14, నవంబర్ 2016, సోమవారం

దైవభక్తి-దేశభక్తి .

 దైవభక్తి-దేశభక్తి .
తన కుటుంబం వరకు పరిమితమైన అర్ధ,కామాలను,పరమాత్మునికి వినిపించి ,తగిన పూజ,జప
హోమాది క్రతువులతో ,ఈ జన్మకు ,పైజన్మలకు భౌతిక వస్తు,మానసిక సంతృప్తి కొరకు చేసేవన్నీ ,
రజోగుణ లక్షిత లక్షణాలు . జ్ఞాన భక్తిలో పంచభౌతిక పరిమితి దాటినప్పటికీ ,తన ముక్తి ,దానికి
తగిన ధ్యాన ,ధారణాది క్రియలు సహజం . సాత్వికమైనా ఇది కూడా స్వార్దాన్ని సూచిస్తుంది .
సన్యాసులకి ఆశ్రమాలెందుకు అని చాలామంది అడుగుతారు . కానీ ప్రపంచాన్ని పరమాత్మగా
గ్రహించినవారు,లీలగా ఆప్రపంచానికి తగిన వ్యావృత్తులను స్వీకరించి చరిస్తారు . ఇటువంటి
కోవకు చెందినవే శ్రీ శంకర పీఠాలు.అలానే ఎటువంటి ఆశ లేక ,కేవలం జన హితమే కోరే వారు
ఎవరైనా ఉంటే వారు కూడా ఈ కోవకు చెందినవారే . వీరిది దేశ  భక్తి. సర్వము విష్ణు మయమే .

25, అక్టోబర్ 2016, మంగళవారం

ధర్మం

ధర్మం .
ధర్మం అంటే లక్షణం . గాలికి కదలడం లక్షణం . నీటికి ప్రవహించడం లక్షణం . ఇవి వీటి ధర్మాలు . పరమాత్మనుండి కదిలిన సృష్టికి అతని లక్షణాలే కలిగి ఉండడం ధర్మం . సర్వే సర్వత్రా ఉండడం వలన అంతా తానే ,అంతా తనదే .ఇది ప్రధమలక్షణం . ఇది అందరూ కలిగివున్నారు . ముందుగా ఈ లక్షణాలు శరీరానికి ముడిపెట్టకూడదు . ఇదే మనకు జ్ఞానులలో కనపడే మొదటి లక్షణం . ఎంతోమంది జ్ఞానులు విదేశీయుల దాడులలో 'మీరేమి చెయ్యలేరు . పొతే పోయేది నా శరీరమే' అని జవాబిచ్చారు .మనకి ప్రపంచం కనిపించడం అనేది పంచేంద్రియ విషయమే . నిద్రలో అది ఉన్నా తెలియదు .  అజ్ఞాన కారణంగా . కానీ అజ్ఞాన కారణంగా నిద్రలో లేనట్లే ,అద్వైత జ్ఞాన కారణంగా జ్ఞానులకు ,ఊహా మాత్రంగా గాని , కలలాగా కానీ దీని అస్తిత్వం ఉంది . అందుచేత ధర్మం అనేవిషయాన్ని అర్ధం చేసుకోడానికి ,పరమాత్మ పంచ భూత ప్రకృతిగా ఉన్నాడు అని అనుకుందాము . అందరూ పాడుతున్న అన్నమయ్య పాట ,అందరికి ,నేల ,నీరు ,గాలి సమానమని చెపుతున్నది .నిద్రలో లేని బేధం మెలకువలో ఉంది . నిద్రలో ఏమి తెలియనీయని అజ్ఞానం , మెలకువలో  శరీరధ్యాసను కానుకగా ఇస్తున్నది . దీనినే మాయ అని శాస్త్రం అంటుంది . పంచభూతాలు ,కొన్నిసమీకరణలతో ఏర్పడిన శరీరం ,పంచ భూతాలే కదా . అది వాటితోనే పోషించబడుతుంది .తిరిగి వాటిలోనే కలిసి పోతుంది దీనిలో తనది ఏముంది ?
    ఇదే ప్రధమసూత్రం హిందూ ధర్మానిది . ఇది అద్వైతం . దీనికి నేను ఉన్నాను అని జోడిస్తే ద్వైతం . ద్వైతం ఉంటే రెండవది ఉండడం వలన ఉన్నదాన్ని భాగించి సర్దుకోవలసి ఉంటుంది . దీనినే పరిధి అంటారు . ఇలా పరమాత్మ నేను , నాది అని విభాగించ బడినట్లు కనిపిస్తున్నది ,మెలకువ .నిద్రలో విభజనం లేకున్నా అద్వయ ప్రభావం వలన విశ్రాంతి ఉంది .అజ్ఞానం వలన తెలియమి ఉంది . ఇంతకీ అద్వైతమే విశ్రాంతి . అది అందనంతవరకు అశాంతి .అందుకునే పధ్ధతి ధర్మం . మెలకువ ద్వైతం కావడం వలన పరిధి ప్రారంభం అవుతుంది .ఇదే ప్రపంచం ,నాది అని సూచించ బడుతుంది అంతా తానేనన్న అనుభవం అంతా తనదే అనే భావాన్ని మనిషిలో 'నేను'అనేది కలిగి ఉంటుంది . దీని కోసం ప్రపంచంలో తాపత్రయ పడుతుంది 'నేను'. దీన్ని మాత్రమే శాస్త్రం నిరసిస్తుంది . సముద్రం  తాను కలిగి ఉన్న అలలను తానే పొందాలనుకునే తపన లాంటిదే ఇది . దీన్ని జ్ఞానంతో తొలగించుకోమని హితవు పలికేదే హిందూ ధర్మం . ఇంకా చాలా చర్చించుకుందాము .

