27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సనాతనం

సనాతనం. 
       శ్రీ గురుభ్యో నమః. 
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. కలియుగంలో తరింపచేసే మంత్రం.
ఇందులో మనకు కనిపించేవి మూడు నామాలు .మూడు ముక్తిమార్గాలు. తాపత్రయాల నుండి తప్పుకోడానికి ఈ మంత్రం. సంసారమనే కాసారంలోని సుఖపడాలనే తపనే గజేంద్రుడు ఈదులాడిన సరస్సు. కాలమనే మొసలి సమీపిస్తే ,తన ఆత్మబంధువులైనా ఏమీ చెయ్యలేరు. చాలామంది ఇక్కడ విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఎవరూ ఏమీ చెయ్యలేని దురవస్థ. అంతేకానీ ఇందులో బంధుజనుల అలసత ఏమిఉండదు. పూర్వపుణ్య విశేషం ,అలానే 
తనశక్తి ఏమీ పనిచెయ్యడం లేదని తెలిసిన క్షణం పరమాత్మను అంతర్యామిగా గుర్తించడం వలన అతనిని శ్రీహరి 
రక్షించాడు. దీనికి సంసారంలోఉన్నా పరమాత్మపట్ల అవగాహన కలిగి ఉండడం వలన ,వీలైనంత శాస్త్ర అవగాహన , భక్తి ,అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము ,గజేంద్రునికి సహకరించాయి. అవి ఈజన్మకు సంబంధించినవి కాకపోయినా జంతుశరీరంలో రక్షించాయి. కానీ మానవుడైకూడా ప్రయత్నశీలుడు కాకుంటే పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . ఎన్నో జన్మల తపః ఫలంగా లభించిన మానవదేహం తన గమ్యాన్ని చేర్చే నావ . మిగిలిన ఉపాధులకు 
ఈఅవకాశం లేదు. మానవజన్మలో గమ్యం చేరాలంటే అడ్డుగా ఉన్నవి ,అహం,మమ. నిజానికి ఈరెండూ కలిగి ఉన్నది  పరమాత్మ.కానీ శరీరంలో పరమాత్మ తేజస్సు  శరీరికి అర్ధం కానివ్వదు . శరీర పర్యంతంగా తెలుస్తున్న 
చైతన్యాన్ని అహంగా భావిస్తాడు. కుమ్మరి కుండ తయారైన మాత్రాన ,అందులో ఆకాశం నింపబడలేదు. అలానే 
బయటి ఆకాశంకన్నా వేరుకాదు. కుండ తన ఆకాశం అంటే ఎలాటిదో ,శరీర పర్యంత అహం తాను అనుకోవడం 
అలాంటిదే. అలానే పంచేద్రియాలు గ్రహించే సకలము తనది అయిన ప్రపంచం అవుతుంది. ఇవన్నీ పరమాత్మ 
సృజనలో పంచభూత వికారాలే . కనుక తను అనేది ,తనది అనేది మిధ్య. అంటే [పుట్టుకతో] మధ్యలో వచ్చాయి. 
మధ్యలోనే పోతాయి. ఆకాశంలా తానెప్పుడూ ఉండేదే. కుండ రాకపోకలతో ఆకాశం దుఃఖిస్తే ఎలా?
        కానీ ఇదే అజ్ఞానం ఎన్నో జన్మలుగా ధృఢపడి కుండే నిజమై కూచున్నది. జంతు జన్మలలో జ్ఞానార్జన అవకాశం లేదు కనుక ,ఈ జన్మకు ఎంతో ప్రాధాన్యత నిచ్చింది శాస్త్రం. మానవ మస్తిష్కమే ముక్తి సాధనం . సాధన వరకే దీని 
ఉపయోగం. సాధ్యం అంతటా నిండియున్న ఆకాశమే తాను అని గ్రహించడమే సారాంశం. అందుకే ఆకాశమే విష్ణువు అంటుంది శాస్త్రం . ఆకాశం అంటే జడంకాదు . మనలో చైతన్యం మనకు తెలుస్తున్నది కదా ?అదే అంతటా నిండి ఉన్నది. జీవితంలో భుక్తికి అవసరమైనంతగా మాత్రమే ,కుటుంబ అవసరాలవరకు ధర్మబద్ధంగా సంపాదించి , ధార్మిక జీవనం కొనసాగిస్తూ తనకు వీలైనంత సమయాన్ని ,తత్వ ,భక్తి శాస్త్ర అధ్యయనంలోనూ,సజ్జన సహవాసం తోను, పరమాత్మ కృపకు పాత్రులైతే హృదయంలో గురుసాన్నిధ్యం కలుగుతుంది . శివాయ గురవే నమః. బాహ్యంలో గురువు ,మీ శాస్త్ర విహిత కర్మాచరణతో మీముందుకు వస్తారు. మన పెద్దల బాటను విడువక ఆరాధన,కొనసాగిస్తేనే 
తగిన గురువు మార్గదర్శనం చేస్తారు . పెద్దల బాటకు బద్ధకం ,కుతర్కం తోడైతే ,సాధనను మోసపుచ్చే గురువే 
లభ్యం అవుతారు. దీనికి పరమాత్మకూడా ఏమీ చెయ్యలేడు . కనుక తన ఆచార వ్యవహారాల పట్ల జాగ్రత్త అవసరం. 
          జ్ఞానం తనను ఉద్దరించుకోడానికే ,జంఝాటానికి కాదు . ఈసాధనకు గమ్యాన్ని ప్రసాదించే మహామంత్రమే 
హరే రామ ,హరే కృష్ణ . అహం మన సాధనకు అడ్డుపడుతున్నపుడు రామనామము,ప్రపంచం నాదిగా తిప్పలు 
పెడుతున్నప్పుడు కృష్ణ మంత్రము,అన్నివేళలా హరి మంత్రము ,ముముక్షువుకు సహాయపడతాయి. ఏకాగ్రతతో, బుద్ధి సహాయంతో అహం రూపమైన రావణ సంహారాన్ని, చిన్ననాటినుండి ఆశ్రయించిన యోగ వశిష్ఠ గీత యొక్క అనుభవ సారంతో జీవన విధానాన్ని,కలిగిన శ్రీరాముని కధనుండి ప్రేరణ పొంది,శ్రీరామనామంతో అహంను జయించాలి.అన్ని తావులయందు తన వైభవాన్ని చాటి ప్రతి వారితోను ప్రతి సంఘటనతోను,మమేకం అయినట్లుఉన్నా, క్రీడగా తన పాత్రను ప్రపంచంలో ప్రకటించిిిన కృష్ణానామాన్ని ,ఇదం అని తెలియబడుతున్న      ప్రపంచాన్ని,బాహ్యం లోను,అంతరంగంలోను ,విశ్వం అంతా పరమాత్మ భావాన్ని పొందడానికి కృష్ణానమాన్ని గ్రహించి చరించాలి.
హరేరామ హరేరామ రామరామ హరేహరే ,హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి