2, డిసెంబర్ 2016, శుక్రవారం

అహం-ఇదం

అహం-ఇదం .
ఈరెండే ప్రతి బంధకాలు జీవుడు ,ఈశ్వరుడు అయ్యేందుకు . ఇదే ఇరుముడి , అయ్యప్పకైనా . తలనీలాలు ,ముడుపు వెంకటేశ్వరునికైనా . శరీర పర్యంత స్వాభిమానం అహం . దాని పరిధి అంతా ఇదం . బాహ్యంలో కనిపిస్తున్న ,వ్యావహారిక నామరూపాలన్నీ శరీరం వెలుపలివి . బాహ్యాన్ని విడిచి ,తనలో వాటి స్థానం ఆలోచిస్తే ,అవి ఒట్టి ఊహ మాత్రమే . ఏవి లోపలికి ప్రవేశించ లేవు . కానీ అవే మన భగవదత్తమైన సమయాన్ని ,సాధనకు పనికిరాకుండా చేసి మానవ జన్మను వృధా చేస్తున్నాయి . ఒకక్షణమైనా ఏమిటి అనే ప్రశ్న రాకుండా మూసుకుపోయిన అజ్ఞానమే ,ఆవరణ . ఆవరణ వరకు వెళ్లకుండా అడ్డుపడేది ,విక్షేపం . విక్షేపం విడిచి పెట్టాలంటే 'ఇదం' అనే నామరూపాలు ,తనలో ఉన్న తన దగ్గరికే వెళ్లనీయని ,ముళ్లకంచె . దీన్ని దాటాలి . కానీ ఎక్కడా గాయం కాకూడదు మనసుకు . చిన్న కుండీలోని గులాబీ తుంచినంత సులువు కాదు ,బలిష్టంగా మారిన గులాబీ చెట్టు మధ్యలో ఉన్న గులాబీ కోయడం లాంటిదే ఇది . ముందు చుట్టూ కొమ్మల్ని ,తలో వైపుకు లాగి కట్టాలి . కానీ అవి కట్టుబడక విడిపోతూనే ఉంటాయి . అత్యంత సావధానం
అవసరం . అలానే అసలు బయటి ప్రపంచంలోని వస్తువులు ,వ్యక్తులు ,అంతరంగంలోకి ఎలా ప్రవేశించగలరు అని మధన చేయాలి , కానీ కొద్ది నిమిషాలుకూడా మనసు నిలబడదు . దీన్ని దాటలేని నిరాశను జయించలేని స్థితిలో భగవంతుడే దిక్కు అనుకోని వారుండరు . వారే ముందు ఆర్తులు ,తరువాతి జిజ్ఞాసువులు . వీరికి ప్రపంచ విషయాల పట్ల లేని ఆర్తి పరమాత్ముని చేరే విషయంలో ఉంటుంది . వీరిది స్వచ్ఛమైన భక్తి . ఇది రానంతవరకు భక్తుడు అని చెప్పడం అసమంజసం .ఇలా భక్తులైన వారి స్థితిలో,గృహస్థాశ్రమ నియమాలను ఉల్లంఘించలేని బేలతనం , కానీ పరమాత్మను చేరాలనే తాపత్రయం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . ఇక్కడ సహకరించేదే ముడుపు .
అంటే తనది అనుకుంటున్న దానినుంచి ఎలా మనసుకు బయటకు రావాలో సహకరించమనే అభ్యర్ధన ,ముడుపులో ఉంది . ఇది అన్ని కొమ్మలు బాగా అన్ని పక్కలకు కట్టేయడం . ఇది విక్షేపానికి పడే తాపత్రయం . గులాబీని కొయ్యడం ,ఆవరణను తొలగించడమే . గులాబీ క్రింది ముళ్ళు ఉండనే ఉన్నాయి .పువ్వు కనిపిస్తుంటే గుర్తు పట్టడం సులువే. కానీ అహం అనే ఆవరణ , తెల్లవారక ముందు కోసే గులాబీ .దీనికి వెలుగు చూపే దీపం గురు స్వరూపం . ఇది భగవంతుని కరుణ వల్లనే లభ్యం. దీనికి సహకరించే అంగం మానసిక సన్యాసం . ఇదే తలనీలాల ప్రయోజనం . మనం బాహ్యంగా చెయ్యలేని సన్యాసాన్ని సూచిస్తుందిది. ఈస్థితిలో మాత్రమే గురువు సహకరించ గలరు . వస్తువును చూపడానికి . కానీ ప్రయత్నం ఎవరికి వారిదే . దీపం పువ్వును మాత్రమే చూపగలదు . దీక్షగా దగ్గరికి వెళ్లి చూడాలి . దూరంగా ఉండగా సాధ్యపడదు . ఇప్పుడు గులాబీ స్థానంలో అమ్మను చూద్దాం . ఎందుకంటే పువ్వు లాంటి జడం కాదు పరమాత్మ . ఎంత పనిలో ఉన్నా ఏడుస్తూ ,నిస్సహాయంగా చూస్తున్న పిల్లవాడిని లాలించే తల్లి పరమాత్మ .ఇప్పుడు ఉదాహరణ మార్చడానికి కారణం చూద్దాం.
కర్మ పరిధిలోని జన్మ కారణం ,కర్తృత్వం . ఈ అభిమానం వలన ఏర్పడిన నేను ,నాది అనే భావాల నుండి తనను తాను ఉద్ధరించుకోవలసిన బాధ్యత కూడా తనదే.దీనికి ప్రధమంగా శాస్త్ర సహాయంతో పెద్దల సహాయంతో ,తన విధి ,నిషేధాలను తెలిసి దేనికీ వ్యగ్రత పొందక ,అతిని పొందక ,భగవత్ప్రీతిగా కర్మ ఆచరిస్తూ,అర్ధార్ధి ,ఆర్తుడు , జిజ్ఞాసువుగా ప్రయత్నం చేయాలి. ఏమిచేయలేని నిస్సత్తువ,గమ్యం చేరే మొదటితీరం . ఇక్కడ గురువు ,దైవము సహకరిస్తారు . శివోహం .

18, నవంబర్ 2016, శుక్రవారం

మార్పు

మార్పు .
తనను తాను మార్చుకుని ,తన కుటుంబం ఉన్నత ప్రమాణాలతో జీవించాలనే కోరిక , మార్పుకు
శ్రీకారం . ఎంతసేపు ఆర్ధిక పురోగతి అనేది తప్ప వేరే విలువలు అవసరం లేని వారికి ఈ మాటల వల్ల ఏ ప్రయోజనము లేదు . చాలా శ్రద్ధతో ఒకపని చేస్తూ జీవన శైలిగా మార్చుకోడం వలన ,DNA మారుతుందని సైన్స్ చెబుతుంది . ఇలా తమ జీవితాన్ని ఉత్తమ సంస్కారాలతో జీవించి ,ముందు
తరాలకోసం బంగారు భవిష్యత్తును పెద్దలు అందించారు మనకు . కానీ వీలు కావడం లేదని ,ఈ రోజుల్లో ఇలా ఉండక్కరలేదని తమను తాము సమర్ధించుకుంటూ ,పిల్లలను సమర్ధిస్తూ ఏది
కోల్పోతున్నామనేది ఎవరూ గమనించడం లేదు . ఇప్పుడు కూడా ఎంత ప్రతిభ ఉన్నా తల్లి ,తండ్రి
కుటుంబ నేపధ్యాన్ని గౌరవిస్తున్న వారికీ ,కొదువ లేదు .కానీ పూర్వముతో పోలిస్తే తక్కువని చెప్పాలి. ఇలా గౌరవాన్ని కాపాడుకోడానికి ఆర్ధికం కన్నా ,హార్దికం సహకరిస్తుంది .ఇలా జీవిస్తున్న వారిని చూచి
నపుడు ,మిగిలిన వారికి ఆశ్చర్యం గాను ,కొద్దిగా దాన్ని మనం సాధించలేక పోయామనే అసంతృప్తి
సహజం . దీనికి తోడు,వారి అదృష్టం అనే సాకు వాడుకోవడమూ సహజమే .
  కానీ వారి కృషిని గుర్తిస్తే అహం ఊరుకోదు .నిజానికి వారి గురించి సరిగా అంచనా వేయక పోవడమే దీనికి కారణం . సాధారణంగా వీరు పెద్దగా ఎవరి విషయాలలో జోక్యం చేసుకోరు . ఎవరిని అలా తమ విషయంలో జోక్యం చేసుకోడానికి ఒప్పుకోరు .ఊరందరిదీ ఒక దారి ఉలిపి కట్టె దొక దారి అని వీరి గురించి అనడం వింటుంటాం . ఎందువలన వీరి వైఖరి ఇలా ఉంటుంది అంటే ,పెద్దలవలన
వారు ఏర్పరచిన విధానాలకు ,విఘాతం కలగకుండా ఉండాలంటే ,వేరే వారి విమర్శలకు తావు
ఉండకూడదు .దీనికి ముందుగా వీరి పెద్దలు కూడా మిత్రత్వానికి పరిధులు విధించుకుని ,అపుడు
వారిపిల్లలు కూడా ,అనవసర పరిచయాలు పెంచుకోకుండా జాగ్రత్త చూపుతారు . ఇది మిగిలినవారి దృష్టిలో ,అహం భావం అయినా కావచ్చు ,లేదా చేతకాని తనమైనా కావచ్చు . కానీ ఒంటరి పోరాటానికి తన జీవన సహచరి యొక్క ఆవశ్యకత అనుపమాన మైనది . దాన్ని అర్ధం చేసుకునే
తీరు విలక్షణ మైనది . దీనికి ప్రధమ పుష్పం ,గృహిణి తన పుట్టింటివారిని ,పొగడక ,అత్తింటివారు ఆత్మ బంధువులైతేనే ,ప్రయాణం ,పూలపై నడుస్తుంది . ఎప్పుడూ అత్తింటివారిని ,తనవారితో
పోలుస్తూ,వీరిని ఎందుకూ పనికిరాని వారుగా భర్తకు నిరూపించే ,ఇల్లాలు ఎప్పటికీ ముందు చెప్పిన , జీవన శైలిని ఆహ్వానించలేదు .ఇది అంతర్మధనం . వారితోనే కలిసి ఉండేవారూ ఉన్నారు ,విడిగా ఉండి ,కలిసినప్పుడు అసలు ఇటువంటి పిల్లలు ఎవరికైనా ఉంటారా అనేలా ఉండేవారు ఉన్నారు .
మొదటి వారిలో ,ఎప్పుడూ భర్తకి మానసిక స్థిమితం ఉండదు . అంతా వాళ్ళ నాలికమీద నడిచినట్లు ఉండాలి . లోపల పూర్తి అసంతృప్తి . ఈ యింట్లో పిల్లలు కూడా ఎంతో అణకువగా కనిపిస్తారు . కానీ వారి స్నేహితులే వారికి ఆత్మ బంధువులు . తల్లి దండ్రులు ఏమి చూపిస్తున్నారో అదే వారికి వీరు
తిరిగి ఇస్తారు . పిల్లల్ని తూలనాడడమే తప్ప సమస్య పరిష్కారమవదు . వీరిలో డ్రగ్ ఎడిక్ట్స్ , కులాంతర ,మతాంతర వివాహాలు కనిపిస్తాయి .కానీ  అంతరంగం అత్తవారి స్వంతం చేయగలిగిన