3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీమాత్రే నమః .

శ్రీమాత్రే నమః .
సాధన ,సంస్కారాన్ని  బట్టి ఉంటుంది . సాధకులుగా పిల్లలు తయారవాలంటే మంచి సంస్కారాలు పెద్దలు ఆచరించి
అందించాలి . అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే అందరికి మంచి విషయాలు తెలుసు . కానీ ఆచరణలో లోపం వల్ల పిల్లలకు అందడం లేదు . కాలం అందరిని పెద్దవారిని చేస్తోంది . కానీ విజ్ఞత మాత్రం తల్లి ,తండ్రులు వారు పొంది ,
పిల్లలో పెంచి పెద్ద చేయాలి . తాము అన్య కారణాల వలన పొందక పోయినా ,మీ బాధ్యతగా మీరు ధర్మాన్ని వహించి
పిల్లలకు మార్గదర్శనం చేయాలి . అలా పిల్లల్ని పెంచితే ,కనీసం ముందు తరాలకు ధర్మ భ్రష్టత రాదు . దీని వలన
వంశంలోని, పూర్వపు 7తరలవారి ఆశీర్వాదంతో మళ్ళీ వంశం ఉఛ్ఛ స్థితికి వస్తుంది . ఆర్ధికంగా బలంగా ఉన్న
సమయంలోనే ,ఆచార ,సంప్రదాయాలు ,వ్యవహరించే తీరు ,కట్టు ,బొట్టు ఇలా అన్ని విషయాలలో పెద్దలు ,పిల్లల్ని
ప్రభావితం చేయాలి . ఇలా ధర్మాచరణకు నడుం కడితే ,అది మనను ,మనకు తెలియకుండానే సాధకులను చేస్తుంది
  సాధన యొక్క పరాకాష్ఠ ,లోపల అగ్ని వలె వాసనలను దహించి ,ఆత్మ గురువును చేరుస్తుంది . అంటే నిజమైన
జిజ్ఞాస భగవంతుని ఉనికి పట్ల కలుగుతుంది . ఇదే ఎక్కువగా ఉపయోగపడే ఆత్మగురువు లక్షణం . శిష్యుడు
సమిధలతో గురువును చేరడం ఇదే . తనలోని వాసనల తడి పూర్తిగా ఆరినపుడు ,ఒక్క తత్వమసి అనే గురు వాక్యం ,వ్యాఖ్యానం అవసరం లేనంతగా ,అగ్నిని శిష్యునిలోని సమిధలను  ఆత్మ యజ్ఞంలో పొగరాకుండా ,యజ్ఞ ఫలాన్ని
అందేలా చేస్తుంది . ఆయజ్ఞ ఫలమే ,అహం బ్రహ్మాస్మి . 

2, అక్టోబర్ 2016, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః .
ప్రతి సంవత్సరము ,శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎంత శక్తి ఉన్నా ,ఎంతో శ్రద్ధతో అందరూ సేవిస్తారు . దురిత
నివారణ అమ్మవారి అనుగ్రహం . దురితాలలో ఎవరూ జ్ఞానాన్ని సముపార్జించ లేరు . అందువలన ఈ నవరాత్రులు
దురితాన్ని దూరం చేస్తే ,శరత్తులోని నీటిలా మనసు తేలికపడి ,జ్ఞానం వైపు చూడడానికి సాహసం చేస్తుంది . వసంత నవరాత్రులు ,సరస్వతీ అనుగ్రహంతో ,ధర్మం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి, అనే దిశా నిర్దేశం చేసే ,వ్యాపక పరబ్రహ్మ
తత్వమైన రామతత్వాన్ని ప్రకటిస్తూ, జ్ఞాన రూపంలో అమ్మఅనుగ్రహం లభిస్తుంది . కానీ ప్రకటంగా రామ నవమి
వేడుకలకు ప్రాధాన్యం . జ్ఞానం యొక్క ప్రకట రూపం ధర్మం . దురితాలతో పోరాటం అలసట కలిగిస్తుంది . సేద తీరాలంటే ధర్మాన్ని ఆలంబన చేసుకోవలసిందే .
   పరమార్ధంలో బయట మనకు కనిపించే దుఃఖాలు పోగొట్టడమనే అర్ధం ఉన్నా ,నిజమైన అమ్మ యుద్ధం దేనితో
అనే ప్రశ్న చాలా అవసరం . ఎన్నో శరన్నవరాత్రులు ,వసంత నవరాత్రులు చూశాక ,ఎప్పుడూ ఈ పోరాటం మనలో
ఆగడం లేదనేది మనం గమనించ వచ్చు.మనను గెలిపించాలని అమ్మ ఆరాటం అర్ధం ఏమిటి ? చీడ పట్టిన చేనును 
రైతు జీవ కారుణ్యం ,ఆ జీవులు మనలాంటివే అంటే ,ఆజ్ఞానం [అజ్ఞానం]రైతుకు ఎంతవరకు మంచిది ?దీన్ని
సమానత్వం అనే పేరుతొ ఎంతవరకు సహించాలి ?దీన్నే శాస్త్రంలో అసుర లక్షణం ,మంచి లక్షణాల మీద చేసే
యుద్ధంగా గ్రహిస్తే ,దీన్ని రైతుకున్న పక్షపాత ద్రుష్టి అనడం ఎంతవరకు సమంజసం ?
   సర్వత్రా వ్యాపకమైన పరమాత్మ ఎవరి పట్ల అధిక ప్రేమను కాక ,మంచి లక్షణాల [ధర్మం]పట్ల ఉన్న బాధ్యత వల్ల
సక్రమ మార్గాన్ని మనకు పరిచయం కలిగించాడనికి ,నిరాకరమైన మౌన వ్యాఖ్యను ,శబ్దరూపమైన వేదరాశిగా , అందుకోలేని  వారికి ఇతిహాస ,పురాణ రూపంగా అందించాడు ,తపించిన మునుల ద్వారా . అలా మనకు అందిన
పూజలో,నిరాకరమైన మనసు ,పరమాత్మలో లయిస్తే ,ఉన్నది పరబ్రహ్మమే . అమ్మవారు చేస్తున్న యుద్ధం ఏమిటి
అంటే ,లీలగా కనిపిస్తున్న ఈ ప్రపంచ అంతా సాలీడు అల్లిన గూడులా అంతా , పరమాత్మ నుండే వచ్చింది . అందు లోనే ఉంది . మళ్ళీ పరమాత్మలో లయమౌతుంది .ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యం . కానీ ఎప్పుడూ దీన్ని
పట్టించుకోకుండా ,తను ,తన  కష్టాలు ,నష్టాలు ,వీటిని తీర్చడానికే పరిమితమైన పరమాత్మ . కలుగుతున్న సుఖ
భ్రాంతికి , తన ప్రతాపంతో తాను సాధించిన విజయాలకు కర్తననే అహం . ఇలా సాగే జీవుని ప్రయాణంలో ,సమయం
లోపల సామాన్య సత్యాన్ని తలకెక్కించాలనే తాపత్రయం అమ్మవారిది . దీనికే ఇంత యుద్ధం . ఉన్న పరమాత్మదే
సృష్టి లోని ప్రతి అణువు . అది నాది అంటే అమ్మ ఊరుకోదు . కర్తను నేను అంటే ఎలా ?శరీరంలో శక్తి అమ్మవారిది.
సృష్టి రూపంలో ఈశ్వరుని , ఆయన శక్తిగా సంపదను గుర్తించే వరకు ఆమె యుద్ధం ఆగదు . ఈ జ్ఞానం కలిగే వరకు
ధర్మ యుద్ధం చేసి ,ఆత్మా రాముడై జీవుడు వెలగాలి .

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హిందూ ఆచార పరమార్ధాలు

   హిందూ  ఆచార పరమార్ధాలు.
హిందూ ధర్మ పరిధిని కాపాడుతూ ,ధర్మ పతాకాన్ని ఎగురవేసే బాధ్యత ,ఎక్కువగా స్త్రీలమీద ఆధార పడింది .
అమ్మగా అబ్బాయిలకు ,అమ్మాయిలకు కూడా వారి ధర్మాలను కాపాడుకునేలా చేసే బాధ్యత తల్లిదే . ఎందువల్లనంటే మగవారిని బయట పనులకు పంపి ,ఇంటి బాధ్యతను ఇల్లాలికి ,మన ధర్మం అప్పజెప్పింది . నాజూకుగా ఉండే పువ్వులను ఎండలో ఉంచము కదా . ప్రస్తుతానికి నేను వ్రాయబోయే విషయానికి ఇది చాలు .
 అన్నిటికి తాత్వికార్ధం మాత్రమే వ్రాస్తున్నాను .
1. స్త్రీ కంటే వయసులో పెద్దవారికి ఇచ్చి కన్యా దానం చెయ్యాలి . ఎందుకు ?
శక్తి స్త్రీ . అది కలిగినవాడు శివుడు . సృష్టిలో స్త్రీ శక్తికి ,పురుషుడు శివునికి సంకేతం . నిరాకార చైతన్య శివుని నుండి కదలి సృష్టిలో స్త్రీగా ప్రకృతి వచ్చింది . అంటే ఆద్యుడు పురుషుడు . అందువలన వయసులో కొంత పెద్ద అనేది గ్రహించాలి . కనుక ఆడ పిల్లలకు బొట్టు పెడతారు . అంటే ఆమె పుడుతూనే సుమంగళి . అందుకే ఒకవేళ ,[అమంగళము ప్రతిహత మగుగాక ]భర్తని కోల్పోతే కుంకుమ పెట్టుకోరు . కానీ ఎంతమంది సువాసినులు కుంకుమ
ధరిస్తున్నారో వారికి వందనాలు . ఎర్ర స్టిక్కర్లు కాదు .
2. సువాసినిలు పూజలు ,నోములు నోచినపుడు కూడా కాళ్లకు పసుపు రాసుకోరు.ఎవరికీ రాయరు . చేతికి
ఇస్తున్నారు .ఎందుకు ఆలా చెయ్యకూడదు ?
తమను తాము గౌరిగా నమ్మి, సుమంగళిని వాయనానికి ,పిలవడం అనేది వ్రతాలలో భాగం . పార్వతిగా నోములు . వ్రతాలు అన్నింటిని గౌరి దేవి మనకు పరిచయం చేసింది . అంటే ఆమె కన్యాదానం చేయబడినది . మనకు విష్ణువు
పార్వతి ,పరమేశ్వర కళ్యాణం చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉంటాము . అంటే అమ్మవారికి పుట్టిల్లు ,అన్నగాని , తమ్ముడు కానీ విష్ణు రూపుడే . పీత [పసుపు]రంగు వస్త్రాలను విష్ణువు ధరిస్తాడు . అంతే కాదు ,ధర్మానికి ప్రతీక
అయిన నంది యొక్క కొమ్ము ,భూమి మీద పసుపు కొమ్ముగా మారిందని ఐతిహ్యం . బృహస్పతి కూడా పసుపు
వర్ణం గుర్తు . అంటే ధర్మ రక్షణ చేసే స్త్రీలకు గురు అనుగ్రహం కలుగుతుంది .ఇది మాంగల్య బలానికి ఎంతో అవసరం  తాత్పర్యం ,పుట్టింటినుంచి తన అనుబంధానికి గుర్తుగా అమ్మాయి ,పసుపు ,కుంకుమ తీసుకు వస్తుంది . అంతే కాదు ఇక్కడికి [అత్తవారింటికి]  వచ్చాక సింహద్వారానికి  రాస్తుంది . అనుబంధాలు అక్కడ వరకేనని తాను దానం చేయబడి ,ఈ ఇంటికే వన్నె తెస్తాననే భావం ,అందులో ఉంది . దీనికి ఎవరికి వారు కట్టుబడి ఉన్నామా ?అని
ఆత్మ విమర్శ చేసుకోవాలి . విషయానికి వస్తే ,పసుపుతో తయారైన తోపు ఎఱుపు కుంకుమ ,ఐదవతనానికి గుర్తు .
సరే ,సుమంగళి అయిన స్త్రీ ,శివ శక్తుల కలయిక అయిన శ్రీ చక్ర బిందు రూపిణి . గౌరీ పరదేవత . రాహు గ్రహ అధి
దేవత .అంతే కాదు అమ్మవారిని చూచినపుడు ముఖపద్మం నుండి పాదాలవరకు చూడాలి . విష్ణువు లలితా ప్రతి రూపముగాను ,శివుడు ,విష్ణువు అర్ధ నారీశ్వరుడైన ,హరిహర మూర్తిగాను మనకు తెలుసు . విష్ణువును చూచి నపుడు పాదాలనుండి ,కిరీటం వరకు చూడడం పరిపాటి . అర్ధ నారీశ్వరుడైన పరమాత్మ సృష్టిలో,స్త్రీ ,పుం
రూపాలతో ప్రకాశించినపుడు ,ఆకాశ రూపంలో అంతటా ఉన్న విష్ణువే స్థితి కారుడై ,ప్రకాశిస్తున్నాడు . అంటే
విష్ణు రూపం వర్తమానం కనుక ,సృష్టిగా కనిపిస్తున్న ప్రకృతికి ,శివుని నుండి లీలగా ప్రపంచ రూపంలో కనిపిస్తున్న
విష్ణు ,గౌరీ రూపాలకు ,ఒకేసారి నమస్కరిస్తూ ,నుదుట బొట్టుపెట్టి అమ్మవారిని ,మెడకు గంధం వ్రాసి శివుని ,
అలానే పాదాలకు పసుపురాసి విష్ణువును పూజిస్తున్నామన్నమాట . ఇంత అర్ధవంతమైనది ,మనసంప్రదాయం .









