోగుట్టుకుని ,అందరిచేత దూషించ బడుతొంది .
ప్రతివారికి అవసరమైన పూజ ,జప ,యజ్ఞ కార్యక్రమాలకు వీరిని ఉపయోగించు కుంటున్న సమాజం ,వినోదానికి
బలి అయిన వీరిని చిన్నచూపు చూస్తున్నది . ఎన్నో పురోహిత కుటుంబాలు తమ వృత్తిని కాదని పిల్లలను ఉద్యోగాలకు ఎప్పుడో అర్పించారు . కానీ కంప్యూటరైజేషన్ తో ఆగని వృద్ధి నెమ్మదిగా ,రొబోటిజం వైపు అడుగులు
వేస్తోంది . ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఇప్పటికే ఎక్కువగా కనిపిస్తోంది . అదే సమయంలో పూజ ,జప, దాన,యజ్ఞ
కార్యకలాపాలు పెరుగుతున్నాయి . కానీ రెండు ,మూడు తరాలుగా వేదాన్ని వదిలినవారు ,పిల్లలను మళ్ళీ అటు
వైపు మళ్లి0చ గలరా ?పిల్లలే వారిని, మీరు నేర్చుకోలేదు కదా అంటే సమాధానం లేదు . ఈ పరిస్థితులకు కారణం
సినిమా కాదా ?yes or no ?

15, సెప్టెంబర్ 2016, గురువారం

హిందూధర్మం

హిందూధర్మం ఎంతో సనాతనమై కోట్ల సంవత్సరాలుగా నిలిచి ఉన్నట్లు మనకు నిదర్శనాలున్నాయి . రాముని కాలంనాటి ఆనవాళ్లనిబట్టి చూచినా అర్థంచేసుకోవచ్చు . త్రేతాయుగం నమ్మితే ముందు సత్యయుగం ,హరిశ్చంద్ర
చరిత్ర ,భగీరథ చరిత్ర ,అంతరంగంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ,అని అలానే నిర్గుణ ,నిరాకార చైతన్య పరబ్రహ్మ
స్వరూపమైన తనను శివోహం అని గ్రహించినా ,ఆచరణ దశలో సత్య ధర్మాలను ఆలంబనగా జీవితాన్ని నడిపిన
తపస్సంపన్నుల కనుసన్నలలో  ఊపిరి పోసుకున్న చరిత్ర ,నాగరికత, పెద్దలు అందరూ చెపుతున్నట్లుగా జీవించే విధానం పేరు హిందూ ధర్మం .ఎంతో విస్తరించిన మహా వృక్షం నీడలో సేదతీరే సమాజం హిందువులది . ఎవరికైనా
సమృద్ధి ,సహజత్వం ,చూసినపుడు కలిగే ఈర్ష్య ,ద్వేషాలే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు . ఇవే
మనకు పూర్వయుగాల్లో దశావతారాలను రప్పించిన రాక్షస ప్రవృత్తులు . కలిలో వివిధ మతాలుగా ,నాగరికతల
రూపంలో ఇప్పుడు కూడా అంతే ప్రభావం చూపిస్తున్నాయి . పులిని చూసి నక్క వాత అనేవే ఇతర మతాలు . కానీ
నక్కని చూసి పులి ఊళ లా ఉంది పరిస్థితి . ఎంతో కష్టపడి పెద్దలు అందించిన జీవిత విధానం వదులుకొని ,వెళ్లి
ఆకులు కట్టుకున్న ఆటవిక జాతుల నుంచి నేర్చుకునే కుహనా సంస్కారాలకు పెద్ద పీట వేసి ,వాళ్ళముందు
మేము కూడా చావుడప్పు వాయించగలం అని ,మృదంగ విద్వాంసుడు చెప్పినట్లు తయారయింది సమాజం .  

20, ఆగస్టు 2016, శనివారం

నామరూపాలు

నామరూపాలు
ఒక చిత్రకారుడు తనచిత్రాలలో 6చిత్రాలు ,కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యాలనే భావాలకు అనుగుణంగా అద్భుత చిత్రాలను గీశాడనుకుందాము . మనసు వాటిలో లయించినపుడు అంతే భావ స్ఫురణ కలిగి ఉండవచ్చు . కానీ
మనసు బహిర్గతమైనప్పుడు ,వీటి నిజానిజాలు గుర్తించే ప్రయత్నం చేస్తే ,నిజానికి కాగితము ,రంగులు తప్ప అన్యమేమీ
లేదు .కాగితమనే ఉనికి [existence]మీద ,గుణాలనే రంగులతో భ్రమింపజేస్తున్న సృష్టిని పరిశీలించి ,గ్రహిస్తే ఉన్నది ,నామ
రూపాలుగా వ్యక్తంఔతున్నది ,పంచభూతాత్మక ప్రకృతియే . మనసు నామరూపాలలో లయించినంత సేపు ఇది నిజమనే
అనిపిస్తుంది.కానీ గురుకృపతో జ్ఞానం ప్రకాశించినపుడు ,పరమాత్మ జ్ఞానం [ఉనికి]త్రమేప్రకాశించి,ప్రకృతిరూపమైన నామ       రూపాలు మభ్య పెట్టలేవు.చిన్న పిల్లవాడు కాగితం మీది బొమ్మను చూసి భయపడి నపుడు,పదే పదే భయపడినపుడు
తండ్రి చిత్రకారుని వలె ,కాగితాన్ని రంగులను చూపి అతని భయాన్ని పోగొడతాడు . కానీ ఇది కొంచెం పరిణతి చెందిన
వారికే ప్రయాజనం . బాగా చిన్న పిల్లలు పరిణతి లేనివారు దీన్ని అర్ధం చేసుకోలేనపుడు ,వారికి నచ్చేలా ,వేరే బొమ్మను
ఇచ్చి బుజ్జగించ వలసిందే . అవే వివిధ సాధనా మార్గాలు .
 

15, ఆగస్టు 2016, సోమవారం

అద్వైతం

అద్వైతం
           త్రిపురసుందరి . నటరాజ నర్తనానికి సాక్షి . పరమాత్మను నామరూపాత్మకంగా [సోపాధికంగా]తెలుసుకుని , త్రిపురాలయందు భగవత్ సాక్షాత్కారాన్ని గ్రహించి సాక్షిగా రమించే అమ్మ తీరు సాకార ధ్యానం . శక్తిని చైతన్యం అని దర్శించి , ఆ కదలికల లాస్యాన్ని అంతరంలో గ్రహించి ,చలించని ధృతిలో తనలో తాను మునిగిన మోని ,నిరాకార ధ్యాని .
ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . సాకార ,నిరాకార ధ్యానాల రెండింటా ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . శరీరం శివుడు ,శక్తి స్త్రీ . శరీరంలో శక్తి దాగి ఉంది . శరీరం ద్వారా మాత్రమే వ్యక్త మోతుంది . భారతీయ సంప్రదాయం ఈ విషయాన్నే స్త్రీ గోప్యతను 
పాటిస్తుందని తెలియజేస్తుంది . అంతేకాని స్త్రీని ఎక్కడా తక్కువ అని పేర్కొనలేదు .
          ఉనికి నామరూపాత్మక ప్రపంచంగాను ,చైతన్యం శక్తిగాను ,ఆనందం  మనస్సుగాను అర్ధం చేసుకుంటే ,సత్చితానందం
యొక్క సృష్టి రూపం ప్రపంచం  . సత్చితానంద బింబరూపానికి ,సృష్టి ప్రతిబింబం . ఏ ఒక్కరికి తాను ఉన్నాను అనడానికి అద్దం అవసరం లేదు .తన ఉనికికి   బింబ లక్షణాలు అన్వయించి జీవించడం ధర్మం.ప్రతిబింబ లక్షణాలతో అన్వయించడం  అధర్మం.నిరాకారమైన శివస్వరూపానికి ,సాకార విష్ణు రూపం ,ప్రారంభం .అంటే అనంతం, నామరూపాలతో వ్యక్తమైంది.అందు
వల్లనే దశావతారాది కృత్యాలు విష్ణుపరంగా వచ్చినవే.శివుడు విష్ణు కళ్యాణం చేసి నట్లు కనపడదు . విష్ణువు పార్వతి   పరమేశ్వర   కళ్యాణం చేసినది అందరికి తెలుసు .స్వస్థితిలో ఉండడమే పార్వతీ పరమేశ్వర కళ్యాణం . వీరికి శక్తి కావాలి అనే వాంఛ ఉండదు . ప్రతిబింబం తానుగా భావించినపుడు మాత్రమే ,తాను శరీర పర్యంత జీవి నని ,తన శక్తి పరిమితమైనది అని భావించి ,పరమాత్మ యొక్క నిరాకార తత్వం సాపేక్షమైనది కాదు కనుక ,శక్తి కొరకు తనకు నచ్చిన దైవరూపంతో ,తపస్సు చేసి ,అనంత శక్తిని కోరుకుంటాడు . కానీ ఇది ప్రతిబింబ జ్ఞానం కావడం వలన పరిధులు తప్పవు . కోరిక ప్రతిబింబ లక్షణం .   