సంస్కారం ఉన్న ఇల్లాలు దీన్ని అధిగమించి పిల్లల్ని వారి సంస్కారాలకు వారసులను చెయ్యగలదు.  
దీనికి సత్యం అనేదాని ఆధారం కావాలి . తన భర్తకు ఇష్టమైన కుటుంబం తనకు ఇష్టమయ్యేలా
మారాలి తాను ,అందుకే గోత్రం మార్పు . తన పుట్టింటివారిని సమర్ధించే భర్తని కోరుకుంటే , నటనే
మిగులుతుంది . అమ్మమ్మని ఆరాధించే మనుమలు బామ్మకి భవిష్యత్తులో సంభవిస్తారు .మనమే
బాటలో పయనిస్తే పిల్లలు ,భార్య మాటవింటూ , వారసులౌతారు .
   రెండో వారు ,ఎలాస్టిక్ ఎంతవరకు లాగి ఉంచితే అంతవరకు అలా జాగ్రత్తగా ఉంటుంది . వదిలితే
ఏమార్పూ ఉండదు . ఇంటికి అత్తగారు ,మామగారు ,లేదా ఆడపడుచు ,భర్త సోదర వర్గం ,లేదా
వారి తరుఫు బంధువులు . ఇలా ఎవరు వచ్చినా అంతా వారే ప్రపంచం అన్నట్టు . వెళ్ళగానే రిలాక్స్ .
మనసులో ,మాటలో ,ఫోన్ లో ,స్కైప్ లో ఎప్పుడూ పుట్టిల్లు . పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఎలా తల్లికి
తాళం వెయ్యాలో బాగా తెలుసు . వాళ్ళకి కావలసినది ఏదైనా ,తల్లి తండ్రులు ,ఒళ్ళు మరచి చేసేలా
చెయ్యగల ధీరులు . ఎప్పుడూ పెళ్లి తరువాత కలిసి ఉండరు . మనుమలు అమ్మమ్మ కబుర్లు చెప్తూ
ఉంటారు . తల్లి తండ్రుల అవసరాలకు వృద్ధాశ్రమాలు ఎలానూ ఉన్నాయి .
     ఈ రెండూ దాటి అత్తవారిల్లు పరమాత్మ ఇచ్చిన వరం అనిభావించి ,భర్త ద్వారా వీరి గురించి
మంచిని మాత్రమే విని ,ఏదైనా అసంతృప్తి తల్లి తండ్రుల పట్ల భర్త కలిగి ఉన్నా అత్త మామల పరి
స్థితిలో అంతకన్నా వారేమీ చెయ్యలేరని అతనికి కూడా చెప్పి ,వారికి అండగా ఆలోచించి ఇంటిని
స్వర్గంగా మార్చడం ,తన తల్లి తండ్రుల నిస్వార్ధ చింతనతో ఇల్లాలు చెయ్యగలదు . ఇలా ఉన్న
అమ్మాయి ,తల్లి తండ్రులకు ,అంతా వారి అమ్మాయి ప్రయోజకత్వం అనే దురభిప్రాయం ,కలగడం
అనివార్యం . ఇపుడు మన కథలోకి ప్రవేశిద్దాం . ఇలా ఒక ఇల్లు ఉంటే ఆ అత్తగారు ,మామగారు ,
పూజలు,ఆచారాలు పాటించే వారై ఉంటారు .ముందు తరాలు ఆరాధన ,పరంపర కలిగి ,సంఘంలో
అందరూ గౌరవించే స్థాయిలో ఉంటారు . దీన్నే పరువుగల కుటుంబం అంటారు . పిల్లలు ఆచార
వ్యవహార శైలి కలిగి వినయంతో ఉంటారు . అటువంటి అల్లుడికి అమ్మాయిని ఇవ్వడం వీరి అదృష్టం.
కానీ ఇక్కడే వ్యవహారం తిరగబడుతుంది . అల్లుడు బొత్తిగా అమాయకుడని ,తల్లి దండ్రులు ఎంత చెపితే అంత అని ,పిల్లకి సుఖం లేదని ఆఇంటిని అతలాకుతలం చెయ్యడానికి రెడీ . అదే విధంగా
తమ కొడుకు ఉంటే చాలా గొప్ప . తమలా పెంచగలవారు ఉండరు . ఈధోరణికి బలైపోయిన
కుటుంబాలు కోకొల్లలు . ఇంతకీ తర తరాలుగా వస్తున్న పూజ ,వ్యవహారశైలి కాపాడుకున్న అత్తగారు
ఈ సమరాన్ని దాటగలదు . అంటే ఇంచుమించు 30 సం/ ఇష్టపడి కాపాడుకున్న విలువలు ,వారిని
కాపాడి ,కోడలికి అన్నీ అర్ధం అయ్యేలా చెప్పే సామర్ధ్యాన్ని ఇస్తాయి .అంటే వారి DNA మారి ,పిల్లల్ని
సంరక్షించుకునేలా చేసింది . మూలమైన విషయం ఏమిటంటే ,పెద్దల ఆచార ,సంప్రదాయాలు
విడువక పాటించే వారికి ,ఎన్నో జన్మల సాధనాపరులైన వారు ,వారి ఇంట జన్మించి,చిరకీర్తులై
చిరంజీవులౌతారు .

