26, ఏప్రిల్ 2016, మంగళవారం

మాయ

మాయ . ఉన్నది లేనట్లు ,లేనిది ఉన్నట్లు కలిగే భ్రాంతి . చక్కనైన ఉదాహరణ కలే . ఆ సమయంలో అది లేదని ఎవరూ అనలేరు . అమ్మవారిని  ,మాయ అని కూడా అంటారు .జ్ఞాన స్వరూపిణి ,ముక్తి ప్రదాత కూడా . ఎలా విడదీయాలి ఈ
చిక్కుముడి ?నేను అని భావిస్తున్న శరీర భావన ,నిజానికి తనకు సంబంధం లేనిది . పరాయి సొత్తును తమ సొత్తుగా
ప్రకటించినపుడు ,దాని యజమాని ఎందుకు అంగీకరిస్తాడు ?నిజానికి సృష్టి అంతా అర్ధనారీశ్వరమే . శరీరం శివుడు ,శక్తి
అమ్మవారు . దీన్ని మరచి ,శరీరం తనదంటూ ,దాని వ్యవహారాలు తనవంటూ ,కర్మ వలయంలో చిక్కి ,జీవుడు
తనను తానే బంధించుకున్నాడు . పైగా భగవంతుని దృష్టిలో తరతమ బేధాలున్నాయని ,సృష్టిలోని బేధాలను వేలెత్తి
చూపుతారు . దీనికి కారణం తను వహించిన కర్తృత్వం అని ఎన్నడూ భావించడు . పరమాత్మ కృపతో సాధన సాగితే ,
సృష్టిని పరమాత్మ క్రీడగా భావించి ,అన్ని శరీరాలను పరమాత్మగా భావించి ,తనపాత్రను ఏమరపాటు లేక ,తొట్రుపడక
జీవించినపుడు మాత్రమే ,మాయవరణం తొలిగి ,అమ్మవారు ముక్తి ప్రదాతగా అనుగ్రహిస్తారు . అమ్మవారి సృష్టిలోని ఏ కణం
తనది అన్నా మయావరణం వీడదు .

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ప్రతిబింబం

   ప్రతి బింబ న్యాయం .
ప్రతిబింబం రెండు విధాలుగా మనకు సరి అయిన బింబ దర్శనానికి సహకరించదు . 1బింబం సరిగా లేనపుడు ,ఎలాగూ సరిగా కనిపించదు . 2అద్దం మురికిగా ఉన్నప్పుడు సరిగా ప్రతిఫలించదు . 1భౌతిక ప్రపంచ విషయాలు . తనను సరి చేసుకుని ప్రతిబింబ రూపమైన జగత్తును చూడాలి . 2పరమాత్మ విషయంలో బింబం ఎప్పుడూ మార్పు లేకుండా ఉంది .
అంతే నిష్కల్మషంగా అనుభవానికి అందాలంటే ,మనస్సనే అద్దాన్ని శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి శుభ్ర పరచి ,బుద్ధి యోగంతో
పరమాత్మను సంధానం చెయ్యాలి .
   బుద్ధి యోగం .
 జగత్తు ,పరమాత్మగా సత్యం . ప్రపంచం బాహ్యంలో ఉన్నది . అప్పటి వరకు అది పరమాత్మ . కానీ అంతర ప్రపంచం
వస్తు ప్రపంచం కాదు . నిజానికి ఇది వీడియో ,ఆడియో తప్ప వేరుకాదు . కానీ దీనికి సత్యత్వాన్ని ఆపాదించి ,జన్మ
పరంపరను ఆహ్వానిస్తున్నాము . దీనికి సాక్షిగా చూచే వినే ,చైతన్యం స్పష్టంగా తెలుస్తున్నా గమనించక పడే అనర్ధమే
బంధం .

13, జనవరి 2016, బుధవారం

ధర్మపత్ని

ధర్మపత్ని . 
                భర్త స్వరూపం ధర్మం ,కాగా దాన్ని ధ్వజంలా నిలబెట్టే భారాన్ని వహించే ,సహధర్మచారిణి . అతడు ధర్మాన్ని విడువక ,అనుసరింప జేసేలా ,తన ప్రవర్తనకు తానే బాధ్యతను వహిస్తూ ,పిల్లలకు ,ధర్మమే ప్రాతిపదికగా 
ఆచరించి చూపే చుక్కాని ,ధర్మపత్ని .
 1. అయస్కాంతాన్ని అతుక్కుని ఇనుము తన ధర్మాన్ని పాటిస్తూ ,అయస్కాంత ధర్మాన్ని మనకు తెలిసేలా చేస్తున్నది . 
చూడడానికి అయస్కాంతం ఇనుప ముక్కలాగానే ఉంటుంది .కానీ ఇనుమును పట్టి ఉంచడం దానిధర్మం కాగా, సహకరించిన కారణంగా,అవ్యక్త స్వభావం ,వ్యక్త మైనది . అవ్యక్త ప్రపంచం వ్యక్త మైందిలా .ఇనుము అయస్కాంత రాపిడితో అయస్కాంత మైంది కానీ ,అయస్కాంతం ఏ నాడూ ఇనుపముక్కగా మారింది లేదు . ఇదే కుటుంబ వ్యవస్థ .దీన్ని పదార్ధ భావంతో 
విమర్శిస్తే ,మిగిలేది పదార్ధ భావమే ,కానీ యదార్ధం గ్రహించడం ,చైతన్య లక్షణం .
 

20, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ గోదా కళ్యాణం

శ్రీ గోదా కళ్యాణం .

         'శ్రీ రంగనాధాయ నమః '. . పరమాత్మ కరుణతో కలిగిన మానవ దేహానికి ,చూపుతో బాటు ,
మనో నేత్రం కూడా ప్రసాదించాడు . అనాది అయిన ,పురాకృత కర్మ బంధం వలన ,జగత్తుగా
సత్యమైన మాయ వలన ,మిధ్యా ఆరోపం సహజం . దీనికి దృష్టి దోషం సహజం గానే జీవికి , ఏర్పడుతున్నది . భవరోగ నివారణకి ,వైద్య శిఖామణి పరమాత్మ తానే ,గురువుగా అవతరించి ,
జ్ఞానమనే కంటి అద్దాలు ప్రసాదించి ,ముక్తి మార్గాన్ని ,సరిగ్గా ద్యోతకమయ్యేలా చేస్తాడు .
         వారి ,వారి పూర్వ సాధనా సామర్ధ్యానికి తగిన గురువు వారికి తప్పక లభిస్తారు . అలాకాదు
మాకు సరి అయిన గురువు దొరకలేదు ,భ్రమలో ఉండి పోయాము ,అనుకోవడం శుద్ధ తప్పు .
ఎవరైనా వారి పురాకృత కర్మను మించి ఏదీ పొందలేరు . కనుక సంచిత ప్రారబ్ధాన్ని సరి చేయడానికి ఆ రూపంలో వారు తారస పడతారు . అర్ధమైన తరువాత అయినా ,భక్తి అంటే ,కేవల
పూజ ,జపము ,ధ్యానము కాదని ,జీవించే ప్రతిక్షణం కనిపించే ,వినిపించే ప్రతి విషయం , పరమాత్మ లీలగా ,అందులోని తనపాత్ర ఎంత సమర్ధ వంతంగా పోషిస్తున్నాడో తెలిసి ,జీవిస్తే
తప్పక గురుకృపకు ,పాత్రులు కాగలరు . ఇది మరీ గ్రాంధికంలా ఉందంటున్నారు పిల్లలు .
పూర్వం మంచి నీళ్ళు దోసిలిలో పోసేవారు అవి మరి ధారగానే పడతాయి . తీసుకునే వారు
ఆగి ,ఆగి తీసుకోక తప్పదు .
        ఇక నాచేత వ్రాయించ బడుతున్న ఏ విషయమైనా ,శ్రీ రమణ మార్గాన్ని తప్ప వేరే కోణాన్ని
చూపించలేకపోవడం ,సహజం . శ్రీ శంకరుల ఆచారము ,శ్రీ రమణుల అనుగ్రహము ,ఇవే రెండు
కళ్ళద్దాలు . కానీ చూపు శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ .
      శ్రీ గోదా దేవి మానవుడు తానుగా భ్రమిస్తున్న అహం . చేరిన శ్రీ రంగనాధుడు జగత్తును ఆటగా ,
క్రీడిస్తున్న పరమాత్మ . సోహం అంటూ భ్రమర కీట న్యాయంగా ,లేని తనను ఉన్న సత్యంలో
ఐక్యం చేయడం కళ్యాణం .
        పుట్టిన పురిటి పిల్లకు ఎవ్వరూ చెయ్యరు పెళ్లి . వారిని పెంచే విధానం విష్ణు చిత్తుడు ,నేర్ప
వలసిందే . తల్లిదండ్రులు వారిజీవితాన్ని ,పరమాత్మనే గమ్యంగా గడిపినప్పుడు ,పిల్లలు ఎలా
ఉంటారో అని ఆలోచించే పనే ఉండదు . ఎందువల్లనంటే ,వారి చిత్తం ,శివునిది కనుక . తమను
తాము , జిజ్ఞాసువులుగా మార్చుకుని ,పిల్లలకు మార్గదర్శనం చేస్తారనే ,పరమాత్మ సంతానాన్ని ఇచ్చింది . కానీ కలి గురించి ఎన్ని కారణాలైనా చెపుతారు . కానీ ఒక క్షణం వర్తమానంలో ఉంటే
కలి లేనే లేదు . లేనిదాన్ని ఉందని నిరూపించడానికి పడే తాపత్రయం ,పరమాత్మ కొరకు
వినియోగిస్తే వేరే తపస్సు అవసరం లేదు . నిజానికి విష్ణు చిత్తునకు భార్య లేదు . కానీ మనం
అనుసంధానం చేస్తే ,మారు మాట్లాడకుండా సాధనకు సహకరించే మనస్సనే భార్యతో కలిసి ,
తన వ్యక్తిత్వాన్ని పరమాత్మకు సమర్పించాడు విష్ణు చిత్తుడు . తల్లి దండ్రులు నేర్పినంత ,నేర్చి
తనను తాను విష్ణు చిత్తునిగా గ్రహించి ,మనసును వంచి ,అహంను ,శివోహంలో లయం చేసి ,
సాక్షిగా ,శ్రీ గోదా రంగనాధుల కల్యాణాన్ని వీక్షించాలి . శరీరం ఉప్పు బొమ్మలా ప్రారబ్దానంతరం
పరమాత్మ అనే సముద్రంలో కలిసి సముద్రంగానే ఉంటుంది .
                                        శ్రీ గోదా రంగ నాధార్పణ మస్తు .



    

27, నవంబర్ 2015, శుక్రవారం

సేవ

సేవ .... దీనికి ముందుగా చెప్పేపేరు అమ్మ . ఒక కుటుంబం నిలబడింది అంటే అమ్మవల్ల . తాను అమ్మగా నిలబెట్టిన కుటుంబం తనతో మొదలు కాదు . కానీ ముందు తరం అమ్మకు తానిచ్చిన గౌరవం ఎంత ?తాను కోరుకుంటున్నది ఎంత ?
         ఇది కేవలం కుటుంబానికి పరిమితమయ్యే అంశం కాదు . ఇది సాధనకు సంబంధించి ,ధర్మాన్ని పరిరక్షించే మొదటి సోపానం . సృష్టిలోని రెండు ఉపాధులు ,ఆడ ,మగ . శాస్త్రం మగ వారిని శివునితోను ,ఆడవారిని శివానిగా అనుసంధానం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే . స్థిరము ,చరము కలిస్తేనే సృష్టి . శివుని స్థిరంగానూ ,అమ్మను చరంగానూ గుర్తిస్తే
స్థిరం మీద ఆధారపడి చరం అనేది ప్రకృతి నియమం . ఈ కారణంగానే వివాహం తరువాత గోత్రం మార్చి, చర వస్తువును
మూలమైన స్థిర ప్రజ్ఞకు కలిపి సంపూర్ణం అన్నారు . చరమైనది ఎప్పుడూ స్థిరమైనదాన్ని చేరితేనే సంపూర్ణం . కాబట్టి వదలి
వచ్చినది తనకు పరాయిదని తెలిసి ,తనకు కుటుంబాన్ని అందించిన ,అత్త మామలను తన తల్లి దండ్రులుగా భావించే
సంస్కృతిని ,వేదమతం అందించింది . ఈ పరంపరలో చర స్వరూపమైన మనస్సు స్థిరం చేసే ప్రక్రియే ,అహం తొంగి చూడని
అత్త మామల సేవ .
        కానీ ఇప్పుడు ఆడపిల్లలు, తమ తల్లిదండ్రులను సేవించగలరు . సమాజం లోని వృద్ధులను ,అనాధలను ,తోడు లేని
వారిని ఉద్ధరించడానికి ముందుకు వస్తారు . కానీ దీనిలో జరుగుతున్న అంతర్ సంస్కారాలు ఎలా ఉన్నాయి ,అనేదాన్ని
పరిగణనలోకి తీసుకోవడం లేదు . నిజానికి తన అహం ఎక్కడ పొగడ బడుతుందో, అక్కడ సేవ అనే పేరుతో స్వీకరించి
ధర్మాన్ని తప్పుగా చిత్రీకరించి ,ప్రగల్భాలు చెప్పుకునే ,పరధర్మాన్ని విడిచి ,తనకు అహాన్ని నిర్జించి ,పరమాత్మను చేర్చే
సోపానంగా అత్తమామల సేవను గుర్తించాలి .
 

18, అక్టోబర్ 2015, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః 
 
           సకల సృష్టి పరమాత్మ స్వరూపమే . సృష్టికి ముందు ,యందు ,విందు కూడా పరమాత్మలోనివే . ముందు భూతకాలం . యందు ,వర్తమానం . సమర్పణగా కూడా విందు పరమాత్మకే . నన్ను నీలో కలుపుకో, ఇదే మోక్షం .
సద్రూపం  మాత్రమే ఆధారం . అంటే ఉనికి అనేదే పై మూడింటికి ఆధారం . దీన్ని విడిచి జీవితం లేదు . 
      ఇదే  మనకు, వేద మతం  ఇచ్చిన కుటుంబ వ్యవస్థ . దీన్ని విడిస్తే నేల విడిచి సాము చేసినట్లే . పరమాత్మ నిండి 
ఉండకపోతే సృష్టి నిలబడడం అసాధ్యం . అలానే శరీరం పడిపోయే వరకు తల్లి దండ్రులతో ఉండడం ,మన జీవన శైలిగా 
మనకు అందించారు పెద్దలు . సాధక బాధకాలు ఎన్ని ఉన్నా ఈ విషయంపై అవగాహన చాలా అవసరం .
      ఒకే శరీరంలో విడి విడి భాగాలూ కలిసి ఉన్నాయి . అన్నీ వేరే వేరే పనులు నిర్వహిస్తూ మనకు ఈ విషయాన్నే 
తెలియజేస్తున్నాయి . ఉనికి శివుడు ,చైతన్యం అమ్మవారు ,శరీరం వినాయకుడు , జీవుడు కుమారస్వామి . అందరూ 
ఉన్న ఉమ్మడి కుటుంబం ఈ శరీరం ,పిల్లలు వచ్చారని సచ్చితానంద స్వరూప ఘన పరమాత్మ ,శరీరాన్ని జీవుడిని 
విడిచి పోలేదు . సరిగ్గా గుర్తు పట్టాలి . శ్రీ శివ కుటుంబిన్యై నమః .  
 
 


16, అక్టోబర్ 2015, శుక్రవారం

శ్రీ మహిష మర్దిన్యై నమః .

శ్రీ మహిష మర్దిన్యై నమః . 
       మనిషి లోనే ,మహిషము ,మర్దిని ఇద్దరూ ఉన్నారు . బాల్యం వరకు పిల్లలను భగవత్ స్వరూపులుగా తలుస్తాము . అంటే  మహిష మర్దినిగా ,గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా  దిద్దే సమయమనేదే అంతరార్ధం . ఈపని చేసినపుడు ,ఇంట్లో 
పెద్దలు ,సరిగ్గా చేసావు, అంటారో ఆపని మాత్రమే చేసేలా వారిని తీర్చి దిద్దడమే ,బాల పూజ . ఇది ఈ సమయంలో 
మాత్రమే సాధ్యం .బాల్యం అనేదానికి ఆడ ,మగ అనే బేధం కాదు . ఎవరి వ్యక్తిత్వాలు వారు మలచుకోవడం ఇద్దరికీ  
అవసరమే . తల్లి దండ్రులుకాని ,పెద్దలు కానీ చూస్తే ఏమైనా అంటారు ,అనే భావం ఉన్న ఏ పని వారు చెయ్యకుండా
వారిని దిద్ద గలిగితే ,బాలలను మహిష మర్దనులుగా మారుస్తున్నట్లే . అంటే ధర్మాన్ని తనపరంగా ఎవరూ ప్రశ్నించే
అవసరం లేకుండానే ,జీవన శైలిగా మారుతుంది .
     దీనికి ముఖ్య సూత్రం బాధ్యత తెలిసేలా చెయ్యడం . ఖచ్చితంగా వారి పనులు చేస్తూ, ఇంటికి అవసరమైన పనులలో
ప్రవేశ పెడుతున్నామా అనేది ముఖ్య సూచన. ఇద్దరమూ సంపాదిస్తున్నాము ,లేదా చాలా స్థితిమంతులము .పిల్లల చేత
పనిచేయించాల్సిన అవసరం లేదు ,అనుకున్నప్పుడు ,పిల్లలకు పరిచయం చేస్తున్నది మాత్రం మహిష ప్రవృత్తినే . సరి అయిన ప్రవర్తన లేకుండా ,వారిని వారే పొగుడుకుంటూ ,పక్కవారిని చులకన చేస్తూ ,సమయాన్ని వృధాగా గడుపుతూ
తమ చేతకానితనానికి ,మిగిలినవారిని బాధ్యులనుచేస్తూ ,ఎదిగే బాల్యం మహిషాసురుల్నే తాయారు చేస్తుంది . సమాజానికి వారినే అందిస్తుంది . పెద్దవరాయక పెర్సనల్ మానేజ్మెంట్ కాదు ,పిల్లలుగా బాధ్యత గుర్తుపట్టినవారు
తమలోని ,అప్రాకృత ,విషమ శైలిని ,తమంత తామే గుర్తుపట్టి ప్రతి క్షణం ,హక్కు కాదు ,బాధ్యత మాత్రమే ముఖ్యం ,
అని నమ్మి,వారిలోని మహిషిని మర్దించ గలరు . హక్కులు ,బాధ్యతలను  వహించిన వారికే స్వంతం . ఇది ప్రకృతి
నియమం . ఎవరిని ఎంత హింసించినా ,ప్రకృతి నియమాలు మారవు . నియమాలను గౌరవించి ,తమను దిద్దుకోవడమే
ధర్మం ,ఇలా జీవించేవారి చేతిలో ,వారిలోనే దాగిఉన్న మహిషం మీద విజయం తధ్యం .