19, సెప్టెంబర్ 2016, సోమవారం

దృశ్యం

దృశ్యం .
దృశ్యం అనేది మనసుమీద చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది .అలా సమాజం మీద చాలా ప్రభావం చూపింది
సినిమా .దీనివలన సంఘంలో ఎక్కువగా నాశనమైనది హిందువుల ఆచార ,సంప్రదాయాలే . దేవాలయాలు ,
కుటుంబాలు ,వారసత్వ పూజా విధానాలు ,ఎంతో ఉన్నతమైన తల్లి ,తండ్రుల న్యాయ సమ్మతమైన హక్కు ఐన
పిల్లల వివాహ విషయాలు అన్నీ,దౌర్భాగ్యపు అవలక్షణాలు సినిమా వలన అంటే ఆశ్చర్యం ఏమిలేదు . ముఖ్యంగా
బ్రాహ్మణ సమాజం తన విలువలను ,వినోదం అనే చిన్న కారణంతో పోగుట్టుకుని ,అందరిచేత దూషించ బడుతొంది .
ప్రతివారికి అవసరమైన పూజ ,జప ,యజ్ఞ కార్యక్రమాలకు వీరిని ఉపయోగించు కుంటున్న సమాజం ,వినోదానికి
బలి అయిన వీరిని చిన్నచూపు చూస్తున్నది . ఎన్నో పురోహిత కుటుంబాలు తమ వృత్తిని కాదని పిల్లలను ఉద్యోగాలకు ఎప్పుడో అర్పించారు . కానీ కంప్యూటరైజేషన్ తో ఆగని వృద్ధి నెమ్మదిగా ,రొబోటిజం వైపు అడుగులు
వేస్తోంది . ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఇప్పటికే ఎక్కువగా కనిపిస్తోంది . అదే సమయంలో పూజ ,జప, దాన,యజ్ఞ
కార్యకలాపాలు పెరుగుతున్నాయి . కానీ రెండు ,మూడు తరాలుగా వేదాన్ని వదిలినవారు ,పిల్లలను మళ్ళీ అటు
వైపు మళ్లి0చ గలరా ?పిల్లలే వారిని, మీరు నేర్చుకోలేదు కదా అంటే సమాధానం లేదు . ఈ పరిస్థితులకు కారణం
సినిమా కాదా ?yes or no ?

15, సెప్టెంబర్ 2016, గురువారం

హిందూధర్మం

హిందూధర్మం ఎంతో సనాతనమై కోట్ల సంవత్సరాలుగా నిలిచి ఉన్నట్లు మనకు నిదర్శనాలున్నాయి . రాముని కాలంనాటి ఆనవాళ్లనిబట్టి చూచినా అర్థంచేసుకోవచ్చు . త్రేతాయుగం నమ్మితే ముందు సత్యయుగం ,హరిశ్చంద్ర
చరిత్ర ,భగీరథ చరిత్ర ,అంతరంగంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ,అని అలానే నిర్గుణ ,నిరాకార చైతన్య పరబ్రహ్మ
స్వరూపమైన తనను శివోహం అని గ్రహించినా ,ఆచరణ దశలో సత్య ధర్మాలను ఆలంబనగా జీవితాన్ని నడిపిన
తపస్సంపన్నుల కనుసన్నలలో  ఊపిరి పోసుకున్న చరిత్ర ,నాగరికత, పెద్దలు అందరూ చెపుతున్నట్లుగా జీవించే విధానం పేరు హిందూ ధర్మం .ఎంతో విస్తరించిన మహా వృక్షం నీడలో సేదతీరే సమాజం హిందువులది . ఎవరికైనా
సమృద్ధి ,సహజత్వం ,చూసినపుడు కలిగే ఈర్ష్య ,ద్వేషాలే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు . ఇవే
మనకు పూర్వయుగాల్లో దశావతారాలను రప్పించిన రాక్షస ప్రవృత్తులు . కలిలో వివిధ మతాలుగా ,నాగరికతల
రూపంలో ఇప్పుడు కూడా అంతే ప్రభావం చూపిస్తున్నాయి . పులిని చూసి నక్క వాత అనేవే ఇతర మతాలు . కానీ
నక్కని చూసి పులి ఊళ లా ఉంది పరిస్థితి . ఎంతో కష్టపడి పెద్దలు అందించిన జీవిత విధానం వదులుకొని ,వెళ్లి
ఆకులు కట్టుకున్న ఆటవిక జాతుల నుంచి నేర్చుకునే కుహనా సంస్కారాలకు పెద్ద పీట వేసి ,వాళ్ళముందు
మేము కూడా చావుడప్పు వాయించగలం అని ,మృదంగ విద్వాంసుడు చెప్పినట్లు తయారయింది సమాజం .