14, నవంబర్ 2016, సోమవారం

దైవభక్తి-దేశభక్తి .

 దైవభక్తి-దేశభక్తి .
తన కుటుంబం వరకు పరిమితమైన అర్ధ,కామాలను,పరమాత్మునికి వినిపించి ,తగిన పూజ,జప
హోమాది క్రతువులతో ,ఈ జన్మకు ,పైజన్మలకు భౌతిక వస్తు,మానసిక సంతృప్తి కొరకు చేసేవన్నీ ,
రజోగుణ లక్షిత లక్షణాలు . జ్ఞాన భక్తిలో పంచభౌతిక పరిమితి దాటినప్పటికీ ,తన ముక్తి ,దానికి
తగిన ధ్యాన ,ధారణాది క్రియలు సహజం . సాత్వికమైనా ఇది కూడా స్వార్దాన్ని సూచిస్తుంది .
సన్యాసులకి ఆశ్రమాలెందుకు అని చాలామంది అడుగుతారు . కానీ ప్రపంచాన్ని పరమాత్మగా
గ్రహించినవారు,లీలగా ఆప్రపంచానికి తగిన వ్యావృత్తులను స్వీకరించి చరిస్తారు . ఇటువంటి
కోవకు చెందినవే శ్రీ శంకర పీఠాలు.అలానే ఎటువంటి ఆశ లేక ,కేవలం జన హితమే కోరే వారు
ఎవరైనా ఉంటే వారు కూడా ఈ కోవకు చెందినవారే . వీరిది దేశ  భక్తి. సర్వము విష్ణు మయమే .

25, అక్టోబర్ 2016, మంగళవారం

ధర్మం

ధర్మం .
ధర్మం అంటే లక్షణం . గాలికి కదలడం లక్షణం . నీటికి ప్రవహించడం లక్షణం . ఇవి వీటి ధర్మాలు . పరమాత్మనుండి కదిలిన సృష్టికి అతని లక్షణాలే కలిగి ఉండడం ధర్మం . సర్వే సర్వత్రా ఉండడం వలన అంతా తానే ,అంతా తనదే .ఇది ప్రధమలక్షణం . ఇది అందరూ కలిగివున్నారు . ముందుగా ఈ లక్షణాలు శరీరానికి ముడిపెట్టకూడదు . ఇదే మనకు జ్ఞానులలో కనపడే మొదటి లక్షణం . ఎంతోమంది జ్ఞానులు విదేశీయుల దాడులలో 'మీరేమి చెయ్యలేరు . పొతే పోయేది నా శరీరమే' అని జవాబిచ్చారు .మనకి ప్రపంచం కనిపించడం అనేది పంచేంద్రియ విషయమే . నిద్రలో అది ఉన్నా తెలియదు .  అజ్ఞాన కారణంగా . కానీ అజ్ఞాన కారణంగా నిద్రలో లేనట్లే ,అద్వైత జ్ఞాన కారణంగా జ్ఞానులకు ,ఊహా మాత్రంగా గాని , కలలాగా కానీ దీని అస్తిత్వం ఉంది . అందుచేత ధర్మం అనేవిషయాన్ని అర్ధం చేసుకోడానికి ,పరమాత్మ పంచ భూత ప్రకృతిగా ఉన్నాడు అని అనుకుందాము . అందరూ పాడుతున్న అన్నమయ్య పాట ,అందరికి ,నేల ,నీరు ,గాలి సమానమని చెపుతున్నది .నిద్రలో లేని బేధం మెలకువలో ఉంది . నిద్రలో ఏమి తెలియనీయని అజ్ఞానం , మెలకువలో  శరీరధ్యాసను కానుకగా ఇస్తున్నది . దీనినే మాయ అని శాస్త్రం అంటుంది . పంచభూతాలు ,కొన్నిసమీకరణలతో ఏర్పడిన శరీరం ,పంచ భూతాలే కదా . అది వాటితోనే పోషించబడుతుంది .తిరిగి వాటిలోనే కలిసి పోతుంది దీనిలో తనది ఏముంది ?
    ఇదే ప్రధమసూత్రం హిందూ ధర్మానిది . ఇది అద్వైతం . దీనికి నేను ఉన్నాను అని జోడిస్తే ద్వైతం . ద్వైతం ఉంటే రెండవది ఉండడం వలన ఉన్నదాన్ని భాగించి సర్దుకోవలసి ఉంటుంది . దీనినే పరిధి అంటారు . ఇలా పరమాత్మ నేను , నాది అని విభాగించ బడినట్లు కనిపిస్తున్నది ,మెలకువ .నిద్రలో విభజనం లేకున్నా అద్వయ ప్రభావం వలన విశ్రాంతి ఉంది .అజ్ఞానం వలన తెలియమి ఉంది . ఇంతకీ అద్వైతమే విశ్రాంతి . అది అందనంతవరకు అశాంతి .అందుకునే పధ్ధతి ధర్మం . మెలకువ ద్వైతం కావడం వలన పరిధి ప్రారంభం అవుతుంది .ఇదే ప్రపంచం ,నాది అని సూచించ బడుతుంది అంతా తానేనన్న అనుభవం అంతా తనదే అనే భావాన్ని మనిషిలో 'నేను'అనేది కలిగి ఉంటుంది . దీని కోసం ప్రపంచంలో తాపత్రయ పడుతుంది 'నేను'. దీన్ని మాత్రమే శాస్త్రం నిరసిస్తుంది . సముద్రం  తాను కలిగి ఉన్న అలలను తానే పొందాలనుకునే తపన లాంటిదే ఇది . దీన్ని జ్ఞానంతో తొలగించుకోమని హితవు పలికేదే హిందూ ధర్మం . ఇంకా చాలా చర్చించుకుందాము .

3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీమాత్రే నమః .

శ్రీమాత్రే నమః .
సాధన ,సంస్కారాన్ని  బట్టి ఉంటుంది . సాధకులుగా పిల్లలు తయారవాలంటే మంచి సంస్కారాలు పెద్దలు ఆచరించి
అందించాలి . అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే అందరికి మంచి విషయాలు తెలుసు . కానీ ఆచరణలో లోపం వల్ల పిల్లలకు అందడం లేదు . కాలం అందరిని పెద్దవారిని చేస్తోంది . కానీ విజ్ఞత మాత్రం తల్లి ,తండ్రులు వారు పొంది ,
పిల్లలో పెంచి పెద్ద చేయాలి . తాము అన్య కారణాల వలన పొందక పోయినా ,మీ బాధ్యతగా మీరు ధర్మాన్ని వహించి
పిల్లలకు మార్గదర్శనం చేయాలి . అలా పిల్లల్ని పెంచితే ,కనీసం ముందు తరాలకు ధర్మ భ్రష్టత రాదు . దీని వలన
వంశంలోని, పూర్వపు 7తరలవారి ఆశీర్వాదంతో మళ్ళీ వంశం ఉఛ్ఛ స్థితికి వస్తుంది . ఆర్ధికంగా బలంగా ఉన్న
సమయంలోనే ,ఆచార ,సంప్రదాయాలు ,వ్యవహరించే తీరు ,కట్టు ,బొట్టు ఇలా అన్ని విషయాలలో పెద్దలు ,పిల్లల్ని
ప్రభావితం చేయాలి . ఇలా ధర్మాచరణకు నడుం కడితే ,అది మనను ,మనకు తెలియకుండానే సాధకులను చేస్తుంది
  సాధన యొక్క పరాకాష్ఠ ,లోపల అగ్ని వలె వాసనలను దహించి ,ఆత్మ గురువును చేరుస్తుంది . అంటే నిజమైన
జిజ్ఞాస భగవంతుని ఉనికి పట్ల కలుగుతుంది . ఇదే ఎక్కువగా ఉపయోగపడే ఆత్మగురువు లక్షణం . శిష్యుడు
సమిధలతో గురువును చేరడం ఇదే . తనలోని వాసనల తడి పూర్తిగా ఆరినపుడు ,ఒక్క తత్వమసి అనే గురు వాక్యం ,వ్యాఖ్యానం అవసరం లేనంతగా ,అగ్నిని శిష్యునిలోని సమిధలను  ఆత్మ యజ్ఞంలో పొగరాకుండా ,యజ్ఞ ఫలాన్ని
అందేలా చేస్తుంది . ఆయజ్ఞ ఫలమే ,అహం బ్రహ్మాస్మి . 

2, అక్టోబర్ 2016, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః .
ప్రతి సంవత్సరము ,శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎంత శక్తి ఉన్నా ,ఎంతో శ్రద్ధతో అందరూ సేవిస్తారు . దురిత
నివారణ అమ్మవారి అనుగ్రహం . దురితాలలో ఎవరూ జ్ఞానాన్ని సముపార్జించ లేరు . అందువలన ఈ నవరాత్రులు
దురితాన్ని దూరం చేస్తే ,శరత్తులోని నీటిలా మనసు తేలికపడి ,జ్ఞానం వైపు చూడడానికి సాహసం చేస్తుంది . వసంత నవరాత్రులు ,సరస్వతీ అనుగ్రహంతో ,ధర్మం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి, అనే దిశా నిర్దేశం చేసే ,వ్యాపక పరబ్రహ్మ
తత్వమైన రామతత్వాన్ని ప్రకటిస్తూ, జ్ఞాన రూపంలో అమ్మఅనుగ్రహం లభిస్తుంది . కానీ ప్రకటంగా రామ నవమి
వేడుకలకు ప్రాధాన్యం . జ్ఞానం యొక్క ప్రకట రూపం ధర్మం . దురితాలతో పోరాటం అలసట కలిగిస్తుంది . సేద తీరాలంటే ధర్మాన్ని ఆలంబన చేసుకోవలసిందే .
   పరమార్ధంలో బయట మనకు కనిపించే దుఃఖాలు పోగొట్టడమనే అర్ధం ఉన్నా ,నిజమైన అమ్మ యుద్ధం దేనితో
అనే ప్రశ్న చాలా అవసరం . ఎన్నో శరన్నవరాత్రులు ,వసంత నవరాత్రులు చూశాక ,ఎప్పుడూ ఈ పోరాటం మనలో
ఆగడం లేదనేది మనం గమనించ వచ్చు.మనను గెలిపించాలని అమ్మ ఆరాటం అర్ధం ఏమిటి ? చీడ పట్టిన చేనును 
రైతు జీవ కారుణ్యం ,ఆ జీవులు మనలాంటివే అంటే ,ఆజ్ఞానం [అజ్ఞానం]రైతుకు ఎంతవరకు మంచిది ?దీన్ని
సమానత్వం అనే పేరుతొ ఎంతవరకు సహించాలి ?దీన్నే శాస్త్రంలో అసుర లక్షణం ,మంచి లక్షణాల మీద చేసే
యుద్ధంగా గ్రహిస్తే ,దీన్ని రైతుకున్న పక్షపాత ద్రుష్టి అనడం ఎంతవరకు సమంజసం ?
   సర్వత్రా వ్యాపకమైన పరమాత్మ ఎవరి పట్ల అధిక ప్రేమను కాక ,మంచి లక్షణాల [ధర్మం]పట్ల ఉన్న బాధ్యత వల్ల
సక్రమ మార్గాన్ని మనకు పరిచయం కలిగించాడనికి ,నిరాకరమైన మౌన వ్యాఖ్యను ,శబ్దరూపమైన వేదరాశిగా , అందుకోలేని  వారికి ఇతిహాస ,పురాణ రూపంగా అందించాడు ,తపించిన మునుల ద్వారా . అలా మనకు అందిన
పూజలో,నిరాకరమైన మనసు ,పరమాత్మలో లయిస్తే ,ఉన్నది పరబ్రహ్మమే . అమ్మవారు చేస్తున్న యుద్ధం ఏమిటి
అంటే ,లీలగా కనిపిస్తున్న ఈ ప్రపంచ అంతా సాలీడు అల్లిన గూడులా అంతా , పరమాత్మ నుండే వచ్చింది . అందు లోనే ఉంది . మళ్ళీ పరమాత్మలో లయమౌతుంది .ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యం . కానీ ఎప్పుడూ దీన్ని
పట్టించుకోకుండా ,తను ,తన  కష్టాలు ,నష్టాలు ,వీటిని తీర్చడానికే పరిమితమైన పరమాత్మ . కలుగుతున్న సుఖ
భ్రాంతికి , తన ప్రతాపంతో తాను సాధించిన విజయాలకు కర్తననే అహం . ఇలా సాగే జీవుని ప్రయాణంలో ,సమయం
లోపల సామాన్య సత్యాన్ని తలకెక్కించాలనే తాపత్రయం అమ్మవారిది . దీనికే ఇంత యుద్ధం . ఉన్న పరమాత్మదే
సృష్టి లోని ప్రతి అణువు . అది నాది అంటే అమ్మ ఊరుకోదు . కర్తను నేను అంటే ఎలా ?శరీరంలో శక్తి అమ్మవారిది.
సృష్టి రూపంలో ఈశ్వరుని , ఆయన శక్తిగా సంపదను గుర్తించే వరకు ఆమె యుద్ధం ఆగదు . ఈ జ్ఞానం కలిగే వరకు
ధర్మ యుద్ధం చేసి ,ఆత్మా రాముడై జీవుడు వెలగాలి .