3, ఆగస్టు 2016, బుధవారం

లక్ష్మి

లక్ష్మి 
   సమయము లక్ష్మీ స్వరూపము . కాలస్వరూపిణి ఆది లక్ష్మి . శుద్ధమైన మనసు[చంద్రుడు] మాత్రమే నిరాకరమైన సమయాన్ని గుర్తు పడుతుంది .అందువలన లక్ష్మి చంద్ర సోదరి .  సంకల్ప వికల్పాలు లేని సమయాన్ని లక్ష్మీ స్వరూపం అని గుర్తుపట్టిన ముని జనుల సమూహాలతో ఆవృతమైన జ్ఞాన స్వరూపిణి ,వేదాలచే స్తుతింపబడిన మోక్ష ప్రదాయిని . మోక్షము అద్వితీయమైన వర్తమానమే . ఇది ఎక్కడ ,ఎవరికి లేదు ?ఇది విష్ణు శక్తి . శ్రీ మహాలక్ష్మి . ఇంద్రియ ,మనో ,బుద్ధులు 
ఈ విషయాన్ని తెలిసి వర్తమాన క్షణాన్ని మౌనం అని గ్రహించి ఆక్షణంలో రమించేదే మోక్షం . ఇదే ధ్యానం .
       ఈ సమయాన్ని ఇంద్రియ మనో బుద్ధులు తమ ఆధీనం చేసుకుని విహరించేదే విష్ణుమాయ .కానీ కర్తవ్య కర్మ కొరకు కదలక తప్పదు . పని చేసే ఆ సమయంలో మాత్రమే దానికి సంబంధించిన వ్యవహారం కలిగి ,వేరొక పనిలో, మొదటి పని యొక్క ఆలోచనలు లేకుండా ఉండడమే ఏకాగ్రత .ఎన్ని జన్మల సంచితమైనా ఈ విధమైన ఏకాగ్రతను భంగంచెయ్యలేదు . వర్తమానంలో ఉండడం వలన , చైతన్యరూపమైన పరమాత్మ సన్నిధిలో ,పురాకృత కర్మ తన ప్రభావాన్ని కోల్పోతుంది .పురుష 
ప్రయత్నం అని పెద్దలు సూచించినది ఇదే . తన ప్రయత్నంతో ఇలాచేసే ఈ ప్రయత్నం భగవత్కృపతో సాధనగా మారడం 
ఎంతో సహజం . ధ్యానం సహజంగా కుదురుతుంది . భౌతిక ప్రపంచంలో చరించే దశలో ఏకాగ్రత సాధన . పని ఆగిన క్షణం 
శుద్ధమైన మనసు , నిరాకార సమయంలో మునగడమే ధ్యానం . అక్కడ ఉన్నది చైతన్యం యొక్క మూలం ,ఖాళీ కాదు .
మోక్షలక్ష్మి ,ఆది లక్ష్మి .
     ధాన్యలక్ష్మి-2
      ప్రపంచంలో చరించే దశలో మంచి ,చెడుల సంఘర్షణ సహజం .ఇది క్షిర సాగర మధనమే . మనసును మంచికి
ప్రేరేపించి కార్యసాధన చేయాలి . దీనినే దేవతల గెలుపు అన్నారు . దేవతలంటే ఇష్టమని ,రాక్షసులంటే అయిష్టమనే అర్ధం కాదు . పిల్లల దుష్ప్రవర్తన ఎవరూ సహించరు . అలానే మనసు చేసే మాయలో చెడుకి సహకరించక ,మంచిని ఎంచుకుని
