11, జులై 2016, సోమవారం

నామరూపాలు

 
 నామరూపాలు 
       నామరూపాలు,ఖేదాన్ని కాక మోదాన్ని ప్రసాదించే విద్య మోక్షవిద్య . సర్వమ్ విష్ణు మయం జగత్ . కనుక 
నామరూపాలు కూడా విష్ణు రూపమే . భగవంతునిచేత రూపొందించబడిన విగ్రహాలే నామరూపాలు . వాటికి పరంపరా 
ప్రాప్తిత కర్మల ఫలాలతో కలిపి చూడక ,చైతన్యవంతమైన విగ్రహాన్ని మాత్రమే చూసి చేసే సేవ ,మాధవసేవ . దీనివలన 
క్రమంగా నామరూపాలు చైతన్యమనే ఎరుక బలపడుతుంది . దీనికి మానవ సేవ పేరుతో చందాల అవసరం లేదు . తాను 
ప్రపంచంలో తనుకాక ఎవరితో మెలిగినా అదే స్పృహ కలిగి ఉండాలి . దీనివల్ల క్షమాది షట్క సంపత్తి ఏర్పడుతుంది . దీనివలన మానవ సంబంధాలు బలపడతాయే కానీ చెదిరిపోవు . అంతే కానీ ,నామరూపాలతో ప్రాప్తిత కర్మను కలిపి చూడడం వలన కామక్రోధాది దుర్లక్షణాలు కలుగుతాయి . కానీ కర్మతో ముడిపడిన అనుబంధాలు ధర్మబద్ధంగా అనుసంధానం చేసినపుడు మాత్రమే జీవనం సార్ధకత పొందుతుంది .
          నామరూపాలు ,ధ్యాన సమయంలో తన ఉనికిలో నిలువనివ్వక ,మనో సామ్రాజ్యం ఆహ్వానిస్తుంది . ఎప్పుడూ
ఖాళీ లేకుండా పరుగులు తీసే అలవాటు వల్ల ,ధ్యానం అనగానే ఆ తీరికని వాడుకోడానికి మనస్సు ఎంతో ఉత్సాహంగా
తన ప్రతిభను ప్రదర్శించి ,మాయలేడిలా భ్రమ పెడుతుంది . సీతలా శరీర పర్యంతంగా తనను భావించే అహం ,లేడివెనుకే
చైతన్యాన్ని పంపుతుంది . మిగిలినది అందరి ఎరుకలోని ,ధ్యానం అనే స్ఫురణ జారిపోవడమే జరుగుతుంది .దీనికి తోడుగా ధర్మ బద్ధమైన జీవన విధానం ,శరణాగతి ,ప్రపత్తి అనే మూడు ఆయుధాలతో ,దశానన చెరనుండి ,పరమాత్మ కృపతో
రామపత్నిగా ,రాజపత్నిగా మోక్షాన్ని జీవులు పొందవచ్చు .
      సీత ఎప్పుడు రామునిదే . అలానే సృష్టి ఎప్పుడూ పరమాత్మదే . సృష్టికి పూర్వము ,సృష్టిగాను ,సృష్టినుండి లయించిన తర్వాత కూడా . యిలా మూడుగా గాని ,జీవాత్మ పరమాత్మ యిలా రెండుగా గాని అనిపించడమే మాయ. దీనికి పెద్దలు
చూపిన ఉపమానము ,ఘట లేదా మఠ ఆకాశము . ఇవి తయారైనప్పుడు ఆకాశం ఏకమే . అవి అలా ఉన్నప్పుడూ ఆకాశమే ,కుండ విరిగినా ,మఠం కూలినా ఉన్నది ఆకాశమే . నిద్రలో ఉన్న వారికి వారు లేరనే అర్ధం లేదు . ఉన్నారు కానీ
తెలియడం లేదు . మెలకువలో తాను ఉన్నాననే స్పష్టత ఉన్నది . మెలకువ లోని స్పష్టత మాయతో కూడి ఉన్నది . దీన్ని మాయా ముక్తం చేయడం కర్తవ్యం . మాయలేడి వెంట వెళుతున్న చైతన్యం మనకు దొరకదు . అందుకే ధ్యానం . దీన్నే
ఆలోచనకు సాక్షిగా ఉండడం అంటారు . దీనికి తనలో విషయాన్ని తెలుసుకోవాలనే తపన ముఖ్యం . రోజులో ఎన్ని సార్లయినా ,ఎవరు ఆలోచిస్తున్నారు ?వింటున్నారు?చూస్తున్నారు ?అని మనసుని నిలిపితే ,మోనమే సమాధానం .
కానీ తెలుసుకుంటున్న వారుగా అక్కడ ఉన్నారు . మోనానికి అర్ధం ఉండడం . అదే ఉనికి . కానీ ఉన్నది శరీర పర్యంత
వ్యక్తి కాదు . పరమాత్మ . అక్కడే ఉంటే పరమాత్మ . దేహంతో తాదాత్మ్యం చెంది చెప్పినా ,విన్నా ,ఏం చేసినా జివి .
దీన్నే మోన వ్యాఖ్య అంటారు . మోనంలో ఉన్న చైతన్యం పరమాత్మ మాత్రమే . ఆలోచన మొదలైన క్షణం సృష్టి . సృష్టి
లేకున్నా ఉనికి ఉన్నది . కానీ ఉనికి లేక సృష్టి లేదు .దీన్ని శంకరాచార్యులవారు కోహం అని ప్రశ్నించారు . దీన్నే
రమణులు ఎవరు నేను ?అన్నారు .
   









       

6, జులై 2016, బుధవారం

వరాలు ,శాపాలు .

      వరాలు ,శాపాలు .
మనం పొందే సుకృత ఫలాన్ని ,వరమని ,దుష్కృత ఫలాన్ని శాపమని ప్రస్తుత జన్మలో పొందుతాము . ఇది అనివార్యము .
అలానే ఇబ్బందులు కలిగినపుడు జాతకాన్ని పరిశీలించి ,వాటికి పరిహారాన్ని చేయించుకోవడం పరిపాటి. కాలసర్ప దోషాలు 
పితృ దోషాలు ,ఇలా రకరకాలు ,వాటి పరిహారాలు అందరికి తెలిసినదే . వంశంలో తరతరాలు ఆస్తిలా అనుభవించే దోషాలు
ఉంటాయి . ముందు తారాలలో జరిగిన పొరపాట్లకు ,తరువాతి తరంలో ఇబ్బందులు తప్పవు . దీనికి ఉదాహరణయే
భగీరథ చరిత్ర .దీనికి భగీరధుడు ఎందుకు తపించాలి ?హాయిగా జీవితాన్ని అనుభవించ లేకనా ?దీన్ని కృతజ్ఞత అంటారు .
 రాబోయే తరాలపట్ల దయ . అందువల్లనే కదా రాముడు ఆ వంశంలో కలిగాడు . మన విషయాలకు వస్తే ,నాస్తిక వాదం
పేరుతోనో ,అశ్రద్ధ చేతనో ,నా కర్మ ఇంతే అనే నిరాశతోనో ,జీవితాన్ని అలానే గడిపెయ్యవచ్చు . కానీ ఎప్పుడో పెద్దలు చేసిన
దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం . అనేదానిలోని సాధక బాధకాలు ఒకసారి చూద్దాం . సర్వసాక్షి అయిన పరమాత్మ
అంతరంగం నుండి అన్ని పాపపుణ్యాలు లెక్క కట్టి నూతన జన్మను ఇస్తాడు . జనన మరణాల మధ్యన స్వర్గ నరకాలలో
కర్మ తూకంలో సరి సమానమైనపుడు ,తిరిగి మానవజన్మ సాధ్యం . తండ్రి తననే పుత్రునిగా పొందుతాడనేది శాస్త్రం .
అలా వంశంలో పూర్వము తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహిస్తూ మళ్ళీ అదే వంశంలో జన్మిస్తాడు వ్యక్తి . అందువలన
తనకర్మకు తానే కర్త కనుక సర్వులూ సరి అయిన ప్రాయశ్చిత్తాన్ని గ్రహించి ,పూర్వులను ,తమ తరాన్ని ,రాబోయే తరాలను
రక్షించుకోవాలి . ప్రాయశ్చిత్తానికి తగిన శరీరం పొందినందుకు భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు .

29, జూన్ 2016, బుధవారం

పరంపర

                                                       పరంపర
అమ్మ నేర్పితే అన్నం తినడం వచ్చిమ్ది . అదే బాటలో అన్నీ చెప్తేనే వచ్చాయి . భౌతిక విషయాలకే ఇది అవసరమైతే భగవంతుని చేర్చడానికి గురువు ఎంత బాధ్యత వహిస్తారు ?అదే పరంపర . అందరూ చెప్తున్న షిర్డీ సాయి ,ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్'అన్నారేకాని ,రామ ,కృష్ణ అనలేదు . దేవత నామాన్ని కూడా ఉచ్చరించని వారికి ,హిందువులు గుడి కట్టడం శోచనీయం . మీ పూజ మీరు చేసుకొండి అన్నారు .కానీ ఆయనకు గుడి కట్టమనలేదు . భగవన్నామం చెయ్యండి అన్నారుకాని ,తన నామజపం చెయ్యమనలేదు .ఏనాడూ విగ్రహారాధన చెయ్యలేదు . విగ్రహారాధన చెయ్యని వారికి గుడిలో పూజలేమిటి ? నిజానికి వారి అనుయాయులు 'అల్లా మాలిక్ 'అనాలి అంత గౌరవం ఉంటే గుడి కట్టేకన్నా పాతమసీదులు బాగుచేసుకుని అల్లా మాలిక్ అనాలి .
        ఆచార ,సంప్రదాయాలు పాటించ వలసిన అవసరం లేదని ,సంధ్యావందనాది క్రియలకు దూరమై, భగవదత్తమైన సంప్రదాయానికి తిలోదకాలిచ్చే వారికి ,బాసట మాత్రమే సాయి భక్తి . దీని వలన అనాచారం పెరిగి సర్వమూ సంకరమైనది . ఎన్నో రూపాలతో తన దరికి ఎవరినీ రానీయక, శ్రేష్ఠ మైన అర్హునికి మాత్రమే ఉపదేశం చేశారు దత్తులు .పరశురామునికి శ్రీవిద్యని ఇచ్చి ఉపాసనా ఫలంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని వారికి ప్రతిపాదించారు . శ్రద్ధతో శ్రాద్ధ క్రియలు జరిపే ఇంట జన్మ స్వీకరించి తమ తమ ఆచార వ్యవహారాలు తప్పక పాటించమని సూచించారు . కొన్ని మహిమలు చేసినంతమాత్రాన వారిని దేవతలుగా మనవారు ఎన్నడూ గ్రహించ లేదు . సాధన దశలో ప్రాప్తిమ్చే సిద్ధితో ,మందిని పోగుచెయ్యడం అనుష్ఠానానికి వ్యతిరేకం . ఆచరణ అవసరంలేని వేదాంతం , సన్యాసికి మాత్రమే . సన్యాసం ధర్మాలు గృహస్తును పాటించమని ఎవరూ అనరు . గృహస్తు అంటే తనవిధిని పాటించ వలసినదే .విధి ,నిషేధాలు అవసరం లేని విషయం ప్రపంచంలో లేనే లేదు . శృతి సమ్మత జీవన శైలి పరంపరా ప్రాప్తంగా అందరూ జన్మతో కలిగి ఉంటారు . దానినే ధర్మం అని గురువు తెలియజెయ్యాలె తప్ప క్రొత్త విధానాలు ప్రవేశపెట్టి తికమక పెట్టడమే తప్ప ,అన్యంగా వేరే ఏమి లేదు .షిర్డీ సాయిని దత్తాంశగా భావిస్తున్నారు.
          శ్రీ దత్తులు 24 ప్రకృతి పరమైన అంశాలనుండి తాను నేర్చుకున్న విషయాలను తెలియజేసారు తప్ప ,ఎవరిని తమగురువుగా ప్రకటించలేదు .ముందుగా అనుకున్నట్లు శ్రీ దత్తులు ,ఎవరికి ఎంతవరకు అవసరమో అంతే అందేలా ఎన్నో విచిత్రాలు చేశారు . అందులో భాగంగా నామరూపాలకు అతీతంగా గురు తత్వాన్ని గుర్తు పట్టి సూచన గ్రహించాలి కానీ గుడులుకట్టి ,సినిమా ట్యూన్ భక్తి పాటలతో ఎవ్వరూ ఏదీ సాధించేది లేదు . గురువుచూపిన మార్గాన్ని నడవాలే కానీ గురువుకు గుడికట్టి ,సొంత నామావళితో పూజ కాదు . నారదుడు వాల్మీకికి రామనామాన్ని ,అలానే ధ్రువునికి నారాయణ నామాన్ని ఉపదేశిస్తే ,వాళ్ళు ఉపదేశించిన నామాన్ని జపించారే తప్ప నారద నామాన్ని కాదు .నమస్కరించ వచ్చు కానీ గురు బ్రహ్మా ... కానీ, గుడులు అవసరం లేదు . మీ పెద్దలు నడిచిన దారిలో నడవమన్న గురు వాక్యాన్ని విస్మరించి గుళ్ళు కడితే,తోటమాలి తోటపని మాని యజమాని పేరు జపించినట్లు ఉంటుంది. దీనికి మనవాళ్ళు పెట్టిన పేరే విష్ణుమాయ .





4, మే 2016, బుధవారం

త్రిపుటి

     సృష్టిలోని ప్రతి విషయము త్రిపుటికి అనుసంధానమోతుంది . కర్మ ,భక్తి ,జ్ఞానము . చాలా విషయాలు ,పలు మాధ్యమాల్లో వింటూ జ్ఞాన పరిపూర్ణులైనట్లుగా భావించడం ఇప్పుడు అత్యంత సహజం . అందులో మొదటిగా భ్రమింప
చేస్తున్నది ,తమోగుణ రూపమైన అహం . తన శరీర పర్యంత వ్యాప్తిత ,చైతన్యం తన స్వంతమని ,తాను దానికి
యజమానిగా భావించి ,తనకు తానుగా పొందే భావం అహం . ఇది తమోగుణ లక్షణం .
     దీనికి అనుసంధానమైన వెర్రితలలు చూద్దాం . భగవద్గీతను ప్రమాణంగా చెబుతూ ,కోరిక లేకుండా పరమాత్మను
పూజించాలి . ఆశ్చర్యంగా ఉన్నా ఒక విషయాన్ని గ్రహించాలి . నిజానికి ఇది స్థితప్రజ్ఞ లక్షణం . దీన్ని సాధనాపరంగా
చూడకూడదు . ఇది చేరిన స్థితి . శరీరాభిమానం ఉన్నంత వరకు ,కోరిక ,బాధ ,అవమానం వేధిస్తాయి . వీటిని
పరమాత్మకు చెప్పకుండా ,పూజ ముగించి ఏ కోరికా లేకుండా ఉన్నానని తనకు తాను మభ్యపెట్టుకోవచ్చు . కానీ తన
విషయాలను ఆత్మీయులతో పంచుకోకుండా ఎవరూ ఉండరు . అంటే ఓదార్పు వారి నుండి ఆశించే కదా .తనది ధర్మమైనా అధర్మమైనా ,సమర్ధించి తనపక్షాన మాట్లాడేవారితోనే కదా చెప్పేది?అంటే పరమాత్మకన్నా అధికంగా తనకు వారు ముఖ్యులు . ఇది పూర్తిగా తమోగుణ లక్షణం . తన శక్తితో తాను పనులు చేస్తున్న అహం చేస్తున్న అట్టహాసం . [కర్మ]
    పూజలో తనముందు ఉన్నది విగ్రహరూపంలో ఉన్న నిరాకార ప్రత్యక్ష పరమాత్మగా సంభావించి ,తన కష్ట సుఖాలను
ఎంతో ఆర్తిగా పంచుకునేదే పూజ . తనకు పరమాత్మ తప్ప వేరే దిక్కేలేదు చెప్పడానికి . ఇది భక్తి . ఆయనకు ,వస్తు సముదాయంతో కానీ ,మానసికంగా కానీ సమర్పించే ఉపచారాలకన్నా ,తనే తప్ప వేరే లేదనే భక్తుని భావమే భగవంతుని
ప్రసన్నుణ్ణి చేస్తుంది . [భక్తి ]దీనికి గమ్యం జ్ఞాన సిద్ధి . పరమాత్మకన్నా తనకెవరూ లేరనే ఉపాసన అన్నిటికన్నా మిన్న .
ప్రతి సందేహము తీరుతుంది . అలసట తీరుతుంది . ఓర్పు ఏర్పడుతుంది . సహనం సహాయపడుతుంది . చివరగా సర్వే
సర్వత్ర పరమాత్మగా ప్రకటితమై ,చెప్పేవాడు మిగలక ,చెప్పేవి లేని స్థితి ,స్థిత ప్రజ్ఞత్వాన్నిస్తుంది . పరమేశ్వరార్పణమస్తు .




26, ఏప్రిల్ 2016, మంగళవారం

మాయ

మాయ . ఉన్నది లేనట్లు ,లేనిది ఉన్నట్లు కలిగే భ్రాంతి . చక్కనైన ఉదాహరణ కలే . ఆ సమయంలో అది లేదని ఎవరూ అనలేరు . అమ్మవారిని  ,మాయ అని కూడా అంటారు .జ్ఞాన స్వరూపిణి ,ముక్తి ప్రదాత కూడా . ఎలా విడదీయాలి ఈ
చిక్కుముడి ?నేను అని భావిస్తున్న శరీర భావన ,నిజానికి తనకు సంబంధం లేనిది . పరాయి సొత్తును తమ సొత్తుగా
ప్రకటించినపుడు ,దాని యజమాని ఎందుకు అంగీకరిస్తాడు ?నిజానికి సృష్టి అంతా అర్ధనారీశ్వరమే . శరీరం శివుడు ,శక్తి
అమ్మవారు . దీన్ని మరచి ,శరీరం తనదంటూ ,దాని వ్యవహారాలు తనవంటూ ,కర్మ వలయంలో చిక్కి ,జీవుడు
తనను తానే బంధించుకున్నాడు . పైగా భగవంతుని దృష్టిలో తరతమ బేధాలున్నాయని ,సృష్టిలోని బేధాలను వేలెత్తి
చూపుతారు . దీనికి కారణం తను వహించిన కర్తృత్వం అని ఎన్నడూ భావించడు . పరమాత్మ కృపతో సాధన సాగితే ,
సృష్టిని పరమాత్మ క్రీడగా భావించి ,అన్ని శరీరాలను పరమాత్మగా భావించి ,తనపాత్రను ఏమరపాటు లేక ,తొట్రుపడక
జీవించినపుడు మాత్రమే ,మాయవరణం తొలిగి ,అమ్మవారు ముక్తి ప్రదాతగా అనుగ్రహిస్తారు . అమ్మవారి సృష్టిలోని ఏ కణం
తనది అన్నా మయావరణం వీడదు .

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ప్రతిబింబం

   ప్రతి బింబ న్యాయం .
ప్రతిబింబం రెండు విధాలుగా మనకు సరి అయిన బింబ దర్శనానికి సహకరించదు . 1బింబం సరిగా లేనపుడు ,ఎలాగూ సరిగా కనిపించదు . 2అద్దం మురికిగా ఉన్నప్పుడు సరిగా ప్రతిఫలించదు . 1భౌతిక ప్రపంచ విషయాలు . తనను సరి చేసుకుని ప్రతిబింబ రూపమైన జగత్తును చూడాలి . 2పరమాత్మ విషయంలో బింబం ఎప్పుడూ మార్పు లేకుండా ఉంది .
అంతే నిష్కల్మషంగా అనుభవానికి అందాలంటే ,మనస్సనే అద్దాన్ని శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి శుభ్ర పరచి ,బుద్ధి యోగంతో
పరమాత్మను సంధానం చెయ్యాలి .
   బుద్ధి యోగం .
 జగత్తు ,పరమాత్మగా సత్యం . ప్రపంచం బాహ్యంలో ఉన్నది . అప్పటి వరకు అది పరమాత్మ . కానీ అంతర ప్రపంచం
వస్తు ప్రపంచం కాదు . నిజానికి ఇది వీడియో ,ఆడియో తప్ప వేరుకాదు . కానీ దీనికి సత్యత్వాన్ని ఆపాదించి ,జన్మ
పరంపరను ఆహ్వానిస్తున్నాము . దీనికి సాక్షిగా చూచే వినే ,చైతన్యం స్పష్టంగా తెలుస్తున్నా గమనించక పడే అనర్ధమే
బంధం .

13, జనవరి 2016, బుధవారం

ధర్మపత్ని

ధర్మపత్ని . 
                భర్త స్వరూపం ధర్మం ,కాగా దాన్ని ధ్వజంలా నిలబెట్టే భారాన్ని వహించే ,సహధర్మచారిణి . అతడు ధర్మాన్ని విడువక ,అనుసరింప జేసేలా ,తన ప్రవర్తనకు తానే బాధ్యతను వహిస్తూ ,పిల్లలకు ,ధర్మమే ప్రాతిపదికగా 
ఆచరించి చూపే చుక్కాని ,ధర్మపత్ని .
 1. అయస్కాంతాన్ని అతుక్కుని ఇనుము తన ధర్మాన్ని పాటిస్తూ ,అయస్కాంత ధర్మాన్ని మనకు తెలిసేలా చేస్తున్నది . 
చూడడానికి అయస్కాంతం ఇనుప ముక్కలాగానే ఉంటుంది .కానీ ఇనుమును పట్టి ఉంచడం దానిధర్మం కాగా, సహకరించిన కారణంగా,అవ్యక్త స్వభావం ,వ్యక్త మైనది . అవ్యక్త ప్రపంచం వ్యక్త మైందిలా .ఇనుము అయస్కాంత రాపిడితో అయస్కాంత మైంది కానీ ,అయస్కాంతం ఏ నాడూ ఇనుపముక్కగా మారింది లేదు . ఇదే కుటుంబ వ్యవస్థ .దీన్ని పదార్ధ భావంతో 
విమర్శిస్తే ,మిగిలేది పదార్ధ భావమే ,కానీ యదార్ధం గ్రహించడం ,చైతన్య లక్షణం .