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హిందూ ఆచార పరమార్ధాలు

   హిందూ  ఆచార పరమార్ధాలు.
హిందూ ధర్మ పరిధిని కాపాడుతూ ,ధర్మ పతాకాన్ని ఎగురవేసే బాధ్యత ,ఎక్కువగా స్త్రీలమీద ఆధార పడింది .
అమ్మగా అబ్బాయిలకు ,అమ్మాయిలకు కూడా వారి ధర్మాలను కాపాడుకునేలా చేసే బాధ్యత తల్లిదే . ఎందువల్లనంటే మగవారిని బయట పనులకు పంపి ,ఇంటి బాధ్యతను ఇల్లాలికి ,మన ధర్మం అప్పజెప్పింది . నాజూకుగా ఉండే పువ్వులను ఎండలో ఉంచము కదా . ప్రస్తుతానికి నేను వ్రాయబోయే విషయానికి ఇది చాలు .
 అన్నిటికి తాత్వికార్ధం మాత్రమే వ్రాస్తున్నాను .
1. స్త్రీ కంటే వయసులో పెద్దవారికి ఇచ్చి కన్యా దానం చెయ్యాలి . ఎందుకు ?
శక్తి స్త్రీ . అది కలిగినవాడు శివుడు . సృష్టిలో స్త్రీ శక్తికి ,పురుషుడు శివునికి సంకేతం . నిరాకార చైతన్య శివుని నుండి కదలి సృష్టిలో స్త్రీగా ప్రకృతి వచ్చింది . అంటే ఆద్యుడు పురుషుడు . అందువలన వయసులో కొంత పెద్ద అనేది గ్రహించాలి . కనుక ఆడ పిల్లలకు బొట్టు పెడతారు . అంటే ఆమె పుడుతూనే సుమంగళి . అందుకే ఒకవేళ ,[అమంగళము ప్రతిహత మగుగాక ]భర్తని కోల్పోతే కుంకుమ పెట్టుకోరు . కానీ ఎంతమంది సువాసినులు కుంకుమ
ధరిస్తున్నారో వారికి వందనాలు . ఎర్ర స్టిక్కర్లు కాదు .
2. సువాసినిలు పూజలు ,నోములు నోచినపుడు కూడా కాళ్లకు పసుపు రాసుకోరు.ఎవరికీ రాయరు . చేతికి
ఇస్తున్నారు .ఎందుకు ఆలా చెయ్యకూడదు ?
తమను తాము గౌరిగా నమ్మి, సుమంగళిని వాయనానికి ,పిలవడం అనేది వ్రతాలలో భాగం . పార్వతిగా నోములు . వ్రతాలు అన్నింటిని గౌరి దేవి మనకు పరిచయం చేసింది . అంటే ఆమె కన్యాదానం చేయబడినది . మనకు విష్ణువు
పార్వతి ,పరమేశ్వర కళ్యాణం చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉంటాము . అంటే అమ్మవారికి పుట్టిల్లు ,అన్నగాని , తమ్ముడు కానీ విష్ణు రూపుడే . పీత [పసుపు]రంగు వస్త్రాలను విష్ణువు ధరిస్తాడు . అంతే కాదు ,ధర్మానికి ప్రతీక
అయిన నంది యొక్క కొమ్ము ,భూమి మీద పసుపు కొమ్ముగా మారిందని ఐతిహ్యం . బృహస్పతి కూడా పసుపు
వర్ణం గుర్తు . అంటే ధర్మ రక్షణ చేసే స్త్రీలకు గురు అనుగ్రహం కలుగుతుంది .ఇది మాంగల్య బలానికి ఎంతో అవసరం  తాత్పర్యం ,పుట్టింటినుంచి తన అనుబంధానికి గుర్తుగా అమ్మాయి ,పసుపు ,కుంకుమ తీసుకు వస్తుంది . అంతే కాదు ఇక్కడికి [అత్తవారింటికి]  వచ్చాక సింహద్వారానికి  రాస్తుంది . అనుబంధాలు అక్కడ వరకేనని తాను దానం చేయబడి ,ఈ ఇంటికే వన్నె తెస్తాననే భావం ,అందులో ఉంది . దీనికి ఎవరికి వారు కట్టుబడి ఉన్నామా ?అని
ఆత్మ విమర్శ చేసుకోవాలి . విషయానికి వస్తే ,పసుపుతో తయారైన తోపు ఎఱుపు కుంకుమ ,ఐదవతనానికి గుర్తు .
సరే ,సుమంగళి అయిన స్త్రీ ,శివ శక్తుల కలయిక అయిన శ్రీ చక్ర బిందు రూపిణి . గౌరీ పరదేవత . రాహు గ్రహ అధి
దేవత .అంతే కాదు అమ్మవారిని చూచినపుడు ముఖపద్మం నుండి పాదాలవరకు చూడాలి . విష్ణువు లలితా ప్రతి రూపముగాను ,శివుడు ,విష్ణువు అర్ధ నారీశ్వరుడైన ,హరిహర మూర్తిగాను మనకు తెలుసు . విష్ణువును చూచి నపుడు పాదాలనుండి ,కిరీటం వరకు చూడడం పరిపాటి . అర్ధ నారీశ్వరుడైన పరమాత్మ సృష్టిలో,స్త్రీ ,పుం
రూపాలతో ప్రకాశించినపుడు ,ఆకాశ రూపంలో అంతటా ఉన్న విష్ణువే స్థితి కారుడై ,ప్రకాశిస్తున్నాడు . అంటే
విష్ణు రూపం వర్తమానం కనుక ,సృష్టిగా కనిపిస్తున్న ప్రకృతికి ,శివుని నుండి లీలగా ప్రపంచ రూపంలో కనిపిస్తున్న
విష్ణు ,గౌరీ రూపాలకు ,ఒకేసారి నమస్కరిస్తూ ,నుదుట బొట్టుపెట్టి అమ్మవారిని ,మెడకు గంధం వ్రాసి శివుని ,
అలానే పాదాలకు పసుపురాసి విష్ణువును పూజిస్తున్నామన్నమాట . ఇంత అర్ధవంతమైనది ,మనసంప్రదాయం .