సాగడం దేవతల గెలుపు . ఈ సాధన వలన సమయం అనుకూలిస్తుంది . అంటే లక్ష్మి కృప కలుగుతుంది .సాధన పరంగా
దీన్ని అర్ధం చేసుకోవాలే కానీ ,ఆర్ధిక పరంగా ఆలోచించి నిరాశ పడకూడదు . జన్మ పరంపరలనుండి దాటించే కృప కన్నా
ఐశ్వర్యమేముంది ?సమయమనే సముద్రంలో వ్యాపించి వసిస్తున్న మహాలక్ష్మి ,మనకు సర్వ సమృద్ధిని కలిగించే ధాన్యలక్ష్మి.
నిజానికి ,చిన్నప్పుడు బుద్ధిగా సమయాన్ని వినియోగించి సాగించిన అధ్యయనమే ,తరువాత ఆర్ధిక సమృద్ధిగా అంది వస్తుంది . అంటే సమయమే సమృద్ధి . అందుకే అమ్మ ధాన్యలక్ష్మి .
  ధైర్యలక్ష్మి -3
   ఎప్పుడైతే సమయపాలన విలువ తెలుస్తుందో , అపుడే మనో ప్రపంచం దాడి చేస్తున్న విషయం అర్ధం అవుతుంది . దీన్ని
గమనించి శ్రద్ధతో విష్ణు పాదాలయందు ద్రుష్టి నిలిపితే ,భవసాగరం భయపెట్టలేదు . విష్ణుపాదాలను పూజిస్తున్న లక్ష్మి కృప
కలుగుతుంది . విష్ణు పాదాలు ,అవి సూచిస్తున్నది , అహం యొక్క ఆధారభూతమైన చైతన్యాన్నే . రెండు పాదాలుగా
మనకు పరిచయమైన ద్వైత దర్శనలోని ,ఒకరే[అద్వైతం] కలిగిఉన్న రెండు పాదాలు. ఉన్న చైతన్యమే ,దృశ్యమానమైతే ,రెండు . చరించే ధర్మం ఒక పాదం . చెరించే దశలో కూడా తనలో స్థిరంగా తెలిసే చైతన్యం రెండోపాదం . ఎపుడూ వర్తమానంలో ఉండడంవలన కొత్తగా కర్మ ఏర్పడదు . వర్తమాన క్షణంలో ఎవరికీ అహం అనేది శరీర పర్యంతంగా భ్రమ
పెట్టదు . ఎందుకంటే రెండో వస్తువు ఉన్నపుడే పోలిక ,భ్రా0తి కలుగుతాయి . వర్తమాన క్షణంలో రెండోది లేదు . ఈదశలో పురాకృత పాపము అని తెలియబడుతున్నది కూడా ,మాయగా తెలియబడుతూ ,తన సత్తాను కోల్పోయి ,పాపక్షయం
అవుతుంది . భవ భయహారిణి ,పాపవిమోచని ,శ్రీ ధైర్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది .
సశేషం